పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

13, సెప్టెంబర్ 2023, బుధవారం

ఆమనిలా...

*ఆమనిలా...*

కంచికి చేరని కథనే నేను
నీ చెంతకు చేరాకే కవితగా మారాను
ఇంతకు మునుపు నేనూ శిలనే
నీజత కుదిరాకే అలనయ్యాను
కదిలించీ కలలోనే విహరిస్తావెందుకూ
కవ్వించీ కలవరమై కనుమరుగౌతావెందుకు
కరుణించని కాలం 
కరిగిపోతూనే వుంది
కనులముందు ఆక్షణం మాత్రం
చెక్కుచెదరక నిలిచిపోయింది
ఎప్పటిలాగే పరిగెడుతున్నాను
వెంటబడుతూనే వుంది నీరూపం
నువ్వు వస్తానన్నావు
అంతరంగాన్ని అలంకరిస్తానన్నావు
నన్ను నాకు కాకుండా చేసి
మిన్నకుండిపోతే...ఎలా...
రా... అనురాగాన్ని ఆలపించూ
రా....ఆమనిలా పలకరించూ
కలువనెచ్చెలి రెక్కలపైన మయూఖమై ప్రసరించిన చలువలజాబిలి నీవై 
ఈ కలకంఠి
హృదయాన్ని సుతారంగా కదిలించూ
నిన్నటి పున్నమిలో మెరిసిన నానవ్వులన్నీ
పూవులై నీ పాదాలను స్పృశించాలని
నిరీక్షిస్తున్నాయి
ఎదురుచూపుల అమావాస్యలో సైతం 
నీ తలపుల నక్షత్రాలు మినుకు మినుకుమంటుంటే 
నా హృదయాకాశం నిండుపున్నమిలానే వుంది
గుప్పిట నిండా నీతీయని గురుతులు
ఎదలో గాయాలను చేస్తున్నా
నిను చూడని ప్రతి నిమిషం 
నిట్టూర్పులపరమై మోడువారిపోతున్నా...
ఆమనిలా నువ్వొస్తావని ఆశ 
నన్ను మళ్ళీ చిగురించేలా చేసింది
నామదిలో నిరంతరం నీవు ప్రవహిస్తుంటావు
అందుకేనేమో నేనింకా సజీవంగా వున్నాను.

*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*
https://youtube.com/@srimanikavanasameeram?si=3Y6zBcVZIADau-Nm.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి