పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

నేను తీసిన చిత్రం

నిశిరాతిరిలో శశిరాల్చిన 
వెన్నెల తునకలు కాబోలు
ఈ అరవిరిసిన రజనీగంధపుపూలు, 
మిసిమిని ఒడిసిపడుతూ..
ఏమా.. ఒసపరితనం
అద్వితీయం కదా...
ఆ కుసుమ విలాసం.
ప్రకృతికి ప్రణమిల్లుతూ..*శ్రీమణి*

28, ఏప్రిల్ 2022, గురువారం

*నే దిగి రాను*

*నే దిగిరాను*

నను నిద్దుర లేపకండి
పెను ఉదయం చూడలేను
నను మాట్లాడించకండి
మౌనముద్రలో వున్నాను
దేవుడు నే దిగి రాను
దేహి యనకు మానవుడా
తప్పులు లెక్కకు మించెను
తప్పనిసరి ఈ మూల్యం
భగవంతుడినే గానీ
పగబట్టిన కాలానికి
గాలమేసి  లాగలేను
విధి రాతను ఎదురిస్తూ
వీసమెత్తూ చేయలేను
ప్రపంచం క్షణక్షణానికి
పలచబడిపోతుంటే
మనిషి జీవనం మరణంఅంచుల్లో
కూలబడిపోతుంటే
ఉబుకుతున్న విషవాయువు
ఊపిరి నులిమేయాలని
ఉబలాటపడుతుంటే
వినువీధుల ప్రతిధ్వనించే
ఆ విషాదగీతం వినలేను
ఊపిరులాగిన ఉత్పాతంలో
ఉస్సూరంటూ నిలబడలేను
ఆగుతున్న గుండెచప్పుడు విని
గుంభనంగా ఉండనూలేను
నేనిచ్చిన శాపం కాదు
నేల రాలిన మీ జీవితాలు
నేనుద్ధరించగ వీలుకాని
వింతనాటకం మరి..
దేవుడనే దిగిరాను
మ్రింగుడుపడని సత్యమైనా
రంగంలో దిగాల్సింది 
తక్షణమే మానవుడే..

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

27, ఏప్రిల్ 2022, బుధవారం

తానా వారి సత్కారం

భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల సందర్భంగా *ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)* ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడిన అత్యంత ప్రతీష్టాత్మకమైన *అంతర్జాతీయ కవితల పోటీలలో* విజేతగా నిలిచి "కవితాలహరి" 
లో కవితా గానం చేసినందుకు తానా వారి నుండి అందుకొన్న ప్రశంసాపత్రం.
మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ..
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

26, ఏప్రిల్ 2022, మంగళవారం

సిద్ధమే

*సిద్ధమే*

గాయాలకు భయపడేది లేదు
రాగాలు నాలో రవళించి నను
మురళిగా మలుస్తాయంటే
ఉలిదెబ్బలకు సిద్ధమే
రమ్యమైన శిల్పమై విరాజిల్లుతానంటే
ఉప్పెనలోనూ ఊపిరోసుకుంటాను
ఉప్పొంగిన అలనేనై నేల తాకుతానంటే
అమావాస్య కంటికి కాటుకగా
కరిగిపోతాను..
రాబోయే వెన్నెలంతా నాపేరిట
రాసిస్తానంటే
నిస్సందేహంగా నిన్నలలో
కూరుకుపోతాను
రేపటి ఉదయంలా
రాణిస్తానంటే
ఓటమినై చరిత్రలో కలిసిపోతాను
రాబోయే యుద్ధంలో విజయఖడ్గంలా
మెరిసిపోతానంటే
ఘటనలన్నీ ఘడియలోపే
గతం కాగితంపై వాలిపోతున్నాయి
అనుభూతులు సైతం అరక్షణంలో
అనుభవాలై మిగిలిపోతున్నాయి
వెతలు చూసి బెదిరిపోతే
ఎదురుగా ఇక శూన్యమేగా..
ఎదురుదెబ్బలు గురువులనుకొని
ఎదురుకోనా నిబ్బరంగా

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
pandoorucheruvugattu.blogspot.com

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

*మన్నుతో మైత్రి*


ప్రకృతితో మమేకమైన
స్వచ్ఛమైన పల్లెజీవనం
ఆహా...మనసును తట్టి లేపే  
మట్టిపరిమళం..
గుర్తుకొస్తేనే గుప్పెడు ఆశలు 
చిగురిస్తాయి
మరి మట్టితో మనిషి
మైత్రి ఈనాటిదా
మన్ను లేక మానవాళి
మనుగడున్నదా..
పుట్టినా గిట్టినా మనిషి
చరిత మట్టిదేకదా...
అట్టి మట్టి పరిమళాన్ని
మాయంచేసేస్తుంది
మాయదారి మరజీవనం
గుండె తడారి ఎడారి చిత్రంగా
నేటి పట్టణీకరణం
పచ్చని సౌభాగ్యానికి 
పట్టిన ధౌర్భాగ్యంలా
నేటి అత్యాధునిక జనజీవనం
పట్టుమని పదిక్షణాలు తీరికలేని
యాంత్రిక జీవనమే
బ్రతకాలన్న ఆరాటమే గానీ
బ్రతుకును ఆస్వాదించే
ఆస్కారమెక్కడ??
ఆశలకు అంతిమసంస్కారం తప్ప
ఏం సాధించామయ్యా సామీ
పల్లె గుండెను పగులగొట్టి
ఏం బావుకొన్నామో మరి
పచ్చదనాన్ని తగులబెట్టి
అన్నదాత కడుపుగొట్టి
నిలుచున్నకొమ్మనే నిట్టనిలువునా
కూల్చుకొంటున్నాం ఖర్మ
అవును వినాశకాలే విపరీత బుద్ధి
అవగతమవుతూనే వుందిగా
అనుభవించే కొద్దీ
పెచ్చుమీరిన సాంకేతికతతో
స్వచ్ఛమైన ప్రకృతికి పంచనామా
చేస్తూ అర్ధంకాని రోగాలతో
అలమటిస్తూనే వున్నాం
కలికాలపు పైత్యానికి
సాక్ష్యంగా సాగిపోతూనే
సగటు మనిషి యాంత్రిక జీవనం
ఆకలి చావులకూ 
చీకటి తావులకూ తావులేక 
పుడమితల్లి సేవలో పునీతమై
రైతే రారాజులా అలరారిన 
ఆనాటిరోజులు ఆణిముత్యాలు
తప్పదు ఇక ఆత్మావలోకనం
తప్పిదాలు మన్నించమంటూ
తప్పక మోకరిల్లాలి ప్రకృతి ముంగిట 
మనం మునుపటి మానవుడిగా మారి
ఆఘ్రాణించాలని వుంటే
ఆనాటి మట్టి పరిమళం
ఆస్వాదించాలని వుంటే
అచ్చమైన ఆనాటి అందమైనజీవనం.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
(ధరిత్రీ దినోత్సవం సందర్భంగా)

21, ఏప్రిల్ 2022, గురువారం

*ప్ర(కృ)తిఫలం*విరులు విరబూసి నవ్వవా!
వాలుజడ చేరి  వాడినా... 
తరులు తరించిపోవా! 
సాంతం అర్పించుకొన్నా!
నెలజీతం అడిగాయా !సెలయేటి ఝరులు 
నీలిమేఘం నిధులడిగిందా
కురిసేందుకు
మధువిచ్చి సుమబాల
బదులడిగిందా!
బరువని
భరించనందా... ధరణి
చరాచర ప్రాణిని
రేయి నిద్దరోతుందా !
వెన్నెల హాయికి వెలకడుతుందా ... 
"పొద్దు"పొడవనందా...
ప్రతిఫలమేదంటూ 
తెల్లబోయి చూస్తుందా !పిల్లగాలి  వీచక 
నావల్ల కాదని నింగి నీరసించిందా 
జాబిలి నిదరోతుందా 
ఒరిగేదేముందని
పడి లేవనంటుందా .. ఎగిసే కెరటం
పురిటినొప్పులకువెరసి 
అమ్మ జన్మనివ్వకుంటే 
మనుగడేదీమనకు పుడమిపైన 
ప్రతిఫలమాశించక ప్రకృతిలో
ప్రతి అణువు పరులకై పరిశ్రమిస్తుంటే 
తనకోసం తానే జీవించే మనిషికి మాత్రం
ప్రతీ పనిలో ప్రతిఫలాపేక్షణమే.. 
కర్తవ్యం లోనూ... కాసులకైంకర్యమే 
(కాదంటారా... నామాటలని
 కొట్టిపారేస్తారా.వట్టినీతులని)

      *సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

19, ఏప్రిల్ 2022, మంగళవారం

ఎంతహాయి

పూవులు పలకరించాయి
కలియ తిరుగుతావే గానీ
త్రుంచి సిగలో ముడుచుకోవేమనీ,
పిచ్చిమాలోకాలు కాసేపైనా
అమ్మ కొమ్మపై ఆడుకొనే అవకాశం ఇచ్చాననుకోవేం,
అంత చిన్న జీవితంలోనూ
చిరునవ్వులు చిందించడం
ఎక్కడ అభ్యసించాయో తనువాడిపోతామని తెలిసీ
తనివితీరా విరబూయడం
విరులకే సాధ్యమేమోకదా
పరులకోసం తపిస్తూ
పరవశాన్నందించే
ప్రకృతి సొబగులు
మనసువీణపై హాయిరాగాలను
మీటుతుంటే..ఆహా ఎంతహాయి, పులకరించెనుకదా కనుదోయి
                  ‌‌...*శ్రీమణి*

తానా కవితలహరిలో ఎంపికైన నాకవిత

భారతదేశ వజ్రోత్సవ వేడుకల
సందర్భంగా  
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)  
ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ కవితల పోటీలలో నాకవిత విజేతగా ప్రకటించి  కవితాలహరి  లో పాల్గొనే అమూల్యమైన అవకాశం కల్పించి ఆహ్వానం అందించిన  తానా నిర్వాహకులకు
హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
మీ అందరి ఆశీస్సులకోసం..
సాలిపల్లి మంగామణి (శ్రీమణి)

🙏🌹🌹🌹🌹🌹🌹🙏

18, ఏప్రిల్ 2022, సోమవారం

నిజం చెప్పవా

*నిజం చెప్పవా*

నిజం చెప్పవా.. కృష్ణా!
నే... నీదానను కానా...
నీవు లేక నిమిషమైన
నేనుండగలనా...
నిన్నటి నీమాటలన్నీ...
నీటి మీద రాతలా..
చేసుకొన్న బాసలన్నీ..
చెరిగిపోయే ఊసులా...
పెనవేసుకొన్న  మన
మనసుల కధలన్నీ
ఒట్టి కట్టుకధలేనా...
నువ్వుండేదా...గగనంలో
నేనేమో...ఇలాతలంలో
ఆశలరెక్కలతో
విహంగమై విహరిస్తున్నా..
అలుపెరుగని పయనంలో
అనుక్షణమూ...నీకోసం
అన్వేషిస్తున్నా...
ఎన్ని జన్మలెత్తాలిక
వెన్నదొంగా...
నీ పద సన్నిధి చేరగా...
చెప్పు నిజంగా...
నల్లని వాడా...నావల్లకాదిక
అల్లరి చాలించవా, యమునా తీరములో
వేచియుంది...ఇదిగో...నీరాధిక
        (రాధామాధవీయం)

  *సాలిపల్లి మంగామణి ‌(శ్రీమణి)*

నేను తీసిన చిత్రం

17, ఏప్రిల్ 2022, ఆదివారం

నేను తీసిన చిత్రం

అవనీధరము 
ఆగగనపు తలము
అత్యంత సామీప్యంగా,
అనుసంధాన కర్తగా 
ఆ ఎగురుతున్న విహంగం
హస్తచాతుర్యమే సుమా..
ఆ తెలుపు వర్ణపు విరుల
మేలుకొలుపు 
మహేంద్రజాలమంతా
ఆరాధించే హృదయానిదే
సృజనశీలి కదా ప్రకృతి
మనసారా ప్రణమిల్లుతూ...*శ్రీమణి*

ధర్మశాస్త్రం మాసపత్రిక ఏప్రిల్ సంచికలో ప్రచురితమైన నాకవిత *మహర్షులే పుట్టాలా* మీ అమూల్యమైన స్పందన కోసం....*శ్రీమణి* 🙏🌷🌷🌷🌷🙏

ధర్మశాస్త్రం మాసపత్రిక ఏప్రిల్ సంచికలో ప్రచురితమైన నాకవిత *మహర్షులే పుట్టాలా* మీ అమూల్యమైన స్పందన కోసం....*శ్రీమణి*
 🙏🌷🌷🌷🌷🙏

16, ఏప్రిల్ 2022, శనివారం

రాతి సందేశం

*రాతిసందేశం*

గుప్పుమనడానికి ఇవి 
కమ్మని జ్ఞాపకాలు కాదు,
 మరుపుకు నోచుకోని 
కరకురాతి క్షణాలు,
కనికరమెరుగనికాలం 
కసితీరా కాటేసిన కర్కశగాయాలు,
 గుండెగదిలో తడియారని 
గుబులుచెమ్మకు తడిమినకొద్దీ
బిగుసుకుపోతున్నాయి 
హృదయపు కవాటాలు,
తెప్పరిల్లని మనసుకథలు 
తప్పక మసలుతున్నవి మాత్రం
ఒట్టి మానవశరీరాలు,
మాటిమాటికీ మరోయుద్ధం
మనసుతంత్రులు తెగినశబ్ధం,
నిశీధి లాంటి నిశ్శబ్దం, 
నిన్న ఎరుగని నిబిడాంధకారం,
 బ్రతుకుపొత్తంలో 
ఇది భయానక అధ్యాయం,
విశ్వమనే ఊరంతా విస్తరించింది
 విషాదగీతం, 
తూరుపు దారులన్నీ 
నిట్టూరుపురాగంలో
కూరుకుపోతున్నాయి,
కాలంచెట్టుకు పూసిన కాటుకపూలే 
కాబోలు ఈ కరుకురాతిక్షణాలు,
ఉర్వి యావత్తూ ఉపద్రవాలనే సేవిస్తుంది,
ఉరికొయ్యలపైనే ఊపిరులన్నీ,
కాలధర్మమో, కలికాలపు మర్మమోమరి,
బ్రతుకుదీవికి ఉప్పెనొస్తే
 బతుకుజీవుడా..బతుకునీవని
రాతిసందేశం,
రాడటమరి దేవుడు, 
మనిషీ మనసు దిటవుచేసుకో, 
జీవించే నైపుణ్యాన్నిఅలవరచుకో,
అభ్యర్ధిస్థే అడ్డుతప్పుకొంటుందా రేపటియుద్ధం,కన్నీరుకారిస్తే
కరుణ చూపిస్తుందా కాటేసేకాలం,
సంధించాలికఆగ్నేయాస్త్రం, 
అవశ్యమే నువ్వు ధరించాలి
అచంచలఆత్మస్థైర్యం.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి

13, ఏప్రిల్ 2022, బుధవారం

మందస్మిత


ఎవరిచ్చారో మందారానికి
రేకుల నిండా ఎర్రని సింధూరం
సృష్టికెవరు నేర్పించారో దృష్టిని
కట్టిపడేసే చాతుర్యం
అందమంతా అరవిరిసిన సొబగులలో
కుమ్మరించిన విరించిదెంతటి రసహృదయం
మానసతీరంలో మరందాన్ని చిలకరించే
ఆ అద్వితీయ సౌందర్యం 
రెప్పలవాకిలి దాటి నేరుగా 
హృదయాన్నే స్పృశించే సౌకుమార్యం
అబ్బురపడి అంబరమణి
లేలేత కిరణాల ముద్దాడినందుకేమో
ఆ అపురూపమైన వర్ణవిలాసం
మందస్మిత మందారమా
హృదయాలను మంత్రించే
సమ్మోహనరాగం 
నీకెవ్వరు నేర్పించారూ
రమణీయతనంతా రాశి పోసి
సుమలలామా ...
నిను పట్టరాని సౌందర్యానికి 
పట్టపురాణిని చేసి 
పరవశించిందేమో కదా... ప్రకృతి.

*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*

7, ఏప్రిల్ 2022, గురువారం

*మనిషిని మరి*

*మనిషిని మరి*

తీరని ఆశల రెక్కలు
మొలిచినినపుడల్లా...
నాలో నేనే అంతర్ధానమై
స్వప్న సౌధాలలో అవతరిస్తా...
ఆశల ఆనవాళ్ళు కరిగేవరకూ
ఆ కలల అలలపై 
విహరిస్తూనే వుంటా
గొంతెమ్మ కోరికలు గొంతెత్తి
పిలిచినప్పుడల్లా...
 గోరంత ఆలోచన  నన్నావహించి
ఊరడిస్తుంటుంది....
మాట మీద నిలబడాలన్నది
నా వ్యక్తిత్వం....
తప్పనిసరియై
మాట తప్పాల్సిన అగత్యమేవస్తే,...
తక్షణమే,మౌనాన్నిఆశ్రయిస్తా...
మనసు మధనపడుతున్నా,
మనిషిని మరి...
వ్యాధులు,బాధలు మామూలే
బదులుగా...
కన్నీరూ పరిపాటే 
కాలం మరమ్మత్తు చేస్తుంటుంది
మానని గాయాలపై
 మరుపుమందుపూసి,
కటికచీకటి కమ్ముకొస్తున్నా...
వెలుతురు కోసం వెతుకుతునేవుంటా..
కొమ్ముకాసే ఆ పైవాడి
చల్లని చూపులకై ఎదురుతెన్నులు 
చూస్తూనే వుంటా
ఆగమనం,నిష్క్రమణం
 ఎపుడో తెలియని 
ఈ జీవనయానంలో
మనసున్న మనిషల్లే
 నిష్కల్మషంగా
జీవించాలనుకుంటా
మరణానంతరమూ 
మనుషుల మనసుల్లో
 మనుగడ సాగించాలనుకుంటా.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

3, ఏప్రిల్ 2022, ఆదివారం

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవాసంస్థ

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవాసంస్థ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా డా.వి.డి.రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన
కవిసమ్మేళనంలో పాల్గొని
ఓలేటి పార్వతీశం గారి చేతుల 
మీదుగా  ఆవిష్కరించబడిన 
శుభకృత్ కవనమధూలిక
 E book లో నాకవిత 
అదే వెలుతురు గీతం 
బహుమతి పొందిన శుభతరుణం
మీ అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...

సాలిపల్లి మంగామణి (శ్రీమణి)

🙏🌹🌹🌹🌹🌹🌹🙏