ఎందుకు వృధా ప్రయాస , అన్నిటికీ హేతువు పైసా !
పరుగులు తీసే బ్రతుకు రధానికి పైసయే కదా పరమపదం .
మానవాళి మస్తిష్కంలో నిత్యం మసులుతున్న పైసా భూతం .
ప్రతీ మనిషీ జీవనగమనం
పైసా చుట్టూ పరిభ్రమణం .
ప్రతి నిమిషం పైసా కోసం యోచన ,
ప్రతి క్షణం పైసా కోసం యాచన ,
ప్రతి ఘడియ పైసా కోసమే వంచన .
పైసాకి పైశాచిక ఆనందం పాశాలను తెంచాలని .
పైసా ప్రయత్నం ప్రతి మనిషి తనకి దాసోహం కావాలనే .
బిచ్చగాడి సత్తు గిన్నెలో చతికిలపడినా....
చలువరాతి గదుల్లో మూలుగుతున్నా...
పైసా పైసాయే, పైసాది ఎప్పుడూ పైచేయే .
యధార్దానికి బుద్ధికి స్వార్ధం నేర్పింది పైసా .
మానవత్వానికి మరకలంటించిందీ పైసానే .
కడు బీద కనీళ్ళ సెలఏరులైపారి ఉన్నోళ్ళ
పన్నీటిజల్లుగా కురిసి
తన ఉనికి పదిలపరుచుకుంటుంది పైసా
బ్రతుకు రసాబాస చేసినా బంగరు రాచ బాట వేసినా ,
పట్టు పానుపు పరిచినా ,
ప్రాణం నిలువునా హరించినా ,
మాన్యతతో మన స్థాయిని
అత్యున్నత పరిచినా,
హీనతతో అధఃపాతాళానికి విసిరి పారేసినా ,
అన్నిటిని నడిపించే సూత్రధారి పైసా, పాత్రధారి పైసా.
వాస్తవానికి మనిషేప్పుడూ మహనీయుడే ,
తన సన్నిధిలో మనిషిని మరమనిషిని చేసి ,
మరో మనిషిలా మార్పు చేసిందీ పైసానే.
అందులకే ఓ మనిషీ... పైసాతో తస్మాత్ జాగ్రత్త
పైసా ని దైవంలా బావించు ... బానిసవైతే కావద్దు
నిండు నూరేళ్ళ జీవితంలో పచ్చనోటు కోసం పచ్చదనాన్ని కోల్పోవద్దు
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి