పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

16, డిసెంబర్ 2018, ఆదివారం

బాపు జయంతి సందర్భంగా


ఆయన పేరు వినగానే
మన మానసతీరంలో...
మలయసమీరం వీస్తుంది
మనసంతా....సంతసంతో
మధురోహల విహరిస్తుంది...
ఆయన అవలీలగా...
ఒకగీతగీసినా,అది గిలిగింతై
చక్కిలిగింతై ఎదగిల్లి మరీపోతుంది
ఆయన గీసిన చిత్రమైనా....
ఆయన తీసిన చలనచిత్రమైనా..
మరిపించీ,మురిపించీ
మైమరపించీ,మదిమదినీ
మనోజ్ఞ మైన ఊహలలో ఊరేగించి...మననలరించి
మరపురాని జ్ఞాపకమై
మిగిలిపోతుంది
ఆయనచేతిలో....
పదహరణాల తెలుగుదనం
అలవోకగా అవతరిస్తుంది
ఆతని కుంచె తాకి అరక్షణంలో
ఆదైవం సైతం కనులముందు
సజీవచిత్తరువై సాక్షాత్కరిస్తుంది
ఆయన తలంపు రాగానే
ప్రతి తెలుగు వాకిలీ
ముత్యాలముగ్గు వేసుకొని
మురిసిపోతుంటుంది
ఆయన సృష్టించిన భామిని
మేటి సొగసుల రాణియై
ఎదవీణను సుతారంగా మీటి
కనులముందు...కదలి
కవ్వించి తీరుతుంది
ఆయన చిత్రించిన ప్రకృతి
సౌందర్యానికి ‌....ప్రకృతికాంత
కూడా దాసోహమంటుంది
వర్ణమాలకు ఒంపులద్దగలడతడు
ప్రకృతి పాదానికి పారాణినీ
దిద్దగలడు
ఒకపరి తన ఒరవడితో
హాస్య విరిజల్లును
చిలకరించి పడీపడీ నవ్వించగలడు
తదుపరి తన
రసరమ్య చిత్తరువులతో
సరసరాగాల ఊయలలూపనూగలడు
కాల్పనికతతో....
కమనీయ స్వప్నాన్ని కనులముందు నిలపగలడు
బాపు...ఆ తీయని పేరు
వినని తెలుగువారు లేరు
అతడిది
తెలుగువారి గుండెల్లో
అతడొక మధుర జ్ఞాపకం
అతడిది
తెలుగునేలపై ....వెలుగులద్దే
మనోజ్ఞమైన సంతకం

ఆ...మార్గదర్శికీ
ఆ... మనోజ్ఞ మూర్తికీ
ఆ...చిత్రకళా వాచస్పతికీ
ఆ...మధురమైన స్ఫూర్తికీ
ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి....బాపూకి
ఇదే.....నా కవన నివాళి
తెలుగునేల వున్నంతవరకు
మరువదు ఇక మానవాళి
(బాపు గారి జయంతి సందర్భంగా...నివాళులర్పిస్తూ)
                సాలిపల్లిమంగామణి( శ్రీమణి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి