పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

21, ఫిబ్రవరి 2023, మంగళవారం

*వీధిఅరుగు ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక మాసపత్రికలో* నాకవిత(అరుగును నేను)తోపాటు నాపరిచయాన్ని ప్రచురించిన వీధిఅరుగు పత్రికవారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూమీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ....*శ్రీమణి*🙏🌸🍃🌸🍃🌸🙏

*వీధిఅరుగు ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక మాసపత్రికలో*  నాకవిత(అరుగును నేను)తో
పాటు నాపరిచయాన్ని  ప్రచురించిన వీధిఅరుగు పత్రిక
వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ....*శ్రీమణి*
🙏🌸🍃🌸🍃🌸🙏

15, ఫిబ్రవరి 2023, బుధవారం

నిశివేదన

*నిశి వేదన*

చీకటి మ్రింగిన వెలుతురు దీపం
ఉప్పెనలోనే ఊపిరికెరటం
బడబానలమే బ్రతుకు సముద్రం
గరళం చిమ్మిన కాలసర్పం
మరణచట్రంలో మనిషిప్రాణం
విషణ్ణవదనాలు ,విషాదసంకేతాలు
విచిత్రమైన  అనిశ్ఛితి,విపత్కర పరిస్థితి
మునుపెన్నడూ మనిషెరుగని
నిశ్శబ్ద ప్రఘాతం
ప్రభాతమెరుగని నిశిరాతిరి నిశ్శబ్దం
ముసురుకొస్తుంది మృత్యుకౌగిలి
విస్తుపోయిచూస్తుంది విశ్వమనేలోగిలి
తెరిపిలేని ఆవేదన సుడిగుండంలో
ఆవలతీరమనే ఆనందపు తెరచాపను అన్వేషిస్తూనే అలసిపోతుంది  కంటిపాప
నేనేం రాయాలి పగిలిపోతున్న
హృదయాలనా, రసిగారుతున్న గాయాలనా,రాలిపోతున్న జీవితాలనా,
రగిలిపోతున్న వైపరీత్యాలనా,
కలం ఎలా కదలించను
మనుగడ పునాదులే మరణశయ్యలై
తారసిల్లుతుంటే వేదన నిండిన హృదయంతో
ఏ అక్షరాలు వెదజల్లగలను కాలం కాగితంపై కన్నీటి సిరాతో ...
పరితపిస్తున్న ప్రపంచానికి 
ఏ ఆశావహ కవనమాలికను బహూకరించగలను 
నిశి వేదన కరిగించాలని
మిసిమిని కాస్త వేడుకోవడం తప్ప
మనస్థైర్యమనే మంత్రోచ్చారణలో
మా మనుషుల గుండెలను
బలోపేతం చేయుమని భగవంతుని
బ్రతిమాలుకోవడం తప్ప.


*సాలిపల్లి మంగామణి ( srimaani)*

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

శ్రీమణి గజల్

*గజల్*

అనురాగపు అమృతధార
కురిపించును ప్రేమంటే

గగనమంత విశాలమై
అలరించును ప్రేమంటే

అవనిలోని బంధాలకు
బహుచక్కని భాష్యంగా

అనంతమగు భావాలను
పలికించును ప్రేమంటే

మధుమాసపు కోయిలలా
మదిదోచే మృదురాగం

సుమసుగంధ వీచికలా
వ్యాపించును ప్రేమంటే

అంతరాలు అగుపించని
అద్వితీయ అనుబంధం

అవధులన్ని అధిగమించి
ప్రవహించును ప్రేమంటే

*మణి* దీపపు వెలుతురులా
అంతరంగ సోయగమిది

ఎదసవ్వడి శృతిలయగా
వినిపించును ప్రేమంటే.

రచన: *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

శ్రీమణి గజల్

*శ్రీమణి గజల్*

మానవతా పరిమళాలు విరిసినపుడె మనిషితనం
మనసులోన మంచితనం నిలిచినపుడె మనిషితనం

మహర్షులూ మహనీయులు మనలాంటి మానవులే
విలువనెరిగి మసలుకొనగ తెలిసినపుడె మనిషితనం

ఆలోచన వరమొందిన
 ధన్యజీవి మానవుడు
అహమన్నది విడనాడీ
 గెలిచినపుడె మనిషితనం

దైవమంటె వేరుకాదు
 మనలోనే నివసించును
ఉన్నతమగు శిఖరముగా మెరిసినపుడె మనిషితనం

మానవాళి గమనంలో
 నడవడికే ప్రాధాన్యం
మణిమయమగు సుగుణరాశి ఒలికినపుడె మనిషితనం

*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*