ఎవరిచ్చారో మందారానికి
రేకుల నిండా ఎర్రని సింధూరం
సృష్టికెవరు నేర్పించారో దృష్టిని
కట్టిపడేసే చాతుర్యం
అందమంతా అరవిరిసిన సొబగులలో
కుమ్మరించిన విరించిదెంతటి రసహృదయం
మానసతీరంలో మరందాన్ని చిలకరించే
ఆ అద్వితీయ సౌందర్యం
రెప్పలవాకిలి దాటి నేరుగా
హృదయాన్నే స్పృశించే సౌకుమార్యం
అబ్బురపడి అంబరమణి
లేలేత కిరణాల ముద్దాడినందుకేమో
ఆ అపురూపమైన వర్ణవిలాసం
మందస్మిత మందారమా
హృదయాలను మంత్రించే
సమ్మోహనరాగం
నీకెవ్వరు నేర్పించారూ
రమణీయతనంతా రాశి పోసి
సుమలలామా ...
నిను పట్టరాని సౌందర్యానికి
పట్టపురాణిని చేసి
పరవశించిందేమో కదా... ప్రకృతి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి