పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, నవంబర్ 2023, గురువారం

ఆమె వెళ్ళిపోయింది

*ఆమె వెళ్ళిపోయింది*

ఆమె వెళ్ళిపోయింది
బంధాలు అనుబంధాలు
ఊపిరాడనివ్వలేదు
వెలుతురు కోసం 
చీకటిని ప్రాధేయపడుతూ
కుప్పతొట్టి దగ్గరే తపస్సుచేసేది
సృష్టించిన అమ్మ
కాదు కాదు 
ఆ శుష్కించిన బొమ్మ
కన్నప్రేగుబంధాల పెనుగులాటలో
నేలజారి భళ్ళున ముక్కలైపోయింది
కాసుల వంతులాటలో 
విసిగి వేసారి వీధుల పాలయింది
నిన్న తల్లిని కాబోతున్నానని విర్రవీగిన
వెర్రిబాగులతనం తలంపుకొచ్చి
ఆతల్లి గుండెగొంతుక
అగాధంలో కూరుకుపోయింది
ప్రాణం నిర్దాక్షిణ్యంగా దేహం నుండి
విడివడుతుంటే 
కొడిగట్టబోతున్న దీపం
మరణంతో యుద్ధంచేస్తుంది
ఆఖరిమజిలీ ఒక దయనీయ
ఘట్టానికి వేదికగా నిలిచింది 
అమ్మను వదిలించుకోవాలని
అనురాగాన్ని విదిలించుకోవాలని
రెక్కలొచ్చిన పక్షుల తగవులు
పగలబడి  నవ్వుతుంది 
అమ్మ విగతశరీరం
మౌనంగా మాట్లాడుతుంది
కనిపెంచిన వాత్సల్యం 
భద్రం బిడ్డా....
రోజులు ఏమాత్రం మంచిగా లేవు...
అయినా అది మాతృత్వపు నైజం
అందుకే మన్నిస్తూనే మరలిపోయింది
ఆశీర్వదిస్తూనే 
ఆత్మలా అనంతవాయువుల్లో
కలిసిపోయింది
ఆమె వెళ్ళిపోయింది.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
https://youtube.com/@srimanikavanasameeram?si=BjWMPHgrSpKa4T3Z

4, అక్టోబర్ 2023, బుధవారం

*రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం(తిరుపతి)*&*తెలుగు కళావేదిక సాహిత్య సాంస్కృతిక సంస్థ వారి* ఆధ్వర్యంలో ఈనెల 1వతేదీన *భారతీయం ..సనాతనం*అనే అంశంపై జరిగిన *అఖిలభారతీయభాషా కవిసమ్మేళనం* లో తెలుగు సంస్కృతం,హిందీ,ఒడియా,తమిళ,కన్నడ, మలయాళ,బెంగాలీ భాషల కవులు పాల్గొన్న కవిసమ్మేళనంలో పాల్గొనికవితాగానం చేసి సంస్కృతవిశ్వ విద్యాలయం ఉపకులపతుల,ఆచార్యులచేతులమీదుగా *సనాతన ధర్మప్రవర్ధిని*అనే బిరుదుతో సత్కరించబడడం నా అదృష్టంగా భావిస్తూమీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*🙏🌹🌹🌹🌹🌹🌹🙏

*రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం(తిరుపతి)*&
*తెలుగు కళావేదిక సాహిత్య సాంస్కృతిక సంస్థ వారి* ఆధ్వర్యంలో ఈనెల 1వతేదీన *భారతీయం ..సనాతనం*
అనే అంశంపై జరిగిన *అఖిలభారతీయభాషా కవిసమ్మేళనం* లో తెలుగు సంస్కృతం,హిందీ,ఒడియా,
తమిళ,కన్నడ, మలయాళ,బెంగాలీ భాషల కవులు పాల్గొన్న కవిసమ్మేళనంలో పాల్గొని
కవితాగానం చేసి సంస్కృత
విశ్వ విద్యాలయం ఉపకులపతుల,ఆచార్యుల
చేతులమీదుగా  *సనాతన ధర్మప్రవర్ధిని*
అనే బిరుదుతో సత్కరించబడడం 
నా అదృష్టంగా భావిస్తూ
మీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*
🙏🌹🌹🌹🌹🌹🌹🙏

17, సెప్టెంబర్ 2023, ఆదివారం

వినాయకచవితి శుభాకాంక్షలు

వినాయకచవితి

తూరుపు 
తెలతెలవారక 
మునుపే,
వేకువ 
కువకువలాడక
మునుపే....
పరుగుపరుగున వచ్చె
పార్వతీ తనయుడు
అరుదెంచె మాఇంట
ప్రమద నాయకుడు 
పదేపదే పిలిచానని
కాబోలు
పలుమార్లు తలచానని 
కాబోలు
ఓ మూల తెల్లారకుండా...
పలకరించిపోదామని
పరుగెత్తుకొచ్చాడు
‌పార్వతీ తనయుడు
మము తరింపచేయాలని
తరలి వచ్చేసాడు
 వరసిద్ధివినాయకుడు
ఎలుకపైన ఎక్కలేదు
ఎవ్వరికీ చెప్పలేదు
ఏకదంతుడేకంగా
మా ఇంటికే వేంచేసాడు
పరమేశు పుత్రడొచ్చాడని
పరవశమైపోయాను
సాక్షాత్కరించాడని
సంబరపడి
సాష్టాంగ దండాలు
పెట్టాను...గానీ....
మృష్టాన్న భోజ్యాలు
ఇంకా...వండనేలేదు
పాలలో ఉండ్రాళ్ళు
వేయనేలేదు
కుడుములేమో ఇంకా
ఉడకనేలేదు
పాలవెల్లినింకా..
అమరించనేలేదు
అమ్మకైనా...చెప్పాడో లేదో
మరి....
ఆఘమేఘాలపై
వచ్చి కూర్చున్నాడు...
ఆకలేస్తుందంటూ..
ఆరాటపెట్టాడు
అరనిమిషమైనా....
ఆగలేనన్నాడు
ఇదిగిదిగో వస్తున్న
వక్రతుండా యనుచు
ఆమాట ఈమాటలో
పెట్టి చిట్టిగణపయ్యనేమార్చి
చిటికెలో వంటలను
వండివార్చాను.....
కొసరికొసరి 
వడ్డించి
ముద్దుగణపతికి
ముద్దముద్దనూ...
ముదమారతినిపించి
మురిసిపోయాను.

*అందరికీ వినాయక చవితి*
*శుభాకాంక్షలతో...*
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*
https://youtu.be/jhIWmc66Ot0?si=cbxWVdwhrOBffhA2

13, సెప్టెంబర్ 2023, బుధవారం

ఆమనిలా...

*ఆమనిలా...*

కంచికి చేరని కథనే నేను
నీ చెంతకు చేరాకే కవితగా మారాను
ఇంతకు మునుపు నేనూ శిలనే
నీజత కుదిరాకే అలనయ్యాను
కదిలించీ కలలోనే విహరిస్తావెందుకూ
కవ్వించీ కలవరమై కనుమరుగౌతావెందుకు
కరుణించని కాలం 
కరిగిపోతూనే వుంది
కనులముందు ఆక్షణం మాత్రం
చెక్కుచెదరక నిలిచిపోయింది
ఎప్పటిలాగే పరిగెడుతున్నాను
వెంటబడుతూనే వుంది నీరూపం
నువ్వు వస్తానన్నావు
అంతరంగాన్ని అలంకరిస్తానన్నావు
నన్ను నాకు కాకుండా చేసి
మిన్నకుండిపోతే...ఎలా...
రా... అనురాగాన్ని ఆలపించూ
రా....ఆమనిలా పలకరించూ
కలువనెచ్చెలి రెక్కలపైన మయూఖమై ప్రసరించిన చలువలజాబిలి నీవై 
ఈ కలకంఠి
హృదయాన్ని సుతారంగా కదిలించూ
నిన్నటి పున్నమిలో మెరిసిన నానవ్వులన్నీ
పూవులై నీ పాదాలను స్పృశించాలని
నిరీక్షిస్తున్నాయి
ఎదురుచూపుల అమావాస్యలో సైతం 
నీ తలపుల నక్షత్రాలు మినుకు మినుకుమంటుంటే 
నా హృదయాకాశం నిండుపున్నమిలానే వుంది
గుప్పిట నిండా నీతీయని గురుతులు
ఎదలో గాయాలను చేస్తున్నా
నిను చూడని ప్రతి నిమిషం 
నిట్టూర్పులపరమై మోడువారిపోతున్నా...
ఆమనిలా నువ్వొస్తావని ఆశ 
నన్ను మళ్ళీ చిగురించేలా చేసింది
నామదిలో నిరంతరం నీవు ప్రవహిస్తుంటావు
అందుకేనేమో నేనింకా సజీవంగా వున్నాను.

*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*
https://youtube.com/@srimanikavanasameeram?si=3Y6zBcVZIADau-Nm.

8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

అక్షరాస్యత

*అక్షరాస్యత*

అభ్యసించాలన్నా‌.‌‌...
అక్షరీకరించాలన్నా....
గణించాలన్నా‌....
గణుతికెక్కాలన్నా.‌.
వివరించాలన్నా‌‌...
విషయాన్ని గ్రహించాలన్నా..
మనోభావాలను...
వ్యక్తపరచాలన్నా...
సమాజస్ధితిని
వీక్షించాలన్నా...
పరిస్థితిని పర్యవేక్షించాలన్నా
పరిశీలించాలన్నా‌...
పరిశోధించాలన్నా...
జ్ఞానాన్ని ఆర్జించాలన్నా...
విజ్ఞానాన్ని సముపార్జించాలన్నా...
చరిత్ర గుర్తించాలన్నా.‌..
చరిత్ర సృష్టించాలన్నా‌...
ముందడుగేయాలన్నా...
ముందుతరాలకు
మన సంస్కృతి సాంప్రదాయాలను
అందించాలన్నా...
అభివృద్ధిని అందిపుచ్చుకోవాలన్నా...
అనుకొన్నది సాధించాలన్నా...
అక్షరమేగా‌...అనువైన
ఆయుధం
మానవ మేధస్సుకు
అక్షరమేగా
అక్షయమౌ ‌‌...ఇంధనం
అక్షరమేగా అత్యద్భుత వరం
అక్షరమేగా సంధించే శరం
అక్షరాస్యత తోనే
ఆర్ధిక స్వాతంత్ర్యం
అక్షరాస్యతయేగా
అచంచల ఆత్మవిశ్వాసం
అందరినీ చదివిద్దాం‌.
సంపూర్ణ అక్షరాస్యత సాధిద్దాం
వందకూ వందశాతం
అక్షరాస్యతే మన నినాదమైతే
భరతావనికదే అభివృద్ధి పథం
*✍నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం శుభాకాంక్షలతో..✍*
                                     
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
https://youtube.com/@srimanikavanasameeram?si=b200UY3FdOf-MuUB

7, సెప్టెంబర్ 2023, గురువారం

కృష్ణాష్టమి శుభాకాంక్షలతో...

నా ఛానల్ ను వీక్షించి సబ్స్క్రయిబ్ చేసుకోగలరు.
Please like share comment and subscribe friends 🙏
 🙏https://youtu.be/4fEoMoxbpbg?si=-UVMJZ9C-w_i9v5L
🙏🌺🌺🌺🌺🌺🙏

29, ఆగస్టు 2023, మంగళవారం

చంద్రయాన్3.. పసిడిపర్వం

చంద్రయాన్3...పసిడిపర్వం

భూభాగమును వీడి
నీలిమేఘములకేగి 
హాయి హాయిగ సాగి జాగుసేయక
చంద్రబింబమును చుంబించాలని ఆశ
(చిన్ననాడు నే రాసుకున్న కవిత)
కోరిక నెరవేరేలానే వుంది
కూతవేటు దూరంలోనే ఆశకు ఆధారం
కనిపిస్తుంది
నాకైతే అందాల చందమామ అందేసిందనిపిస్తుంది 
చిత్రం కదూ...
చంటిపాప ఏడ్వడమేంటో
చందమామ రావడమేంటో
కలువలు విరబూయడమేంటో
చలువలరేడు వెన్నెలొలకబోయడమేంటో
నువ్వొస్తావని నువ్వొస్తావని
అమ్మ చెప్పిన 
ఆ కమ్మని అబద్ధం
నమ్మాలనే వుంది
నీపై నే రాసుకున్న కవనపూల సుగంధం
ఎదను ఇంకా మీటుతునే వుంది
ప్రతిపున్నమికీ ఆరుబయట జాబిలితో
ఊసులు అలవాటే
ఆపై మామను అక్షరాలలో బంధించడమూ నాకు 
పరిపాటే....

ఒక నిశిరాతిరి
నాలో ముసిరేసిన 
తియతీయని భావాలను 
దోసిలినింపి‌....వాటికి
కాసిన్ని అక్షరాలనద్ది‌,
జాబిలికి......
జాబురాసుకున్నా..
ఒకనాటి పున్నమిరేయి
వెన్నెల వాకిట్లో...
కవన పూలవాన
కురవాలని,
అది కాంచిన నామది
మకరందం చవిచూడాలని,
అడిగానో...లేదో
నిదురించిన
నాకనురెప్పలపై
సుతిమెత్తని స్వప్నంలా
అరుదెంచాయి
అత్యద్భుత కావ్యాలేవో...
అందమైన నా ఊహకు
అచ్చమైన ప్రతిరూపంగా..
జాబిలి నాకిచ్చిన 
జవాబు కాబోలు‌.

ఇలా...సాగిపోయేది జాబిలితో
నా మనోవిహారం..
కానీ నీ జాడ తెలిసాకా....
అడుగులు నేలపై నిలబడడం లేదు
ఆలోచనలు అంతరిక్షాన్ని విడిచిపెట్టడమూ లేదు
మట్టిలో కలిసే లోపు మహత్తరమైన ఘట్టాన్ని
వీక్షించే భాగ్యం దక్కింది
అదృష్టవశాత్తూ భరతావనిలో
జన్మించినందుకు బహగర్వంగా వుంది
శతమయూఖుని దక్షిణ ధృవాన్ని తాకి 
భరతావని తన సత్తా చాటుకుంది
భారతీయ ప్రజ్ఞానం విశ్వవినువీధులపై
విజయోత్సవ పతాకమై విరాజిల్లుతోంది 
ఈనాటి విజయయాత్ర
అజరామరమై మిగిలిపోతుంది
మరోచరిత్రకు పయనమైనట్టు
మానవాళి ఉప్పొంగిపోతుంది
మనిషిగా పుట్టినందుకు 
మహదానందంగా వుంది 
ఆ అద్భుతం కనులనుండి కదలడం లేదు
ఒక చారిత్రాత్మక ఘట్టానికి
నేనుసైతం సాక్ష్యంగా నిలిచానన్న
గర్వంతో హృదయం ఉప్పొంగిపోతుంది 
ఒక ఉత్కృష్టమైన గెలుపును
కైవసం చేసుకున్నామన్న 
వాస్తవం నన్ను ఆకాశమంత
విశాలం చేసింది
పట్టువదలని విక్రమ్
సుధాంశునిపై వేసిన పచ్చబొట్టు
రాబోయే తరాల అభివృద్ధికి
తొలిమెట్టై మార్గనిర్దేశం చేస్తుందని
మనమంతా ఆశిద్దాం
మనసారా కోరుకుందాం.
జయహో భారతదేశం
జయజయహో భారతదేశం.

*సాలిపల్లిమంగామణి ( శ్రీమణి)*
విశాఖపట్నం
నా కవన సమీరాన్ని వీక్షించండి
👇👇👇👇👇👇
https://youtu.be/6-6ZzIzuFwA?si=4z8aZohjRiBXjdod

21, ఆగస్టు 2023, సోమవారం

దరఖాస్తు

*దరఖాస్తు*

నా రాతలు నన్ను రాసుకోనివ్వండి 
ఖర్చయిపోయిన కాలమెటూ తిరిగిరాదు నాకనులను అద్భుతమైన కలలనైనా కననీయండి తనివితీరా ఆస్వాదించి కవితలుగా మలచుకోనివ్వండి ఓదార్పుకోసమో..ఒక మార్పు కోసమో.. రెండు చేతులు జోడించి నిను వేడుకున్నాను ఎండిన పూలరెక్కలు పైకెగరేసి 
నను ఏరుకోమన్నావు
పరీక్షలన్నీ రాసేసాను ఫలితాలకోసం చూడనునేను
 నానెత్తిన నిప్పులకుంపటి పెట్టిన నీకు నా ఓరిమి సత్తా తెలియకపోదు నన్ను నాటిన ఓదేవుడా...ఏదో రోజు దృష్టిని నాపై సారించకపోతావా 
నా చెంపల జారిన కన్నీటి చుక్కల లెక్కను తేల్చకపోతావా 
మీదుమిక్కిలి కష్టాలే నాపై కుమ్మరించావు
వెక్కి వెక్కి ఏడ్చానన్నమాటేగానీ నేనేమీ వెనుదిరగలేదు 
ఏంచేస్తావో మరీ 
నావేదన నింపిన నివేదనపత్రాన్ని నీముందుంచాను 
తక్కెడవేస్తావోలెక్కలుచూస్తావో నాగురించి ఒక్కసారి ఆలోచించు మనిషేమీ రెండుసార్లు జన్మించడు నేలకేసి బాదినా నెగ్గుకు వస్తూనే ఉన్నాను నా దరఖాస్తును ఏపునఃపరిశీలిస్తావని ఆకాంక్షిస్తూ అక్షరాలబాటలో అలా నడిచిపోతున్నాను.
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)* https://youtube.com/@srimanikavanasameeram

25, జులై 2023, మంగళవారం

శ్రీమణి గజల్

*శ్రీమణి గజల్*

నాకోసం మరుమల్లిగ మారగలవ ఒక్కసారి
ప్రియమార  నాకురులను తాకగలవ ఒక్కసారి

మదిగదిలో  నీరూపమె నిమిషమైన నిదురరాదు
తనివితీర మనపాటను పాడగలవ ఒక్కసారి

మనతలపుల తలవాకిట తన్మయమై  నిలుచున్నా
విరివింటిని వరమీమని కోరగలవ ఒక్కసారి

నీరాకకు పులకరించి హరివిల్లుగ విరిసినాను
నా ఆశల వర్ణాలను చూడగలవ ఒక్కసారి

చిత్తములో చిత్తరువై కొలువుంటే చాలదుమరి
*మణి* మనసును మృదుకవితగ రాయగలవ ఒక్కసారి.

*సాలిపల్లిమంగామణి(శ్రీమణి)*

11, జులై 2023, మంగళవారం

ఈ ఉదయం మునుపటిలా లేదు

*ఈ ఉదయం మునుపటిలా లేదు*

నేను రేపటి కోసం రచిస్తున్నాను
అలసిన రాతిరిపై రాలుతున్న సిరాచుక్కలు
చిమ్మచీకటి కొమ్మపై వాలిన మిణుగురు రెక్కల్లా మినుకు మినుకుమంటున్నాయి
అర్ధరాత్రి దాటినా ఆగదు
నా అక్షరాల కవాతు
కలం,కాగితం
కదిలిపోయిన రాత్రే
ప్రత్యక్ష సాక్ష్యాలు 
చీకటితో యుద్ధంచేసి స్వప్నాలనైతే
కనగలుగుతున్నాయి కళ్ళు
వర్ణాలను కోల్పోయిన హృదయం మాత్రం 
ఈ ఉదయరాగాలను ఆస్వాదించలేకపోతుంది
వెలుతురెందుకో వెలవెలబోతుంది
తెలియని వెలితి ప్రభాతాన్ని ఆహ్వానించలేకపోతుంది
విప్పారిన పూలసోయగాలను
చూసీ చూడనట్టు కనురెప్పలు 
మౌనంగా వాలిపోతున్నాయి
మనసుగోడలకేసిన రంగులు
మళ్ళీ వెలిసిపోతున్నాయి
నలిగిన కన్నుల సాక్షిగా ప్రభవించిన అక్షరాలు పరివర్తన కోసం పరితపిస్తూ ప్రతీఉషస్సునూ
అభ్యర్థిస్తున్నాయి
ప్రతీ ఉదయంలోనూ పరిమళించాలని
అదేంటో పువ్వులు నవ్వడమే లేదు
ఏ గువ్వల సవ్వడి చెవులను సమీపించడంలేదు
ఆశచావక మళ్ళీ మేలుకున్నాను
అరచేతులతో ముఖాన్ని పులుముకుని,
అల్లంత దూరంలో నిశ్శబ్దంగా
ఆకాశహర్మ్యాలు 
పచ్చదనం కోల్పోయిన ప్రకృతి
పగలబడి నవ్వుతోంది 
ఈ ఉదయం మునుపటిలా లేదు.
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*

8, జులై 2023, శనివారం

తెలుగు లోకంలో

ఈనాటి *తెలుగులోకం* చారిత్రక సాహితీ సాంస్కృతిక తెలుగు దినపత్రికలో
ప్రచురించబడిన నా పరిచయం
మిత్రులందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...
తెలుగు లోకం దినపత్రిక వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ....*శ్రీమణి*
🙏🌺🌺🌺🌺🌺🙏

25, మే 2023, గురువారం

గోదావరి ఊసులు మాసపత్రికలో

🙏🌹🌹🌹🌹🌹🙏
తపస్వి *గోదారి ఊసులు* అంతర్జాల తెలుగు మాస పత్రిక.. మే - 2023
మొదటి పత్రికలో  నా ముఖచిత్రంతో(కవర్ పేజీ సెలబ్రిటీగా)వేయడంతో పాటు 
నా పరిచయాన్ని ప్రచురించిన 
తపస్వి మనోహరం
గోదావరి ఊసులు మాసపత్రిక
యాజమాన్యానికి,నాపరిచయాన్ని అందించిన శ్రీ మధుసూదన్ గారికి మనసారా
కృతజ్ఞతలు తెలుపుకుంటూ
సహరచయితలు,రచయిత్రులకు అభినందనలు తెలుపుకుంటున్నాను
మన పత్రిక ఇంకా ఎంతోమంది
కవులను, కవయిత్రులను ప్రోత్సహిస్తూ విజయవంతంగా
సాగిపోవాలని ఆకాంక్షిస్తూ..

*సాలిపల్లి మంగామణి,(శ్రీమణి)*
🙏🌹🌹🌹🌹🌹🙏

13, మే 2023, శనివారం

పదమై నర్తిస్తూ

*పదమై నర్తిస్తూ..*

పల్లవి రాస్తున్నాను 
పదమై నర్తిస్తూ
అలసినఘడియలపై 
అనుభూతులు గుప్పిస్తూ
అనంతమైన అన్వీక్షావిహంగాలు 
హృదయగవాక్షం తెరుచుకుని 
రివ్వున ఎగిరిపోతూనే వున్నాయి
వారించగలేని ప్రేక్షకపాత్ర 
చేతలుడిగి చూస్తుంది
నిన్నని మోస్తున్నానని
కనికరించదుగా కాలం 
కదిలిపోతూనే వుంటుంది 
భారమైన కనురెప్పలు విప్పారేలోపు
వేకువ చెక్కిలిపై చెక్కిన గురుతుల్లా
వెన్నెలచేసిన సంతకాలు
అవధుల్లేని పరవశానికి ప్రతీకలై
నిన్న తళుకులీనిన స్వప్నాలు
ఆఘ్రాణించకనే
అంతర్థానమవుతుంటే
అవలోకనం చేసుకొనే ప్రయత్నంలో 
అలా అంతరంగంలో పొదిగిన
అనుభూతులను ఆర్తిగా గుమ్మరించాను
అక్షరనక్షత్రాలై కాగితాన్ని
కవనంతో అలంకరించాయి
కాలం కరిగిపోయింది
అక్షరాలా ఆక్షణం మాత్రం
చెక్కుచెదరక నిలిచిపోయింది
అందుకే అక్షరాలంటే
అంతటి అనురక్తి
నేను రాసుకొనే అక్షరాలు 
ఎన్నో అంతర్జ్వలనాలకు
అనులేపనాలు 
ఆశలకు ఆలంబనగా నిలిచే
నా అక్షరాలలో నేను
ఆకాశమంత
నిజానికి ఇదంతా
నా చుట్టూరా ప్రపంచం
నేను మాత్రం తలపులతో
తక్షణమే ప్రపంచాన్ని చుట్టేస్తూ
నిరంతర విహారిని.

*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*

27, ఏప్రిల్ 2023, గురువారం

మళ్ళీ ఉదయించాడు

*మళ్ళీ ఉదయించాడు*

మునుపు చీకటిచూరుకు వ్రేళ్ళాడుతూ ఉండేవాడు వెలుతురు గుళికను
మ్రింగి మిణుగురులా మారాడు
ఒకప్పుడు ఎడతెగని కన్నీటి ప్రవాహమే
ఇప్పుడు మహాసముద్రంలా
అవతరించాడు
నిన్నటిదారులనిండా నిశీధులూ,నిశ్శబ్దాలే
ఇప్పుడిప్పుడే చైతన్యాన్ని నింపాదిగా తనలోనికి ఒంపుకుంటున్నాడు 
ఎన్నివేలసార్లు తలపడ్డాడో తెలవారని నిశిరాతిరితో
కనికరించని కాలం జటిలమైన ప్రశ్నాపత్రాలను
సంధింస్తూ స్థాణువులా నిలబెడితే
ఆవహించిన నిర్వేదం ఆశను అమాంతం మరణశయ్యపైకి విసిరేసింది
అప్పుడే ఆర్తిగా ఆఖరుపేజీ తిరగేసాడు
కొన్ని ఆశావహదృశ్యాలు
మనశ్చక్షువులకు సాక్షాత్కరించి తక్షణకర్తవ్యాన్ని
గోచరింపచేసాయి
అతడు మళ్ళీ ఉదయించాడు
నైరాశ్యపు నిబిడాంధకారాన్ని అధిగమించి అభిజ్ఞుడయ్యాడు
మరణించడమంటే ఓడిపోవడమే..
అందుకే మనుగడతంత్రులను నైపుణ్యంగా సరిచేసుకుంటున్నాడు
నిస్పృహనూ,నిస్త్రాణాన్ని విదారించి అతడిప్పుడు యోధునిలా మారిపోయాడు
పునరుజ్జీవన సూత్రాన్ని ఔపోసన పట్టాక 
నైరాశ్యపు చిత్రాలను బ్రతుకు గోడలపై తగిలించడం లేదు
పడిలేచేకెరటాన్ని పదేపదే చూస్తున్నాడు
అతడిప్పుడు సూర్యునిలా
ఉదయిస్తున్నాడు
ఓటమినీ గెలుపునూ అంగీకరించే స్థితప్రజ్ఞతను ధరించాక ఆశలవర్ణాలతో అంతరంగాన్ని అద్భుతంగా 
అలంకరించుకొన్నాడు
అతడింక మరణించడు చిట్టచివరి వరకూ
చిగురిస్తూనే వుంటాడు
గమనమెరిగిన మానవుడు
మళ్ళీమళ్ళీ ఉదయిస్తాడు 
సందేహంలేదు ఏదో ఒకరోజు అవనిని శాసిస్తాడు.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

30, మార్చి 2023, గురువారం

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో...

నా ఛానల్ ను వీక్షించి సబ్స్క్రయిబ్ చేసుకోగలరు 🙏 మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ 
https://youtu.be/6X2cABD1Pt0

14, మార్చి 2023, మంగళవారం

తెలుగు పాటకు పట్టాభిషేకం

https://youtu.be/QBv2Q5CcKe
నా ఛానల్ ను వీక్షించి సబ్స్క్రయిబ్ చేసుకోగలరు 
మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ... Like Share Comment please
🙏🌹🌹🌹🌹🙏
0

21, ఫిబ్రవరి 2023, మంగళవారం

*వీధిఅరుగు ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక మాసపత్రికలో* నాకవిత(అరుగును నేను)తోపాటు నాపరిచయాన్ని ప్రచురించిన వీధిఅరుగు పత్రికవారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూమీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ....*శ్రీమణి*🙏🌸🍃🌸🍃🌸🙏

*వీధిఅరుగు ఆస్ట్రేలియా తెలుగు సాంస్కృతిక మాసపత్రికలో*  నాకవిత(అరుగును నేను)తో
పాటు నాపరిచయాన్ని  ప్రచురించిన వీధిఅరుగు పత్రిక
వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ....*శ్రీమణి*
🙏🌸🍃🌸🍃🌸🙏

15, ఫిబ్రవరి 2023, బుధవారం

నిశివేదన

*నిశి వేదన*

చీకటి మ్రింగిన వెలుతురు దీపం
ఉప్పెనలోనే ఊపిరికెరటం
బడబానలమే బ్రతుకు సముద్రం
గరళం చిమ్మిన కాలసర్పం
మరణచట్రంలో మనిషిప్రాణం
విషణ్ణవదనాలు ,విషాదసంకేతాలు
విచిత్రమైన  అనిశ్ఛితి,విపత్కర పరిస్థితి
మునుపెన్నడూ మనిషెరుగని
నిశ్శబ్ద ప్రఘాతం
ప్రభాతమెరుగని నిశిరాతిరి నిశ్శబ్దం
ముసురుకొస్తుంది మృత్యుకౌగిలి
విస్తుపోయిచూస్తుంది విశ్వమనేలోగిలి
తెరిపిలేని ఆవేదన సుడిగుండంలో
ఆవలతీరమనే ఆనందపు తెరచాపను అన్వేషిస్తూనే అలసిపోతుంది  కంటిపాప
నేనేం రాయాలి పగిలిపోతున్న
హృదయాలనా, రసిగారుతున్న గాయాలనా,రాలిపోతున్న జీవితాలనా,
రగిలిపోతున్న వైపరీత్యాలనా,
కలం ఎలా కదలించను
మనుగడ పునాదులే మరణశయ్యలై
తారసిల్లుతుంటే వేదన నిండిన హృదయంతో
ఏ అక్షరాలు వెదజల్లగలను కాలం కాగితంపై కన్నీటి సిరాతో ...
పరితపిస్తున్న ప్రపంచానికి 
ఏ ఆశావహ కవనమాలికను బహూకరించగలను 
నిశి వేదన కరిగించాలని
మిసిమిని కాస్త వేడుకోవడం తప్ప
మనస్థైర్యమనే మంత్రోచ్చారణలో
మా మనుషుల గుండెలను
బలోపేతం చేయుమని భగవంతుని
బ్రతిమాలుకోవడం తప్ప.


*సాలిపల్లి మంగామణి ( srimaani)*

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

శ్రీమణి గజల్

*గజల్*

అనురాగపు అమృతధార
కురిపించును ప్రేమంటే

గగనమంత విశాలమై
అలరించును ప్రేమంటే

అవనిలోని బంధాలకు
బహుచక్కని భాష్యంగా

అనంతమగు భావాలను
పలికించును ప్రేమంటే

మధుమాసపు కోయిలలా
మదిదోచే మృదురాగం

సుమసుగంధ వీచికలా
వ్యాపించును ప్రేమంటే

అంతరాలు అగుపించని
అద్వితీయ అనుబంధం

అవధులన్ని అధిగమించి
ప్రవహించును ప్రేమంటే

*మణి* దీపపు వెలుతురులా
అంతరంగ సోయగమిది

ఎదసవ్వడి శృతిలయగా
వినిపించును ప్రేమంటే.

రచన: *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

శ్రీమణి గజల్

*శ్రీమణి గజల్*

మానవతా పరిమళాలు విరిసినపుడె మనిషితనం
మనసులోన మంచితనం నిలిచినపుడె మనిషితనం

మహర్షులూ మహనీయులు మనలాంటి మానవులే
విలువనెరిగి మసలుకొనగ తెలిసినపుడె మనిషితనం

ఆలోచన వరమొందిన
 ధన్యజీవి మానవుడు
అహమన్నది విడనాడీ
 గెలిచినపుడె మనిషితనం

దైవమంటె వేరుకాదు
 మనలోనే నివసించును
ఉన్నతమగు శిఖరముగా మెరిసినపుడె మనిషితనం

మానవాళి గమనంలో
 నడవడికే ప్రాధాన్యం
మణిమయమగు సుగుణరాశి ఒలికినపుడె మనిషితనం

*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*

30, జనవరి 2023, సోమవారం

https://youtu.be/EJsKF1jipLY

https://youtu.be/EJsKF1jipLY

ఏదీ...శ్రమరాగం

*ఏదీ...శ్రమరాగం*

నీరుగారి పోతావెందుకు
మంది భారమంతా తెచ్చి నీరెక్కలపై వేస్తున్నట్టు
నీరసించి పోతున్నావెందుకు
నింగిని ఎత్తి నీనెత్తిన మోసేస్తున్నట్టు

ఎందుకంత నిస్సత్తువ
నువ్వేమైనా ఎముకలు కొరికే చలిలో ఊపిరి సైతం స్తంభించేలా సరిహద్దులలో
పహరా కాస్తున్నావా..
ఎందుకంత నీరసం
కాడెద్దుల స్థానంలో నీకాయానికి
నాగలి తగిలించి స్వేద తర్పణం చేసి
సేద్యం గావిస్తున్నావా..

మంచం లేచిన మొదలు
నీ కంచం కోసం కాదూ
నీ ఆరాటం
ఆకలి తీరిందని సంతృప్తి పడితే ఆక్షణమే ఆనందం నిన్ను అక్కున చేర్చుకొనేది
అత్యాశల రోట్లో తలదూర్చి
రోకలిపోటుకు భీతిల్లే
నీకు ఓదార్చే చేతులు కావాలా

అనాయాసంగా ఫలితాన్ని అపేక్షించడం అలవాటై
అదేపనిగా  రోదిస్తున్నావు గానీ నిస్తేజంలో కూరుకుపోయి నువ్వైతే
రోగగ్రస్తునిగానే కనిపిస్తున్నావు

చేవ వుండీ చేతకాని
ఆలోచన వుండీ అడుగేయని
అసమర్ధునిగా అసంపూర్ణ మానవునిగా మిగిలిపోతున్నావేమో ఆలోచించూ..
ఆరాగం ఆలపించకపోతే
ఆలంబన ప్రశ్నార్థకమే
ఆ చైతన్యం ధరించకపోతే  జీవితమంతా నిస్త్రాణమే
శ్రమైక జీవన సౌందర్యంలోనే
జీవనరాగం శ్రావ్యంగా
వినిపిస్తుంది.
*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*

12, జనవరి 2023, గురువారం

*ఓమహర్షీ-ఓమార్గదర్శీ*

*ఓమహర్షీ-ఓమార్గదర్శీ*

జీవుడే దేవుడనీ, 
శక్తియే జీవితమని
బలహీనత మరణమనీ 
భయం పెద్ద పాపమనీ
నిర్భయంగా సాగమనీ
యువతే భవితకు మూలమనీ
ఆత్మస్థైర్యమే ఆయుధమని
విజ్ఞానమే విలువగు ధనమనీ
అజ్ఞానం ఛేదించమని
చదువుకు సంస్కారం ఆవశ్యకమనీ
స్త్రీ శక్తే జాతికి జీవధాతువనీ
ప్రేమతత్వం విడనాడ వలదనీ
దరిద్రనారాయణ సేవే 
మానవ జాతికి పరమావధి యని
ఆరంభం అతిచిన్నదయినా
ఘనమగు ఫలితం తధ్యమని
లక్ష్యసాధనకు గమ్యం ఆవశ్యమని
జాతికి హితమును 
హితవుగా ప్రభోదించి 
అఖండ భారతాన్ని 
తన జ్ఞాన ప్రభలతో 
జాగృతమొనరించిన 
ఆధ్యాత్మిక అద్వితీయ శక్తి
సనాతన ధర్మ సంరక్షణకై
అహర్నిశలు శ్రమించిన
అలుపెరుగని ఋషీ
నిరంతర సత్యాన్వేషీ

ఓమనీషీ
ఓ మహర్షీ
ఓమహోన్నతమూర్తీ
ఓ మార్గదర్శీ
ఓమానవతాచక్రవర్తీ
ఓమనోజ్ఞమూర్తీ
చిరుప్రాయమందునే నీవుఅమరుడవైనా
ధరిత్రి వున్నంత వరకూ 
తరతరాల చరిత్రలో
చెరగని చరిత్రవే నీవు
అమృత తుల్యమగు
మీ దివ్య సూక్తులే 
మాకు శిరోధార్యం
ఆనాటి 
మీఅడుగుజాడలే
మాకు శ్రీరామరక్ష..

స్వామీవివేకానందుని 
జయంతి సందర్భంగా
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*

10, జనవరి 2023, మంగళవారం

నాచే విరచితమైన "నీలిమబ్బు"అనే గజల్అమెరికా వాస్తవ్యులు, ప్రముఖ సంగీత విద్వాంసురాలు,NATA, ATA, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, ఆలిండియా రేడియో లలిత గీతాల విభాగంలో A' Grade కళాకారులు, మీనాక్షి సుస్వర అకాడమీ వ్యవస్థాపకులు డా.అనిపిండి మీనాక్షి వారిచే స్వరపరచబడి ఆలపించబడింది.ఊహ తెలిసినప్పటి నుండీఊపిరున్నంతదాకాసదా..అక్షరాలసేవలోతరించాలనుకునే నాలోనికవయిత్రిని(నన్ను) ఆదరిస్తారని నా ఛానల్ నువిజయవంతంగా నడిపిస్తారనిఆకాంక్షిస్తూ...సాలిపల్లి మంగామణి (శ్రీమణి)🙏🌹🌹🌹🌹🌹🌹🙏

https://youtu.be/EJsKF1jipLY

4, జనవరి 2023, బుధవారం

కళావేదిక మరియు నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) సంయుక్త ఆధ్వర్యంలోపద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు, ప్రముఖ సాహితీవేత్త, విశ్లేషకులు శ్రీ దామెర వెంకటసూర్యారావుగారు, శ్రీ నండూరి రామకృష్ణ గారు,శ్రీ ఎస్.వి.సూర్యప్రకాశరావు గారు, శ్రీ ఆర్.ఆర్.విద్యాసాగర్గారు(R &B), శ్రీమతి బి.రజనీగారు(తెలుగు ఉపన్యాసకులు) చేతులమీదుగా జరిగిననా *మణి దీపాలు* కవితా సంపుటి ఆవిష్కరణ విశేషాలుమీ అందరితో పంచుకొంటూమీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ....*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*🙏🌹🌹🌹🌹🌹🙏

కళావేదిక మరియు నవసాహితీ ఇంటర్నేషనల్ (చెన్నై) సంయుక్త ఆధ్వర్యంలో
పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు, ప్రముఖ సాహితీవేత్త, విశ్లేషకులు శ్రీ దామెర వెంకటసూర్యారావుగారు, 
శ్రీ నండూరి రామకృష్ణ గారు,
శ్రీ ఎస్.వి.సూర్యప్రకాశరావు గారు, శ్రీ ఆర్.ఆర్.విద్యాసాగర్
గారు(R &B), శ్రీమతి బి.రజనీగారు(తెలుగు ఉపన్యాసకులు) చేతులమీదుగా జరిగిన
నా *మణి దీపాలు* కవితా సంపుటి ఆవిష్కరణ విశేషాలు
మీ అందరితో పంచుకొంటూ
మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ....*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
🙏🌹🌹🌹🌹🌹🙏

3, జనవరి 2023, మంగళవారం

1, జనవరి 2023, ఆదివారం

నా ఛానల్ ను వీక్షించండి

🙏🌹🌹🌹🌹🌹🙏
ఈ నూతన సంవత్సరంలో
నే రాసే ప్రతీ అక్షరం
హృదయాలను కదిలించే
కవితగా ఉదయించాలని ఆకాంక్షిస్తూ...
ఈ చిన్న ప్రయత్నం ,ఆదరిస్తారని
మనసారా కోరుకుంటూ...
*శ్రీమణి కవనసమీరం*
యూ ట్యూబ్ ఛానల్ ను 
ప్రారంభించాను,మీరంతాచూసి మీ అమూల్యమైన 
ఆశీస్సులు అందించండి.

https://youtube.com/@srimanikavanasameeram
Please Like, Share and Subscribe.
*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*
*(ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో).*
🙏🌹🌹🌹🌹🌹🙏