పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

14, డిసెంబర్ 2021, మంగళవారం

చిన్ని హృదయమా..

హరిమయము

*హరిమయము*

"హరిమయము 
విశ్వమంతయు
హరివిశ్వమయుండు
సంశయము పనిలేదు
ఆ హరిమయముకాని
ద్రవ్యము పరమాణువులేదు
వంశపావనవింటే"
అనిశుకమహర్షి
చెప్పినట్లు...
శ్రీమహావిష్ణువే
సకలచరాచరసృష్టికీ 
ప్రణయస్వరూపం
జగన్నాధచరణాలే అఖిలజగానికి కైవల్యకారకం
సమస్తప్రకృతిలో
చైతన్యం నింపే తేజోమూర్తి
దుష్టశిక్షణకై,శిష్టరక్షణకై
అవతరించిన అవతారపురుషుడు
మోక్షకారకుడు
మోహనాకారుడు
వేల ఏళ్ళకు
మునుపే నేటి కలియుగం
ఎలాఉండబోతుందో
మహోత్కృష్టమైన
భగవధ్గీత ద్వారా
మనకందించిన
జగద్గురువు ఆయన
నిజానికి
మానవునికి
ఆమాధవునిచరితే
మార్గదర్శకం
శ్రీకృష్ణుని స్మరణ
మాత్రమే మోక్షదాయకం
సర్వపాపహరణం సదా
గీతాపారాయణం.
           
*గీతాజయంతి శుభాకాంక్షలతో*....*శ్రీమణి*

13, డిసెంబర్ 2021, సోమవారం

ఒక తీయనికల

*ఒక తీయని కల*

అమృతాన్ని ఔపోసన పట్టినట్టు 
ఆకాశాన్ని అదిమి పట్టినట్టు 
మబ్బులతో దోబూచులాడి
ఇంద్రధనుస్సు వంపులో ఇమిడిపోయినట్టు
చలువల రేడు వెన్నెల జల్లుకి పులకించిన  
నెచ్చెలి కలువను నేనన్నట్లు
అచ్చర కన్యల తలదన్నే అప్సర నేనన్నట్లు
అందాల రాజ్యానికి అధినేత్రి  నైనట్టు
రంగూ రంగుల సీతాకోక చిలుకల్లె
విరబూసిన పూదోటల్లో విహరించినట్టు 
స్వాతి చినుకు ముద్దాడిన 
ముత్యం నేనే అన్నట్టు 
అరుణోదయ ఉషస్సులో 
ఆ సంద్రంపై మెరిసే అలనైనట్టు
అలా ... అలా ... అలా ... అలలా మెదిలిన 
నా మధురమైన కలల సడికి 
నులివెచ్చని నా  నిదుర చెడి 
నివ్వెరబోయా ! 
ఆ  రవి కిరణపు తాకిడికి.

మన కలలో మనమే కదా కధానాయిక .....  (మీక్కూడా .. అంతేనా )
 
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*

8, డిసెంబర్ 2021, బుధవారం

మనసంతా...నువ్వే!*

*మనసంతా...నువ్వే!*

మౌనంగా...ఉన్నా...
నా మనసంతా నువ్వే...
మాటలాడ లేకున్నా...
నా ధ్యాసంతా... నువ్వే
నా కనుపాపలో నిన్ను
కాపాడుకొంటున్నా...
కవి(కవయిత్రి)ని కదా...కవనంతో
కాలం గడిపేస్తున్నా....
అక్షరాలతో..నిన్ను అభిషేకిస్తున్నా...
నా పద భావాలపల్లకిలో
ఊరేగిస్తున్నా....
నీ ఊహలకు 
ఊయలేసి
ఊరడిస్తూనే ఉన్నా...
నీతలపులలో
తలవాల్చుకు 
 నిదురిస్తున్నా....
మరచిపోలేను..ప్రభూ...
నువు నా మది గీసిన చిత్తరువు
విడిచిపోలేను...ప్రభూ
నా ప్రతి శ్వాస లోనూ...నీవు.
(రాధామాధవీయం)
                     *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

6, డిసెంబర్ 2021, సోమవారం

*మహానటి*

*🌸మహానటి🌸*

ఆణిముత్యాల మిసమిసలు   
అలివేణి దరహసమై అలరారెనేమో
కలకంఠి కంటికి 
కాటుక దిద్దెనేమో చిమ్మ చీకటి.
లలన నుదుటున మెరిసి మురిసె 
కాబోలు తూరుపుసింధూరం
ముదిత ముంగురులై  
మురిపించెనేమో ఆ నీలిమేఘం 
ఏటి కొలనులో కమలాలు   
విరబూసెనేమో కమలాక్షి నయనాల,
మరువము, మల్లియలు
పరిమళాల సంతకాలు చేసెనేమో
సీమంతిని సొగసులపై.,
జాజీ చంపక పున్నాగ సరులు
అరువిచ్చెనేమో అలరుబోణికి
మేని సౌంగంధ మతిశయించ,
విరిబోణి సొబగులకు తళుకులద్దెనమో
తారసపడి ఆ గగనపు తారక
రాయంచ సొగసునంత  
ఈ అంచయాన సొగసుల్లో 
ఒలక బొసేనేమో 
నెలరేడు ఎన్నియలు కురిపించెనేమో సుదతి సౌందర్యమినుమడించ...
ప్రకృతి ప్రతి అణువూ పరవశమయి
పడతి వశమయి పల్లవించెనా..
ఏడుమల్లియల సరితూగు ముగ్ధమనోహరీ.......
నీ ముంగిట సాగిలపడి.
(మహానటి జయంతి సందర్భంగా చిరుకవన నివాళి)
   *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

27, నవంబర్ 2021, శనివారం

సైకతశిల్పాన్ని

*సైకతశిల్పాన్ని*

మన్నించవా నేస్తం
మనసనే నిశీధిలో
మాటరాని మౌనాన్ని నేను
కలసిరాని కాలం ఒడ్డున
సమాధానమే దొరకని
సైకతశిల్పాన్ని,కరిగిపోతూనే వుంటా
ఆనందం పొడచూపని ఆవేదనకెరటాలకు,
పొగచూరిపోయాయి ఒకనాటి ఊహలు
ఒకనాడు గుప్పెడు ఊహలలో
ఒదిగిపోయిన నీ నేస్తాన్నే
కాలం  త్రిప్పిన పేజీలలో
ఒరిగిపోయిన ఆశల శిఖరాన్ని
ఊపిరాడని ఉత్పాతంలో
ఒంటరినై తలపడుతున్నాను
కదిలించాలనుకోకు నాకథనిండా కన్నీళ్ళే
రెప్పవాల్చనీయని వ్యథలో రేపగలూ బంధీని
నేనెంతో శ్రమకోర్చి కట్టుకున్న
మంచితనపు రాతి గోడల మాటున
రాలిపోతూ నేను,వాలిపోతున్న పొద్దులా..
సోలిపోతున్నాను..
సంఘర్షణలే సహవాసాలిక్కడ
నా ఆవాసంనిండా ఆవిరవుతున్న ఆశలే
నేను నిత్యం పూజించే దేవుడు
నేనంతరించేవరకూ మౌనదీక్షలో
ఎన్నిసార్లు గుండె భళ్ళున
ముక్కలైందో....
నేనైతే కావాలని పుట్టలేదు
కాలరాసే భాధ్యత కాలమెందుకు
తీసుకుందో...
అందుకే నేను కళ్ళుతెరవను
బ్రతికేస్తున్నానన్న భావనే బాగుంది,
కాలం కనికరించినపుడు
తప్పక మళ్ళీ పలకరిస్తాను వాస్తవాన్నీ,నిన్నూ.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

19, నవంబర్ 2021, శుక్రవారం

మౌనహంతకీ

*మౌనహంతకీ*

కలలు కూలిన శబ్ధం 
కలకలం రాల్చిన నిశ్శబ్దం
అవిసిపోతుంది ప్రాణం
అలసిపోతుంది జీవనం
బతుకు నాటకంలో
రాకాసి ఘట్టం
కనికరించదుగా 
ఈ కలికాలం చక్రం
ఊపిరి రెక్కలు విరిచేసిన
మౌనహంతకీ ...
మాననీయవే మనసు గాయాలను
బ్రతుకు సౌధం బ్రద్దలుచేసి
యుద్ధమెలా చేస్తావు
వాలిపోయిన మరణశయ్యతో
గరళసేవనమే 
పరిపాటై
మనసుగొంతుక మూగబోయింది
పగటినీ ఆక్రమింంచాయిగా
చీకటిరాత్రులు
ఎన్ని ఎండిన క్షణాలో
మనసునిలా మండిస్తున్నాయి
మనసు పొరలకు మరుపు పూసే
మంత్రముంటే  బాగుండునేమో
శరణు శరణు కాలమా ఇక
మరణమైనా ...మంచిదే మరి
మనిషిగా ఇక మహిని విడిచి
మధుర కథలా మిగిలిపోదును

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

16, నవంబర్ 2021, మంగళవారం

నేనొక ఒంటరిశిలను

ఏముందీ జీవితమంటే
విరిగిన కలల శకలాలు
ఒరిగిన ఆశలశిఖరాలు
కాలవిన్యాసంలో కకావికలమైన
సగటు మనిషి గమనం 
సందిగ్ధావస్థలో సగభాగం
సరిదిద్దుకొనే ప్రయత్నంలోనే
మళ్ళీ రేపటిఉదయం
తోలు బొమ్మలాట బతుకు
అతుకులు కోకొల్లలు
ఆడించేది విధి
వింత ఆటే మరి మనషనే జీవిది
ఆలోచనతెరలను 
కదలించినపుడు ఒక్కోచోట 
కదలనంటూ క్షణాలు స్తంబించి
మొరాయిస్తుంటాయి
నెరవేరని ఆకాంక్షలు 
నేరం నీదేనంటూ..నాకేసి 
చూపుడు వేలును సారించినపుడు
నెర్రెలిచ్చిన ఆకాశంలా
బీటలు వారిపోతుంటాను
వికలమైన నామనసెందుకో
సకలం కోల్పోయినట్టు
ఇప్పుడు నేను ఒంటరి శిలను
శిధిలమైన ఆశల ఆనవాళ్ళ మధ్యలో
స్థాణువునై నిలుచున్నాను.
నిజానికి నేనెందుకు దోషిని
దోసిలినిండిన ఆశలను
ఆఘ్రాణించలేదనా...
తరలిపోతున్న కాలాన్ని
తనివితీరా ఆస్వాదించలేదనా
నేను నడుస్తూనే వున్నాను
నా అడుగులు మాత్రం అక్కడే నిలబడిపోయాయి
నేను మాట్లాడుతూనే వున్నాను
నా గుండెదే మూగనోము
నేనైతే నేనున్న ఈ జీవితంలో
అత్యద్భుతంగా నటిస్తున్నానే
లోలోపల మాత్రం మూర్తీభవించిన నిశ్చలత్వం...ఎందులకో.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

15, నవంబర్ 2021, సోమవారం

యుద్ధం

కత్తులుండవు కటారులుండవు
కుత్తుకలేవీ తెగిపడవు
యుద్ధభేరి మ్రోగదు
వింటినారి సాగదు
శత్రువు కంటికి కనబడడు
జరుగుతున్నది మాత్రం
భీకర సమరమే
అలనాటి మహాసంగ్రామంలా
గుర్రాలు ఏనుగులూ
రథాలూ సైనికసేనలు 
వుంటాయనుకొనేవు
అక్కడ ఆవరించింది
నరాలు చిట్లే ఉద్విగ్నత మాత్రమే
రక్తపుటేరులు ప్రవహించవు
అన్నీ కన్నీటి కాసారాలే
యుద్ధమంటే ఇరు వర్గాల
తలలూ తెగిపడితేనే గాదు
ఎదలోపల ఎడతెగని సంశోధనా యుద్ధమే
అంతస్తాపమే అంతర్యుద్ధమై
పోరు శంఖాన్ని పూరిస్తుంది
అప్పుడే అంతరంగం
కదనరంగమై కలవరపెడుతుంది
నిశితంగా పరికిస్తే ప్రతిఘటించే
ఆయుధాలన్నీ నిగూఢమైనది నీలోనే
ఒక్కోసారి మనోధౌర్భల్యమే మనుగడకు
అంతిమవాక్యం రాస్తుంటుంది
వేధించే అంతర్మధనం
ఛేదించలేని వ్యూహమే
సాధించాలంటే సమయజ్ఞతే సాధనం

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

13, నవంబర్ 2021, శనివారం

అంతా నువ్వేచేసావు.

*అంతానువ్వే చేసావు*

బ్రతుకు గోడలపై నైరాశ్యపుచిత్రాలనలా
వ్రేళ్ళాడదీస్తావెందుకు
నిమిషాలను నిప్పుకణికల్లా మండిస్తున్నావెందుకు
గుండెగొంతుక ఘోషించినప్పుడల్లా
నిశ్శబ్దాన్నే ఆశ్రయించుమని శాసించావు 
మనస్సాక్షి నిరసిస్తుంటే 
మౌనంతో చేతులు కలిపావు
గుప్పెడు ఆశల ఊపిరిరెక్కలు
ఉస్సూరంటూ నేలరాలుతున్న
ప్రతిసారీ నేరం నాది కాదనే వాదించావు
అంతా నువ్వే చేసి
అంతులేని నిర్వేదాన్ని ఆహ్వానిస్తే ఎలా
అంతర్యుద్ధంలో గెలిచిచూడు
అదృష్టం దురదృష్టం లాంటి అదృశ్యభావనలకు తలవంచాల్సిన
అగత్యమైతే లేదు
నిన్న రాలిన ఆశలు,ఆశయాలు
రేపటి చైతన్యపు బీజాలై
ఈ విశ్వక్షేత్రంలో ఏదో మూల
అంకురిస్తూనే వుంటాయి,
ఎగిసిన నక్షత్రాలన్నీ ఏకమై
సరికొత్త పాలపుంతను పలపరిచే వుంటాయి
అన్వేషించాలే గానీ ఆశలకాంతిపుంజాలు
అంతరంగాన్ని వెలుతురుతో నింపేయవూ
చెక్కుచెదరని ఆత్మనిబ్బరాన్ని అలంకరించుకొని 
విజయం మెట్లెక్కిన మానవునికి
విధిసైతం మోకరిల్లి సంకల్పసిద్ధికి
దారులు సుగమం చేస్తుంది
అబద్ధం సాధించిన విజయం అభూతకల్పన
యథార్ధం కైవసం చేసుకొన్న విజయం
శాశ్వతమై విరాజిల్లుతుంది
అప్పుడు మౌనం మాట్లాడుతుంది
మనిషిని మహనీయత అనే
మరో అధ్యాయాన్ని పరిచయంచేస్తూ..

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

8, నవంబర్ 2021, సోమవారం

*శ్రీ శ్రీ కళావేదిక* కవితా పోటీలో

*శ్రీ శ్రీ కళావేదిక*
 కవితా పోటీలో
*యువతపై డ్రగ్స్ ప్రభావం*
అనే అంశం పై నేను రాసిన కవిత కు అందుకున్న ప్రశంసా పత్రం..
డా_కత్తిమండ_ప్రతాప్ గారికి మరియు కళావేదిక నిర్వాహకులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
🙏🌹🌹🌹🌹🙏

31, అక్టోబర్ 2021, ఆదివారం

మదిమధనం

*మదిమధనం*

దిక్కుల  మాటున నక్కి 
నా ప్రతి  సడిని  పసిగడతావు
చుక్కల ప్రక్కన  చేరి
పక్కున నవ్వేస్తావు
నన్ను  వీడి  మనలేక 
నా నీడపైనే  కత్తి  గడతావు .
భావ్యమా! మరి
నా  నవ్వులొలిగి పోకుండా
నీ  దోసిట  పడతావు
పువ్వులాంటి  నా మది 
దోచగ  మధుపంగా  మురిపిస్తావు
మలయ సమీరంలో 
నీ ప్రణయ చందనాన్ని
కలగలిపి  నా శ్వాసకందిస్తావు
నన్ను మంత్రముగ్ధురాలిని చెయ్యాలని
నీ మనో  సామ్రాజ్ఞిని చేయాలని .


నే  విహరించే  దారుల్లో
సిరిమల్లెల  పానుపేసి,
నీలి మబ్బు పరదాల్లో దాక్కుంటావు
నా తలపుల  చిత్తరువుకి  రంగు లద్ది
నీ రూపంగా చిత్రిస్తావు చిత్రంగా !
వెన్నెలమ్మ  వాకిట్లో 
మేను  వాల్చి నిదరోతుంటే
వేణువై వచ్చి ఎద మీటి పోతావు
కనురెప్ప  వాల్చిన మరునిమిషం
కల లోకొచ్చి  కలవరపెడ్తావు
తీరా ! కనులు  తెరిచి చూస్తే కనుమరుగవుతావు..
నీ ప్రేమో ఏమో గాని ....
నా లో  అనుక్షణం మది మధనం.
నీ నిరీక్షణలో నివ్వెరబోయెను నావదనం
నీ కై  వేచిన  క్షణాలు
నిప్పు కణిక లై  వేధిస్తుంటే
నీతో గడిపిన  మధురోహలు మాత్రం 
మంచి గంధాన్నే పూస్తున్నాయి
మరపురాని ఆమధుర క్షణాలు మంచిముత్యాలేకదా...
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

26, అక్టోబర్ 2021, మంగళవారం

ఆకాశం ఫక్కున నవ్వింది

*ఆకాశం ఫక్కున నవ్వింది*

ఆకాశం ఫక్కున నవ్వింది
ఎక్కడలేని నిశ్శబ్దాన్ని 
నీలోనే ఆవరించుకుని నాదగ్గర ఆవులిస్తావెందుకని
నిర్లిప్తత నీడలా వెంబడిస్తే
నీలాకాశానిదా తప్పు
ఆశలు రెక్కలు అకస్మాత్తుగా
తెగిపడితే ఆక్రోశం నామీదెందుకు
అప్పటికీ నర్మగర్భంగా హెచ్చరిస్తూనే 
వున్నాయి అనుభవాల ఘంటికలు
ఆకాశానికి నిచ్చెలేయొద్దంటూ
తగని పరిస్ధితులు జటిల ప్రశ్నాపత్రాలై
శోధిస్తుంటే తగిన సమాధానంతో
సిద్ధంగా వుండాల్సింది నువ్వు
ఊహించని ఉత్పాతాలు అశనిపాతాలై
వేధిస్తుంటే తక్షణమే సమయజ్ఞత
అస్త్రాన్ని సంధించాల్సింది నువ్వు
మనుగడసాగిస్తున్నావని భ్రమపడి
మగతనిద్రలో మసలుతున్న
ఆధునికపు మరమనిషీ 
నిను చూస్తే జాలేస్తుందని
ఆకాశం ఫక్కున నవ్వింది
కాంక్షల బంధీకానాలో 
ఊపిరి తాకట్టుపెట్టి 
కర్తవ్యం ఊసెత్తితే
ఉస్సూరంటావెందుకు
విధ్యుక్తధర్మాన్ని విస్మరిస్తే
విజయమెలా వరిస్తుంది 
గడప దగ్గరే నిలబడిపోతే 
గమ్యమెలా గోచరిస్తుంది
ఆలోచనరెక్కల నిండా 
కాసింత చైతన్యపు చమురును నింపు
నిస్పృహతో చిప్పిల్లిన కన్నీటిని కాదు
ఆత్మస్థైర్యాన్ని ఆహ్వానించి చూడు 
నీ మనోచక్షువులకు 
ఆశావహ జీవన దృశ్యం 
సాక్షాత్కరిస్తుంది
ఈ క్షణమే నువ్వు మనిషివి కావాలి
మనసునకంటిన నైరాశ్యపు
మరకలను తక్షణమే
ప్రక్షాళన చేసుకోవాలి
ఏదో ఒకటి చేయి
గుండె తడారి ఎడారి చిత్రంగా
మిగిలిపోయే లోపు
గుప్పెడు ఆశలు చిగురించేలా..
నీ జీవనముఖచిత్రానికి 
ఒద్దికపడు ఉద్దీపన రంగులు
అద్దాల్సింది నువ్వే
కాలం పుస్తకానికి ఖచ్చితంగా
ముందుమాట రాయాల్సిందీ నువ్వేనంటూ ...
ఆకాశం ఫక్కున నవ్వింది.
(కెనడాడే తెలుగుతల్లి కవితలపోటీలలో బహుమతి
పొందిన కవిత)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

25, అక్టోబర్ 2021, సోమవారం

శ్రీమణి గజల్

*శ్రీమణి గజల్*
6/6/6/6
విరులతరుల సొబగులతో మురిసినదీ పూలతోట
ఏటిఝరుల గలగలతో తడిసినదీ పూలతోట

వానచినుకు ఒడిసిపట్టి మురిపెముగా ముద్దాడె
ధరణిపైన హరివిల్లుగ విరిసినదీ  పూలతోట

మధువనిగా మరులుగొలిపె పూలతావి మనోహరం
మధుపముతో సయ్యాటకు  పిలిచినదీ
పూలతోట

రాచిలకల కిలకిలలకు రారమ్మని ఆహ్వానం
చిగురాకుల పందిరిగా వెలిసినదీ పూలతోట

ఆకుపచ్చ సోయగాన ఉదయరాగ సరాగమై
అంబరమణి శోభలతో మెరిసినదీ పూలతోట.
  *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

7, అక్టోబర్ 2021, గురువారం

కవివర్యులు శ్రీమతి *సాలిపల్లి మంగామణి* గారు 03.10.2021నాడు నిర్వహించిన *గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి* సందర్భంగా జరిగిన కవితా పోటీలలో పాల్గొని ఉత్తమ కవితగా గుర్తింపు పొందినందులకు *వాల్మీకి కవితా గ్రూప్* తరఫున తమరికి అభినందనలు తెలుపుతూ అందచేస్తున్న ప్రశంసా పత్రము...*వాల్మీకి కవితా గ్రూప్* *హైదరాబాద్*

కవివర్యులు శ్రీమతి *సాలిపల్లి మంగామణి* గారు 03.10.2021నాడు నిర్వహించిన *గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి* సందర్భంగా జరిగిన కవితా పోటీలలో పాల్గొని ఉత్తమ కవితగా గుర్తింపు పొందినందులకు *వాల్మీకి కవితా గ్రూప్* తరఫున తమరికి అభినందనలు తెలుపుతూ అందచేస్తున్న ప్రశంసా పత్రము...
*వాల్మీకి కవితా గ్రూప్*
        *హైదరాబాద్*

6, అక్టోబర్ 2021, బుధవారం

ఆగదుగా ఈగమనం

*ఆగదుగా ఈగమనం*

కష్టమింట పుట్టామని
పొట్ట ఊరుకుంటుందా
కట్టలు తెంచుకున్న కన్నీటికి
కాలం బదులిస్తుందా
నడుంకట్టి నడపకుంటే
కదలదుగా బ్రతుకురథం
బ్రతుకు తెరువు వేటలో
కదులుతున్న మాతృత్వం
కర్తవ్యంపాలనలో
ఆ కన్నతల్లి ప్రయాణం
కడుపారా కన్నబిడ్డకు
కన్నీటిని తాపించలేక
తపించే తల్లిగుండె ఆరాటం
ఆకలి మెలిపెట్టినా
అలుపెరుగని పోరాటం
సేదదీర తావులేని
పేదతనం శాపమైతే
ఊరట ఊసేలేక
ఉస్సురంటూ జీవితం
ముద్ద నోటికందాలంటే
ముప్పొద్దుల శ్రమదానం
పస్తులూ పరిపాటంటే
ప్రాణం నిలబడుతుందా
కడుపుతీపి మమకారం
కాలు నిలవనిస్తుందా
అరనిమిషం పాటైనా
ఆగదుగా ఈ గమనం
ఎంతైనా ఓరిమిలో ధరణికదా
మాతృమూర్తి
తలకు మించి భారమైనా
వెనుకాడక సాగుతుంది.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

5, అక్టోబర్ 2021, మంగళవారం

మాయాజాలం

*మాయాజాలం*

అంతర్జాలమా....
అనంత మానవాళినీ
శాసిస్తూ
నీకు దాసోహం గావిస్తున్న
మహా మాయాజాలమా...
నీ గాలానికి చిక్కిన మేము
కాలానికి నీళ్ళొదిలేసాము
కదలడమే మానేసాము
నీ సన్నిధిలో మేము
మరమనుషులమై 
మనుగడ సాగిస్తున్నాము
అమ్మలేదు నాన్న లేదు
నిరంతరం నీధ్యానమే
ఆటలేదు పాటలేదు
అనునిత్యం నీ సాంగత్యమే
సదా నీ సేవలో...
ఫిదాలమైపోయాము
నీ నామమే జపిస్తూ
నీ కోసమే తపిస్తూ
పదేపదే పరితపిస్తూ
గతి తప్పి తిరుగుతున్న
మతి లేని మానవులం
అణుమాత్రం కదలకుండ
అవనిని చుట్టేస్తున్నాం
అరచేత స్వర్గాన్ని 
అంది పుచ్చుకుంటున్నాం
నువ్వుంటే యోగమని
నువ్వంటే భోగమని
భ్రమసి నీపాల పడ్డాము
నేడు నువ్వే ఒకరోగమని తెలిసి
తలపట్టుకు కూచున్నాము
నువు లేక నిమిషమైనా
నిదానంగా మనలేము
మతిచలించిపోతున్నా....
మా బ్రతుకంతా నీతోనే
సృష్టించిన మేమే
నీ బానిసలుగా మారి
శుష్కించిపోతున్నాము
అవసరం కాస్తా
హద్దుమీరి అనర్ధమే అవుతుంది
అడ్డమైన రోగాలకు
ఆవాసమై కూచుంది
ఏమి కనికట్టు కట్టావో మరి
ప్రపంచమే నీపాదాక్రాంతం నేడు.
(అతి సర్వత్ర వర్జయేత్
ఏదైనా శృతి మించితే
అమృతమైనా...విషమే
అవసరానికి వాడుకొంటే
అంతర్జాలమూ ఒక అద్భుతమైనవరమే..
అభివృద్ధికి సంకేతమే).
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

2, అక్టోబర్ 2021, శనివారం

శ్రీమణి గజల్*6/6/6/6

*శ్రీమణి గజల్*
6/6/6/6

వలపుపూల జడివానల
తడిసినదీ *గురుతుందా*
నిదురరాక నిట్టూర్పులు
విడిచినదీ *గురుతుందా*

తేనెలూరు ఘడియలన్ని
కరిగిపోక తరిమినవీ
తడియారని తలపులతో
మురిసినదీ *గురుతుందా*

నులివెచ్చని కలలన్నీ
నడిరేతిరి పరమాయెను
కవ్వింతల కలవరమై
నిలిచినదీ *గురుతుందా*

ప్రణయవీణ  మీటినపుడు
పరువమంత పరవశమే
తపనలన్ని తనివితీర
విరిసినదీ *గురుతుందా*

మనమనసులు మమేకమై
మధువనిలా మారువేళ
*మణి* ఖచితపు ప్రేమనగరి
మెరిసినదీ *గురుతుందా*.


*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

25, సెప్టెంబర్ 2021, శనివారం

గాన గాంధర్వులు*

*గాన గాంధర్వులు*

ఏ గానమాలకించగానే..
గగనం సైతం పులకిస్తుందో...
ఏ స్వరం వినగానే మది
మరుమల్లెల పరమవుతుందో
ఏ గాత్రం వింటూనే...
ప్రతి హృదయానికి
చైత్రం ఎదురవుతుందో..
ఏ మరందపు పాటల ఝరిలో..
రాగాలన్నీ... మానసరాగాలై
పరవశమవుతాయో...
ఎవరి గళంనుండి
అమృతం అలవోకగా
జాలువారుతుందో...
ఎవరి గొంతు వినిపించగానే...
ఆబాలగోపాలమూ
ఆనందరాగమాలపిస్తుందో...
ఏ రాగం వింటూనే ఎద
వెన్నెలస్నానమాడుతుందో
అతడే మన గానగాంధర్వులు
సప్తస్వర మాంత్రికులు
మధురగాయకులు,మనబాలు
అవును ఆ కంఠం
మనసుమనసునూ
తట్టిలేపుతుంది..
వారు పాడితే,మైమరచిన
మన మది,మకరందం చవిచూస్తుంది
వారు పాడితే,
ప్రకృతి పరవశమై
ప్రణయ వీణలు మీటుతుంది
వారు పాడితే ఎద ఎదలో
మధురోహల పూదోట
విరబూస్తుంది
ఆహా..ఎంత భాగ్యము నాది
గాన గాంధర్వునికి
చిరుకవనమర్పించ
నా కలమునకెంతటి సౌభాగ్యమో...
ఆ సంగీతసామ్రాట్టును సన్నుతించ,
ఉరికే సంగీత ఝరి,
స్వర రాజశిఖరి
సరిగమలతో
స్వర్ణరాగాలు పలికించి
కొసరికొసరి తన
గానామృతాన్ని ఒలికించి
మనలనలరించ
భువికేతెంచిన
ఘన గానగాంధర్వులు
సప్తస్వర మాంత్రికులు
శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి
ప్రధమ వర్ధంతి సందర్భంగా
శోకతప్త నయనాలతో అశ్రునివాళి.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

20, సెప్టెంబర్ 2021, సోమవారం

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవాసంస్థమరియు రాగసప్తస్వరం సాంస్కృతికసేవాసంస్థల ఆధ్వర్యంలో

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవాసంస్థ
మరియు రాగసప్తస్వరం సాంస్కృతిక
సేవాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి
98వ జయంతిని పురస్కరించుకుని
ప్రముఖుల సమక్షంలో జరిగిన అంతర్జాల
సమావేశంలో నా కవితకు
ప్రధమస్ధానం కల్పించి
కవితాగానం చేసే అవకాశం
మరియు అక్కినేని కవితా కల్హారం eపుస్తకంలో
ప్రచురించిన శుభతరుణం
మీఅందరి ఆశీస్సులుఆకాంక్షిస్తూ....  *శ్రీమణి*

8, సెప్టెంబర్ 2021, బుధవారం

*అనుభవాల కాగితం*

*అనుభవాలకాగితం*

గతం నుండే జనిస్తుంది
ఘనమైన జీవితం
తెరచిచూడమంటుంది
అనుభవాల కాగితం
మనసునాక్రమిస్తుంది
మరచిపోని జ్ఞాపకం
జలజలా రాలుతునే వుంటాయి
కాలం వెంబడి క్షణాలు
జీవిత రహదారికిరువైపులా
పరచుకొంటాయి రేయింబవళ్లు
ఉదయసమీరాలు,సంధ్యా
రాగాలు స్పృశిస్తూనే వుంటాయి
మనుగడ దారులనిండా
మారుతున్న మజిలీలు
చేజారుతున్న నిమిషాలు
మనసొకమారు మండుటెడారి
ఒకపరి మరుమల్లెల విహారి
ముందునున్న పూలరథం
అధిరోహించాలంటే
నిన్నటి గాయాలకు
నిఖార్సైన మందుపూయాల్సిందే.

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

7, సెప్టెంబర్ 2021, మంగళవారం

కలకానిదీ

*కలకానిదీ*

నమ్ముతారో లేదో మరి
ఒక చిత్రమైన కల నను రోజూ వెంటాడేది, చెక్కుచెదరనికొన్ని ప్రదేశాలు 
కనులముందు సాక్షాత్కరిస్తూ నన్ను  అనిశ్చిత ఆలోచనల వెంట తరుముతూ
ఏవో ఇంతకు మునుపే చవిచూసిన
అనుభూతుల తుంపరలో 
తడిచిపోతున్నట్టు

ఇప్పటికీ అదే కల 
కనురెప్పలు వాలగానే ఆక్రమించుకుని
కాలాన్ని వెనక్కి త్రిప్పి తీసుకెళుతున్న భావన, ఖచ్చితంగా ఆ ప్రదేశంలో 
నేను మసలిన మరపురాని స్మృతులేవో
నా మునుపటి ఉనికిని బలపరుస్తుంటాయి
పూర్వజన్మలో అది నా ఆవాసమా
అన్న అనుమానం స్వప్నం పూర్తయిన
ప్రతీసారి అదే సందేహంతో 
ఉదయాన్ని ఆహ్వానిస్తుంటాను

అక్కడ కనుచూపుమేరలోఎవ్వరూ లేరు
నా ఉనికి నాకే తెలియని నిశ్శబ్ద ప్రదేశం
ఒక్కటి మాత్రం గుర్తుంది 
ప్రకృతితో మమేకమైన నేను
నాప్రక్కన గుబురుగా అలుముకున్న
కాగితపు పూలచెట్లు 
నేలను ముద్దాడినట్లు 
గడ్డిపూలసోయగాలు
నే నిలబడివున్న దారి కాస్త పల్లంగా
అదేదారికేసి కొంచెం దూరంగా
దృష్టిని సారిస్తే బాగా ఎత్తుగా 
దారులకిరువైపులా బారులుతీరి
చిక్కగా అల్లుకొన్న కొమ్మలు, ఆకులతో 
మహావృక్షాలు కాబోలు 
తల ఎత్తిచూసినా
ఆకాశాన్ని కనపడకుండా అడ్డుపడుతున్నాయి
అస్సలు ఆ ప్రదేశానికి సూర్యుని
కిరణాలు అపరిచితమేమో అన్నట్లు
నా వెనుకగా తరాల తరబడి
నిలబడి అలసిపోయి 
వానల అలజడికి కరుగుతూ 
సగం నేలకొరిగిన మట్టిగోడలు
వర్షం వచ్చి వెలసిన జాడలు
కుడిచేతివైపు లోపలకు సన్నని త్రోవ
ఒక్కరు మాత్రమే నడిచేట్టు,

పచ్చదనం వెచ్చగా హత్తుకున్న
మట్టి పరిమళం మనిషినిమాత్రం
నేను ఒక్కదానినే మనసునిండా
ఏదో తెలియని మంత్రజాలంలా
సర్వం మరచి ప్రకృతిలో  పరవశిస్తూ
పంచభూతాల సాక్షిగా నేను
చుట్టుప్రక్కల ఏమాత్రం సంచారం
లేకపోయినా పక్షుల స్వరవిన్యాసం
మాత్రం చెవిని చేరుతూనే వుంది
నేనెవరో నాకు తెలియని సందిగ్దత
కానీ అది నేనేనని మాత్రం స్పష్టంగా
చెప్పగలను,
అసలు అక్కడ  అలా
ఎందుకు  నిలబడ్డానో 
నిర్మానుష్యంగావున్న ఆ ప్రదేశానికి‌,
నాకు మాత్రం
ఏదో జన్మాంతర సంబంధమా అన్న
అనుమానం తలెత్తుతుంది..
ఆశ్చర్యంగా అనిపిస్తుంది వెనువెంటనే
ఎప్పుడూ ఆదారికేసి చూస్తూ
ఎదురుచూపులు చూస్తున్న 
నా నిలువెత్తుచిత్రం మాత్రం చిత్రంగా
ప్రతీ రాత్రీ స్వప్నంలా పలకరిస్తుంటుంది

ప్రతీసారీ అదేకల, అవే ప్రదేశాలు
అదే ఎత్తుపల్లాలదారీ,ఏమాత్రం
రూపు మారని మట్టిగోడలు 
పచ్చల ఆభరణం ధరించిన నేలా
పక్షులకువకువలూ, అన్నీ యధావిధిగా
నా కళ్ళముందు కావ్యంలా
ఆవిష్కరించబడుతూనే వున్నాయి
కనులు నిద్రకుపక్రమించిన 
అతితక్కువ సమయానికే అరుదెంచి
తెల్లారుతుండగానే కరిగిపోతూ
నన్ను అబ్బురపడేలా చేస్తాయి.

కలా లేక , కలకాని భ్రమా
లేక ప్రకృతి పట్ల నాకున్న అవ్యాజమైన
అనురక్తికి నాలో నిక్షిప్తమైన
భావాలకు ఊహాచిత్రమా...
ఏమో..ఏమైనా..గానీ
ప్రకృతి ప్రసన్నమై కలలా 
నన్నుతాకి వివశను చేస్తుంటే
మది వీణియ వింతహాయిరాగాలనే
ఆలపిస్తూ నన్ను ఆమనిలా 
పలకరిస్తూనే వుంది.
(కలకానిదీ..అంతరంగ/అనుభూతి ఆవిష్కరణ)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

6, సెప్టెంబర్ 2021, సోమవారం

సేవ సాహితీసంస్థ

*సేవ* సాహితీసేవాసంస్థ
వారి ఆధ్వర్యంలో జరిగిన
సహస్ర సాహితీ సప్తాహంలో
పాలుపంచుకుని
*తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్*
 నందు  తెలుగు గజల్ విభాగంలో 
 గజల్ గాయనిగా
నాపేరు కూడా  నమోదయిన
 శుభతరుణం మీ అమూల్యమైన 
ఆశీస్సులుఆకాంక్షిస్తూ....*శ్రీమణి*

లోపలిమనిషి

*లోపలిమనిషి*
ఎప్పుడైనా...నువ్వు నీలోనికి
నిశ్శబ్దంగా తొంగి చూసావా
ఏం కనిపించిందీ
అడుగంటిన ఆశలతటాకమా..
ఏనాడైనా ఒక్కసారి
నీ గుప్పెడు గుండె పై
ప్రశ్నల వర్షం గుప్పించావా...
ఏం వినిపించిందీ సమాధానం
అణగారిన ఆశయాల ఆక్రోశమా..
వెన్నెలదారులనే అన్వేషిస్తూ
 అలసిపోయావుగానీ కన్నులముందు
విప్పారిన వేకువనెందుకు
విస్మరించావు
తెల్లారేటప్పటికల్లా చెల్లాచెదురయ్యే
స్వప్నసౌధాలలో
రెక్కలార్చి విహరించావే గాని
ఉదయించిన వాస్తవాన్నెపుడైనా
హృదయంతో ఆహ్వానించావా..
ఒకపరి పరీక్షగా పరికించి చూడు
గుట్టలుగా పడివున్న ఎండిపోయిన 
క్షణాలు తీక్షణంగా నీకేసి చూస్తున్నట్టులేవూ
అందలం ఎక్కాలని అంగలార్చావే గానీ
అంతరంగం గోడు ఏనాడైనా ఆలకించావా
లోపలిమనిషి వేసే ప్రశ్నలకు
ప్రత్యుత్తరం నీ మౌనమైతే ఎలా
మహాసముద్రం లాంటి మనసెందుకు
మౌనముద్రను ఆశ్రయించిందో
అసలు అవలోకించావా
కర్తవ్యానికి నీళ్ళొదిలేసి
నిర్లక్ష్యపుగోడలకింద సేదదీరుతానంటే
లక్ష్యమెందుకు సాక్షాత్కరిస్తుంది
గమనమే సరిగా లేనప్పుడు
గెలుపుగుమ్మమెలా చేరుకోగలం
సాధించాలనుకున్నప్పుడు
ఛేదించాల్సిందే వ్యూహాలెన్నున్నా
ప్రయత్నమన్నదే లేకుండా
ఫలితాన్ని ఆకాంక్షించడం 
హాస్యాస్పదమేగా..
నిట్టూరుస్తూ నిలబడిపోతూ
కాలం ఇనుపరెక్కలక్రింద
నలిగి నాశనమైపోతానంటే
తప్పెవరిదీ..
ప్రారబ్ధం మాట ఎలావున్నా
ప్రారంభం అయితే చెయ్యాల్సింది నువ్వే
కాలం కాళ్ళకు చక్రాలున్నాయి
నువ్వేం సాధించినా,లేకున్నా
నిన్ను రేపటి వాకిట్లో నిలబెట్టే తీరుతుంది
నేలకొరిగిన మాట వాస్తవమే అయినా
చిగురులు వేయడానికీ అవకాశం వుందేమో...అన్వేషించాల్సింది నువ్వే.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

5, సెప్టెంబర్ 2021, ఆదివారం

ప్రణమిల్లెద నీకు*


ఉదయించే జ్ఞానం
నడిపించే ధైర్యం
జీవించే నైపుణ్యం
శోభించే ఔన్నత్యం
సహృదయం,సద్భావం, 
అలవరచగ ఇల వెలసిన
ప్రత్యక్ష దైవమా..
ఉపాధ్యాయుడా....ప్రణమిల్లెద నీకు
ఉజ్వల భవిత
ఉత్తమ నడత
ఉన్నత సంస్కారం
మాన్యతను,మానవతను
ప్రబోధించి మనిషిని మనీషిగ 
మలచిన మార్గదర్శీ
ఉపాధ్యాయుడా...ప్రణమిల్లెద నీకు
జ్ఞానసూర్యుడా...
విజ్ఞాన ప్రదాతా..
మేలుకున్నది మొదలు
మా మేలుకై పరితపించి
కర్తవ్యం స్ఫురింపజేసే
కాంతిపుంజమా...
విద్యాదాతా....
ఉపాద్యాయుడా...ప్రణమిల్లెద నీకు
అజ్ఞానపు చీకట్లను బాపి
వెలుగులనిచ్చే వెలుగులదొరా...
ఒట్టి మట్టిముద్దను సైతం
మహామేథావిని గావించగల
మహిమాన్విత శిల్పీ..
అక్షరక్షీరాలనొసగి
జ్ఞానార్తిని తీర్చిన అమ్మలా
మంచి,చెడులు నేర్పించిన నాన్నలా
వేలుపట్టి దిద్దించి 
వేలుపువైనావు
జన్మంతా సేవించినా
తీరునా నీ ఋణం
వెలకట్టలేని విద్యాసిరులను
వరమిచ్చిన గురువర్యా..
ఉపాధ్యాయుడా....ప్రణమిల్లెద నీకు
(ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో)

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

28, ఆగస్టు 2021, శనివారం

గజల్

*గజల్*

అనురాగపు అమృతధార
కురిపించును ప్రేమంటే

గగనమంత విశాలమై
అలరించును ప్రేమంటే

అవనిలోని బంధాలకు
బహుచక్కని భాష్యంగా

అనంతమగు భావాలను
పలికించును ప్రేమంటే

మధుమాసపు కోయిలలా
మదిదోచే మృదురాగం

సుమసుగంధ వీచికలా
వ్యాపించును ప్రేమంటే

అంతరాలు అగుపించని
అద్వితీయ అనుబంధం

అవధులన్ని అధిగమించి
ప్రవహించును ప్రేమంటే

*మణి* దీపపు వెలుతురులా
అంతరంగ సోయగమిది

హృదిస్పందన శృతిలయగా
వినిపించును ప్రేమంటే.

రచన: *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

25, ఆగస్టు 2021, బుధవారం

ఊరికెట్టబోవాలె

*ఊరికెట్టబోవాలె*

ఊరికెట్ట బోవాలి 
ఉట్టి చేతులట్టుకోని
మట్టికేమి చెప్పాలి 
కూడగట్టుకున్నదేముందని
ముఖమెట్టా చెల్లేదీ
చిల్లిగవ్వ కోసమే 
ముఖం వాచిపోతేనూ
పుట్టినూరునొదలొద్దని
మొత్తుకుంది కన్నతల్లి
దాటి వెళ్ళిపోవద్దని
దారి కాచె పల్లెతల్లి
పల్లె గోడు పట్టలేదు
పట్టపు మోజే తప్ప
పొట్ట చేతపట్టుకోని
పట్టణాల బాటపడితే
బావుకున్నదేముందని
పట్టెడు మెతుకులకోసం
పుట్టెడు అగచాట్లు
పడరానిపాట్లు ఎన్నో..
దూరపుకొండలు నునుపని
మునుపటి సామెత ఎదురై
కన్నీరు సుడులు తిరగబట్టె
వున్నమాట చెప్పితే
చెవికి నచ్చలేదు
అగోరించు అగోరించు
అర్ధాకలి కడుపు
అప్పు మీద అప్పు
తప్పదు ఇక ఆక్రందన
అమ్మ మాట వినకుంటే
జన్మంతా తిప్పలే
పుట్టినూరు ఎప్పుడూ
పట్టుగొమ్మలాంటిదే
మేడలు మిద్దెలు చూసి
పట్టణదారులు పడితే
తినడానికి తిండిలేక
నిలుచుందుకు నీడలేక
బ్రద్దలాయె బ్రతుకునావ
భగ్గుమంటు కాల్చింది
పట్టణాల త్రోవ
మాయదారి పట్నం
బతుకులు కుత్తుకలు
 ఎండిపోయాయిలా
కష్టమైనా సుఖమైనా
చేరదీసి హత్తుకున్న 
తల్లిలాంటి పల్లెనొదలి
పట్నాలకు పరుగులెట్టి
పాలెందుకు...తాగాలిట
నీళ్ళైనా తాగాలిక మీదట
ననుగన్న నేలపై
నిలుచుని ఇక నిదానంగా.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

26, జులై 2021, సోమవారం

నువ్వు కాదూ..,

*నువ్వు కాదూ...*

నే నవ్వులు మరచిపోయినపుడు
పువ్వులు చూపించింది నువ్వుకాదూ..
నా చుట్టూ చీకటి కమ్మేసినపుడు
వెలుతురు జల్లింది నువ్వుకాదూ...
కాలం పడదోసిన ప్రతిసారీ
ఎగిసిన కెరటాన్ని జ్ఞాపకం తెచ్చింది నువ్వుకాదూ...
రాలుతున్న నా ఆశల వెంబడి
రహదారిని త్రవ్వింది నువ్వు కాదూ
మనసు విరిగినపుడల్లా
మనసెరిగి క్రొత్త రెక్కలు తగిలించి
ఎగరమంటూ ఊతమిచ్చింది
నువ్వుకాదూ...
నిబ్బరం కోల్పోయిన ప్రతిసారీ
జబ్బ చరిచి లేవమన్నది నువ్వుకాదూ
నేను  శిధిలమైన ప్రతిసారీ
నా ఉనికిని పదిలం చేస్తూ నన్ను
పునర్నిర్మించింది నువ్వుకాదూ
అంతెందుకూ నా గుండెగొంతుక
తడారిపోయినపుడు సంజీవనిలా
ఎదురొచ్చింది నువ్వుకాదూ...
కొడిగట్టబోతున్న నా ఊపిరిదీపానికి
చేతులడ్డుపెట్టింది నువ్వుకాదూ...
జీవితపు బండిచక్రాలు అగాథంలో
కూరుకుపోతుంటే చివరినిమిషంలో
చేయందించి చైతన్యపరచింది నువ్వుకాదూ...
పగలునూ,రాత్రినీ సృష్టించిన నీకు
పగులుతున్న హృదయాల ఘోష
పనిగట్టుకు చెప్పాలా..
కథ నడిపించే సూత్రధారికి
పాత్రల ఔచిత్యం పరిచయం చేయాలా..
గమనమొకటే నాది
గమ్యం మాత్రం నీవే
నే నడుస్తాను....
నువ్వు నడిపిస్తావు అంతే.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

19, జులై 2021, సోమవారం

*చైతన్యపు ఖడ్గాన్ని*

నిన్నరాత్రి  నిషిద్ధాక్షరాలు
రాలిపడ్డాయి నిశ్శబ్దపు పుటలనుండి
నాలో నిగూఢమైన చైతన్యపు నేత్రాలు
అహస్కరుని కిరణాల్లా
విస్తరించాయి విశ్వక్షేత్రంపై
నిజానికి నేనిప్పుడు 
నిరంతరాన్వేషిని
దూసుకుపోతున్నాను 
నిశిదుప్పటి దులిపేసి
నిజ ఉషస్సు కేసి
నేనిప్పుడు వేయాల్సింది
లక్ష్యపు క్షేత్రంలో లక్షలనాట్లు
నన్నో విజయగీతంగా 
మలచుకోవాలి...
ఎన్నో ఓటమి పర్వాలకు
పర్యవసానంగా..
గెలుపు గుమ్మం చేరుకోవాలి
నేనిప్పుడు నైరాశ్యపు
నిబిడాంధకారాన్ని చీల్చిన
చైతన్యపు ఖడ్గాన్ని
వేకువతట్టుకు వెలుగును పూసిన
తూరుపు సింధూరాన్ని
నిట్టూర్పులు, నీరుగారడాలు
నిన్నటి గతించిన క్షణానివి
వెనుకంజ వేయడాలు
వెక్కి, వెక్కి ఏడ్వడాలు
కాలంచెల్లిన వాక్యాలు
నే నడిచే గమనంలో నిరాశకు
తావివ్వను,నీరసాన్ని రానివ్వను
కన్నీటి కారకాలు సవాలక్ష  
కర్తవ్యప్రేరకాలను 
అన్వేషించడమేగా
మనిషిగా మన సార్ధకత
ఉప్పెనలోనే ఊపిరోసుకొంటాయి
ఉజ్వలమైన ఉపాయాలు
దిగులుమంత్రం ఉచ్ఛరిస్తూ 
నీరసిస్తే ఉద్ధరించే నాధుడెవ్వడు
వెతలే తాకని వేదన సోకని
బతుకుంటుందా ఇలాతలంలో
కంటకాలు అధిగమించక 
కామితాలు నెరవేరేనా
కణకణమండే నిప్పున కాలక
కనకము నిగ్గు తేలేనా
రహదారిని త్రవ్వుతున్నాను
రాలుతున్న ఆశల వెంబడి
నా ఆలోచనాస్త్రాలు
రవికాంతి కిరణాలై 
ఆశయానికి దారిచూపిస్తాయి.
నేనిప్పుడు నిలువెత్తు ఆత్మవిశ్వాసాన్ని
నేనిప్పుడు విజయపతాకాన్ని
విశ్వ వినువీధులవెంట 
విజయోత్సాహానికి ప్రతీకగా
విరాజిల్లుతున్నాను.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

17, జులై 2021, శనివారం

*మనుషుల్లా మారిపోయాం*

*మనుషుల్లా మారిపోయాం*

కరుడుగట్టిన మనసురాతిని చీల్చుకొంటూ మానవతావిత్తనమేదో అంకురించి మనిషిని మనీషిగా ఆవిష్కృతం చేసింది,
కదనం మొదలయ్యాక మనిషిమనిషిలో అంతర్మధనం మొదలయ్యింది,
మనిషితనం మొలకెత్తింది
మృత్యుకౌగిట నిలబడ్డాక,
పోగొట్టుకొన్నదేమిటో పోగుజేసుకొన్నదేమిటో తేటతెల్లమయ్యింది
కలికాలపు రోగం కబళించాక,
బందీఖానా మొదలయ్యాకే బంధాల విలువ తెలిసొచ్చింది ,
నాలుగు గోడల భోదివృక్షం తక్షణ కర్తవ్యం స్ఫురింపచేసింది,
స్వార్ధపు కబంధహస్తాలను పెకలించుకు
సాయంచేసే చేతులు విస్తారంగా ముందుకు వస్తున్నాయి,
మనుషుల మధ్యనే దూరం
మనసుల మధ్యన తరగని మమకారం
చేతులు మాత్రమే కలపము
చేయూతకు ముందుంటాము
మేమంతా మనుషుల్లా మారిపోయాం
మనసున్న మనుషుల్లా,
మా దేశం సౌభాగ్యం ఇక నిస్సంశయం
నా దేశానికి ఏమీ కాదు
ప్రతీ ఒక్కరూ మానవతావాదులే
ఎటు చూసినా సాయం చేసే చేతులే,
ఏ మాయరోగం మమ్మల్ని మట్టు
పట్టలేదు‌,
మానవాళి మనుగడ పునాదులిక కదలనే కదలవు,
అదిగో గెలుపురాగం, రేయిమాటున దాగివున్న ఉషోదయకిరణం ఉదయించే తరుణం అదిగో,

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

10, జులై 2021, శనివారం

అనలవేదిక

*అనలవేదిక*

ముడివడిన విశ్వం భృకుటి
ఇంకా విడివడలేదు
కాలం గుండెలపై మానని కత్తిగాటు
రసిగారుతూనే వుంది
వినువీధుల వెంబడి విషాదగీతం
ఇంకా ప్రవహిస్తూనే వుంది
యుద్ధం ఇంకా ముగిసిపోలేదు
క్షణాలు భారంగానే ఊపిరిపీల్చుకుంటున్నాయి
రణానికి సంసిద్ధమైన
ప్రాణాలు మౌనంగా మనుగడ సాగిస్తున్నాయి
ఏమరుపాటు ఘడియలుకోసం
కాబోలు కలికాలపు రక్కసి
కోరలు కాచుకు కావలి కాస్తుంది
తెరలు,తెరలుగా ముంచుకొస్తున్న
మృత్యునగారా కంటిమీద కునుకును
బలవంతంగా లాగేసుకుంది
దిక్కులన్నీ నిన్నటి పెను విధ్వంసానికి
నిలువెత్తు సాక్ష్యంగా ఇంకా దిగ్భ్రాంతిలోనే,
ఉచ్చు బిగించిన ఉత్పాతం
ఊరటనిచ్చిందనుకొంటే పొరపాటే
తిరుగాడిన కాలం ఇక
తిరిగిరాదు ఎప్పటికీ
మానవ మనుగడలో పెను మార్పు
మునుపటిలా వుండదు రేపు
ఈ మౌనం తెర వెనుక మహాసంగ్రామం
మాటువేసే వున్నట్టుంది
మనోవేదికపై మారణహోమం
అందమైన జీవిత ముఖచిత్రానికి
అమావాస్య చీకటి పూసిన
ఆ హంతకి అంతరించేవరకూ
అప్రమత్తతే మనకు శరణ్యం
లేకుంటే ఆభగవంతునికీ
వినబడదేమో మన అరణ్యరోదన
అనలవేదికయై ఆక్రోశించు
అవని ఆనందసమీరమై
అలరారాలన్నా..
ఎడారికెండిన మానవాళిగుండెలో
వసంతం కదలాడాలన్నా
అప్రమత్తతే మనకు రక్షణ
మానవాళి పరిరక్షణ
ముమ్మాటికీ మనచేతుల్లోనే .. *శ్రీమణి*

8, జులై 2021, గురువారం

నేనొక విజయ గీతం రాసుకోవాలి*

*నేనొక విజయ గీతం రాసుకోవాలి*

కాలమా... 
నేను ఏడవడం లేదు
కాసింత కళ్ళు చెమ్మగిల్లుతున్నాయంతే
ఇదిగో ఇప్పుడే చీకటిని తుడిచేసి
వెలుతురు ముగ్గేస్తున్నా
శూన్యాన్ని కాల్చేసి
వెలుగులు పూయిస్తున్నా
కలికాలం పాత్రలో కలుషితమైన
కన్నీటిని ఒంపేసి
కాసిన్ని నవ్వులు నింపేస్తున్నా
పుస్తకంలో నాకొక పేజీ కావాలి
నేనొక విజయగీతం రాసుకోవాలి
మసలుతున్న రోజులన్నీ
మనోహరకావ్యంలా 
మలచుకోవాలని వుంది
పోగేసుకున్న నాలుగు అక్షరాలను
కలబోసి నాలుగుతరాలకు 
అందించాలి
విధి లాగేసుకున్న నాదైన క్షణాలకు
లక్షణంగా అక్షరరూపం ఇవ్వాలి
నా హృదయం చవిచూసిన
అనుభూతుల తాయిలాలను
అంతే భద్రంగా పదిలపరచుకోవాలి
పోగొట్టుకున్నదేమిటో...
పోగేసుకొన్నదేమిటో చక్కగా
లెక్క రాసుకోవాలి
నే చూసిన ఈ సమాజాన్ని
రేపటికై చిత్రించాలి
నే సంచరించిన
కాలగమనంలో నే సేకరించిన
అనుభవసారాన్ని ఆమూలాగ్రమూ
ఆ పేజీలో పొందుపరచుకోవాలి
ఆ చరిత్రకు పయనమయ్యేలోపు
ఈ ధరిత్రికి దూరమయ్యే లోపు,
అందుకే ఆపుస్తకంలో
నాకొక పేజీ కావాలి.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

2, జులై 2021, శుక్రవారం

15, జూన్ 2021, మంగళవారం

*మహాకవి శ్రీశ్రీ... మహాప్రస్థానం*(నాలుగుమాటలు)

*మహాకవి శ్రీశ్రీ... మహాప్రస్థానం*
(నాలుగుమాటలు)

విజ్ఞుడు, అభిజ్ఞుడు, 
మహాభిజ్ఞుడు
మాన్యుడు అసామాన్యుడు 
అనన్య సామాన్యుడు/
శ్రీశ్రీ అనగానే
అభ్యుదయ సాహిత్యానికి
శ్రీకారం స్ఫురణకు వస్తుంది/
అతని కలం యువతలో
ఆవేశం నింపే అగ్నిబీజం/
అతని కవనం ఇచ్చే ఆదేశం
తరతరాలకూ
తలమానికమౌ సందేశం/
అట్టి మహానీయమూర్తికి
చిన్నతనం నుండే
ఏకలవ్య శిష్యురాలను నేను

ఆ రేడు నడిచిన దారిలో
నడవాలని ఆరాటపడే రేణువును/
అలా చిరుప్రాయం నుండే వారి
కవితల ప్రభావం నామీద పడింది/
కష్టజీవులకు ఇరువైపులా 
వుండేవాడే కవి అన్నారు...
బడుగుజీవులకు
అట్టడుగు జీవులకు బాసటగా
నిలిచేదే మహాకవి శ్రీశ్రీ కవిత్వం/

కాలేకడుపులు, 
కలత చెందిన హృదయాలే కాదు 
ఆ కవనక్షేత్రకునికి సృష్టిలోని 
ప్రతి అంశమూ కవితావస్తువే/
వారు సృజించని అంశమంటూ
లేదంటే అతిశయోక్తి కాదేమో/
శ్రమైక జీవన సౌందర్యాన్ని
వారి హృదయసీమలో 
పటిష్టంగా ప్రతిష్టించుకొని/
ప్రతీ కవితలో.. భావావేశాన్ని 
ప్రస్ఫుటింపచేసిన ప్రతిభాశాలి/

అనంతమైన 
సాహితీపరిజ్ఞానాన్ని
ఔపోసన పట్టిన 
ఆ అభ్యుదయకవీంద్రుని
కలం ప్రభవించిన మహాకావ్యగు
మహాప్రస్థానాన్ని సాహితీవనంలో
అణువంతయును లేని నేను 
సమీక్షించడం అంటే 
హనుమంతుడి
ముందు కుప్పిగంతులే/
అయినా సాహసిస్తున్నాను 

మహాప్రస్థానంలో 
అణువణువును
స్పృశిస్తూ అక్షరాలను 
అంతరాంతరాళాల్లో పదిలం
చేసుకొంటూ పరవశించిపోతున్నాను/

ఆ మహనీయుని స్మరిస్తూ
మహాప్రస్థానం వైపు పరుగులు
తీస్తున్నాను/
మహాప్రస్థానంలో చైతన్యం
రగిలించే గీతాలే అన్నీ
నిదురించే హృదయాలను
సైతం వెన్ను చరిచి మేలుకొలిపే
చైతన్య గీతాలే అన్నీ/
మరోప్రపంచం పిలిచిందంటూ

పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
అంటూ కదం త్రొక్కుతూ
ఉడుకునెత్తురు ఉప్పెనవగా
కవనరంగమున దూకె
ఉగ్రనారసింహుడై మన శ్రీశ్రీ గారు/

ఆహా..ఎంతటి భావావేశం
అనితరసాధ్యమైన సాహిత్యం/
నేను సైతం ప్రపంచాగ్నికి 
సమిధనొక్కటి ఆహుతిచ్చాను 
అంటూ జయభేరి మ్రోగించి 
మనిషిమనిషిలో ఏదో
తెలియని అదృశ్యశక్తి 
ఆవహింపచేసిన
అద్వతీయ కవన రాజం 
మహాప్రస్థానం/

ఆ పదాల ఆవేశం అలాంటిది
ఆ వాక్యాల ప్రవాహం అలాంటిది/
తరచి తరచి చదివినా తరిగిపోని
సంపద మరి.. తరతరాలకూ/

భూతాన్ని యజ్ఞోపవీతాన్ని అంటూ
వినువీధులకెగసే విప్లవగీతాన్ని
ఆలపించిన కలం యోధుడు/
సింధూరం రక్తచంధనం
బంధూకం సంధ్యారాగం
అంటూ నవకవనానికి
నాందీసంకేతాలను
అందిస్తూ అభ్యుదయ
సాహితీ నవశకానికి 
నవజీవం పోసారు/
కవిని ఉదయించే సూర్యునితో
పోలుస్తూ కళారవీ 
అని కొనియాడడం
మహాప్రస్థానంలో 
మనకోసం
ఒక మచ్చుతునక 
మనమూ అంతో ఇంతో కవులమే గనుక/

పొలాలనన్నీ హలాలదున్నీ
ఇలాతలంలో హేమం పిండగ
అంటూ ఎంత అధ్భుత పద
ప్రవాహమో...
ఎంతమందికవులకు సాధ్యమంటారూ/

ఈ కవనాన్ని చదివినంతనే 
కర్షకవీరులకష్టం, 
విలాపాగ్నులూ,
విషాదాశ్రులూ
కనులముందు కదలాడి
ప్రతి హృదయాన్నీ కదిలించి
కర్తవ్యం స్ఫురింపచేయవూ/

బ్రతుకు బరువై మెతుకు కరువై
వెతలు నెలవై చితికి చితికి
చితికి చేరుతున్న వలసబతుకుల
బాటసారి బాధలను హృదయం 
ద్రవించేలా చిత్రీకరించిన వారి
కలం సిరాకు బదులు కరుణనే
నింపుకొందనిపిస్తుంది/

చూడు చూడు నీడలు
పేదవాళ్ళ వాడలంటూ
నిరుపేద బ్రతుకు చిత్రాలకు
నిలువెత్తు చిత్తరువై నిలిపారు
కవనంలో కడుచక్కని పదాలతో ..

ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబురమైతే
అంటూ అద్వైతం శీర్షికతో
అక్షరాలు పేర్చి అందరి
మన్ననలూ పొందితిరిగదా/

ఏ దేశ చరిత్ర చూసినా 
ఏమున్నదిగర్వకారణం 
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం అంటూ
వాస్తవాలను నిర్మొహమాటంగా
ఈ కవనంలో నిలదీసిన
నిక్కమైన కలంవీరుడు/
నిజంగానే నిఖిలలోకం 
నిండుహర్షం వహిస్తుందా 
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా
ఎంత నిగూఢత్వం కవనంలో/

పతితులారా భ్రష్ఠులార
బాధాతర్ప దష్టులార
ఏడవకండేవకండి
వస్తున్నాయ్ వస్తున్నాయ్
జగన్నాధ రథచక్రాలొస్తున్నాయంటూ 
జనంలో ధైర్యాన్ని నింపిన
జనంమెచ్చిన కవి సాహిత్యానికి
సాహో అనక తప్పదు జగం/

నాకనిపిస్తుంది మహాప్రస్థానం
ప్రభావం మనిషిమనిషిలో
చైతన్యం రగిలించే ఆయుధమై
అవతరించిందేమో అని/

నాకనిపిస్తుంది నాబోటి
నత్తనడకలు నడిచే మనుషులతో
క్రొత్తపరుగులు తీయించగలదని/
అది కలమా..కరవాలమా
సందేహమే మరి
కనిపించని కరవాలం 
కలం వెనుక దాగుందేమో/
అందుకే అంత వాడి 
అగండమైన వేడి/

అందుకే అనంతమైన 
ఆ సాహితీ మేరువుకు
అతి చేరువలో కవనసేధ్యం
గావించాలనుకొనే అణువంత కవయిత్రిని/ 

అతిచిన్నవయసులో
వారి మహాప్రస్థానానికి
ప్రభావితమైన శిష్యపరమాణువంటి
చిన్న కవయిత్రిని/

నా విన్నపమిది చిన్ననాటి కవనం
శ్రీశ్రీ గారి పాదాలకు అంకితమైతే
జన్యసార్ధక్యమే నాకు 
అన్యమేమియు వలదు ఇక/

శ్రీశ్రీ నాటిన అభ్యుదయ
సాహితీ వనంలో .. 
నే గడ్డిపూవునయినను చాలు 
ఆ రేడు నడిచిన దారిలో......
ఇసుక రేణువునయినను చాలు 
ఆ అభీకుని కలం విదిల్చిన
సిరా బొట్టు నయిననూ  చాలు 
ఆ మహనీయుని కలానజారిన కవనంలో ....... 
నేనొక అక్షరమయిననూ చాలు 
ఆ దార్శనికుని కవితా కడలిలో
ఎగిసే అలనయినా చాలు 
భాదిత జనాల బాసట  నిలువగ
పీడిత జనాలకూపిరులూదగ 
కవి తలపెట్టిన మహాయజ్ఞం
కొనసాగించుటకై ,
నే ఉడత సాయమందిస్తా ... 
సమ సమాజ స్థాపనలో ,నా
చిరు కవితాబాణం సంధిస్తా ..../ 

నా తొలిసమీక్ష 
అభ్యుదయకవీశ్వరుడు
శ్రీరంగం శ్రీనివాసరావుగారి
మహాప్రస్థానం అని తలచుకొంటేనే
ఉద్వేగంతో తలమునకలైపోతున్నా/
తరించిపోయిన నాకలాన్ని తనివితీరా
చూస్తూ.../
ఇకచాలు ఇకచాలు
ఉన్నా లేకున్నా ఈ భాగ్యమే
చాలు బహుధన్యమే ఇక
నా జన్మము.

ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన
నిర్వాహకు,సమీక్షకులకు
సహ రచయితలకు ప్రణామాలర్పిస్తూ
తొలిప్రయత్నాన్ని ఏమాత్రం
సవరణలున్నా సరిదిద్దుకోగలను
సూచిస్తారని ఆశిస్తూ..ఆకాంక్షిస్తూ
(మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి స్మరణలో)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
విశాఖపట్నం
🙏🌷🌷🌷🌷🌷🌷🙏

14, జూన్ 2021, సోమవారం

పచ్చనికావ్యం

*పచ్చని కావ్యం*

ఎక్కడో ఒక చిన్న నిశ్చింత
గ్రుక్క తిప్పుకోలేని ఉద్విగ్నతలో సైతం
ఊపిరి చిక్కబట్టుకొనేలా..
అంతర్జ్వలనమై ఆక్రోశిస్తున్న
అంతరంగాన్ని స్పృశించినట్లుగా
ఒకింత సాంత్వన 
ఆశను సుతిమెత్తగా హత్తుకొనేలా..
ముగిసిపోయిందని 
ఆర్తిగా ఆఖరుపేజీ తిరగేసేలోపు
సశేషమంటూ ఒక ఊహించని
 అందమైన మలుపు..
అంతుచిక్కని ప్రశ్నల సుడిగుండంలో
చిక్కుకున్న ఆలోచన నావకు 
 అతి చేరువలోనే సమాధానంగా
తీరం సాక్షాత్కరించినపుడు కలిగిన
ఒక ఉత్కంఠ భరిత అనుభూతి..
మరలా చిగురిస్తానన్న ధైర్యం కాబోలు
మరణాన్ని సైతం శాసిస్తుంది..
రేపు తప్పక గెలిపిస్తుందనే నమ్మకం
మనిషిని మరో ఉషోదయానికి
 సమాయత్తం గావిస్తుంది..
మన ఆలోచనా విధానమే 
మన జీవనగమనాన్ని నిర్దేశిస్తుంది..
నేల రాలిన పూలశబ్ధం
అదొక విలాపదృశ్యం అనుకుని నిర్వేదంలో
కూరుకుపోతే...
పూలవాన  పుడమితల్లి కాళ్ళు కడిగిన వింతైన 
అద్భుత హాయిరాగమే 
ఆశావహ దృక్పథం
ఆవహించిన మనసుతో ఆస్వాదిస్తే..
ఎన్నాళ్ళని అమావాస్యనే ఆలింగనం
చేసుకుంటాము వెన్నెలత్రోవ ఒకటుందని మనసు తలుపులు తెరుచుకు చూడాలిగానీ..
మన జీవితగమనాన్ని
వెచ్చని కన్నీటి ప్రవాహంలా
 కాదు.. ఆకుపచ్చని కావ్యంలా
లిఖించుకోవాలి..
రాలుతున్న ఆశల వెంబడి
 వూహల
రహదారిని  వేసుకుంటూ పోవాలి..
జీవితమంటే నిత్యపోరాటమే కాదు
ఉవ్వెత్తున ఎగసి పడే కెరటం కూడా..
సమస్యల అమ్ముల పొది లోనే
ఛేదించే అస్త్రాలూ వుంటాయి..
సాధించే ప్రతి విజయంలోనూ
వేధించి వేసారిన అనుభవమూ ఉంటుంది..
సంధించాలి ..అన్వేషణాస్త్రాన్ని
అనుసంధానం చేసుకోవాలి
నిర్దేశించుకొన్న లక్ష్యానికి..
నిన్ను నువ్వే తెలుసుకో  గలిగే సత్యానికి..
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

9, జూన్ 2021, బుధవారం

*తెరదించే వేకువ*

*తెరదించే వేకువ*

గ్రుక్కెడు కన్నీటి చుక్కలు
గుప్పెడు సంతోషపు రెక్కలు
కలగలిపే కథ నడిపిస్తుంటాయి
బ్రతుకు పుస్తకమంతా
బంగారు క్షణాలే కాదు
భంగపడ్డ ఘడియలూ
దిగాలుగా చూస్తుంటాయి
అన్నీ నెరవేరిన స్వప్నాలు
విరబూసిన వాసంతాలే కాదు
తీరని ఆశలు చేదైనవాస్తవాలు
తీరం చేరని కెరటాలల్లే
స్పృశిస్తూ వుంటాయి
ఆనందాలు హరివిల్లులే కాదు
అంచనాకందని దుఃఖప్రవాహాలు
తారసపడతాయి
తిరుగాడిన కాలం నిండా
అనుభూతుల తాయిలాలే కాదు
అనుభవాల గాయాలు
దర్శనమిస్తుంటాయి
నిజమే ఏదీ మునుపటిలా లేదు
జరుగుతున్నది విస్ఫోటనమే
విలపిస్తే శాంతిస్తుందా...
చీకటిచూరుకు వ్రేళ్ళాడుతుంది కాలం
కూకటి వేళ్లతో పెకలిస్తుంది
ఊపిరిచెట్టును ఉన్నపళంగా
క్షణాలు నిప్పుకణాలై
మండిపోతున్నాయి
ప్రాణాలు ఉరికొయ్యలపై
ఊగిసలాడుతున్నాయి
ఉగ్గబట్టుకో ఉబికి వస్తున్న
ఉద్వేగాన్ని,
ఎన్నో తెలవారని నిశిరాత్రుల
తెరదించే వేకువ ఒకటుంటుంది
నెరవేరని కలలన్నీ ఫలియించే
తరుణం ఉదయిస్తుంది...
వెన్నెల నావ అరుదెంచే లోపు
అంధకారమూ  అడ్డుతప్పుకొంటుంది
వేకువ తోవ అగుపించే మునుపే
నిశిరాతిరీ నిమ్మళంగా నిష్క్రమిస్తుంది
అప్పుడు ఆశల పారిజాతాలు
జలజలా రాలతాయి
అనుకోని అశనిపాతాలకు
అంతిమవాక్యం రాస్తూ..
*సాలిపల్లిమంగామణి @శ్రీమణి*

మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ... *శ్రీమణి*🙏🌹🌹🌹🌹🌹🙏

మీ అమూల్యమైన ఆశీస్సులు
 ఆకాంక్షిస్తూ... *శ్రీమణి*
🙏🌹🌹🌹🌹🌹🙏

27, మే 2021, గురువారం

జాబిలి..జవాబు

ఒక నిశిరాతిరి
నాలో ముసిరేసిన
తియతీయని భావాలను
దోసిలినింపి‌....వాటికి
కాసిన్ని అక్షరాలనద్ది‌,
జాబిలికి......
జాబురాసుకున్నా..
ఒకనాటి పున్నమిరేయి
వెన్నెల వాకిట్లో...
కవన పూలవాన
కురవాలని,
అది కాంచిన నామది
మకరందం చవిచూడాలని,
అడిగాననో...లేదో
నిదురించిన
నాకనురెప్పలపై
సుతిమెత్తని స్వప్నంలా
అరుదెంచాయి
అత్యద్భుత కావ్యాలేవో...
అందమైన నా ఊహకు
అచ్చమైన ప్రతిరూపంగా..
జాబిలి నాకిచ్చిన
జవాబు కాబోలు‌....
                  *శ్రీమణి*

26, మే 2021, బుధవారం

రాడట మరి దేవుడు*

*రాడట మరి దేవుడు*

నను నిద్దుర లేపకండి
పెను ఉదయం చూడలేను
నను మాట్లాడించకండి
మౌనముద్రలో వున్నాను
దేవుడు నే దిగి రాను
దేహి యనకు మానవుడా
తప్పులు లెక్కకు మించెను
తప్పనిసరి ఈ మూల్యం
భగవంతుడినే గానీ
పగబట్టిన కాలానికి
గాలమేసి  లాగలేను
విధి రాతను ఎదురిస్తూ
వీసమెత్తూ చేయలేను
ప్రపంచం క్షణక్షణానికి
పలచబడిపోతుంటే
మనిషి జీవనం మరణంఅంచుల్లో
కూలబడిపోతుంటే
ఉబుకుతున్న విషవాయువు


ఊపిరి నులిమేయాలని
ఉబలాటపడుతుంటే
వినువీధుల ప్రతిధ్వనించే
ఆ విషాదగీతం వినలేను
ఊపిరులాగిన ఉత్పాతంలో
ఉస్సూరంటూ నిలబడలేను
ఆగుతున్న గుండెచప్పుడు విని
గుంభనంగా ఉండనూలేను
నేనిచ్చిన శాపం కాదు
నేల రాలిన మీ జీవితాలు
నేనుద్ధరించగ వీలుకాని
వింతనాటకం మరి..
దేవుడనే దిగిరాను
మ్రింగుడుపడని సత్యమైనా
రంగంలో దిగాల్సింది
తక్షణమే మానవుడే..

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

25, మే 2021, మంగళవారం

అంశుమాలి

*అంశుమాలి*

స్పందించే మనసు తత్వమే
మహా కవిత్వం
సంధించే అక్షరాస్త్రమే
సమగ్ర సాహిత్యం
కవిత్వమంటేనే
ఉప్పొంగుతున్న భావసముద్రం
అనుభూతుల సారం
అనుభవాల సమాహారం
గుదిగుచ్చిన కవనసేద్యం
సమాజ ప్రక్షాళనలో
తిరుగులేనిది కవివైద్యం
మాన్యమైన మార్గనిర్దేశంలో
కవి పాత్రే ఆద్యం
కర్తవ్యం బోధిస్తూ
కార్యోన్ముఖులను చేస్తూ
కల కరవాలం ఝుళిపిస్తూ
కాలంతో కరచాలనమొనరిస్తూ
కదులుతున్న అక్షరసేద్యంతో
ప్రపంచాన పెల్లుబికిన
కల్మషాల,కిల్భిషాల
అఘమర్షణమొందించే
అంశుమాలి కవియన్నది
జగద్విదిత సత్యం.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

24, మే 2021, సోమవారం

*నిశి వేదన*

*నిశి వేదన*

చీకటి మ్రింగిన వెలుతురు దీపం
ఉప్పెనలోనే ఊపిరికెరటం
బడబానలమే బ్రతుకు సముద్రం
విషం చిమ్మిన కాలసర్పం
మరణచట్రంలో మనిషిప్రాణం
విషణ్ణవదనాలు ,విషాదసంకేతాలు
విచిత్రమైన  అనిశ్ఛితి,విపత్కర పరిస్థితి
మునుపెన్నడూ మనిషెరుగని
నిశ్శబ్ద ప్రఘాతం
ప్రభాతమెరుగని నిశిరాతిరి నిశ్శబ్దం
ముసురుకొస్తుంది మృత్యుకౌగిలి
విస్తుపోయిచూస్తుంది విశ్వమనేలోగిలి
తెరిపిలేని ఆవేదన సుడిగుండంలో
ఆవలతీరమనే ఆనందపు తెరచాపను అన్వేషిస్తూనే అలసిపోతుంది  కంటిపాప
నేనేం రాయాలి పగిలిపోతున్న
హృదయాలనా, రసిగారుతున్న గాయాలనా,రాలిపోతున్న జీవితాలనా,
రగిలిపోతున్న వైపరీత్యాలనా,
కలం ఎలా కదలించను
మనుగడ పునాదులే మరణశయ్యలై
తారసిల్లుతుంటే వేదన నిండిన హృదయంతో
ఏ అక్షరాలు వెదజల్లగలను కాలం కాగితంపై కన్నీటి సిరాతో ...
పరితపిస్తున్న ప్రపంచానికి
ఏ ఆశావహ కవనమాలికను బహూకరించగలను
నిశి వేదన కరిగించాలని
మిసిమిని కాస్త వేడుకోవడం తప్ప
మనస్థైర్యమనే మంత్రోచ్చారణలో
మా మనుషుల గుండెలను
బలోపేతం చేయుమని భగవంతుని
బ్రతిమాలుకోవడం తప్ప.

*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*

2, మే 2021, ఆదివారం

నవ్వు.. చిరునవ్వు

*నవ్వు..చిరునవ్వు*

కురిసిన సిరివెన్నెలలా...నవ్వు​
విరిసిన విరి తేనియలా.. నవ్వు
మెరిసిన మరుమల్లియలా..నవ్వు
తరిగిపోని సిరి నవ్వు
కరిగిపోని ఝరి నవ్వు
చీకట్లనుతరిమేసే....
వెలుతురు పువ్వు 
కలతలన్నీ కరిగించే
మంత్రదండమీనవ్వు
నవ్వితే రాలిపడాలి 
అలవోకగ నవరత్నాలు
గలాగలా ప్రవహించాలి
ఆ నవ్వులో వేవేలజలపాతాలు
పచ్చపచ్చనీ పైరల్లే
స్వచ్ఛంగా నవ్వు
మనసారా నవ్వి చూడు
తనువు మనసు తదేకమై
తన్మయమై విహంగమై
విహరించును తక్షణమే
వినీలగగనంపై
అందుకే నవ్వు
అమృతమంటిదీనవ్వు
మైమరచి పోయేట్టు
వెన్నెల దిగబోసినట్టు
వన్నెలొలకబోసినట్టు
కన్నులెదుట పూదోట
సాక్షాత్కరించేట్టు
నవ్వంటే ముఖంపై
అతికించినట్టు కాదు 
బతికించేటట్టుండాలి
ఎన్నిరోజులేడుస్తూ కాలం గడిపేస్తాం
కాసేపైనా గలాగలా నవ్వాలి కదా నేస్తం
ఏదో నవ్వేస్తే ఎందులకానవ్వు
పళ్ళికిలిస్తేనే నవ్వుకాదు
ఆ నవ్వులో కోటికాంతులు
వెల్లివిరియాలి
అందుకనే మనమంతా..
మది సాంతం మైమరచేలా...
మనసారా....నవ్వుదాం
తనువంతా పులకరించేలా‌....
తనివితీరా....నవ్వుదాం
అందుకే నవ్వేద్దాం
తీయతీయగా..
హాయి హాయిగా...
మళ్ళీ.... మళ్ళీ...
తుళ్ళీ....తుళ్ళీ..
(ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా)
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

1, మే 2021, శనివారం

మనసు మార్చుకో కాలమా..

*మనసు మార్చుకో కాలమా*

ఎప్పుడు పెనవేసుకుంటాయో
మునుపటి సంతోషపు లతలు
ఎప్పుడు శెలవు తీసుకుంటాయో
ఈ కాటేసే వెతలు
కనికరించకుంటాయా...
ఆ కారుణ్యపుమేఘాలు
అంతరించకుంటాయా
ఈ అంతులేనిఉపద్రవాలు
మనసన్నదే లేని మాయదారి కాలం
మౌనముద్రలోనేనా ఇక కలలుగన్న వాసంతం
ఊపిరికే ఉచ్చుబిగిస్తే
మా మనుగడ మరణం అంచుల్లోనే
మనసు మార్చుకో కాలమా...
మానవాళి ఆశలు త్రుంచి
మహదానందపడడం భావ్యమా..
మనుజుడన్నదే లేని
మరుభూమిని ఏలాలని
నీ సంకల్పమా..
గుండె సముద్రం ఘోషిస్తుంది
ఊపిరి అలలను కూడగట్టుకొని,
నా కలానికి ముచ్చెమటలు పోస్తున్నాయి
ఈ కాలం చేసే కర్కశ గాయాలను
రాయాలని ప్రయత్నించినపుడల్లా,
ప్రాణాలన్నీ ఉన్నపళంగా
అస్తమించిపోతుంటే
ఎన్ని కన్నీళ్ళనని అక్షరీకరికరించను
లక్షల కల్లోలాలకు సాక్షీభూతంగా..
మిగిలేవన్నీ అశ్రుధారలే
పగిలేవన్నీ మా ఆశల దుర్గాలే.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

28, ఏప్రిల్ 2021, బుధవారం

🙏🌷🌷🌷🌷🌷🌷🙏శ్రీ వంశీ రామరాజు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మూడు రోజుల ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవంలో పాల్గొని కవితా గానంచేసినందుకుగాను *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో నమోదైన ప్రశంసాపత్రంమరియు వంశీ గ్లోబల్ అవార్డ్ అందుకొన్న శుభతరుణం మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ.... *శ్రీమణి*🙏🌷🌷🌷🌷🌷🙏

🙏🌷🌷🌷🌷🌷🌷🙏
శ్రీ వంశీ రామరాజు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మూడు రోజుల 
ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవంలో
 పాల్గొని కవితా గానం
చేసినందుకుగాను *తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్* లో నమోదైన ప్రశంసాపత్రం
మరియు వంశీ గ్లోబల్ అవార్డ్ 
అందుకొన్న శుభతరుణం 
మీ అందరి ఆశీస్సులు ఆకాంక్షిస్తూ.... *శ్రీమణి*
🙏🌷🌷🌷🌷🌷🙏