పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, జులై 2021, గురువారం

26, జులై 2021, సోమవారం

నువ్వు కాదూ..,

*నువ్వు కాదూ...*

నే నవ్వులు మరచిపోయినపుడు
పువ్వులు చూపించింది నువ్వుకాదూ..
నా చుట్టూ చీకటి కమ్మేసినపుడు
వెలుతురు జల్లింది నువ్వుకాదూ...
కాలం పడదోసిన ప్రతిసారీ
ఎగిసిన కెరటాన్ని జ్ఞాపకం తెచ్చింది నువ్వుకాదూ...
రాలుతున్న నా ఆశల వెంబడి
రహదారిని త్రవ్వింది నువ్వు కాదూ
మనసు విరిగినపుడల్లా
మనసెరిగి క్రొత్త రెక్కలు తగిలించి
ఎగరమంటూ ఊతమిచ్చింది
నువ్వుకాదూ...
నిబ్బరం కోల్పోయిన ప్రతిసారీ
జబ్బ చరిచి లేవమన్నది నువ్వుకాదూ
నేను  శిధిలమైన ప్రతిసారీ
నా ఉనికిని పదిలం చేస్తూ నన్ను
పునర్నిర్మించింది నువ్వుకాదూ
అంతెందుకూ నా గుండెగొంతుక
తడారిపోయినపుడు సంజీవనిలా
ఎదురొచ్చింది నువ్వుకాదూ...
కొడిగట్టబోతున్న నా ఊపిరిదీపానికి
చేతులడ్డుపెట్టింది నువ్వుకాదూ...
జీవితపు బండిచక్రాలు అగాథంలో
కూరుకుపోతుంటే చివరినిమిషంలో
చేయందించి చైతన్యపరచింది నువ్వుకాదూ...
పగలునూ,రాత్రినీ సృష్టించిన నీకు
పగులుతున్న హృదయాల ఘోష
పనిగట్టుకు చెప్పాలా..
కథ నడిపించే సూత్రధారికి
పాత్రల ఔచిత్యం పరిచయం చేయాలా..
గమనమొకటే నాది
గమ్యం మాత్రం నీవే
నే నడుస్తాను....
నువ్వు నడిపిస్తావు అంతే.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

19, జులై 2021, సోమవారం

*చైతన్యపు ఖడ్గాన్ని*

నిన్నరాత్రి  నిషిద్ధాక్షరాలు
రాలిపడ్డాయి నిశ్శబ్దపు పుటలనుండి
నాలో నిగూఢమైన చైతన్యపు నేత్రాలు
అహస్కరుని కిరణాల్లా
విస్తరించాయి విశ్వక్షేత్రంపై
నిజానికి నేనిప్పుడు 
నిరంతరాన్వేషిని
దూసుకుపోతున్నాను 
నిశిదుప్పటి దులిపేసి
నిజ ఉషస్సు కేసి
నేనిప్పుడు వేయాల్సింది
లక్ష్యపు క్షేత్రంలో లక్షలనాట్లు
నన్నో విజయగీతంగా 
మలచుకోవాలి...
ఎన్నో ఓటమి పర్వాలకు
పర్యవసానంగా..
గెలుపు గుమ్మం చేరుకోవాలి
నేనిప్పుడు నైరాశ్యపు
నిబిడాంధకారాన్ని చీల్చిన
చైతన్యపు ఖడ్గాన్ని
వేకువతట్టుకు వెలుగును పూసిన
తూరుపు సింధూరాన్ని
నిట్టూర్పులు, నీరుగారడాలు
నిన్నటి గతించిన క్షణానివి
వెనుకంజ వేయడాలు
వెక్కి, వెక్కి ఏడ్వడాలు
కాలంచెల్లిన వాక్యాలు
నే నడిచే గమనంలో నిరాశకు
తావివ్వను,నీరసాన్ని రానివ్వను
కన్నీటి కారకాలు సవాలక్ష  
కర్తవ్యప్రేరకాలను 
అన్వేషించడమేగా
మనిషిగా మన సార్ధకత
ఉప్పెనలోనే ఊపిరోసుకొంటాయి
ఉజ్వలమైన ఉపాయాలు
దిగులుమంత్రం ఉచ్ఛరిస్తూ 
నీరసిస్తే ఉద్ధరించే నాధుడెవ్వడు
వెతలే తాకని వేదన సోకని
బతుకుంటుందా ఇలాతలంలో
కంటకాలు అధిగమించక 
కామితాలు నెరవేరేనా
కణకణమండే నిప్పున కాలక
కనకము నిగ్గు తేలేనా
రహదారిని త్రవ్వుతున్నాను
రాలుతున్న ఆశల వెంబడి
నా ఆలోచనాస్త్రాలు
రవికాంతి కిరణాలై 
ఆశయానికి దారిచూపిస్తాయి.
నేనిప్పుడు నిలువెత్తు ఆత్మవిశ్వాసాన్ని
నేనిప్పుడు విజయపతాకాన్ని
విశ్వ వినువీధులవెంట 
విజయోత్సాహానికి ప్రతీకగా
విరాజిల్లుతున్నాను.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

17, జులై 2021, శనివారం

*మనుషుల్లా మారిపోయాం*

*మనుషుల్లా మారిపోయాం*

కరుడుగట్టిన మనసురాతిని చీల్చుకొంటూ మానవతావిత్తనమేదో అంకురించి మనిషిని మనీషిగా ఆవిష్కృతం చేసింది,
కదనం మొదలయ్యాక మనిషిమనిషిలో అంతర్మధనం మొదలయ్యింది,
మనిషితనం మొలకెత్తింది
మృత్యుకౌగిట నిలబడ్డాక,
పోగొట్టుకొన్నదేమిటో పోగుజేసుకొన్నదేమిటో తేటతెల్లమయ్యింది
కలికాలపు రోగం కబళించాక,
బందీఖానా మొదలయ్యాకే బంధాల విలువ తెలిసొచ్చింది ,
నాలుగు గోడల భోదివృక్షం తక్షణ కర్తవ్యం స్ఫురింపచేసింది,
స్వార్ధపు కబంధహస్తాలను పెకలించుకు
సాయంచేసే చేతులు విస్తారంగా ముందుకు వస్తున్నాయి,
మనుషుల మధ్యనే దూరం
మనసుల మధ్యన తరగని మమకారం
చేతులు మాత్రమే కలపము
చేయూతకు ముందుంటాము
మేమంతా మనుషుల్లా మారిపోయాం
మనసున్న మనుషుల్లా,
మా దేశం సౌభాగ్యం ఇక నిస్సంశయం
నా దేశానికి ఏమీ కాదు
ప్రతీ ఒక్కరూ మానవతావాదులే
ఎటు చూసినా సాయం చేసే చేతులే,
ఏ మాయరోగం మమ్మల్ని మట్టు
పట్టలేదు‌,
మానవాళి మనుగడ పునాదులిక కదలనే కదలవు,
అదిగో గెలుపురాగం, రేయిమాటున దాగివున్న ఉషోదయకిరణం ఉదయించే తరుణం అదిగో,

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

10, జులై 2021, శనివారం

అనలవేదిక

*అనలవేదిక*

ముడివడిన విశ్వం భృకుటి
ఇంకా విడివడలేదు
కాలం గుండెలపై మానని కత్తిగాటు
రసిగారుతూనే వుంది
వినువీధుల వెంబడి విషాదగీతం
ఇంకా ప్రవహిస్తూనే వుంది
యుద్ధం ఇంకా ముగిసిపోలేదు
క్షణాలు భారంగానే ఊపిరిపీల్చుకుంటున్నాయి
రణానికి సంసిద్ధమైన
ప్రాణాలు మౌనంగా మనుగడ సాగిస్తున్నాయి
ఏమరుపాటు ఘడియలుకోసం
కాబోలు కలికాలపు రక్కసి
కోరలు కాచుకు కావలి కాస్తుంది
తెరలు,తెరలుగా ముంచుకొస్తున్న
మృత్యునగారా కంటిమీద కునుకును
బలవంతంగా లాగేసుకుంది
దిక్కులన్నీ నిన్నటి పెను విధ్వంసానికి
నిలువెత్తు సాక్ష్యంగా ఇంకా దిగ్భ్రాంతిలోనే,
ఉచ్చు బిగించిన ఉత్పాతం
ఊరటనిచ్చిందనుకొంటే పొరపాటే
తిరుగాడిన కాలం ఇక
తిరిగిరాదు ఎప్పటికీ
మానవ మనుగడలో పెను మార్పు
మునుపటిలా వుండదు రేపు
ఈ మౌనం తెర వెనుక మహాసంగ్రామం
మాటువేసే వున్నట్టుంది
మనోవేదికపై మారణహోమం
అందమైన జీవిత ముఖచిత్రానికి
అమావాస్య చీకటి పూసిన
ఆ హంతకి అంతరించేవరకూ
అప్రమత్తతే మనకు శరణ్యం
లేకుంటే ఆభగవంతునికీ
వినబడదేమో మన అరణ్యరోదన
అనలవేదికయై ఆక్రోశించు
అవని ఆనందసమీరమై
అలరారాలన్నా..
ఎడారికెండిన మానవాళిగుండెలో
వసంతం కదలాడాలన్నా
అప్రమత్తతే మనకు రక్షణ
మానవాళి పరిరక్షణ
ముమ్మాటికీ మనచేతుల్లోనే .. *శ్రీమణి*

8, జులై 2021, గురువారం

నేనొక విజయ గీతం రాసుకోవాలి*

*నేనొక విజయ గీతం రాసుకోవాలి*

కాలమా... 
నేను ఏడవడం లేదు
కాసింత కళ్ళు చెమ్మగిల్లుతున్నాయంతే
ఇదిగో ఇప్పుడే చీకటిని తుడిచేసి
వెలుతురు ముగ్గేస్తున్నా
శూన్యాన్ని కాల్చేసి
వెలుగులు పూయిస్తున్నా
కలికాలం పాత్రలో కలుషితమైన
కన్నీటిని ఒంపేసి
కాసిన్ని నవ్వులు నింపేస్తున్నా
పుస్తకంలో నాకొక పేజీ కావాలి
నేనొక విజయగీతం రాసుకోవాలి
మసలుతున్న రోజులన్నీ
మనోహరకావ్యంలా 
మలచుకోవాలని వుంది
పోగేసుకున్న నాలుగు అక్షరాలను
కలబోసి నాలుగుతరాలకు 
అందించాలి
విధి లాగేసుకున్న నాదైన క్షణాలకు
లక్షణంగా అక్షరరూపం ఇవ్వాలి
నా హృదయం చవిచూసిన
అనుభూతుల తాయిలాలను
అంతే భద్రంగా పదిలపరచుకోవాలి
పోగొట్టుకున్నదేమిటో...
పోగేసుకొన్నదేమిటో చక్కగా
లెక్క రాసుకోవాలి
నే చూసిన ఈ సమాజాన్ని
రేపటికై చిత్రించాలి
నే సంచరించిన
కాలగమనంలో నే సేకరించిన
అనుభవసారాన్ని ఆమూలాగ్రమూ
ఆ పేజీలో పొందుపరచుకోవాలి
ఆ చరిత్రకు పయనమయ్యేలోపు
ఈ ధరిత్రికి దూరమయ్యే లోపు,
అందుకే ఆపుస్తకంలో
నాకొక పేజీ కావాలి.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

2, జులై 2021, శుక్రవారం