పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

30, జూన్ 2015, మంగళవారం

ప్రేమిక
నీ ధ్యాసే  నా శ్వాస గా 
నీ ఎద సవ్వడి  నా హృది స్పందన గా 
వరమీయవా ప్రియా  నిను జత చేరగా ,నీ సన్నిధి చేరగా 
పరవశమీయవా  నా పరువాల మిసమిసలో  అనురాగ పదనిసవై 
కనుల మాటునా ,కనురెప్ప చాటునా ,నీ మోము కదలనంటుంటే,
ముగ్ధనయి నిలిచా ..అల  స్వప్నాల ఝరిలో ,ఇల వలపుల వనంలో 
నా నవ్వుల్లో విరబూసిన మరువంపు మొలక నీవు .
నువ్వు మసలిన దారుల్లో  పారిజాత సుమ వీచిక నేను
నా అధరం పై కదలాడే మధురమయిన నీ స్మరణతో 
మాటరాని మూగనయ్యా మరో పదం పలకలేక 
నా తనువున ,నా హృది అణువణువున కలగలిసిన వేణువు నీవయితే 
నీ ప్రణయ బృందావనమున విహరించే నీ ప్రేమిక  నేగానా .
ఈ ప్రేమలేఖ వ్రాస్తున్నా!ఒక క్షణమూ మనలేక 
నీ ఎడబాటు ఓర్వలేక ,నిరీక్షించలేక ,
అరుదెంచలేవా , అరుదయిన నీరాక  కానుక నీవా  
నవ మన్మధాకార ,నవనీతచోరా నీ రాకకై  వేచియున్న నీ రాధిక కోసం . 
(ఆ నంద గోపాలుని జతగానిగా  తలచి పరవశిస్తూ ... )
                                                                                      సాలిపల్లి మంగామణి @శ్రీమణి 29, జూన్ 2015, సోమవారం

సౌందర్యలహరి ఆణిముత్యాల మిసమిసలు   అలివేణి ధరహసమై జాలువారెనోమో
కలకంటి కంటికి కాటుక గా దిద్దినదేమో చిమ్మ  చీకటి .  
లలితాంగి  ముంగురులై  మురిపించెనేమో ఆ నీలి మేఘం . 
కొలనుల్లో కమలాలు   విరిసి మెరిసెనేమో ఆ కమలాక్షి కన్నులై  
ఎలకోయిల ఎదురై తన గాత్రం అరువిచ్చెనేమో ఈ చక్కెరబోణికి 
విరిబోణి  మేను కి మెరుపులద్దేనేమో ఆ గగనపు నక్షత్రం 
రాయంచ సొగసునంత  ఈ  అంచయాన  సొగసుల్లో  ఒలకబొసేనేమో 
నెలరేడు ఎన్నియల జల్లు కురిపించెనేమో నీ మోము సౌందర్య మతిశయించంగ 
                                                                                  సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

27, జూన్ 2015, శనివారం

ఆలోచించండి ?గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తేలుతున్న మరమ్మత్తు చేయలేని మరబొమ్మల్లాంటి మందుబాబుల మద్యపాన వ్యసనాని కి  ,ఆమోద శాసనంతో బలం చేకూర్చి ,,
 జీవితాలను నిర్దాక్షిణ్యంగా ఏమార్చి ,
సగటు మనిషి బలహీనతనే ధన బలంగా  మార్చి,
సందుకొకటి ,వీధికొకటి ,ఊరికి నడిబోడ్డుల్లో ,
నిత్యావసర సరుకుల్లాపెచ్చు రేగి  విచ్చలవిడి పర్మిట్లను అందిస్తే ,  
ఆడపడచుల పుస్తెలు  ముక్కలు గావించే  ,  మద్యపు భాండాగారం  కనుసన్నల అడుగడుగున   అగుపిస్తే ,  అంధకారమయిపోదా ...   మద్య తరగతి జీవనగమనం .విచ్చిన్నమయి పోదా !భావి యువత భవితవ్యం .
ఆలోచించండి . అరనిమిషం పాటైనా .,... .. ఆదమరచకండి సమాజ సౌభాగ్యాన్ని ., ... 
                                                                                   సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

25, జూన్ 2015, గురువారం

ప్రేమో ,ఏమో ... ?
ప్రతి  క్షణం  
హృదయపు దొంతరలో 
ఏదో వింత వింత
నులి వెచ్చని అనుభూతులు   ., ,
ఆ గగనమే  సరిహద్దుగా కట్టలు త్రెంచుకొన్న ప్రేమోద్వేగంతో 
మది అంతా మమేకమై ప్రణయ వాహినీ ఝరిలో  ఒక పగలు ,ఒక రేయి ,ప్రతి  నిమిషం ,
భారంగా ,ఆకలికి తావు లేక ,దప్పికంటే అనుభవానికి రాక ,అరనిమిషంపాటైనా అడుగులు ఒక చోట నిలువక ,
నిదుర స్తానాన్ని ,ఎదురుచూపు భర్తీ చేసి ,నిరీక్షణ లో నిర్దాక్షిణ్యంగా తెల్లారిపోతుంటే ,తెల్లబోయి చూస్తూ .. 
కదులుతున్న కఠినమైన కాలాన్ని . 
చినుకు రాలినా ,చిగురు తొడిగినా ,
ఏ కువకువ సవ్వడి విన్నా తన రాకని భ్రమించి ,పరిభ్రమిస్తూ  ..  
ప్రణయ నగరి చుట్టూరా ...
నిప్పులు చెరిగే సూరీడైనా ,
వెన్నెల పంచే నెలరాజైనా 
తన తలపులోనే తలమునకలవుతూ  ,
ఒకేలా అగుపిస్తుంటే , చెదరని నగుమోమే కన్నుల వాకిల్లో విరిసిన ముగ్గల్లే తారసపడుతుంటే 
వద్దన్నా వినకుండా ముసిరే తీయని ఊహలతో మది  సతమతమవుతుంటే 
నిలకడ లేని అడుగుల.తడబడి తత్తరపడుతుంటే ,.. కనులముందు ప్రపంచమంతా ప్రణయ నందనవనమల్లె మైమరపిస్తుంటే ,
అది ప్రేమో ,ఏమో .. కాదుకాదు ప్రేమే నేమో .... (ప్రతీ హృదయం ఈ అనుభూతిని ఏదో ఒక తరుణం అనుభవించే ఉంటుంది కదా .. )
                                                                                            సాలిపల్లి మంగామణి @శ్రీమణి