పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

16, జులై 2015, గురువారం

పొరపాటా ?ఏమరపాటా .. ?


గోదారమ్మ గుండె బరువయ్యింది
కన్నీళ్ళతో చేరి చెరువయ్యింది
కడుపుకోతతో  తో బావురుమంది  . 
కల్ప తరువంటి కన్నతల్లిఒళ్లో 
బిడ్డకి  భద్రత  కరువయ్యింది . 
పొరపాటో ,
గ్రహపాటో 
ఏమరపాటో,
ఏ దిష్టి చెరపాటో ,
వెన్నంటే ఉండాల్సిన అధికార యంత్రాంగం
 దిక్కులు చూస్తుందో ... 
కన్నులుండి గ్రుడ్డితనం ఆవరించిపోయిందో 
నిర్లక్ష్యం నిలువునా నిండు బ్రతుకులు బలి కోరిందో 
.కన్నీరు పెట్టి "కొంటే" ప్రాణం తిరిగొస్తుందా 
ముందే మేల్కొని ఉంటే ఏడ్చే పని మీకుందా ...?
(ఇకనైనా దయచేసి నిర్లక్ష్యం వీడండి . అమాయకుల ప్రాణాలు కాపాడండి  . )
                                                      అభ్యర్ధనతో ......                                  
                                              సాలిపల్లి మంగామణి @శ్రీమణి 


11, జులై 2015, శనివారం

నీటి చుక్క ... ...


           నీటి చుక్క ... ... 

అమృతధారను తెచ్చి అరచేత పోసినా
అరక్షణము మనగలమా  అర్ణమ్ము  లేక
సిరులెన్ని ఉన్ననూ జలసిరులు కాననిచో
ఉర్వీతలంబంత   రిత్తమే కాదా,  
భావి  నీటి వెతల  భరతవాక్యమ్ము  పాడగా
వృధా సేయక ఊరక  ప్రాణాధారమ్మును
అడుగంటి పోతున్న అంభువులనదిమిపట్టి 
వానచినుకును ఒద్దిగ్గా ఒడిసిపట్టి ,
భద్రమ్ము సేయరా ప్రతి నీటి చుక్కా ... ... 
                                                   
                                                     సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                                                                  
                                                         
                                                         

8, జులై 2015, బుధవారం

రాజన్నజయంతి సందర్భంగా ...వేవేల నీరాజనాలతో నా నివాళి


మరువగలమా మహాత్మా... 
మరులుగొన్న నాయకత్వ గరిమ . 
అభివర్ణించగ తరమా !
అత్యద్భుత నీ కర్తవ్య ధీక్షా పటిమ,
పులివెందుల సింహమా..
పుడమిన ఉదయించిన రాజసమా... 
నువు తనువు చాలించి అమరుడవైనా... 
నువ్వొదిలెల్లిలిన ఆశయాల సాధనలో... చిరంజీవివే సుమా...  
నువ్వులేని  శూన్యం మము నిలువునా కుదిపేసినా... 
నువ్విచ్చిన  స్ఫూర్తే, మా ఎడతెగని ధీమా.. 
మరువగలమా ... మహాత్మా 
 విడువగలమా ... నీ వాత్సల్యం,ప్రేమ 
కధన రంగ సింగంలా 
ఎడతెగనీ నీ తెగింపు 
మధనపడే బ్రతుకుల్లో 
ఆదుకొన్న నీ ఓదార్పు  
అడుగడుగున వేళ్ళూనిన 
అరాచకానికి  నువ్విచ్చిన ముగింపు 
అక్కా చెల్లెళ్ళంటూ  ... 
నీ అనురాగపు పలకరింపు 
నేనున్నది   మీ కొరకంటూ 
పాదయాత్రతో నీ పిలుపు 
ధరిత్రి  ఉన్నంత వరకు
చెరగని చరిత్ర నీ తలంపు 
మా కోసం జనియించి 
మాకోసమే జీవించి 
మాకోసం పరితపించి
అంతలోనే నిష్క్రమించి 
తెలుగు ప్రజల గుండెల్లో 
రాజేసినావు ఆరని నిప్పు 
ఏడేడు లోకాల నువ్వు ఏడునున్నా గాని 
నీ ఆశయాల స్మరణమే మాకు ఊరడింపు 
ఇడుపులపాయలో ఇమిడిపోయిన నీ పవిత్ర ఆత్మకు  
శాంతి చేకూరాలని ఆ దేవుని అభ్యర్థిస్తూ ...  
(రాజన్నజయంతి సందర్భంగా ...వేవేల  నీరాజనాలతో  నా నివాళి )
                                     సాలిపల్లిమంగామణి@శ్రీమణి 

                                             
                                                    

7, జులై 2015, మంగళవారం

ఎంతటి నెరజాణవే .....?ఓ చిన్ని హృదయమా ... 
నీకెన్ని ఊహలే .... 
ఎన్నెన్ని ఊసులే ,
ఎంతటి నెరజాణ వే 
ఎంతెంత మాయలాడివే 
మైమరపున జాబిలితో విహరిస్తావు . 
నీలిమబ్బు నీడలపై నిదురిస్తావు . 
ఆకసాన హరివిల్లుపై అలిగి కూర్చుంటావు . 
తారల నడుమన చేరి తళుకును నేనంటావు . 

                                          సాలిపల్లి మంగా మణి @శ్రీమణి                                        

6, జులై 2015, సోమవారం

ఎన్నాళ్ళిలా ....?ఎన్నాళ్ళిలా .. 
 పావలా బతుకులో  ముప్పావలా వెతలు 
 పట్టెడు   మెతుకులకై పుట్టెడు అగచాట్లు . 
 కంట కన్నీళ్లు ,ఇంట గంజి నీళ్ళు .  
 భూమి పుత్రుల ఆత్మార్పణలు ,
 ఎన్నాళ్ళిలా 
 మంచం లేచిన మొదలు లంచపు లాంచనాలు . 
 గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తూలుతూ 
 మరమ్మత్తు చేయలేని మరబొమ్మ గా మారుతున్న వైనాలు
 కుప్పతొట్టికి బహూకరించిన పసిమొగ్గల  ఆక్రందనలు 
  చీత్కారంతో అమ్మల కు నడిరోడ్డు సత్కారాలు 
  ఎన్నాళ్ళిలా .. 
 అడుగడుగునా అబలలపై  అకృత్యాలు 
  అడ్డుకట్టలేని అవినీతి మురికి కూపాలు . 
  మసక బారిపోతున్న మానవత్వపు  ఆనవాళ్ళు . 
 మర జీవనాలు,అనురాగ రహిత జీవశ్చవాలు 
 నల్లధనం మూటలు ,కోటలు దాటిన మాటలు 
 ఎన్నుకొన్న నాయకుల వెన్నుపోట్లు ,పన్నుపోట్లు 
 అడుగడుగునా  విద్య విక్రయశాలలు . 
 పైసా లేక ఆసుపత్రుల్లో అసువులు బాసిన అభాగ్యులు 
 ప్రభుత్వంలో భుక్తాలు ,
 పాలనా యంత్రాంగంలో మంత్రాంగాలు 
  దొంగోడే దొరలా ..   నిలువు దోపిడీ విధానాలు . 
 నీరసించిన ధర్మపాదం . 
 పెచ్చుమీరిన  అధర్మ వాదం . 
 ఎన్నాళ్ళిలా ... 
 రాదంటారా కలలు గన్న సమాజం . 
 లేదంటారా .. సుభిక్షమయిన  జనజీవనం 
 అర్ధ రహితమంటూ  .... వృధా యత్నమంటూ 
ఈ వ్యవస్థ ఇంతేనని తమ  మట్టుకు తలపట్టుకు కూచోక 
మీ నుండే మొదలెడితే  .. మార్పు అనే మరమ్మత్తు.  
మన  వంతుగ కృషి చేస్తే  ..మాన్యమగు  వ్యవస్థ తధ్యం 
 ప్రతీ నీవు స్పందిస్తే ప్రపంచమే మారదా ... 
 పట్టు వీడక ప్రయత్నిస్తే పసిడి పండదా బీడు భూమిలో .... 
 ప్రయత్నిద్దాం ... ప్రయత్నిస్తూనే ఉందాం . 


                                                             సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                      http://pandoorucheruvugattu.blogspot.in3, జులై 2015, శుక్రవారం

తూరుపు గోదారమ్మ బిడ్డన్నేను . ....తూరుపుగోదారమ్మ బిడ్డన్నేను ,తూరుపు గోదారమ్మ బిడ్డన్నేను . 
పరవళ్ళు తోక్కేటి మాయమ్మ ఒళ్లో తుళ్ళితుళ్ళి నేను పెరిగాను . 
,పచ్చాపచ్చని చేలో పరుగుల్లు తీశాను . 
వెచ్చని ఎన్నెల్లో గువ్వల్లే ఎగిరాను ,
పిల్లా గాలులతోటి ఉయ్యాలలూగాను . 
చేప పిల్లలతోటి సయ్యాటలాడాను . 
చల్లాని గోదారి కంటి పాపన్నేను .  "   తూర్పు  "
పూల బాలలతోటి ఊసులాడేదాన్ని 
పూవంటి సుతిమెత్త మనసున్నదాన్ని 
గోదారమ్మ కొంగు పట్టి ఆటలాడేదాన్ని 
కమ్మ ,కమ్మనీ తెలుగుల కవితలల్లేదాన్ని " తూర్పు "
పాడిపంటల నడుమ ఆడి పాడే దాన్ని ,
అన్నపూర్ణా దేవి  అన్నులమిన్నను నేను
ధాన్యసిరి లక్ష్మికి  కాలి అందియ నేను  .
కమ్మని ప్రేమలో అమ్మని మించిన దాన్ని ,తూర్పు గోదారమ్మ బిడ్డనే నేను . 
 
                                                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 
                                                              pandoorucheruvugattu.blogspot.in