పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

31, జులై 2014, గురువారం

నేనే రాధనోయి

          

నీలిమేఘాల వరుసల్లోకూడా  నీ సరసనే నా ధ్యాస 
నీ  తేనె రాగాల మురళీ  పదనిసలో నిలువెల్ల  నా శ్వాస 
నీ నీడ జాడల్లోవడివడిగా  అడుగులు వేసా  
అరఘడియా మనలేక నీ ఎడబాటులో అలసి సొలిసా 
 కలువల రేడుని వేడుకొంటి నీ  చెలియ  గోడు ఆలకించమని 
ప్రతి రేయిలో   పున్నమి ఎన్నియలు  విరజిమ్మమని 
చామంతి ,సంపెంగలతో మంతనాలు చేశా
నువ్వు నడిచే దారుల్లో విరబూయమని 
కిన్నెరసానిపై   కన్నెర్ర చేశా  వన్నెలసోయగంతో 
నన్ను మీరి నిను మురిపించొద్దని , మైమరపించొద్దని 
అది హాయో మాయో తెలియని అయోమయంలో
అల్లాడిపోతున్నా నీకై.    తల్లడిల్లి పోతున్నా నీ లాలనకై 
నీ  అనురాగంలో నను నేనే మరిచిపోవాలని
 నీ ప్రేమఝరిలో ముగ్ధనై మురిసిపోవాలని 
నీ సమ్మోహన రూపం నిరతం నా కనుపాపలలోనే కదలాడాలని 
నా మది దోచిన మురళీ మోహనా ..   నీ  మనసును  నాకే కానుకనీవా 
నాఇరు  కనుపాపల్లో  చిరు దివ్వె వెలిగించి  నీకోసం  నిరీక్షిస్తున్నా .... 
నీ రాక కోసం నిశిరాతిరిలోనూ నిదురమరచి నిలుచున్నా... 
రారా కృష్ణా ! 
మన ప్రణయ రససామ్రాజ్యం లో  నా  హృదయ పీటమేసాను 
కినుక వహించక   నీ అలివేణి పై 
సందేహము వలదు కృష్ణా నేనే నీ రాధను  

12, జులై 2014, శనివారం

గురు చరణం
కరువాయెను కవితకు ఆదరణ  అని ,
బరువెక్కిన హృదయంతో ,ఎరుపెక్కిన వదనంతో,
వెనుదిరిగిన తరుణంలో ,
గురువాయెను నండూరివారు ,దిశానిర్దేశం చేయ మార్గదర్శియై !
కన్న తల్లి పాలు , తండ్రి మురిపాలు పసిబిడ్డకు జీవం పోస్తే ,
గురువు ఆశీస్సులే   చాలు  
కలం పట్టిన కవి కావ్యం పండడానికి 
అల్లిబిల్లి అక్షరాలూ కవితా సుమాలై విరబూయాలన్నా  ,
హిమశిఖరపు అంచులంత నీవు ఎదిగిపోయినా  ,
ఒదిగిపో ... నీ గురు పాదాల చెంత 
నా కవితా రధానికి సారధి అయిన నండూరి వారికి ,
పండూరు చెరువు గట్టు వారి వినమ్రతా పూర్వక పాదాభివందనాలు తో 

                                                            సాలిపల్లి మంగామణి @ శ్రీమణి 

8, జులై 2014, మంగళవారం
మా పెరటి సుమాలతో  
                                 
నా కవితా  కుసుమాలు ... 
                                                      
          సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 

4, జులై 2014, శుక్రవారం

అల్లూరి సీతా రామ రాజు


మరువగలమా మహోన్నతుడా . 
మాతృభూమి శ్రుంఖలాలు తెగదెంచ నెంచి 
ఉడుకు నెత్తురు ఉప్పెనవగా ...  రుద్ర  నారసింహుడవై 
తుచ్చమైన తెల్ల కుక్కల పాలిట సింహ స్వప్నo  నీవై 

బడుగు బ్రతుకుల వెలుగు నింపి ,గిరి పుత్రుల వెతలు కడిగిన  మన్యవీరుడా
 మానవ కుల మాన్య  ధీరుడా 
ఓ తెలుగు వీరుడా .. చైతన్య ధీరుడా .. స్వరాజ్య సమర యోధుడా .. 
ఉద్యమానికి ఊపిరులూది వందేమాతరమన్న నినాదాన్ని ఎలుగెత్తి చాటిన విప్లవ స్పూర్తి 
కొన ఊపిరి వరకు స్వరాజ్య పోరాటాన్నే నీ శ్వాస గా  తలచి చరితార్దుడా 
 మర ఫిరంగులు వర్షంలో మృత్యువుకే దడ పుట్టిస్తూ 
గుండెను చీల్చి తుపాకీకి ఎదురొడ్డి  తెల్ల వారి గుండెల్లో గుభుళ్ళు పుట్టించిన 
తెలుగు బిడ్డల ఆత్మగౌరవాన్ని ఎల్లలు దాటి చాటి చెప్పిన చైతన్య స్ఫూర్తి
అమర జ్యోతివై నిలిచినావు  ఈ భరత జాతి ఉన్నంత వరకు 
ప్రతి తెలుగు బిడ్డ గుండెల్లో ఆత్మగౌరవానివై  చిరంజీవి గా వర్దిల్లుతున్నావు 
             
అల్లూరి సీతారామరాజు  జయంతి సందర్భంగా 
                                                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

3, జులై 2014, గురువారం

"కల "వరం


అమ్మ గర్భం నుండి వస్తూనే అవాక్కయ్యా... 
 నాన్న చేతిలో  ఆసుపత్రి బిల్లు చూసి 
ఆకలి ఆమడ దూరం పరుగెట్టింది 
 అవసరాల ధర  ఆకాశంలో చూసి ... 
ఖర్చు లేదుకదా .. కమ్మని  కల కందామంటే 
కరెంటు బిల్లే కల్లోకొచ్చి కలవర పెడ్తుంది 
నిజమే కదా .. 
సగటు మనిషి నేటి సమాజంలో పడ్తున్న పాట్లు 
కళ్ళు  మూస్తే
 తీపి జ్ఞాపకాల,కటిక చేదు వర్తమానాల ,
 అర్ధరహితంగా అగుపిస్తోన్న భవిష్య దర్పణాల మేళవింపుతో తల బ్రద్దలవుతుంటే ...  నిద్దరెలా వస్తుంది 
 వెన్నెల పట్టపగల్లా ఉన్నా.. 
 పట్టపగ్గాల్లేని ఆలోచనలతో పట్టపగలే  చుక్కలు చూపిస్తుంటే ... 
అదేంటో  చిన్నప్పుడు ఎంతో అందంగా భావుకత్వం పొంగివచ్చే ఆనవాళ్ళన్నీ ఈ నాడు అగమ్య గోచరంగా అగుపిస్తున్నాయి . 
అమ్మ చిన్నప్పుడు  ఆకాశంలో చందమామను చూపిస్తే అబ్బురమేసేది . 
కానీ ఇప్పుడు ఆకాశంలో చూడాలంటే ఆకాశానికెక్కిన ధరలే దడ పుట్టిస్తున్నాయి . భావుకత్వం మాట దేవుడెరుగు.  బావురుమనకుంటే చాలు 
ఒకటో తారీఖు వస్తుంటేనే వెన్నులోంచి వణుకు పుడుతోంది 
ఒకప్పుడు కరెంటు ముట్టుకొంటేనే షాక్ 
కానీ  ఈరోజు ఏది ముట్టుకొన్నా షాకే షాకు 
నిత్యావసరాలు నిచ్చె నలెక్కి కూచుంటే 
పాలధరలు  పాలుపోక చూస్తున్నాయి 
కాయగూరల ధరలు మనల్నే నమిలేసేట్టు చూస్తుంటే 
బ్రతుకు పరుగుల పందెంలో పరుగులు తీయటమే తప్ప ,
జీవిత మాధుర్యం,ప్రేమానురాగాలు తావెక్కడుంది . 
భార్య కళ్ళలోకి చూస్తే  ఏదో తెలియని అనుభూతి అంటారు . 
కానీ నేటి మద్యతరగతి భర్త కి భార్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలంటే 
కన్నీరు అడ్డు వస్తుంది . తన కనీస అవసరాలు కూడా తీర్చలేక 
ఆనాడు పిల్లల్ని ఎంతమందిని కందామనే ఆలోచనే అద్భుతంగా ఉంటే 
ఇప్పుడు కన్నా ఒక్క బిడ్డ చదువుకీ కట్టుకొన్న ఇల్లు అమ్మినా అప్పు వెక్కిరిస్తోంది 
అసలు  మద్యతరగతి మానవుడికి మధురోహలు ఉండకూడదేమో !
చిన్నప్పుడు ఎలాగైనా విమానం ఎక్కితీరతానని మారాం చేసాం 
నేడు వేడెక్కిన బుర్ర మాత్రం విమానం మోతెక్కుతోంది 
భార్య కూరల్లో పోపు మానేసినా ... 
భర్త స్నానంలో సోపు మానేసినా .. 
జీవితాన్ని ఈడ్చుకొస్తామన్న హోపు మాత్రం లేదు 
బ్రతకడానికి స్కోపు చాలా తక్కువగానే ఉంది 
నిత్యం జారే కన్నీళ్ళే  .. టీనీళ్లై నా బావుండు టీ ఖర్చు తప్పేది 
కడుపుమంటే కడుపు నింపుతుంటే 
అరిగిన మోకాలి చిప్పలు కిర్రుమంటూ జోల పాడితే 
రెప్ప పడక కన్నులు  లభో దిభో మంటుంటే నిద్దరేలా వస్తుంది 
అమ్మో !ఒకటో తారీఖు అంటూ హడలెత్తి కన్నులు పత్తికాయల్లా విచ్చుకొంటే 
వచ్చే నాలుగు డబ్బులు నాలుగు వైపులా పంచలేక 
నగుపాటు పాలవుతుంటే ,తెల్లారితే అప్పులవాళ్ళ మేలుకోలుపుతో ఠారెత్తి పోతుంటే .చేసేదేముంది తెల్లారకూడదని తెల్లమొహం వేయడం తప్ప . 
మతి లేక తప్పు చేసిన వాడికంటే , గతి లేక అప్పు  చేసిన మాకే పెద్ద శిక్ష .  
ఎలా ఎలా బ్రతకాలి అని  ప్రశ్నించుకు పోతుంటే 
సమాధానం నేటి ప్రభుత్వాల తీరా !
లేదంటే మా తల రాతే  వేరా !
నిద్దరెలా వస్తుంది నిండా మునిగిన మా బ్రతుకులకని 
అనుకొంటూ నిద్దురకుపక్రమిస్తూ 
కల అయినా వస్తే బావుణ్ణు .  కడుపునిండా తిన్నామని 
కంటి నిండా నిద్రపోయామని , గుండెలపై చేయి వేసుకొని 
మేము ఈ సమాజంలో బ్రతక గల్గుతున్నామని 
కలైనా వస్తే బావుణ్ణు 
"కల"వరమై వస్తే బావుణ్ణు" కలవరం" తగ్గడానికి  
అనుకొంటూ నిర్లిప్తంగా వేడుకొంటూ 
రాని నిద్రకై పరితపిస్తూ కఠినమైన రాత్రిని వదిలి 
రేపటి అరుణోదయ కరుణాకిరణం కోసం వేచి చూస్తుండడం
 నిత్య క్రుత్యమయిపోయే  , ఈ కలచి వేసే మధ్యతరగతి బ్రతుకులపై 
ఏ ప్రభుత్వపు కరుణా కటాక్షమవుతుందో ...  సందేహమే  ?????????

                                                        సాలిపల్లిమంగా మణి @శ్రీమణి 
2, జులై 2014, బుధవారం

'పైసా'చిక ప్రపంచం


ఎందుకు వృధా ప్రయాస , అన్నిటికీ  హేతువు పైసా !
పరుగులు తీసే బ్రతుకు రధానికి పైసయే కదా పరమపదం .
మానవాళి మస్తిష్కంలో నిత్యం మసులుతున్న పైసా భూతం .
ప్రతీ  మనిషీ జీవనగమనం పైసా చుట్టూ పరిభ్రమణం .
ప్రతి నిమిషం పైసా కోసం యోచన ,
ప్రతి క్షణం పైసా కోసం యాచన ,
ప్రతి ఘడియ పైసా కోసమే వంచన .
పైసాకి పైశాచిక ఆనందం పాశాలను తెంచాలని .
పైసా ప్రయత్నం ప్రతి మనిషి తనకి దాసోహం కావాలనే .
బిచ్చగాడి సత్తు గిన్నెలో చతికిలపడినా....
చలువరాతి గదుల్లో మూలుగుతున్నా...
పైసా పైసాయే, పైసాది ఎప్పుడూ పైచేయే .
యధార్దానికి బుద్ధికి స్వార్ధం నేర్పింది పైసా .
మానవత్వానికి మరకలంటించిందీ   పైసానే .
కడు బీద కనీళ్ళ సెలఏరులైపారి  ఉన్నోళ్ళ  పన్నీటిజల్లుగా కురిసి
తన ఉనికి పదిలపరుచుకుంటుంది పైసా
బ్రతుకు రసాబాస చేసినా బంగరు  రాచ బాట వేసినా ,
పట్టు పానుపు పరిచినా ,
ప్రాణం నిలువునా హరించినా ,
మాన్యతతో మన స్థాయిని  అత్యున్నత పరిచినా,
హీనతతో అధఃపాతాళానికి విసిరి పారేసినా ,
అన్నిటిని నడిపించే సూత్రధారి పైసా, పాత్రధారి పైసా.
వాస్తవానికి మనిషేప్పుడూ మహనీయుడే ,
తన సన్నిధిలో మనిషిని మరమనిషిని చేసి ,
మరో మనిషిలా మార్పు చేసిందీ పైసానే.

అందులకే ఓ మనిషీ... పైసాతో తస్మాత్ జాగ్రత్త 
పైసా ని  దైవంలా  బావించు ... బానిసవైతే కావద్దు 
నిండు నూరేళ్ళ జీవితంలో పచ్చనోటు కోసం పచ్చదనాన్ని కోల్పోవద్దు 
                                      
                                                   సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

1, జులై 2014, మంగళవారం

పల్లవించే ప్రణయ రాగం


ఏ మరులు దాచావు ఆ నవ్వులో 
ఏ విరులు కూర్చావు నీ పదములో 
ఏ సిరిచందనాల పరిమళాల మునిగి తేలినావు నీవు 
ఆ  మదనుని విల్లువి నీవో , ఆ సురులు సేవించిన సుధాజల్లువో 
కలవో , కల్పనవో , కమ్మని కావ్యానివో 
కటిక చీకటిపై కుమ్మరించిన వెన్నెల జడివో 
ఏం మాయ చేశావో , ఏ మత్తు జల్లావో 
ప్రకృతితో మమేకమై ప్రతి అణువును,ప్రణయరాగమాలికలో ఊయలలూగించావు 
నిజమే నిరంతరం నీ సాంగత్యం కోరుతోంది ఆ నీలి గగనం కూడా 
రా రమ్మని  రాచిలకే రమ్మంటోంది . ఆ కొమ్మల మాటున నక్కి 
ఏరికోరి కొండమల్లె  నీ మీదే మనసు పారేసుకుంది 
మండుటెండలో కూడా మైమరచే పాడుతోంది గండు కోయిల 
నిను చూసి . అది వాసంత సమీరమని తలచి . 
అంతెందుకు  నీ జతకై 
విహంగమై విహరిస్తూ పదే పదే పరితపించె నా మది 
పల్లవించే ప్రతీ క్షణం ప్రణయవాహినీ లా 
నీకై కలవరించే నా హృదయానికి నీ హృదయంతో  సేద తీర్చు 
ప్రకృతి సైతం పరవశించి మురిసేలా.... 
   
                   సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి