పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

20, డిసెంబర్ 2018, గురువారం

Indi blogger award


2017 లో నా బ్లాగుకి వచ్చిన ఇండీ బ్లాగర్ అవార్డ్ సర్టిఫికెట్ ఈరోజుకు చేరింది మా ఇంటికి,😁

17, డిసెంబర్ 2018, సోమవారం

నిజం చెప్పవా...కృష్ణా


నిజం చెప్పవా...కృష్ణా!
నే... నీదానను కానా..
నీవు లేక నిమిషమైన
నేనుండగలనా...
నిన్నటి నీమాటలన్నీ...
నీటి మీద రాతలా..
చేసుకొన్న బాసలన్నీ..
చెరిగిపోయే ఊసులా...
పెనవేసుకొన్న  మన
మనసుల కధలన్నీ
ఒట్టి కట్టుకధలేనా...
నువ్వుండేదా...గగనంలో
నేనేమో...ఇలాతలంలో
ఆశలరెక్కలతో
విహంగమై విహరిస్తున్నా..
అలుపెరుగని పయనంలో
అనుక్షణమూ...నీకోసం
అన్వేషిస్తున్నా...
ఎన్ని జన్మలెత్తాలిక
వెన్నదొంగా...
నీ పద సన్నిధి చేరగా...
చెప్పు నిజంగా...
నల్లని వాడా...నావల్లకాదిక
తనువంతా కనులై
వేచియుంది.....ఇదిగో...నీరాధిక
        (రాధమాధవీయం)
                       ...శ్రీమణి

16, డిసెంబర్ 2018, ఆదివారం

బాపు జయంతి సందర్భంగా


ఆయన పేరు వినగానే
మన మానసతీరంలో...
మలయసమీరం వీస్తుంది
మనసంతా....సంతసంతో
మధురోహల విహరిస్తుంది...
ఆయన అవలీలగా...
ఒకగీతగీసినా,అది గిలిగింతై
చక్కిలిగింతై ఎదగిల్లి మరీపోతుంది
ఆయన గీసిన చిత్రమైనా....
ఆయన తీసిన చలనచిత్రమైనా..
మరిపించీ,మురిపించీ
మైమరపించీ,మదిమదినీ
మనోజ్ఞ మైన ఊహలలో ఊరేగించి...మననలరించి
మరపురాని జ్ఞాపకమై
మిగిలిపోతుంది
ఆయనచేతిలో....
పదహరణాల తెలుగుదనం
అలవోకగా అవతరిస్తుంది
ఆతని కుంచె తాకి అరక్షణంలో
ఆదైవం సైతం కనులముందు
సజీవచిత్తరువై సాక్షాత్కరిస్తుంది
ఆయన తలంపు రాగానే
ప్రతి తెలుగు వాకిలీ
ముత్యాలముగ్గు వేసుకొని
మురిసిపోతుంటుంది
ఆయన సృష్టించిన భామిని
మేటి సొగసుల రాణియై
ఎదవీణను సుతారంగా మీటి
కనులముందు...కదలి
కవ్వించి తీరుతుంది
ఆయన చిత్రించిన ప్రకృతి
సౌందర్యానికి ‌....ప్రకృతికాంత
కూడా దాసోహమంటుంది
వర్ణమాలకు ఒంపులద్దగలడతడు
ప్రకృతి పాదానికి పారాణినీ
దిద్దగలడు
ఒకపరి తన ఒరవడితో
హాస్య విరిజల్లును
చిలకరించి పడీపడీ నవ్వించగలడు
తదుపరి తన
రసరమ్య చిత్తరువులతో
సరసరాగాల ఊయలలూపనూగలడు
కాల్పనికతతో....
కమనీయ స్వప్నాన్ని కనులముందు నిలపగలడు
బాపు...ఆ తీయని పేరు
వినని తెలుగువారు లేరు
అతడిది
తెలుగువారి గుండెల్లో
అతడొక మధుర జ్ఞాపకం
అతడిది
తెలుగునేలపై ....వెలుగులద్దే
మనోజ్ఞమైన సంతకం

ఆ...మార్గదర్శికీ
ఆ... మనోజ్ఞ మూర్తికీ
ఆ...చిత్రకళా వాచస్పతికీ
ఆ...మధురమైన స్ఫూర్తికీ
ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి....బాపూకి
ఇదే.....నా కవన నివాళి
తెలుగునేల వున్నంతవరకు
మరువదు ఇక మానవాళి
(బాపు గారి జయంతి సందర్భంగా...నివాళులర్పిస్తూ)
                సాలిపల్లిమంగామణి( శ్రీమణి)

13, డిసెంబర్ 2018, గురువారం

కన్నీటి కతలివే

అతుకుల,గతుకుల
బ్రతుకుబాటలో....
బితుకు,బితుకుమని
మెతుకులు కోసం
వెతుకులాటలివి
వెతలే...గతులై
చితికిపోతున్న
చిన్నారుల,కన్నీటి కతలివి.
ఆదుకొన...లేక
అతీ...గతీ....చూడలేక
అక్కున చేర్చుకోనూలేక
చేతకాక....
చేయూత నీయలేక
హతవిధీ...అని
చతికిలపడి
చేతలుడిగి నే రాస్తున్న
చేతగాని రాతలివి
ఆ అభాగ్యులనాదుకొనగ
ఆర్తితో,అభ్యర్ధన చేయ
ఆభగవంతునికి
నాదు కన్నీటిజోతలివి😰

          శ్రీమణి

11, డిసెంబర్ 2018, మంగళవారం

ఆంధ్రభూమి....లో...నేను రాసిన నీహారిక.....26వవభాగం

Manga mani Salipalli:
ప్రపంచ సాహితీ జగత్తులో
రికార్డు స్థాయి..
45మంది రచయితలు కలిసి
రచించిన గొలుసుకట్టు నవల
'నీహారిక' ఈనవలలో ...
నేను26వ భాగం రాసాను 
డిశంబరు2018,ఆంధ్రభూమి మాసపత్రికలో,పూర్తి నవలను
పబ్లిష్ చేయడం జరిగింది....
చదివి మీఅమూల్యమైన
అభిప్రాయం తెలుపగలరు.
వీలుంటే కొనిచదవగలరు
వెల..20/రూ...
🙏🌺🌺🌺🌺🌺🙏

9, డిసెంబర్ 2018, ఆదివారం

ప్రకృతి కాంత


తూరుపు వేకువ వేళ
ఉదయించిన నులి వెచ్చని
అరుణారుణ కిరణం నేను
నిశిరాతిరి పున్నమిలో
శశి రాల్చిన వెన్నెలకు
వన్నెలిచ్చింది నేను
ఇంద్రధనుస్సులో సప్త వర్ణాలను
ఒలకబోసింది నేను
విరిసి విరియని మల్లియ రేకున
ఊగిస లాడిన హిమ బిందును నేను
సంకురాతిరి సంధ్య వెలుగులో
మెరిసిన రంగవల్లినీ నేనే
పురి విప్పిన మయూరికి
అరుదగు నాట్యం నేర్పిన
అచ్చర నర్తకి నేనే....
కొమ్మల దాగిన కోయిలమ్మకు
కమ్మని గాత్రాన్ని అరువిచ్చిన
గురువును నేనే
విరజాజికీ,విచ్చుకున్న చామంతికీ
పరిమళాన్ని పంచింది నేను
మెరిసిన తారకకు
తళుకుల నిచ్చిందీ నేను
ఎగిసే కెరటం నేనూ,
కురిసే మేఘం నేనే
మెదిలే కలలోనూ....
కదిలే అలలోనూ...
అణువణువులో...నేను
అవనియంతా...నేను
అన్నింటా నేనూ....
ఆద్యంతం నేనై ఆవహించియున్నా....
అందానికే అందాన్ని నేనూ
అందాల సామ్రాజ్యానికే
అసలు అధినేత్రినే నేనూ...
నాకు సాటి ఎవరూ లేరు
నాకు ధీటుగా ఎవరున్నారు
పంచభూతాలపై నాట్యమాడగలను
సింధూరపు భానుడనే
నా నుదుటన తిలకంగా దిద్దుతాను
కటిక చీకటితో నాకనులకు
కాటుక గీయగలను
వెండి  మబ్బునే నా నడుమకు
చీరగ చుట్టేస్తాను
నెలవంకనే అలవోకగా
నామెడలో ఆభరణం చేయగలను
గంగా, యమునా, క్రిష్ణా, పెన్నా
నదులేవైనా... సెలయేళ్ళైనా...
అన్నీ, నా చెలరేగిన కురులే గదా..
సప్త సంద్రాలైనా,లక్ష ద్వీపాలైనా
కొండ లైనా...కోన లైనా...
కోయిలమ్మ కూత లైనా...
అన్నీ నా అందానికి తీరుగా దిద్దిన తుదిమెరుగులు కావా....
అంటూ....మురిసిపోయింది
ప్రకృతి కాంత.....
మైమరచిపోయింది....
పరవశించి ప్రకృతియంతా....
                       శ్రీమణి

4, డిసెంబర్ 2018, మంగళవారం

గానగాంధర్వుడు... ఘంటసాల


🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸

అద్భుతమది
అమోఘమది
అపూర్వమది
అమృతాస్వాదనమది
అదే...అత్యద్భుతమగు
ఆ మధురగాయకుని
మృధుమధురగాత్రం
ఆ పాటలపాఠశాలలో 
చేరి పరశించని
హృదయముంటుందా...
గరళానసైతం సుధలొలికించగల
మాధుర్య గళం విని  తన్మయమవని
తనువు వుంటుందా.....
ఆతని పాటకు పల్లవి
తానై ప్రకృతి సైతం
పరవశించి  పాడుతుంది
అశేష ఆంధ్రావనికీ
అమృతంచవిచూపించడానికే
అవతరించె కాబోలు
ఆ అమరగాయకుడు
తన మధురమైనగాత్రంతో
మది,మదినీ తట్టిలేపి
తన్మయాన మధురోహల
విహరింపచేసిన
మన మధురగాయకుడు
ఎడారిలో సైతం
తనకమ్మని పాటలతో
నవవసంతం విరబూయించగల
గాన గాంధర్వుడాతడు
అవును....ఆతని
స్వరాలాపనలో....
మన మానసతీరాన్ని
మైమరపుల మలయ సమీరం
నులివెచ్చగా తాకి సమ్మోహనరాగమాలపిస్తుంది
అమావాస్యసైతం..
ఆతని కంఠం వినబడగానే
నిండుపున్నమిని
తలపించి వెన్నెల పూలు
పూయిస్తుంది
అతడే మన ఘనఘంటశాల
ఆ మహాగాయకుని కని
పరవశించెను కదా...
తెలుగునేల
మరలరాని లోకాలకు నువు
తరలిపోయి,ఎన్ని
దశాబ్దాలు దొరలినా....
మరువలేకున్నాము...
నీ మధురరాగాల జడిలో
నేటికీ మంత్రముగ్ధులమే మేము
ఆనాడు నువ్వాలపించిన
గీతాలన్నీ ఈనాటికీ
మమ్మావహించి....
మానరనరాన ప్రవహించి
మాలో నీవై నివశించి
పరవశింపచేస్తున్నాయి
మరువగలమా...మిమ్ము
మనోజ్ఞమూర్తీ....
మర్చిపోగలమా...మీ
మహోన్నత కీర్తీ....
ఓ...అమరగాయకా...
ఓ...ఘన గాన గాంధర్వుడా...
ఓ...సంగీతసామ్రాజ్య చక్రవర్తీ...
ఓ...మహనీయమూర్తీ...
మీపాదపద్మములకివే....
మా వందనాలు
వేవేల అభివందనాలు
(గాన గాంధర్వునికి చిరు కవన నివాళులర్పిస్తూ....)
🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸🎼🌸
                      ‌శ్రీమణి