ప్రకృతితో మమేకమైన
స్వచ్ఛమైన పల్లెజీవనం
ఆహా...మనసును తట్టి లేపే
మట్టిపరిమళం..
గుర్తుకొస్తేనే గుప్పెడు ఆశలు
చిగురిస్తాయి
మరి మట్టితో మనిషి
మైత్రి ఈనాటిదా
మన్ను లేక మానవాళి
మనుగడున్నదా..
పుట్టినా గిట్టినా మనిషి
చరిత మట్టిదేకదా...
అట్టి మట్టి పరిమళాన్ని
మాయంచేసేస్తుంది
మాయదారి మరజీవనం
గుండె తడారి ఎడారి చిత్రంగా
నేటి పట్టణీకరణం
పచ్చని సౌభాగ్యానికి
పట్టిన ధౌర్భాగ్యంలా
నేటి అత్యాధునిక జనజీవనం
పట్టుమని పదిక్షణాలు తీరికలేని
యాంత్రిక జీవనమే
బ్రతకాలన్న ఆరాటమే గానీ
బ్రతుకును ఆస్వాదించే
ఆస్కారమెక్కడ??
ఆశలకు అంతిమసంస్కారం తప్ప
ఏం సాధించామయ్యా సామీ
పల్లె గుండెను పగులగొట్టి
ఏం బావుకొన్నామో మరి
పచ్చదనాన్ని తగులబెట్టి
అన్నదాత కడుపుగొట్టి
నిలుచున్నకొమ్మనే నిట్టనిలువునా
కూల్చుకొంటున్నాం ఖర్మ
అవును వినాశకాలే విపరీత బుద్ధి
అవగతమవుతూనే వుందిగా
అనుభవించే కొద్దీ
పెచ్చుమీరిన సాంకేతికతతో
స్వచ్ఛమైన ప్రకృతికి పంచనామా
చేస్తూ అర్ధంకాని రోగాలతో
అలమటిస్తూనే వున్నాం
కలికాలపు పైత్యానికి
సాక్ష్యంగా సాగిపోతూనే
సగటు మనిషి యాంత్రిక జీవనం
ఆకలి చావులకూ
చీకటి తావులకూ తావులేక
పుడమితల్లి సేవలో పునీతమై
రైతే రారాజులా అలరారిన
ఆనాటిరోజులు ఆణిముత్యాలు
తప్పదు ఇక ఆత్మావలోకనం
తప్పిదాలు మన్నించమంటూ
తప్పక మోకరిల్లాలి ప్రకృతి ముంగిట
మనం మునుపటి మానవుడిగా మారి
ఆఘ్రాణించాలని వుంటే
ఆనాటి మట్టి పరిమళం
ఆస్వాదించాలని వుంటే
అచ్చమైన ఆనాటి అందమైనజీవనం.
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
(ధరిత్రీ దినోత్సవం సందర్భంగా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి