పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

5, సెప్టెంబర్ 2015, శనివారం

రా రా కిట్టయ్యా ...


రా రా కిట్టయ్యా ... రతనాల కృష్ణా 
నవనీత  చోరా  .. నా బాల కృష్ణా 
నీపాదాల సిరి మువ్వ రవళితో
 నా ఇంట సిరులు కురిపించగా 
నీ కనుసైగ మాత్రమే మా సకల సౌభాగ్య రేఖ 
చల్లని నీ చూపే మాకు శ్రీ రామరక్ష 
తెల్లవారక మునుపే ముత్యాల ముగ్గులేసాను 
పాలబువ్వను వండి నీకై తలుపు తీశాను 
ముల్లోకములనేలు మురిపాల కృష్ణా 
మురిపించ రావయ్య ముంగిళ్ళలోకి 
అభిమానమంతా అటుకులు బెల్లంతో 
మూట గట్టి మువ్వ గోపాల నీకై వేచి చూస్తున్నాను 
బుడిబుడి తడబడు పసిడి అడుగులతో 
కిల కిల చిరునవ్వుల వెన్నెల మిలమిలతో 
గలగల  సిరి మువ్వలగజ్జెల  చిరు  సవ్వడితో,
తియతీ యని  మురళీ రవళితో 
వేంచేయవయ్యా  వన్నియల కృష్ణా 
భోంచేయి మా ఇంట విందు ఈ పూట 
అలసి ఉన్నా ప్రభూ... నిన్నటి నిద్దురలో నీతో ఆడిపాడి 
నిరీక్షించగ క్షణమైనా  నిలువజాలను నేను 
                         కృష్ణాష్టమి శుభాకాంక్షలతో                                                  సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

ఆచార్య శ్రీ నేమాని కృష్ణమూర్తి సహస్ర చంద్ర దర్శన మహోత్సవ వేడుకల సందర్భంగా ఆ మహనీయుని వర్ణిస్తూ నా కవనం ..ఏమని  పొగడగలము ఎల్లలు దాటిన శ్రీ నేమాని యశో తేజో విరాజ రాజసాన్ని,
ఎంతని  కొనియాడగలము.  ఆ అవిరళ కృషీవలుని,అలుపెరుగని ఋషీశ్వరుని,
అంబరాన్ని తాకిన ఆ  అభిజ్ఞుఁని   ప్రజ్ఞాప్రాభవాన్ని వర్ణించగ ప్రబంధమైనా సరిపడునా... 
ఆ అసమాన ఆచార్య సార్వభౌమునీ ,ఆ అభీకునీ 
సన్నుతించగ పదములున్నవా పృథ్వి పైన. 
ఆ రసాయన శాస్త్రవిదుఁనీ ,చిత్రకళా కోవిదునీ 
ప్రస్తుతించగ పదివేల మాటలు చాలునా.. .. 
ఆ మాన్యుని  కుంచె నుండి ప్రభవించిన నన్నయ, తిక్కన,ఎఱ్ఱన,శ్రీనాధ పోతనామాత్యుల  చిత్రాల అమృతత్వమేమని ప్రసంశించగలము. 
గీతోపదేశమంటి ఎనలేని అపూర్వ చిత్తరువుల మనోహరంగా మలచి ,  మన సంస్కృతీ సౌరభాన్ని దిగ్దిగంతాలా చాటిన ఆకళాభిజ్ఞుని కౌసల్యమెంతని అభివర్ణించగలము. 
మన నయనమ్ములు చేసుకొన్న సుకృతమ్ము గాక వేరు గాదు.  శిష్యకోటి కల్పతరువును, మేరువంటి గురువర్యుని  చేరువగ అభివీక్షించ,
నా కలానికొచ్చిన వైభోగం.ఆహిరణ్య కంకణ సుశోభితుని వర్ణించగ నా కవనమందు. 
సాక్షాత్తు శ్రీ కృష్ణుడు ,రుక్మిణీ దంపతుల అభిదేయమే మన కృష్ణమూర్తి రుక్మిణమ్మ దంపతుల నామధేయమగుట దైవ సంకల్పమే.. గదా 
అలనాడుద్వాపరయుగంలో  ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి  రుక్మిణీ దేవి  సపర్యలు చేసి తరిస్తే ,  నేడు ఈ  కృష్ణమూర్తి 
"నాతిచరామి" అన్న కళ్యాణ మంత్రాన్నివాస్తవంలో ఆచరిస్తూ రుక్మిణమ్మకి అన్నీ తానై   సేవలందిస్తున్న  ఆదర్శ విభుడు. 

మానవత్వం మూర్తీభవించిన మానవతామూర్తి అతడు . 
ఓ మనీషీ,
ఓ మహర్షీ ,
ఓ మహాత్మా,
ఓ మనోజ్ణమూర్తీ, 
ఓ మార్గదర్శీ, 
ఓ చిత్రకళా చక్రవర్తీ ,
ఓ అభినవ బృహస్పతీ.. 
ఆధర్శ దాంపత్య నిలువెత్తు నిదర్శనమైన  మా 
అభినవ  కృష్ణమూర్తి అయిన మీకు ,మీ సహధర్మచారిణి రుక్మిణమ్మకీ 
ఈ సహస్ర చంద్ర దర్శన మహోత్సవ వేళ పరిపూర్ణ ఆయుష్షునివ్వాలని ఆ పరమాత్మునికి సహస్రకోటి నమస్సులర్పిస్తూ ... 
మీపాదారవిందాలకివే మా అభివందన మందార సుమ మాలికలు . 
                                                                                                   
                                                సాలిపల్లి మంగామణి @శ్రీమణి