పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

25, మార్చి 2022, శుక్రవారం

*కలికి చిలకల కొలికి*

*కలికి చిలకల కొలికి*

ఆణిముత్యాల మిసమిసలు   
అలివేణి దరహసమై అలరారెనేమో
కలకంఠి కంటికి 
కాటుక దిద్దెనేమో చిమ్మ చీకటి.
లలన నుదుటున మెరిసి మురిసె 
కాబోలు తూరుపుసింధూరం
ముదిత ముంగురులై  
మురిపించెనేమో ఆ నీలిమేఘం 
ఏటి కొలనులో కమలాలు   
విరబూసెనేమో కమలాక్షి నయనాల,
మరువము, మల్లియలు
పరిమళాల సంతకాలు చేసెనేమో
సీమంతిని సొగసులపై.,
జాజీ చంపక పున్నాగ సరులు
అరువిచ్చెనేమో అలరుబోణికి
మేని సౌంగంధ మతిశయించ,
విరిబోణి సొబగులకు తళుకులద్దెనేమో
తారసపడి ఆ గగనపు తారక
రాయంచ సొగసునంత  
ఈ అంచయాన సొగసుల్లో 
ఒలక బొసేనేమో 
నెలరేడు ఎన్నియలు కురిపించెనేమో సుదతి సౌందర్యమినుమడించ...
ప్రకృతి ప్రతి అణువూ పరవశమయి
పడతి వశమయి పల్లవించెనా..
ఏడుమల్లియల సరితూగు ముగ్ధమనోహరీ.......
నీ ముంగిట సాగిలపడి.
 సాలిపల్లి మంగామణి (శ్రీమణి).

22, మార్చి 2022, మంగళవారం

నీటి చుక్కా ... నీకభివందనం🙏

నీటి చుక్కా ... 
నీకభివందనం🙏

అమృతధారను 
తెచ్చి అరచేత పోసినా..
అరక్షణము మనగలమా,
జలధార  లేక!
సిరులెన్ని దొరలినా.. 
నీరు పొరలని
నేల రిత్తమే కాదా...  
భావి నీటి వెతల
భరతవాక్యమ్ము పాడగా...
వృధా సేయక ఊరక 
ప్రాణాధారమ్మును,
వానచినుకును 
ఒద్దిగ్గాఒడిసిపట్టి,
అడుగంటి పోతున్న 
జలవనరునదిమిపట్టి 
భద్రమ్ము సేయరా 
ప్రతి నీటి చుక్కా ... ...
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

16, మార్చి 2022, బుధవారం

సత్కారం

12 వతేదీ తాడేపల్లిగూడెంలో
శ్రీశ్రీ‌కళావేదిక వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన
ప్రపంచ రికార్డు కవిసమ్మేళనంలో పాల్గొని
సత్కరించబడిన శుభతరుణం
మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ.... *శ్రీమణి*.
🙏🌹🌹🌹🌹🌹🙏

11, మార్చి 2022, శుక్రవారం

నిరంతరాన్వేషి

*నిరంతరాన్వేషి*

కాలజ్ఞాని 
కాలానికంటే
ముందే ప్రయాణం చేసే
నిరంతర అన్వేషి
కాలగతిని అధ్యయనం చేస్తూ 
కాలంతో కరచాలనం చేస్తూ
సాగిపోయే మహర్షి
రేపటి కల నెరవేర్చే
కార్యాచరణను నేడే
సిద్ధం చేసుకునే సిద్ధహస్తుడు
రాబోయే అనర్ధాలకు 
మూలాన్ని 
అన్వేషించి పరిష్కారాన్ని
నిశితంగా సూచించే శాస్త్రవేత్త
జీవనగమనంలో వచ్చే 
పరిణామాలను పసిగట్టి
మనుగడకోసం ప్రణాళికను
రచించే కవిపుంగవుడు
కరిగిపోతున్న సమయాన్ని 
చూసి కలవరపడక
కల నెరవేరే మార్గాలను
కనుగొనే తాత్వికుడు
ప్రతీక్షణాన్ని సద్వినియోగం
చేసుకుంటూ సాగిపోయే
సంచార యాత్రికుడు
ఓటమి ఎదురైనా వెరువక
మరల మరల విజయం కోసం
ఎగిసిపడే కెరటంలా ప్రయత్నిస్తూనే
వుండే పట్టు వదలని విక్రమార్కుడు
క్షణాలతో పోటీపడుతూ...
అనుక్షణం పయనం సాగి
ప్రతీ క్షణాన్ని పదిలంగా 
వినియోగిస్తూ కాలం వ్యర్ధం
చేయక సద్వనియోగపరచుకొనే
సమన్వయవేత్త.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

10, మార్చి 2022, గురువారం

దేవుడు

🙏🌹🌹🌹🌹🌹🙏
దేవుడు ప్రత్యక్షంగా రాడు
తనబిడ్డలపై వాత్సల్యాన్ని
పరోక్షంగానే కురిపిస్తాడు
చల్లని ఆచూపులు ప్రసరించి
పరీక్షలన్నీ అతిగమించే శక్తిని
ప్రసాదించి మరీ గెలిపిస్తాడు
భారమంతా దేవునిదే
బాధ్యత మాత్రమే మనది
నిష్కల్మష హృదయంతో
నిరీక్షించడం మానవధర్మం
నిరంతరం పర్యవేక్షించడం
పరమాత్ముని మర్మం.
ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి..*శ్రీమణి*
🙏🌹🌹🌹🌹🌹🙏

9, మార్చి 2022, బుధవారం

8, మార్చి 2022, మంగళవారం

ఏడాదికొకసారి

*ఏడాదికొకసారి*

కవిత రాయనే లేదు 
కలం ముట్టనే లేదు
గళం విప్పనే లేదు
కర చాలనమైనా చేసి
తోటి మహిళామణులకూ
అభినందనలర్పించనే లేదు
మా మహిళాదినోత్సవమనే
మహదానందవేళ .........
ఒక స్నేహితుడు పంపే
పలకరింపుకోసం
ఒక అన్నయ్య పంపే
అభినందన కోసం
ఒక తమ్ముడు రాసే 
ఆత్మీయ కవిత్వం కోసం
ఆదమరచక చూస్తున్నా
ఆశీస్సులకై నిరీక్షిస్తున్నా..
మీ అందరి శుభాకాంక్షల 
వెల్లువ కోసం,చూస్తున్నా... 
మౌనంగా చూస్తున్నా,
మీ అందరి అంతులేని
అభిమానాన్ని ఆసాంతం
ఆస్వాదిస్తున్నా...
మరపురాని ఈరోజే గా 
మహిపై మహిళ మహిమను 
మనస్ఫూర్తిగా కొనియాడేది..
మది విహంగమై
విహరిస్తుంది...
మావిశిష్టతను వేనోళ్ళ పొగిడే 
ఏడాదికొక రోజు గా మరి..
మహిపై మామూలుగా 
మనుగడ సాగించే మాకు 
మాన్యతనాపాదించే రోజుని
మారాణులని కీర్తించే రోజుని
మౌనంగా తిలకిస్తున్నా
మా అనురాగాన్ని, త్యాగాన్ని,
చెలిమినీ, గుర్తించే రోజుకదా!,
కుటుంబ క్షేమంలో, 
సమాజ సంక్షేమంలో 
మా పాత్ర ఔచిత్యం గోచరించే ఈ రోజున మీ ఆశీస్సులతో 
తరించి పోవాలనీ అందుకే
రోజంతా ఆనందాస్వాదనమే, సంభ్రమాశ్చర్యాల సమారంభమే....
తనివి తీరకుంటుంది..
తరచితరచిచూసినా శుభాకాంక్షలపరంపరలోతలమునకలవుతూ....
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

6, మార్చి 2022, ఆదివారం

నలుపు నాణ్యమే

మేని ఛాయదేముంది
 మేలిమంటి మనసుంటే
నలుపైతేనేమిగాని
 నాణ్యమైనదనే కదా నానుడి
నలుపంటే అలుసెందుకు
 అసలైన సొగసంతా 
దాగున్నది నలుపులోనే
నందగోపాలుడు నలుపుకాదా
వందల వేల గోపికల మదినిదోచి
 వలపు రాగమాలపించలేదా
ఎలకోయిల నలుపేగా..
వీనులవిందైన తన
తియతీయని రాగంతో 
వేల ఎదవీణల మీటదా...
కరిమబ్బు నలుపైనా
వాననొలకబోయదా...
పుడమి పులకరించేలా..
కాకి నల్లదైననేమి కలకాలం
కలిసుండమంటూ కడుచక్కని 
సందేశం అందించదా
కాటుక నలుపైనా
కలకంఠి కంటికి ఇంపై 
అందాన్ని ఇనుమడించదా
సృష్టిలోని అందమంతా
నలుపులోనే దాగుంది
నిశితమైన అనుభూతుల 
స్పృశించేటి మనసుంటే..
నలుపు రంగు లేకుంటే
తెలుపుకందమేముంది
రంగులదేముంది గాని
అంతరంగమెరిగి మసలుకో
అసలైన సొబగులన్నీ
మరులుగొన్న మనసునందే
దాగున్నవి తెలుసుకో. 
 సాలిపల్లి మంగామణి(శ్రీమణి)

5, మార్చి 2022, శనివారం

తెరదించే వేకువ

గ్రుక్కెడు కన్నీటి చుక్కలు
గుప్పెడు సంతోషపు రెక్కలు
కలగలిపే కథ నడిపిస్తుంటాయి
బ్రతుకు పుస్తకమంతా
బంగారు క్షణాలే కాదు
భంగపడ్డ ఘడియలూ
దిగాలుగా చూస్తుంటాయి
అన్నీ నెరవేరిన స్వప్నాలు
విరబూసిన వాసంతాలే కాదు
తీరని ఆశలు చేదైనవాస్తవాలు
తీరం చేరని కెరటాలల్లే
స్పృశిస్తూ వుంటాయి
ఆనందాలు హరివిల్లులే కాదు
అంచనాకందని దుఃఖప్రవాహాలు
తారసపడతాయి
తిరుగాడిన కాలం నిండా
అనుభూతుల తాయిలాలే కాదు
అనుభవాల గాయాలు 
దర్శనమిస్తుంటాయి
నిజమే ఏదీ మునుపటిలా లేదు
జరుగుతున్నది విస్ఫోటనమే
విలపిస్తే శాంతిస్తుందా...
చీకటిచూరుకు వ్రేళ్ళాడుతుంది కాలం
కూకటి వేళ్లతో పెకలిస్తుంది
 ఊపిరిచెట్టును ఉన్నపళంగా
క్షణాలు నిప్పుకణాలై
 మండిపోతున్నాయి 
ప్రాణాలు ఉరికొయ్యలపై
ఊగిసలాడుతున్నాయి
ఉగ్గబట్టుకో ఉబికి వస్తున్న
ఉద్వేగాన్ని,
ఎన్నో తెలవారని నిశిరాత్రుల
తెరదించే వేకువ ఒకటుంటుంది
నెరవేరని కలలన్నీ ఫలియించే
తరుణం ఉదయిస్తుంది...
వెన్నెల నావ అరుదెంచే లోపు
అంధకారమూ  అడ్డుతప్పుకొంటుంది
వేకువ తోవ అగుపించే మునుపే
నిశిరాతిరీ నిమ్మళంగా నిష్క్రమిస్తుంది
అప్పుడు ఆశల పారిజాతాలు 
జలజలా రాలతాయి
అనుకోని అశనిపాతాలకు
అంతిమవాక్యం రాస్తూ..
*సాలిపల్లిమంగామణి @శ్రీమణి*

4, మార్చి 2022, శుక్రవారం

అంతఃసౌందర్యం


అందమంటే మనిషిదా..!
అందమైన మనసుదా...!
పట్టరాని అందమంటే
పైపైన సౌందర్యమా...
అపురూప లావణ్యమంటే
రూపురేఖలకే పరిమితమా...
అంగాల అమరిక కాదు గదా అందం
అంతరంగ సోయగమే
అత్యద్భుత సౌందర్యం
అచ్చంగా అందమంటే
స్వచ్ఛమైన మనసేగా...
ఆత్మశుద్ధితోనే సాధ్యమగును
అద్వితీయ ఆనందం 
అంతఃసౌందర్యమే...దానికి
అనువైన సాధనం
కాలగమనంలో కరిగిపోయేది
బాహ్యసౌందర్యమైతే
అక్షయమైన ఆనందం 
మనసునంటిన సౌశీల్యమనే మకరందం
పైపైన మెరుగులకే
ఆకర్షితమౌతాము గానీ
హృదయాంతరాళాలను 
తరచి చూడమెందుకో...?
బాహ్యమైన సొగసులకై
బంధీలమే గానీ బహుకాలం
నిలుచునా...పలుచనైన ఆబంధం
నిజమైన అంతఃసౌందర్యం గాంచిన
అనుబంధం విడివడునా.. ఏనాడైనా...
చక్కదనం అంటే చక్కని ఆలోచనావిధానం
ఒసపరితనమంటే
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం
ఎనలేని అందమైనా మనలేదు
మేలిమంటి మనసు ముందు
అందులకే నేస్తం
అందమైనమాట 
అందమైన ఆలోచన
అందమైన నడత
ఆదుకునే గుణముంటే
ఆద్యంతం ఆ అందం మన సొంతం
అసలు సిసలు ఆనందమే
ఆసాంతం.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

జై సంతోషిమాత

నిత్యసంతోషిణీ కనకత్కనకభూషిణీ
ఆనందరూపిణీ అభయప్రదాయిని
సర్వమంగళ కారిణి
శ్రీవాణీ శ్రీదేవికారూపిణీ
శక్తిస్వరూపిణి,భక్తరక్షామణీ
జగత్ సంతోషరాణి
మా జననీ సంతోషిణీ

హృదయమంతా నిండి
నీ దివ్య రూపమే
నిత్యమూ సేవింతు
నీ ధ్యానామృతము మాత్రమే
వేడుకొంటున్నాము తల్లీ
వేదనలు తీర్చవా....
గుండెల్లో గుడి కట్టి
కొలుచుకొంటున్నాము..తల్లీ
కాచి కాపాడవా...
జగత్ సంతోషరాణి
మా జననీ సంతోషిణీ

కలనైన మాకనులు
నిను మరువలేదు
రక్షరక్షాయంటూ 
లక్షల్లో నీస్తోత్రాలు
చేసాము తల్లీ 
రక్షించరావా మాకల్పవల్లీ
నిశ్చేతనుల్నయిన చైతన్యమొందించు
నీ కృపా కటాక్షములు
మాపైన ప్రసరించి
సాయమందించవే
సార్వభౌమామణి
జగత్ సంతోషరాణి
మా జననీ సంతోషిణీ

కల్లోలమును బాపి
కళకళలు పంచేటి
కల్పతరువువునీవు
చింతలెన్నున్నా 
చిటికెలతీర్చేటి కరుణామూర్తీ
చల్లనీ నీచూపు మాపైన సారించి ఆనందమీయవా
ఆశీస్సులందించి
సర్వోపద్రవ నాశినీ
ఓ చారుహాసినీ
జగత్ సంతోషరాణి
మా జననీ సంతోషిణీ
*జై సంతోషిమాత జైజై సంతోషిమాత*

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

2, మార్చి 2022, బుధవారం

నేనొక చైతన్యం

నేనొక చైతన్యం

నిన్నరాత్రి  నిషిద్ధాక్షరాలు
రాలిపడ్డాయి కొన్ని నిశ్శబ్దపు పుటలనుండి
నాలో నిగూఢమైన చైతన్యపు నేత్రాలు అహస్కరుని కిరణాల్లా
విస్తరించాయి విశ్వక్షేత్రంపై
నిజానికి నేనిప్పుడు 
నిరంతరాన్వేషిని
దూసుకుపోతున్నాను 
నిశిదుప్పటి దులిపేసి
నిజ ఉషస్సు కేసి
నేనిప్పుడు వేయాల్సింది
లక్ష్యపు క్షేత్రంలో లక్షలనాట్లు
నన్నో విజయగీతంగా 
మలచుకోవాలి...
ఎన్నో ఓటమి పర్వాలకు
పర్యవసానంగా..
గెలుపు గుమ్మం చేరుకోవాలి
నేనిప్పుడు నైరాశ్యపు
నిబిడాంధకారాన్ని చీల్చిన
చైతన్యపు ఖడ్గాన్ని
వేకువతట్టుకు వెలుగును పూసిన
తూరుపు సింధూరాన్ని
నిట్టూర్పులు, నీరుగారడాలు
నిన్నటి గతించిన క్షణానివి
వెనుకంజ వేయడాలు
వెక్కి, వెక్కి ఏడ్వడాలు
కాలంచెల్లిన వాక్యాలు
నే నడిచే గమనంలో నిరాశకు
తావివ్వను,నీరసాన్ని రానివ్వను
కన్నీటి కారకాలు సవాలక్ష  
కర్తవ్యప్రేరకాలను 
అన్వేషించడమేగా
మనిషిగా మన సార్ధకత
ఉప్పెనలోనే ఊపిరోసుకొంటాయి
ఉజ్వలమైన ఉపాయాలు
దిగులుమంత్రం ఉచ్ఛరిస్తూ 
నీరసిస్తే ఉద్ధరించే నాధుడెవ్వడు
వెతలే తాకని వేదన సోకని
బతుకుంటుందా ఇలాతలంలో
కంటకాలు అధిగమించక 
కామితాలు నెరవేరేనా
కణకణమండే నిప్పున కాలక
కనకము నిగ్గు తేలేనా
రహదారిని త్రవ్వుతున్నాను
రాలుతున్న ఆశల వెంబడి
నా ఆలోచనాస్త్రాలు
రవికాంతి కిరణాలై 
ఆశయానికి దారిచూపిస్తాయి.
నేనిప్పుడు నిలువెత్తు ఆత్మవిశ్వాసాన్ని
నేనిప్పుడు విజయపతాకాన్ని
విశ్వ వినువీధులవెంట 
విజయోత్సాహానికి ప్రతీకగా
విరాజిల్లుతున్నాను.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

1, మార్చి 2022, మంగళవారం

నువ్వు కాదూ...


నేనవ్వులు మరచిపోయినపుడు
పువ్వులు చూపించింది నువ్వుకాదూ..
నా చుట్టూ చీకటి కమ్మేసినపుడు
వెలుతురు జల్లింది నువ్వుకాదూ...
కాలం పడదోసిన ప్రతిసారీ
ఎగిసిన కెరటాన్ని జ్ఞాపకం తెచ్చింది నువ్వుకాదూ...
రాలుతున్న నా ఆశల వెంబడి
రహదారిని త్రవ్వింది నువ్వు కాదూ
మనసు విరిగినపుడల్లా
మనసెరిగి క్రొత్త రెక్కలు తగిలించి
ఎగరమంటూ ఊతమిచ్చింది
నువ్వుకాదూ...
నిబ్బరం కోల్పోయిన ప్రతిసారీ
జబ్బ చరిచి లేవమన్నది నువ్వుకాదూ
నేను  శిధిలమైన ప్రతిసారీ
నా ఉనికిని పదిలం చేస్తూ నన్ను
పునర్నిర్మించింది నువ్వుకాదూ
అంతెందుకూ నా గుండెగొంతుక
తడారిపోయినపుడు సంజీవనిలా
 ఎదురొచ్చింది నువ్వుకాదూ...
కొడిగట్టబోతున్న నా ఊపిరిదీపానికి
చేతులడ్డుపెట్టింది నువ్వుకాదూ...
జీవితపు బండిచక్రాలు అగాథంలో
కూరుకుపోతుంటే చివరినిమిషంలో
చేయందించి చైతన్యపరచింది నువ్వుకాదూ...
పగలునూ,రాత్రినీ సృష్టించిన నీకు
పగులుతున్న హృదయాల ఘోష
పనిగట్టుకు చెప్పాలా..
కథ నడిపించే సూత్రధారికి
పాత్రల ఔచిత్యం పరిచయం చేయాలా..
గమనమొకటే నాది
గమ్యం మాత్రం నీవే
నే నడుస్తాను....
నువ్వు నడిపిస్తావు అంతే.
(మహాశివరాత్రి శుభాకాంక్షలతో)
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*