పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

17, సెప్టెంబర్ 2023, ఆదివారం

వినాయకచవితి శుభాకాంక్షలు

వినాయకచవితి

తూరుపు 
తెలతెలవారక 
మునుపే,
వేకువ 
కువకువలాడక
మునుపే....
పరుగుపరుగున వచ్చె
పార్వతీ తనయుడు
అరుదెంచె మాఇంట
ప్రమద నాయకుడు 
పదేపదే పిలిచానని
కాబోలు
పలుమార్లు తలచానని 
కాబోలు
ఓ మూల తెల్లారకుండా...
పలకరించిపోదామని
పరుగెత్తుకొచ్చాడు
‌పార్వతీ తనయుడు
మము తరింపచేయాలని
తరలి వచ్చేసాడు
 వరసిద్ధివినాయకుడు
ఎలుకపైన ఎక్కలేదు
ఎవ్వరికీ చెప్పలేదు
ఏకదంతుడేకంగా
మా ఇంటికే వేంచేసాడు
పరమేశు పుత్రడొచ్చాడని
పరవశమైపోయాను
సాక్షాత్కరించాడని
సంబరపడి
సాష్టాంగ దండాలు
పెట్టాను...గానీ....
మృష్టాన్న భోజ్యాలు
ఇంకా...వండనేలేదు
పాలలో ఉండ్రాళ్ళు
వేయనేలేదు
కుడుములేమో ఇంకా
ఉడకనేలేదు
పాలవెల్లినింకా..
అమరించనేలేదు
అమ్మకైనా...చెప్పాడో లేదో
మరి....
ఆఘమేఘాలపై
వచ్చి కూర్చున్నాడు...
ఆకలేస్తుందంటూ..
ఆరాటపెట్టాడు
అరనిమిషమైనా....
ఆగలేనన్నాడు
ఇదిగిదిగో వస్తున్న
వక్రతుండా యనుచు
ఆమాట ఈమాటలో
పెట్టి చిట్టిగణపయ్యనేమార్చి
చిటికెలో వంటలను
వండివార్చాను.....
కొసరికొసరి 
వడ్డించి
ముద్దుగణపతికి
ముద్దముద్దనూ...
ముదమారతినిపించి
మురిసిపోయాను.

*అందరికీ వినాయక చవితి*
*శుభాకాంక్షలతో...*
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*
https://youtu.be/jhIWmc66Ot0?si=cbxWVdwhrOBffhA2

13, సెప్టెంబర్ 2023, బుధవారం

ఆమనిలా...

*ఆమనిలా...*

కంచికి చేరని కథనే నేను
నీ చెంతకు చేరాకే కవితగా మారాను
ఇంతకు మునుపు నేనూ శిలనే
నీజత కుదిరాకే అలనయ్యాను
కదిలించీ కలలోనే విహరిస్తావెందుకూ
కవ్వించీ కలవరమై కనుమరుగౌతావెందుకు
కరుణించని కాలం 
కరిగిపోతూనే వుంది
కనులముందు ఆక్షణం మాత్రం
చెక్కుచెదరక నిలిచిపోయింది
ఎప్పటిలాగే పరిగెడుతున్నాను
వెంటబడుతూనే వుంది నీరూపం
నువ్వు వస్తానన్నావు
అంతరంగాన్ని అలంకరిస్తానన్నావు
నన్ను నాకు కాకుండా చేసి
మిన్నకుండిపోతే...ఎలా...
రా... అనురాగాన్ని ఆలపించూ
రా....ఆమనిలా పలకరించూ
కలువనెచ్చెలి రెక్కలపైన మయూఖమై ప్రసరించిన చలువలజాబిలి నీవై 
ఈ కలకంఠి
హృదయాన్ని సుతారంగా కదిలించూ
నిన్నటి పున్నమిలో మెరిసిన నానవ్వులన్నీ
పూవులై నీ పాదాలను స్పృశించాలని
నిరీక్షిస్తున్నాయి
ఎదురుచూపుల అమావాస్యలో సైతం 
నీ తలపుల నక్షత్రాలు మినుకు మినుకుమంటుంటే 
నా హృదయాకాశం నిండుపున్నమిలానే వుంది
గుప్పిట నిండా నీతీయని గురుతులు
ఎదలో గాయాలను చేస్తున్నా
నిను చూడని ప్రతి నిమిషం 
నిట్టూర్పులపరమై మోడువారిపోతున్నా...
ఆమనిలా నువ్వొస్తావని ఆశ 
నన్ను మళ్ళీ చిగురించేలా చేసింది
నామదిలో నిరంతరం నీవు ప్రవహిస్తుంటావు
అందుకేనేమో నేనింకా సజీవంగా వున్నాను.

*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*
https://youtube.com/@srimanikavanasameeram?si=3Y6zBcVZIADau-Nm.

8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

అక్షరాస్యత

*అక్షరాస్యత*

అభ్యసించాలన్నా‌.‌‌...
అక్షరీకరించాలన్నా....
గణించాలన్నా‌....
గణుతికెక్కాలన్నా.‌.
వివరించాలన్నా‌‌...
విషయాన్ని గ్రహించాలన్నా..
మనోభావాలను...
వ్యక్తపరచాలన్నా...
సమాజస్ధితిని
వీక్షించాలన్నా...
పరిస్థితిని పర్యవేక్షించాలన్నా
పరిశీలించాలన్నా‌...
పరిశోధించాలన్నా...
జ్ఞానాన్ని ఆర్జించాలన్నా...
విజ్ఞానాన్ని సముపార్జించాలన్నా...
చరిత్ర గుర్తించాలన్నా.‌..
చరిత్ర సృష్టించాలన్నా‌...
ముందడుగేయాలన్నా...
ముందుతరాలకు
మన సంస్కృతి సాంప్రదాయాలను
అందించాలన్నా...
అభివృద్ధిని అందిపుచ్చుకోవాలన్నా...
అనుకొన్నది సాధించాలన్నా...
అక్షరమేగా‌...అనువైన
ఆయుధం
మానవ మేధస్సుకు
అక్షరమేగా
అక్షయమౌ ‌‌...ఇంధనం
అక్షరమేగా అత్యద్భుత వరం
అక్షరమేగా సంధించే శరం
అక్షరాస్యత తోనే
ఆర్ధిక స్వాతంత్ర్యం
అక్షరాస్యతయేగా
అచంచల ఆత్మవిశ్వాసం
అందరినీ చదివిద్దాం‌.
సంపూర్ణ అక్షరాస్యత సాధిద్దాం
వందకూ వందశాతం
అక్షరాస్యతే మన నినాదమైతే
భరతావనికదే అభివృద్ధి పథం
*✍నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం శుభాకాంక్షలతో..✍*
                                     
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
https://youtube.com/@srimanikavanasameeram?si=b200UY3FdOf-MuUB

7, సెప్టెంబర్ 2023, గురువారం

కృష్ణాష్టమి శుభాకాంక్షలతో...

నా ఛానల్ ను వీక్షించి సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.
Please like share comment and subscribe friends 🙏
 🙏https://youtu.be/4fEoMoxbpbg?si=-UVMJZ9C-w_i9v5L
🙏🌺🌺🌺🌺🌺🙏