ఏ మరులు దాచావు ఆ నవ్వులో
ఏ విరులు కూర్చావు నీ పదములో
ఏ సిరిచందనాల పరిమళాల మునిగి తేలినావు నీవు
ఆ మదనుని విల్లువి నీవో , ఆ సురులు సేవించిన సుధాజల్లువో
కటిక చీకటిపై కుమ్మరించిన వెన్నెల జడివో
ఏం మాయ చేశావో , ఏ మత్తు జల్లావో
ప్రకృతితో మమేకమై ప్రతి అణువును,ప్రణయరాగమాలికలో ఊయలలూగించావు
నిజమే నిరంతరం నీ సాంగత్యం కోరుతోంది ఆ నీలి గగనం కూడా
రా రమ్మని రాచిలకే రమ్మంటోంది . ఆ కొమ్మల మాటున నక్కి
ఏరికోరి కొండమల్లె నీ మీదే మనసు పారేసుకుంది
మండుటెండలో కూడా మైమరచే పాడుతోంది గండు కోయిల
నిను చూసి . అది వాసంత సమీరమని తలచి .
అంతెందుకు నీ జతకై
విహంగమై విహరిస్తూ పదే పదే పరితపించె నా మది
పల్లవించే ప్రతీ క్షణం ప్రణయవాహినీ లా
నీకై కలవరించే నా హృదయానికి నీ హృదయంతో సేద తీర్చు
ప్రకృతి సైతం పరవశించి మురిసేలా....
సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి