పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

20, ఆగస్టు 2018, సోమవారం

ప్రకృతి...ప్రకోపం

మహోగ్రరూపం,మహాగ్రరూపం
మహా ప్రతాపం,మహాప్రతాపం
మరుభూమిని తలపిస్తూ...
ప్రకృతి మ్రోగించిన
మరణమృదంగం .‌.‌‌.‌
మలయాళనేలపై మహాగంగమ్మ ప్రళయతాండవం‌
బ్రద్దలయిందేమో...
భళ్ళునఆకాశం....
వరుణుని భీకర ప్రకోపానికి....
చిగురుటాకులా ‌....
వణికిపోతున్న మలబారుతీరం
ఎక్కడ చూసిన....
ఉవ్వెత్తున పొంగి పొర్లుతున్న
వాగులు,వంకలు
కుప్పకూలుతున్న
నిలువెత్తు కట్టడాలు ...
కుప్పలుతెప్పలుగా
పడివున్న కళేబరాలు,
ఎల్లలు దాటిన కల్లోలం
అసువులు బాసిన
అమాయక జీవాలు
కొండ పెళ్లలు ఫెళ్లు,ఫెళ్లున
జారిపడగా...తల్లి ,బిడ్డా...
జాడకానక,తల్లడిల్లేతలోదిక్కై..
ప్రాణమరచేత పట్టుకు
కళ్ళనీళ్ళే కడుపునింపే
కటిక చీకటి పహారా..
మృత్యు కౌగిట మూగ అభ్యర్ధనలు,
గ్రుక్కెడు నీళ్ళు లేక
బిక్కు బిక్కు మంటూ...
దిక్కుతోచని అభాగ్యుల
ఆర్తనాదాలు, హాహాకారాలు
పెను విధ్వంసం,పెను విధ్వంసం
అనంతపద్మనాభుడే
ప్రత్యక్ష సాక్షీభూతం....
మానవతప్పిదమో.....
మనస్వయంకృతాపరాధమో...
ప్రకృతి పైమానవ వికృతచర్యకు పర్యవసానమో!
ఈ పరమ విలయ తాండవం.
ప్రకృతి సోయగాలకు
నెలవైన....కేరళ
వెలవెలబోయింది
ఆపన్నహస్తం కోసం
వేయికన్నులతో
ఎదురుతెన్నులు చూస్తుంది
చేయూతనిద్దామా...
మానవత్వం పరిమళించగ
మనవంతుసాయంచేద్దామా‌...              
                     *శ్రీమణి*

18, ఆగస్టు 2018, శనివారం

కదిలే...కాలమా..

కదిలే కాలం ఒక జీవనది
నిరంతరం ప్రవహిస్తూనే
వుంటుంది...
ఎన్ని కన్నీటిధారలు
తనలో కలిపేసుకుందో...
ఎన్నెన్ని గతచరిత్రలను
తనలో ఇముడ్చుకుందో...
అలుపెరుగని
తన పయనంలో...
అడుగడుగునా...
అంతులేని కధలెన్నున్నా...
కన్నీటమ్రగ్గుతున్న
వ్యధలెన్నున్నా....
అరక్షణమైనా...
ఆగి చూడదుగా...
సాగి పోవడమే....ఠీవీగా..
ఆనందాలైనా‌‌....
ఆక్రోశాలైనా...
సంతోషాలైనా...
సంతాపాలైనా...
జననమైనా...
మరణమైనా..
గమనం మాత్రం
ఆగదుగా...
కదిలిపోతూనే వుంటుంది..
కరిగిపోతూనే వుంటుంది...
చీకూ...చింతా...తనది..
కాదుగా...
చిట్టచివరి మజిలీ...
తనకు...లేదుగా...
ఒక్కొక్కసారి....
నిగ్గదీసి అడగాలనిపిస్తుంది
ఓకాలమా....
అసలు....ఎక్కడ‌..
నీచిరునామా.....?
నీ గమ్యం ఎటువైపు?
నీలక్ష్యం....ఏమిటని?

                   శ్రీమణి

16, ఆగస్టు 2018, గురువారం

15, ఆగస్టు 2018, బుధవారం

నేడెలే‌

నేడెలే‌...నేడెలే‌..నేడెలే‌...నేడెలే‌

భారతకుసుమం
వికసించెను నేడెలే
నవభారత గీతం
వినిపించెను నేడెలే
భరతావని సంకెళ్ళను
వీడెలే నేడెలే
భరతజాతి మైమరచి
ఆడెలే నేడెలే‌

నేడెలే‌...నేడెలే‌..నేడెలే‌...నేడెలే‌

భరతమాత గుండెల్లో
హరివిల్లు విరిసింది ......నేడెలే
మన బానిస బ్రతుకు ల్లో
మణిదీపం వెలిగిందీ......నేడెలే
ప్రతి గువ్వ,ప్రతిఅవ్వా
పరవశించి పాడినది......నేడెలే
నలుమూలల నాదేశం
మువ్వకట్టి ఆడినది......నేడెలే

నేడెలే‌...నేడెలే‌..నేడెలే‌...నేడెలే‌

బాపు,చాచా ఆశలు
ఫలియించెను....నేడెలే
నేతాజీ, రామరాజు
ఆత్మశాంతి ......నేడెలే
చీకటి రేఖలు చీల్చుకు
నవకిరణం మెరిసినది....నేడెలే
స్వతంత్ర భారతావని
సుప్రభాతమై ఉదయించెను‌...
నేడెలే

నేడెలే‌...నేడెలే‌..నేడెలే‌...నేడెలే‌

72వ స్వాతంత్ర్య దినోత్సవ
శుభాకాంక్షలతో .... (7వతరగతిలోనే రాసి,
స్కూల్లో పాడిపలువురి ప్రశంసలందుకొన్న
చిననాటి నాదేశభక్తి గేయం..)
                         *శ్రీమణి*

11, ఆగస్టు 2018, శనివారం

గోరింట

అరుణారుణ
కిరణంలా....
ఎర్రగా పండిన
నా అరచేతి
గోరింటనుచూసి
మూగబోయింది
మా పెరటి
ముద్దమందారం...
విరబూసిన
నా అరచేతినిగని,
వికసించిన సుమమనుకొని,
ఝుమ్మని తుమ్మెద
ఝంకారం... చేసింది.
తమజాబిలి‌...తరలివెళ్ళి
తరుణిఅరచేత
కొలువుదీరెనా...అని
తరచితరచి
చూసింది ఆకాశం
ఆశ్చర్యంగా....!
అతిశయమనుకోవద్దు
అందంగా పండింది
ఆషాఢమాసంలో
నా అరచేయి..
అమ్మ తన అనురాగాన్నంతా
రంగరించి పెట్టింది మరి
అద్భుతంగా పండదా...మరి...
అందగా ఉండదా...మరి...

                     *శ్రీమణి*

6, ఆగస్టు 2018, సోమవారం

ఎందుకయ్యా...శివా!

ఎందుకయ్యా...శివా!
   ఎంత పిలిచిన రావు
ఎందుకయ్యా....శివా!
  ఎంత తలచిన రావు
అమ్మైనా చెప్పలేద
    తల్లడిల్లుతున్నానని,
చెమ్మగిల్లిన కళ్ళను
  ఒక్కసారి తుడవాలని,
ఎందుకయ్యా...శివా....2

కన్న కలలు కన్నీరై
కరిగిపోతున్నాయి
కనులముందు కలతలే
కలవరపెడుతున్నాయి
పదేపదే వేడుకొంటే
కధలా...వింటున్నావా.‌..
కదలి వచ్చి, వ్యధను తీర్చ
ఒక్కసారి రాలేవా...
ఓదార్చి పోలేవా... " ఎం"

నీకోసం తపించీ
నీ సేవలో తరించాను
నిరతంరం నిను కొలిచీ
నను నేనే మరిచాను
పూజలెన్ని చేశానో
నోములెన్ని నోచానో
ఏమున్నా...లేకున్నా...
నేనున్నా ..నీకంటూ
ఒక్కసారి రాలేవా....
ఓదార్చి పోలేవా... " ఎం"