పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

31, మార్చి 2014, సోమవారం

ఉగాది పురస్కారం
అందరికీ   ఉగాది  శుభాకాంక్షలు . నేను  వ్రాసిన  కవిత  మానస సాహితి ( విజయవాడ) వారి ఉగాది పురస్కారానికి ఎంపిక అయ్యింది ,ఈ సంతోషాన్ని ఈ ఉగాది  రోజు న  మీ  అందరితో పంచుకొంటున్నాను 
                                                 
                                            సాలిపల్లి  మంగా మణి @శ్రీమణి 
                                                                   సెక్రటరీ 
                                                          విశాఖ  కళావేదిక  
          

30, మార్చి 2014, ఆదివారం

జయము నీయ రావమ్మ జయ వత్సరమా
చిరుగాలి పరదాలతో చిగురుమావికొమ్మ
కుహూ కుహూ రాగాలతో చిరుకోయిలమ్మ
మైమరపుల పరిమళాలతో సిరిమల్లె పూరెమ్మ
పరవశించి వేచి ఉంది ప్రకృతిలో ప్రతీ జన్మా
ఈ ఉగాదికై ఈనవ సంవత్సరాదికై
జయం జయం మాకంటూ అభయం మాకిమ్మంటూ
నీ రాకతో జయగంటలు మ్రోగిస్తూ గత అనుభవాల చేదు ఖేదాన్ని మరపిస్తూ
ఈ మధుమాసం మధుకలశం మనకోసం తేవాలని
జయ జయ ధ్వానాలతో, హర్ష ధ్వానాలతో
ఆహ్వానిద్దాం ఈనవ ఉగాదిని, ఆశీశ్సులిమ్మందాం మన జయ సంవత్సరాదిని
ఈ నవ వసంతం ప్రతి జీవితాన నవ ఉషస్సు నింపాలని
ఈ చైత్రం మన జీవన పధానికి చైతన్య రధం కావాలని
మానవాళిలో మానవతా పరిమళాలు వెదజల్లాలని,
మానవాళి భవిత ప్రజ్వలింప జేయాలని
చిరునవ్వుల హరివిల్లులు ప్రతి ముంగిట విరబూయాలని.
సిరుల జల్లు విరిజల్లై ప్రతియింటా కురవాలని
ఉదయించే ప్రతి దినం మనకు ప్రవర్ధమానమవ్వాలని,
వేసే ప్రతి అడుగు ప్రగతి పసిడి బాట కావాలని
ప్రకృతిలో ప్రతి జీవి పరవసంతో ఉండాలని
అలసిన మా హృదయాల పాలిట సేద తీర్చగ కల్పతరువై రావాలని
ఆహ్వానిద్దాం ఈనవ ఉగాదిని  ఆశీశ్సులిమ్మందాం మన జయ సంవత్సరాదిని

అన్నదమ్ములం మేం విడివడినా గాని
అమ్మ కాంక్షించే జయాలనే అమ్మకు అంకితం ఇవ్వాలని
నూతన రాష్ట్రంలో నూతనంగా అడుగిడుతున్న
ఈ ఉగాదిని ఆనందం తెమ్మందాం
జయములనిమ్మందాం ఈ జయ సంవత్సరాదిని.
తీపిని చేరువ చేస్తూ కారం దూరంచేస్తూ,
పులుపును కలగలిపేస్తూ
చేదు కటువుల్లో మధువును పూస్తూ
వగరును చిరునగవులతొ వారిస్తూ
ఉప్పును సరిపాళ్ళుగ పోస్తూ షడ్రుచులను
మన జీవిత విస్తరిలో కొసరి కొసరి వడ్డిస్తూ
జయమనే పానీయం మనకందించమంటూ
ఆహ్వానిద్దాం ఈనవ ఉగాదిని  ఆశీశ్సులిమ్మందాం మన జయ సంవత్సరాదిని

సాలిపల్లి మంగామణి శ్రీమణి 

28, మార్చి 2014, శుక్రవారం

చేరవోయి నీ చెలి చెంతకుచేరవోయి  కృష్ణా నీ చెలి చెంతకు !ఒక్కమారైనా !కినుక  వహించక నీ చెలికై  రావా ...
మదన గోపాలా  నా మది దోచిన ముగ్ధమొహన  గోపాలబాలా
వందలు  వేలు  చెలియలు నీకున్నారేమో ! నిన్నే వలచిన  ప్రియసఖినేను
మరువము,మల్లెలు దోసిట  నింపి నీకై నిలుచున్నా
మంచి  ముత్యాలు కూర్చి సరముగ నీ రాకకై నిరీక్షిస్తున్నా
సిరి చందనాల పరిమళాలు నీపై  చిలుకరించగ  కలవరిస్తున్నా
బెల్లం చిట్టి అటుకుల తాయిలాలు నీకోసం దాచుంచి
వెన్నముద్దలు , జున్నుముక్కలు మక్కువనీకని  పదిలంగా ఉంచా
నెమలికన్నువింద్యామరతో  నీకు సేద తీర్చ వేచి ఉన్నా ..
యమునా  తీరంలో  నీకై  నిలువెల్ల  కనులుగా  వెతికి వెతికి  అలసి పోయా
నీ మురళీగానం  ఆలకించాలని  నా ఆణువణువూ  కలవరించె
నిద్దుర  మరచిన  నా కన్నుల్లో వద్దన్నా .. నీ  రూపే
నిన్నే  వలచిన  నా  హృది  ఏమో ! నన్నే వదలి తరలెల్లిపోయింది . నువ్వున్న తావులకై .
వలదన్నా  వినకుండా  నా  అధరాలు  నీ  నామమే జపిస్తున్నాయి .
ఏ  చోట  నువ్వు  దాగున్నా , వేగిరంగా  నాకై  రారా ... మురళీలోల .. ముద్దుగోపాలా
ముచ్చట   తీర్చగ  ఎచ్చటనున్నా ... నీ  నెచ్చెలి చేరగ తక్షణమే  రా .. రమ్మని
 మధురా నాయకా మనమొహన కృష్ణా ..  .. నిన్ను  వేడుకొందు .
 
                                        
                                                                                                సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

27, మార్చి 2014, గురువారం

వరమీయవా


 ఉరకలేసే  నా  ఊహకి  రెక్కలొచ్చి  చుక్కల పల్లకినెక్కి  నీకై  వెతికింది .
నా తలపుల  కోయిల పల్లవి  మరచి  నీ చరణాలను తాకింది . 
నా  ఆశల  హరివిల్లు  నీ సన్నిధిలోనే   వెల్లి విరిసింది . 
మకరందం  గ్రోలుతున్న  తుమ్మెదలా ... 
నా  మది,
మధురమైన నీ ప్రణయామృతధారలలో పరవశించి తడిచింది .    
మండు వేసవిలో  కూడా   నీ ధ్యాస. 
నా మేనును సుతిమెత్తగా  తాకింది...    మంచు తెమ్మెరలా  !
పండువెన్నెల్లో  విరబూసిన వెన్నెల  కుసుమంలా !
మల్లె చెండు పరిమళాల గుభాళింపులా !
 ఏ  మాయ  చేశావో .. ఏం  మత్తు  జల్లావో !
నా  హృదయం అనుక్షణం, నీ చుట్టూ ప్రదక్షిణం .  
నా ఉనికిని  నేనే మరచి ,తరచి , తరచి ,అడుగుతున్నా !
నాలో కొలువున్న  నా  చెలికాడా....   నీ జాడేదని . 
నన్ను  నాకు కాకుండా చేసిన  నా చెలికాడా ....
 నువ్వు నా జత చేరే ఘడియేదని . 
నీకై  వెతికే  నా  కన్నులకు   నీ   సన్నిధి  చేరే  వరమీవా !
మధుమాసపు  కోయిలకై తరలొచ్చిన వాసంతంలా .... 
నిన్ను తలచి  మైమరచిన  నీ చెలికై 
ఆఘమేఘాలపై  పయనించి  రావా !

నీకై  వేచిన  నీ సఖికై . చిన్నికృష్ణా ...  నిన్ను  వేడుకొందు . 
                                           
                                          సాలిపల్లి  మంగామణి @శ్రీమణి 

25, మార్చి 2014, మంగళవారం

అలిగిన నా హృదయంప్రియా  !
అలిగిన  నా హృదయం  నీ  దరికే  వచ్చింది . 
 అర్ధం లేని  ప్రశ్నలతో  నిను  కలవరపెడుతోందా ... 
తన చిలిపి చిలిపి భావాలతో నీ  ఇల్లు తీసి  పందిరి  వేస్తోందా .. 
అప్పటికీ  నే వారించా ...  నన్ను కాదని ,పరుగులు తీసింది . నీ  వైపే.  
నేనంటే  ఏదో  నీ ద్యాసలో  గడిపేస్తున్నా . కాని  నా  హృదయానికి  తొందరెక్కువ . అందుకే .. 
 తను  మాత్రం నిను  చూడాలని మారాం  చేస్తుంది. 
నీ  వ్యాపకాలలో పడి  నా జ్ఞాపకాలు కూడా నిర్లక్ష్యం  చేస్తే
 ఊరుకోవడానికి అది నాలా కాదు .మహా మొండి . 
 నీ  గుండెలోకి  చేరి, గుట్టు   బయట పెడ్తుంది . తర్వాత నీ  ఇష్టం . 
నువ్వు జీవించేది నా  కోసం అని  నాకైతే  తెల్సు . 
కాని.... 
  దానికి నీ  గుండెలోని  లోతుల్లో  దాని  జాడలే  కనిపించాలట .  
నీ  శ్వాసలో  తన  ధ్యాసే  నిండాలట .  
నిరంతరం  దాని  తలపుల్లోనే  నువ్వు  తలమునకలవ్వాలట . 
 నిమిషమాత్రమైనా  నీ  ఎడబాటు  తనకు  తగదట . 
మూడు  ముళ్ళు  వేసిన  మరుక్షణమే.నీతో వీడని ముడి వేసిందట .  
ఏడడుగులు  వేసినంతనే  తన అడుగుజాడల్లో  నిను  కట్టిపడేసిందట . 
నువ్వు  రెప్పవేసినంతలో  కూడా  తనను  మరువకూడదట . 
నిత్యం  నీ  గుండెల్లో  తను కొలువుండాలట . 
 తన స్థానం  నీ  గుండెల్లో  పదిలమని 
తనతోడే  నీ జీవనమని ,నిదానంగా వివరించి ,
నా  మనసును  ఊరడించి ,నిండు నూరేళ్ళు ,ఏడు జన్మలూ ,నీకై  నేనున్నానని  ,   ఒట్టేసి  చెప్పెయ్యవా  నువ్వు  ఒంటరి కావని ,
నా  గుండెగుడి  నేలేటి  నా  నెచ్చెలి  నీవని ,నీ  ప్రియసఖుడను  నేనే అని 
       అనునయించి చెప్పు   నా హృదయానికి . 
హృదయారావిందం గా ... 
                         
                                          సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

23, మార్చి 2014, ఆదివారం

నీ సన్నిధికై (నిరీక్షించే ప్రతి హృదయపు వేదన)
నిను  చేరే  దారిని  సరళం  చేస్తే
గరళాన్నైనా  చిరునవ్వుతో  సేవించేస్తా !
నిన్ను చూడగ కనులకు కాంతినిస్తే ,
కటికచీకటిలో నే కాలంగడిపేస్తా !
నా ప్రణయం  తెలుపగ  నా అధరానికి పదములనిస్తే,
ఆపై మూగనయినా నే  మురిసిపోతా !
నీ మనసును ఒక పరి  గెలుచుటకై ,
నిరంతరం నే ఓడిపోతా !
నా హృదయపూతోటలోకి   నువ్వొస్తానంటే ,
నూరేళ్ళకైనా  కనురేప్పేయక  నే  నిరీక్షిస్తూనే  ఉంటా !
నిజంగా .. ప్రియతమా !
నీకై  తెల్లవారుతోంది  ఉదయం , నీకోసమే ఆ సాయం సమయం .
నిదరోకముందే  కలను  కూడా  ఆదేశిస్తా !
నిన్నే  తనతో తీసుకురమ్మని . లేకుంటే  కరిగిపొమ్మని .
ఇల  నా  జీవితాన్ని  నే శాశిస్తా !
నీ  జత  లేదంటే  శూన్యం  కమ్మని .
అందులకే  నే   నువ్వోస్తావనే  నే  జీవిస్తున్నా !
నీకై  నే నిరీక్షిస్తున్నా... నిద్దురలోనూ  మేలుకొని .

                  సాలి పల్లి  మంగా మణి @ శ్రీమణి
                      సెక్రటరీ, విశాఖ కళావేదిక  


                                      

22, మార్చి 2014, శనివారం

పుస్తకాలయం

ఓం

                         
మహా  విశాఖ  నగరంలోని  సుప్రసిద్ధ రచయితలు ,రచయిత్రుల రచనలను భద్ర పరచే  క్రమంలో భాగంగా              పుస్తకాలయం'  ఒకటి నెలకొల్పవలెనన్న సదాశయంతో కళావేదిక నేడు మీ  ముందుకు  వస్తోంది.  ఈ  సందర్భంగా    మీమీ  సలహాలను ,సూచనలను మా  కళావేదిక  ఆహ్వానించే  క్రమంలో  ది 29-3-2014,స్థిరవారం (శనివారం ) సాయంత్రం “4.30 గం..కు శ్రీ నండూరి రామకృష్ణ  గారి నివాసంలో  plot no -132, sector -8, M.V.P.కాలనీ ఉషోదయ జంక్షన్ (సత్యసాయి విద్యావిహార్ కు  చేరువలో ) మీ అందరితో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమయినది .
కావున  మీరు తప్పక  ఈ  సమావేశానికి  విచ్చేసి  మీమీ  సలహాలను /సూచనలను అందచేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే  మీ మీ  రచనలను(ముద్రితాలను  మాత్రమే) తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము మీ మీ profile ని  కూడా hard copy  జతపరుస్తారని ఆశిస్తున్నాము .

గమనిక సమయం పాటిద్దాం మీ సహకారం ఆశిద్దాం
(సాయంత్రం “4.30 గం..కు ప్రారంభిద్దాం, 6.00 గం''కు ముగిద్దాం
            Salipalli Mangamani@srimaani                                                                                                         (Visakhapatnam Kalavedika seceratory)
Contact 


21, మార్చి 2014, శుక్రవారం

కవితా కన్యక
ఎవరివో నీవు నా  కలల్లో  విహరించి, అలలా  ఉప్పొంగి ,  
నా కలాన  జాలువారి,  
కవినైన  నాలో  కవితల్లె  కదలినావు 
అరవిరిసిన  మందారానివా !
ఇల దిగి వచ్చిన గాంధర్వ కన్యకవా !
ప్రణయ భావం  పల్లవించగ ప్రణయ దేవతవా !
మానసముల్లాస పరచగ మధుకలశానివా !
చెంపకు  చారెడు  కన్నుల కుసుమకోమలివా !
కమ్మనైన  కధలో  మెదిలిన  కావ్య నాయిక  నీవా !
వేచిన  కనులకు  వెన్నెల తునకవా !
నటనమాడే మయూరివా !
నండూరి  ఇంట ఎంకివా !
రెప్పపాటులో  మెరిసి మురిసిన  బంగరులేడివా !
తలవాకిట  తీరుగ దిద్దిన  రంగవల్లికవా !
మధుమాసపు  కోయిలవా
ఇలా  అరుదెంచిన  ఎల్లోరా శిల్పానివా ! 
నా కవి హృదయం దోచేసిన సౌందర్య  కవితాకన్యకవా !
ప్రపంచ  కవితా  దినోత్సవం  సందర్బంగా  'ఈ  కవితా  కన్యక'  నా మిత్రులందరికీ ,బ్లాగర్లందరికీ 

                                                                                  సాలిపల్లి  మంగా మణి @శ్రీమణి 
                                                                                   విశాఖ  కళావేదిక  సెక్రటరీ

19, మార్చి 2014, బుధవారం

సప్తపదులూ నడిచిన నీకై ;
నా  కన్నులు  నీ కన్నులకై  కవితను రాసాయి .  నీకు చేరలేదా  !      
 నా  మనసు తన ముంగిట   ముత్యాల  ముగ్గు వేసింది . నువ్వొస్తావని . నీకగుపడలేదా !
నా  అధరాలు  నిరతం  నీ  స్మరణమే .  నీ చెవికి  తాకలేదా !
నా  నీలి ముంగురులు  గోల గోల చేస్తున్నాయి  . తము సవరించగ  నువ్వు లేవని . మరిచావా  నువ్వు
నువ్వు  లేని  నేను.   నెలరేడు   కానరాని  పౌర్ణమి. 
నీ  నవ్వు  లేని  తావుల్లో   నిశిరాతిరి  అంధకారం .
నీ  తోడు  లేని  నా  గమ్యం . ఎండమావికై  పరుగులిడిన  వైనం .
నీ  జత  లేని  నా  ప్రణయ సీమ.  మోడు  వారిన  బీడు  కాదా !
అందులకే  చెబ్తున్నా ! ఆరాధనతో, ఆవేదనతో ....
నేనెక్కడ  నేనెక్కడ "? నీవు లేని నా ఉనికి నాకే ప్రశ్నార్దకమయి  పరిణమించె  .
నీవు  లేని  నేను  పూవు లేని   తావిని . పదం  పడని  కవిత్వమని .
నీవు  లేని  నా  జీవితం  మాధుర్యం  మరచిపోయిన  కాటిన్య  విషం .
ఏడేడు  జన్మలైనా  నీతోటిదే  నా  జీవితం .
నీ  తోటిదే  నా సంతోషం .  కష్టాలే రాని , కన్నీటి వరదల్లోనే  చిక్కుకు పోనీ ,
నా  ప్రాణాలను  హరియించగా  ఆ  కాల  యముడే  నన్ను తరిమినా ..
నా  శ్వాస  ఆగిపోదు . నీ  చేయి నా చేతిలో ఉన్నంత వరకు .
సప్తసంద్రాల  ఆవల  నీవున్నా .. నే  సప్తపదులు నడిచిన  నీకై  నే  నిరీక్షిస్తూ నే  ఉంటా ..

                                                                                      సాలి పల్లి  మంగా మణి @శ్రీమణి

16, మార్చి 2014, ఆదివారం

ప్రతీ ఎద లోగిలికి హోలీ శుభాకాంక్షలు


 సంబరాలు  అంబరాన్ని తాకేలా !
ఆకాశమే  హద్దు  సప్త వర్ణాలు  మెరిసేటి  ఈ వేళ !
సరిహద్దులే  మరచి  ఆడిపాడాలి  ప్రతీ  మనసు మైమరచేలా !
ఉవ్వెత్తున ఎగిసిపడే  ఆ సంద్రపు  అలలా !
నేరవేరాలి  ఈ వేళ  రంగురంగుల  కల !
విరిసిన   ముద్దు రోజా రేకులా !
కురిసిన  హరివిల్లులో వర్ణాలు  సిరిజల్లులా !
చిరుగాలి పరదాల ఊగిసలాడే  మనసే  ఊగాలి  ఊయలలా !
ప్రతి  స్వరం పరవశించి  పాడాలి  ఎల కోయిలలా !
మనసు  పూల తోటలో ఆనంద కుసుమాలు  విరబూయాలా !
వెల్లి  విరియాలి  ప్రతి  ఎద లోగిలిలో ఆనంద  హేల !
                              
                అని  ఆకాంక్షిస్తూ ........ 
                                                      మీ  

                                   సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

15, మార్చి 2014, శనివారం

ముత్యమంత ఆశ

                                                                                                                 
                                                                                                                                   
మనిషి  ఆశాజీవి  అన్నారు  కదా ... 
కానీ  నా   మనస్సు  మాత్రం  దురాశా  జీవి ... 
ఎందుకంటే   నా  గుండె కొంచెం వేగం ఎక్కువ .(ఇది నిజం ) 
మరి  అప్పుడు దాని ఆశలక్కూడా తొందరేక్కువే కదా !
   నా ఈ   గుప్పెడంత  గుండెలో ముత్యమంత ఆశ 
నా చిన్ని హృదయంలో చిగురించిన చిలిపి  ఆశ 
 అరవిరిసిన  నా  మది తోటలో  మధు  ధరహాసం విరబూయాలని  ఆశ 
సాయం సంధ్యా సమయంలో భానునితో దోబూచులాడాలని ఆశ
 జడివాన  విరిజల్లులో హరివిల్లుపై నాట్యమాడాలని ఆశ
పురి విప్పిన వయారాల  మయూరానికి  సరి జోడుగా నర్తించాలని  ఆశ 
నీలి మేఘమాలికపై ఊయలలూగాలని ఆశ
 చిరుగాలితో చేరి అణువణువున విహంగమై  విహరించాలని ఆశ 
నిండుపున్నమిలో, వెండి వెన్నెలలో పారిజాత పానుపై పవళించాలని ఆశ
పంచెవన్నెల చిలుకల్లే ఎగిరిపోవాలని ఆశ 
మానస సరోవరాన చేరి రాయంచల సరసన జలకాలాడాలని ఆశ
చుక్కల పల్లకిలో విహరించాలని ఆశ
లెక్కలేని  తారల నడుమన చేరి తళుక్కు మనాలని ఆశ 
తలచిన  మరు క్షణమే 
భువిని వీగి, నీలిమేఘముల కేగి, హాయి హాయిగా సాగి,
జాగు సేయక చంద్రబింబమును చుంబించాలని ఆశ
ఆశ. . . . .చిన్ని చిన్ని ఆశ. . . . .చిగురించిన చిలిపి  ఆశ 
    ముత్యమంత  ఆశ  ...   ప్రతి  మదిని  మురిపించు  ఆశ 
                                      ఆశాజీవులారా ... ఆశను  ఆశ పడేందుకు     ఆశ  తీరా   ఆశించండి . 
                                                     
                                                            ఆశిస్తారనే  ఆశతో   మీ 
                                                          సాలిపల్లి  మంగా మణి @శ్రీమణి 

SRIMAANI

13, మార్చి 2014, గురువారం

నేటి వ్యవస్థ ?
కంపు కొడుతున్న నేటి రొంపి వ్యవస్థలో ;
షికార్లు చేస్తున్న మానవ వరాహాలు !
బ్రష్ఠు  పట్టిన మానవ జాతిలో తుప్పుపట్టిన మనసులున్న రాక్షసరాయిళ్ళు 
తిరుగాడుచున్న నేటి అత్యాధునిక గంజాయివనంలో ,
నిర్మలమగు తులసి జీవించుట  ఎంత కష్టమో ,
కరుడు కట్టిన పైశాచిక సమాజంలో , 
కర్పూరమంటి మనసున్న మహామనీషి మనుగడ కూడా మరణప్రాయమే !
రాక్షసమూకతో రాజీ  పడగలమేమో !
బేతాళునితో  తలపడగలమేమో !
సముద్ర మధ్యమున చేరి తపమాచరించగలమేమో !
పశు పక్షాదులతో కూడా సంభాషించగలమేమో !
హిమాలయాలనే ఢీకొనగలమేమో !
కానీ.........?
ఈ మానవ జాతిని మాత్రం ఇసుమంతైనా మార్చగలేము ;
కానీ....... ప్రయత్నిద్దాం , ప్రయత్నిస్తూనే వుందాం ; 
కలచివేసే వ్యవస్థనే కల్పతరువుగా మార్చేందుకు ,
మనం కలలుగన్న నవ్య వ్యవస్థ నిర్మించేందుకు........ 

                                               సాలిపల్లి మంగామణి @ శ్రీమణి 

11, మార్చి 2014, మంగళవారం

ఓ వ్యధ


తుమ్మెదా ! ఓ చిన్ని తుమ్మెదా !
ఓ సారి ఇటు  చూడు  చెబుతాను  నా వ్యధ . 
తీయ తీయని  మధువు  గ్రోలుతుంటావు 
హాయి హాయిగ నీవు విహరిస్తూ ఉంటావు 
ముచ్చటగా పూలతో ఊసులాడుతావు 
చల్లని  గ్గాలుల్లో  ఊయల్లూగుతావు 
రయ్యి రయ్యని  జోరుగా  ఎగిరిపోతుంటావు  
 నా  వ్యధను చెబుతాను  ఒకసారి  ఆగవే ... 
నా  కధకు బదులిచ్చి  ఆనాక   సాగవే ... 
అనురాగమందించు ఆశలే లేవే !
ఆనందమనిపించు  ఘడియేది లేదే !
కన్నీట  ఓదార్చు చేతులే  లేవే !
కష్టాల  కడతేర్చు  కలలైనా  రావే !
మరుజన్మ వుంటే నీలాగ పుడతాను 
జన్మ జన్మలకైనా మనిషి  కాలేను . 
                   సాలిపల్లి   మంగామణి @శ్రీమణి 

10, మార్చి 2014, సోమవారం

రక్తమోడ్చు రహదారులు


                          
                                                                                                                                                                    నేడు రహదారుల ప్రయాణాలు సాక్షాత్తూ యమలోకపు ద్వారానికి దారులు                                                                                 
నేటి ఆధునిక వాహనాల శరవేగాలు, మనను కభళించే మృత్యుపాగాలు. . 

అడుగడుగునా ప్రమాదాలు
నేటి జనజీవన యానంలో అది షరామామూలు. .

ఎక్కడ చూసినా రక్తమోడ్చు రహదారులె
శోకసంద్రాన నిండిన నిండు జీవితాలె. .

గడపదాటి బయటకు వెళ్లిన బాటసారి
మరల తిరిగి వస్తాడని, బ్రతికి బట్ట కడతాడని నమ్మకమేది ఈనాడు !

నిదానమే ప్రధానమని వాహనాలఫై లిఖించేస్తే
నిజానికి ఈ నినాదాన్ని పాటిస్తారెందరు ?

మత్తుల్లో తూలుతూ తోలతారు వాహనాల చోదకులు
నిస్తంత్రిని చేతపట్టి నిదురోతూ నడుపుతారు . .

శిరస్త్రాణం త్యజియించి వేగాన్ని హెచ్చించి దూసుకుపోతుంటారు కొందరు
నియమాలను పెడచెవిన పెట్టి కారుల్లో షికార్లు చేస్తుంటారు మరికొందరు. .

ఈ నిర్లక్ష్యపు పోకడలు, భాద్యత రాహిత్యాలకూ
నిర్దయగా బలయ్యేది, అనాథగా మిగిలేది,
అభాగ్యులుగా మారేది, గుండె పగిలి ఏడ్చేదీ
అన్యం పుణ్యం ఎరుగని నీ అమాయకపు కుటుంబమే
అని మరచిపోకు నీవు. .
నియమాలను మీరి పోకు నీవు. .
కొని వెళ్ళకు ప్రమాదాల తావులకు. . . .
                                                                                 

                                            
                                       సాలిపల్లి  మంగామణి @ శ్రీమణి 

7, మార్చి 2014, శుక్రవారం''అమ్రుతమూర్తీ '' ఓ  ''స్త్రీ  మూర్తీ '',
'ఆదిశక్తీ ' అవనిపై  వెలిగే   ''అఖండ జ్యోతీ ''
ఏ కవి వర్ణించగలడు  నీ  స్త్రీ జాతి కీర్తి 
ముత్తెపు సిరుల  మృదు దరహాసం ముదితా ..       నీ  సొంతం.
మంచు తుంపరల చల్లదనం  నీ మది సాంతం . 
నీ  ఆదరణతో  ఆ  ధరణి ని  తలపించావు 
నీ  ఔదార్యంతో  ఈ  అవనికి  ఆదర్శం నిలిచావు 
మమత  మానవత  నిర్వచనం  నీవై 
అనురాగం  ఆప్యాయత  చిరునామావై 
అనంత సృష్టికి ప్రతిరూపం నీవై 
జగతిని  వెలిగించే దీపం నీవై 
ఓ  జననివై  , తనయవై , సహోదరి నీవై 
సహధర్మచారిణివై  ,నీ  కర్తవ్య పాలనలో 
కృతకృత్యురాలవై  , 
అన్నింటా  నీ జాతి  ముందడుగేస్తున్నా .. 
కన్నీట  కరుగుతున్న కధలెన్నెన్నో .. 
చీకట్లో  మ్రగ్గుతున్న వ్యధలెన్నెన్నో . 
అర్ధరాత్రి అతివ ఒంటరిగా నడిస్తే అదే అదే స్వాతంత్ర్యం 
అన్నారే జాతి పిత . 
నేడు పట్టపగలు పడతికి రక్షణ  ఏదీ ఈ కర్కశ లోకంలో 
రాకాసి మూకలు  జగతి నిండగా  ఉండగా , 
ఇంతి  బ్రతుకు ఇక  దండగా ? కానే  కాదు కదా !
రాణి  రుద్రమదేవి ,ఝాన్సీ ,ఒక ఇందిరా ప్రియదర్శిని 
ధీర వనితలు వెలసిన'  స్త్రీ ' జాతిని 
వంచించకు   వనితను వంటింటి కుందేలని . 
'స్త్రీ '  గౌరవించబడిన  కాడే 
ముక్కోటి  దేవతల జాడ  అందులకే .. 
గౌరవించు ' స్త్రీ 'జాతిని 
ఇనుమడింప చేయండి మహిళాఖ్యాతిని ,
ద్విగుణీకృతం  చేయండి  వనితా శక్తిని , 
అబల  సబల కాదంటూ పెంపొందించండి 
అతివలో ధైర్యం ,స్థైర్యం . సహకరించి , ప్రోత్సహించి 
ప్రోద్భలమందించి  . 
'' తెలుసు కదా  నాటి మన భారత సంస్కృతిలో స్త్రీల  హిస్టరీ ''
''నేడు  చేయొద్దు మహిళ బ్రతుకు ఒక మిస్టరీ ''
           అని  వేడుకొంటూ ..  
 మహిలో మహిళా  మహోన్నత  మూర్తులందరికి 
సహస్ర  కోటి వందనాలతో  మహిళా దినోత్సవ  శుభాకాంక్షలతో               
             ............................ 


                            సాలిపల్లి మంగామణి @ శ్రీమణి 


6, మార్చి 2014, గురువారం

ప్రయాణంఅలల ప్రయాణం  తీరం వరకే ... 
కలల ప్రయాణం  మెలకువ  వరకే ... 
మబ్బు  ప్రయాణం  కురిసే  వరకే .. 
నదుల ప్రయాణం  కడలి  చేరే  వరకే ... 
మనిషి  ప్రయాణం మరణం వరకే ... 
మరి 
మనసు  ప్రయాణం ???????????  

                           సాలిపల్లి  మంగామణి @ శ్రీమణి 

4, మార్చి 2014, మంగళవారం

నేటి విద్యావ్యవస్థలో విద్యార్థి అవస్థలు


నేటి విద్యాసంస్థలు   మేటి  లాభసాటి  వాణిజ్య సంస్థలు 
చదువుకోవాలంటే  చదువు 'కొనాలి ' మరి నేడు .. 
పలక పట్టిన  మొదలు పట్టా  పట్టే  వరకు 
అక్షరానికో లక్ష , అది పేదవానికందని  ద్రా.... క్ష . 
విద్య   నేర్పించాలంటే   వీధిన  పడాల్సిన స్థితి నేడు . 
పుస్తెలమ్మి పుస్తకాలు  కొనివ్వాల్సిన  కొందరి  దుస్థితి.. 
నాడు గురువు నుండి విద్యను  అర్ధిస్తే 'విద్యార్ధి ' అన్నాం 
నేడు  విద్యను కొంటుంటే  దానిని  ఏ విశిష్ట పదంతో  నిర్వచించాలి ?
నేటి విద్యావ్యవస్థల వ్యాపార తీరు 
అడుగడుగున   అవస్థలె నేటి  విద్యార్ధికి ..., 
నేటి  విద్యాలయాలు  పెద్దోళ్ళకు   ' కొలువులు '
పేదోళ్లకు  మాత్రం ' కొలుములే'
విద్య లేని వాడు  వింత పశువు  అన్నారు కానీ 
నేడు విద్యనూ ధనం  పెట్టి  కొనలేని  వాడినే 
వింతపశువుగా  చూస్తున్నారీలోకాన . 
తీరా .... ! పాఠశాలకు వెళ్తే ,
వెన్నెముకలు అరిగేలా బండెడు' పుస్తకాల  బరువులు'
మస్తకాలు  అరిగేలా  రుద్దుతారు  ' గురువులు '
నాటి  చదువుతో పాటు ' సంస్కారం '
నేడు ఆ  చదువే  'బలాత్కారం'  అయిపోయె కదా !
అందులకే  వద్దు  వద్దు  ఈ తరహా  విద్యాచారం 
వెసులుబాటు చేయండి మీ  ఫీజుల పట్టీని  న్యాయ ప్రకారం 
ఒక  బృహత్కార్యమని తలచి అందించండి 
మీ విద్యను అభ్యసించు  విద్యార్ధికి .. 
తీర్చి దిద్దండి రేపటి పౌరులను 
విద్యాలయాలు  దేవాలయాలుగా  కొనియాడేలా ... 
నమ్ముకోండి  విద్యను ,అమ్ముకోవద్దు 
                             
       
సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                                              

3, మార్చి 2014, సోమవారం

మది మకరందం చవి చూసిన ఘడియ

మనసున  మల్లెలు   విరిసిన  వేళ

మెలమెల్లగా పిల్లతెమ్మెర  మేను  తాకిన ఘడియ 
జాబిలి  మబ్బుల   చాటున  దాగిన వేళ 
కలువ భామ చంద్రునికై వేచిన ఘడియ 
సన్నజాజుల  పరిమళాలతో  వేయి పున్నముల వెన్నెల  కురిసిన వేళ 
స్వాతి జల్లుకై  ముత్తెపుచిప్ప  పరితపించిన  ఘడియ 
సంపంగిపూలు  చెంత చేరి పలకరించిన  వేళ 
ఆ  మరపురాని  ఘడియాలోనే మైమరచా నిను  తలచి 
ఆ  సుమధుర ఘడియ .. 
నా మది మకరందం  చవి చూసిన  ఘడియ 
యమునా తీరంలో పరవశించి  నీ ఒడిలో తలవాల్చిన  వేళ 
నీ సాంగత్యపు మధుర పుటలు మది తాకిన  ఘడియ 
ఆ సుమధుర ఘడియ .. 
నా  మది మకరందం  చవి చూసిన  ఘడియ 
నీ సుతి మెత్తని  స్పర్శతో  నా  తనువు  పులకరించిన  వేళ 
నా కన్నులు నీ  కలలతో  సరాగమాడిన  ఘడియ 
ఆ సుమధుర  ఘడియ ... 
నా  మది మకరందం  చవి  చూసిన  ఘడియ 
అలవోకగా  నా ఊహలు తెరచాపలా  పయనించే  వేళ 
వింత వింత  అనుభూతుల సంతకాల నా ఎద  మురిసిన  ఘడియ 
నిత్యం నీ లోకంలో  నీ కోసం  నే వేచిన  వేళ 
ఆ సుమధుర ఘడియ 
నా మది మకరందం  చవి చూసిన ఘడియ 
   
సాలిపల్లి  మంగా మణి @ శ్రీమణి 

2, మార్చి 2014, ఆదివారం

ప్రియతమా ...... ( ప్రతి కన్నె మనసు నిరీక్షణ )

ప్రియతమా ... ప్రియతమా 
నీవే నా  ప్రేమకి  చిరునామా ... 
నా  తలపుల  వనములో 
విరబూసిన పారిజాతమా .. 
నా  జీవన బృందావనిలో 
వినిపించిన  వేణుగానమా .. 
నా  గుండె గొంతుకలో పలికిన  మృదు సరిగమా 
నా మనసుని శృతి చేసిన  వీణానాదమా 
నా  మదిలో  మెదిలే మధుర  భావమా 
నా  కన్నుల కదిలిన పసిడి స్వప్నమా 
నా  ఊహల  ఒదిగిన నా ప్రాణమా 
మమతను పంచిన  మధురానురాగమా 
ఇల దిగి వచ్చిన  వెన్నెల చంద్రమా 
నా కనుపాపల  కదలాడే చిరు  ప్రతిబింబమా .. 
నా  మనసుని గురి చూసిన  మదనుని బాణమా 
నిరతం  నా అధరం  నీ మననం 
ప్రతీ  క్షణం  నా హృదయం  నీ స్మరణం 
నీ  ఊహలు  నా చెంతనుండగ  దరి చేరదు ఏ  మరణం 
నీకై   వేచిన  క్షణాలు  వేయి యుగాలై నను వేదిస్తుంటే 
వలపులదారుల్లో  నీకై  వెతుకుతున్నా 
వలచిన వరుడా నీకై వేచి  ఉన్నా ... 

సాలిపల్లి మంగామణి @శ్రీమణి              


1, మార్చి 2014, శనివారం

నా తలపుల వనంలో ( పరువంలో ప్రతి హృదయపు భావన ఇది )ఎటు  చూసినా  నీ  సడి . 
ప్రతీ జడి నీ అడుగులనే  నే  తడబడి ,
నా  మదిలో  ఒక మధురమయిన  అలజడి . 
జడివానలా .... ప్రతి రేయి  నిద్దుర  కొరవడి 
నా కన్నుల .
నీ  చిలిపి  ఊహల  ఒరవడిలో 
నే  తల వాల్చా ... నులివెచ్చని  నీ ఒడిలో ... 
అది ఒక వెన్నెల నిండిన  వలపుగది . 
అది జంట హృదయాల  మైమరపుల  మధుర  ఘడియది 
ప్రతీ  క్షణం  నీ  సాంగత్యం . 
కోరుతోంది  నా మది  అనునిత్యం . 
మచ్చలేని  జాబిలిలా 
అచ్చం నీ రూపమే అచ్చు గుద్దినట్లున్నది   నాఎదలోగిలిలో ...... 
నవ మల్లికా  కుసుమాల గుచ్చం 
విచ్చుకొన్నట్లున్నది  నా చిన్ని మదితోటలో .. 
కటిక చీకటిలో కూడా నీ రూపం  మిణుగురులా 
మిణుక్కుమంటూంటే  ...........
నీ  తలపుల పలకరింతలే నాలో వలపుల  కలవరింతలై 
వేణుగానమాలకించినట్లున్నది 
ఏమరపాటులో నేనుంటే ఏదో మత్తును  చిలకరించి  
నీ  ఊహల  సయ్యాటలో అమాంతం నను దోచేసి 
నీ వలపుల  దారులకై అజ్ఞాతంగా  నడిపిస్తూ 
నా  మనసు  శృతి  లయ  నీవై 
ప్రణయరాగాలు పల్లవింపచేస్తున్నావు 
నిరీక్షించలేకున్నా  నిమిషమాత్రమూ  నీకై 
ఆలశ్యం  దేనికి ప్రియతమా ! 
ఆశలతీరం  చేరడానికి . 
రెక్కలు  తొడిగి రాలేవా ...  నీ నెచ్చెలి దరి  చేరడానికి . 
                                                                           
                                                    సాలిపల్లి మంగామణి @ శ్రీమణి