పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

29, జూన్ 2022, బుధవారం

నేటి ఉదయం దినపత్రికలో ప్రచురితమైన నాకవిత

నేటి ఉదయం దినపత్రికలో ప్రచురితమైన నాకవిత మీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...*శ్రీమణి*

28, జూన్ 2022, మంగళవారం

మేలైన తరుణమనీ

*మేలైన తరుణమనీ...,*

మేలుకొంటి వేకువనే
మేలిమి బంగరుసామిని
మేలుకొలుప
మేలైన తరుణమనీ...,
మరులు గొలిపె మాధవునికి
మరుమల్లెల మాలనల్లి
మనసారా ... మోకరిల్లి
మదిలో మెదిలే మధుర
భావాలను...
మదన గోపాలుని
పాదాలపై పదిలంగా పరిచానంతే..,
మువ్వగోపాలకృష్ణా...యని
ముదమారా...పిలిచానంతే...,
ప్రణయ సుధా మాధవా...అని
ప్రియమారా...తలచానంతే...
తనువు,మనసూ తదేకమై
తన్మయమై
తన తలపులు లోగిలిలో
తలవాల్చుకునిదురించిననాకు,
మరుమల్లియ మాల...విరిసిన
నా కవితల పూమాలై
కనుల ముందు సాక్షాత్కరించింది...
కమలాక్షుడిలా కటాక్షించె 
కాబోలు..... కడుచిత్రంగా....

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
విశాఖపట్నం.
8522899458.

27, జూన్ 2022, సోమవారం

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవాసంస్థ

మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవాసంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 
ఎంతో వైభవంగా నిర్వహించబడిన 
కవి సమ్మేళనంలో పాల్గొని శ్రీయుతులు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు,
ప్రముఖ సినీగీతరచయిత 
శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, 
సాహితీ ప్రముఖులు శ్రీ బిక్కికృష్ణగారు మరియు సంస్ధ గౌరవాధ్యక్షులు డి.వి.రాజగోపాల్ గారు,
ఇతర ప్రముఖుల ఆశీస్సులతో సత్కరించబడిన శుభతరుణం 
మీ అందరి అమూల్యమైన 
ఆశీస్సులు ఆకాంక్షిస్తూ...
*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

శ్రీమణి గజల్

త్రిస్రగతి        6/6/6/6

నీలిమబ్బు పులకరించి
కురిసినదీ  వానచినుకు
విరితావుల పలకరించి
మురిసినదీ వానచినుకు

ఆకాశం చేస్తున్న
అభిషేకం బాగున్నది
ఆకుపచ్చ సంతకమై
మెరిసినదీ వానచినుకు

తొలకరిలో తడవాలని
మనసుకెంత ఉబలాటం
మైమరపుల పరవశాలు
చిలికినదీ వానచినుకు

చిటపటమను సవ్వడితో
మధురమైన సంగీతం
చిరుగాలిని పెనవేసుకు
ఉరికినదీ వానచినుకు

ధరణీమణి చరణాలకు
చిరుజల్లుల సత్కారం
అణువణువున అమృతమై
ఒలికినదీ వానచినుకు.

*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*

26, జూన్ 2022, ఆదివారం

*మత్తు-గమ్మత్తు*

*మత్తు-గమ్మత్తు*

ఊది ఊది....ఊపిరి
ఆగిపోయేవరకు పీల్చేసై
గుట్టలకొద్దీ పొగాకుకట్టలు
లొట్టలు వేస్తూ కాల్చేసై
జల్సా చెయ్,బలి చేసేయ్, బంగరుబ్రతుకును,బండలుచేసై
వెలిగించు రింగురింగులుగా.....
పొగ గుప్పించు
ఎలాగూ... రేపటి నీ బ్రతుకు
ఆరిపోయే దీపమేగా... వెలుగెక్కువేలే
పొగచూరిన,ఊపిరితిత్తులెలా
మసిబారి పోతేనేం?
మాడి మసైపోతేనేం..?
నీ ఆయువు ఆవిరయితేనేం..?
నిండు జీవితం నీవల్లే
నిప్పులకొలిమయితేనేం..?
నీ ఇల్లాలి తాళిచెల్లిపోతేనేం ?
నీ బిడ్డల తలరాతలు
తలక్రిందులయితేనేం?
నిన్ను కన్నవాళ్ళ
గుండె బ్రద్దలయితేనేం?
గుప్పుగుప్పు మంటూ
ఆ గబ్బును గబగబా..
ఆబగా లాగించెయ్
మత్తులోని గమ్మత్తును అమాంతం ఆస్వాదించెయ్
నువ్వు కాల్చేప్రతీ సిగెరెట్టు,
ప్రతీక్షణం,నీలో కణకణాన్ని
కణకణమని భస్మంగావిస్తున్నా
నీ ఉసురుతీసేందుకు
ముసురు గాసుకొస్తేనేం..?
కాటికి దగ్గర దారి... 
కాలయముడితో
కాలక్షేపమే సరాసరి,
నీ వ్యసనానికి ప్రతిఫలంగా
నీవొళ్ళు,నిన్నునమ్ముకొన్నవాళ్ళ 
ఆశలకు నీళ్ళొదిలేసేయ్,
నీ తనువు ఛిద్రమై
బ్రతుకునిరర్ధకమై,నిత్యం,
మృత్యుకేళీవిలాసంలో
ఊగిసలాడుతూ...
నీకు నీవే భారమై
నీవారికీ..పెనుభారమై 
గమ్మత్తులకెగబడి మత్తుల్లో 
తూలుతూ మరమత్తు 
చెయ్యలేని మరబొమ్మగా
మారి,మిగిలి తగలబెట్టు
నీ వాళ్ళ  నిండు భవితను
నిర్దాక్షిణ్యంగా ...
(గమ్మత్తులు చూడాలని
మత్తుల్లో తూలుతూ
మరమ్మత్తు చేయలేని
మరబొమ్మై మిగులుతున్న
నేటి జనావళిపై వ్యంగ్యంగా
రాసిన కవిత)
(మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా
దయచేసి మత్తుమందులకు
బానిసలవ్వద్దని అభ్యర్థిస్తూ...)       
*సాలిపల్లిమంగామణి(శ్రీమణి)*

25, జూన్ 2022, శనివారం

నీమీదొట్టు

*నీమీదొట్టు*

ఝుమ్మని ఎద పలికినట్టు
లెమ్మని కల కదిలించినట్టు
రారమ్మని పిలిచినట్టు
కమ్మని కబురొచ్చినట్టు
నే ఉన్నా లేనట్టు
లేకున్నా ఉన్నట్టు
ఊపిరాగుతున్నట్టు
ఊసులేవొవిన్నట్టు
నీ మీదొట్టు.నే వున్నా లేనట్టు
నిను చూడక నే లేనన్నట్టు
వెన్నెల దిగబోసినట్టు
వన్నెలొలకబోసినట్టు
కన్నులెదుట పూదోటే
కావలి ఉన్న ట్టు,ఏవేవో కానుకలు కావాలన్నట్టు....,
అధరాలపై నీ పేరే
మధుర మాయినట్టు
మది లోపల
మధురోహల మదనమాయినట్టు
తడవ,తడవకూ తడబడి,అణువుఅణువులో నీవని పొరబడి‌,
నిద్దుర మొదలే కొరవడి,తత్తరపడి,బిత్తరపడి
చిత్తరువయి నిలుచున్నా.....
నీ మీదొట్టు...నే వున్నా లేనట్టు,
నిను చూడక నే లేనన్నట్టు.....!

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

24, జూన్ 2022, శుక్రవారం

ఉదయం దినపత్రికలో

నేటి ఉదయం దినపత్రికలో ప్రచురితమైన నాకవిత
మీ అమూల్యమైన స్పందన కోరుకుంటూ...*శ్రీమణి*
🙏🌹🌹🌹🌹🙏

22, జూన్ 2022, బుధవారం

మధురముగాదా

*మధురము గాదా*

ప్రియవదనా...!
నిను వలచిన నా హృదయం 
సుతిమెత్తని ఒక ఉదయమై
నీ చరణాలను స్పృశించినపుడు,
నిరతం నీ స్మరణలో తరించే
నాఅధరాలు మకరందపుఝరులై
ఆ ప్రణయ సుధా వాహినిలో 
పరవశించి ప్రవహించినపుడు,
నా అందెల రవళి,నీమోహనమురళి
శ్రుతిలయలై,
 సమ్మోహనరాగమాలపించినపుడు,
నా నీలి నీలి కురులను చేరి 
నీకరములు అలవోకగ
అరవిరిసిన వలపుల విరులల్లినప్పుడు,
వెన్నెలంటి నీ ఎద పానుపుపై
సేదదీరి నామనసంతా మైమరపుల
మదనమాయినపుడు,
కలవరమైన నా మదిలో 
నీరాక   "కల"వరమై కవ్వించినపుడు
నా మానసతీరాన్ని నీ తలపులు
మలయసమీరాలై పలకరించినపుడు
నా చెంపల్లో విరబూసిన కెంపుల్లో
నీ రూపం సాక్షాత్కరించినపుడు
ఈ కలువకన్నియ కన్నుల నిండిన 
వెన్నెల చంద్రుడు నీవై
మేనక మెరుపుకి తడబడిపోయిన 
ఆ ఋషీంద్రుడు  నీవై
నా వలపుల సడిలో తొలకరి జడివై 
సరసమాడినపుడు,
ఆహా...మధురము గాదా ఆతరుణం!
ఎదురై రాదా యమునా తీరం!
వేణు మాధవా... వలచిన నీ నెచ్చెలి 
మనసంతా మధురోహలు విరిసిన పూదోటే అదిగో మన ఆశల బృందావని
అదియే మన మది దోచిన ఆ మధువని. 

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

21, జూన్ 2022, మంగళవారం

రెప్ప వాల్చని రాత్రి

*రెప్పవాల్చని రాత్రి*

ఆమె ఒక రెప్పవాల్చని రాత్రి
ఓరిమి ధరించని ధరిత్రి
యుద్ధానికి సిద్ధంగా పరివర్తన 
పరిణితి చెందిన పడతి 
వాడి ముళ్ళదారులను అధిగమించే
ప్రయత్నంలో స్వభావాన్ని మార్చుకోవాల్సివచ్చింది
సహజసిద్ధమైన సౌకుమార్యం స్థానంలో పరాక్రమాన్ని భర్తీచేసుకుంది
తరుణి తక్షణకర్తవ్యాన్ని గ్రహించి
కాలానికి తగ్గట్టు మనుగడ పగ్గాలను
పట్టుకు అడుగులు సారిస్తుంది 
ఏమరుపాటును ఏమాత్రం ఆశ్రయించదు ఏకీచక క్రీనీడ పడకుండా రక్షణకవచాన్ని
సన్నద్ధం చేసుకుంది
మానప్రాణ సంరక్షణ కోసం
ఆమె సివంగిలా రూపాంతరం చెందింది  ఆడదాన్ని అమ్మలా పూజించే సంస్కృతికి అంతిమవాక్యం 
రాస్తున్న రాకాసికాలానికి సమాధానంగా
ఆమె అప్రమత్తమైంది 
ఏ గాలానికి చిక్కదు అప్రతిహతంగా పహరా కాసుకుంటుంది 
అహర్నిశలు మేలుకొనే వుంటుంది 
ఆమె ఒక రెప్పవాల్చని రాత్రి 
ఓరిమి ధరించని ధరిత్రి
అఘాయిత్యాలను భరించలేని అతివ
అగ్గిరవ్వగా  అవతరించింది.

*సాలిపల్లి మంగామణి( శ్రీమణి)*

ఈరోజు మెట్రో ఉదయం పత్రికలో ప్రచురించబడిన నా కవిత ...*శ్రీమణి*

ఈరోజు మెట్రో ఉదయం పత్రికలో ప్రచురించబడిన నా కవిత ...*శ్రీమణి*

20, జూన్ 2022, సోమవారం

మృగశిర కార్తె

*మృగశిరకార్తె..*

మురిపిస్తూ,మురిపిస్తూ
మృగశిర కార్తె
కాస్త పలకరించిందో లేదో...
పులకరించిపోయింది
సమస్త ప్రకృతి..!

మేఘమాల వచ్చి
చిరుజల్లు చిలకరించిందో...లేదో
పచ్చపచ్చని సోయగంతో
పుడమి యావత్తూ,
పురివిప్పినమయూరమై నాట్యమాడింది..!

ఎర్రని ఎండకు నెర్రెలిచ్చిన నేలసైతం సుతిమెత్తని చల్లగాలితాకిడికి
పరవశించిపోయింది..!

నిన్నటిదాకా నిప్పులకొలిమై
భగభగమండి,ఉక్కపోతతో
ఉస్సూరంటూ...
రోహిణి తాపానికి
ఠారెత్తిన ప్రాణికోటి
చినుకు ఉనికితో కొత్త
ఊపిరి పోసుకుంది..!

ఆకాశం కేసి ఆశగా చూస్తున్న
రైతన్నకళ్ళల్లో
రతనాలమెరుపేదో
తళుక్కున మెరిసింది..!

మలయ సమీరం ముదమారా
తాకగానే ప్రతి హృదయం
మైమరపుల సరాగమేదో
మధురంగా ఆలపించింది...!

*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*

అంతా నువ్వే చేసావు

*అంతా నువ్వే చేసావు*

నీ భుజములపల్లకిపై 
ఊరేగినపుడే ఈలోకం నాకు మొట్టమొదటగా పరిచయమయ్యింది 
నీ గుండె పానుపుపై ఆదమరచి నిద్రపోయినపుడే నీగుండెచప్పుడు లాలిపాటై నా అణువణువులోనూ
అనురాగాన్ని ప్రవహింపచేసింది
నా శిరస్సుపై నీచేతులు ఆన్చి నువ్విచ్చిన ఆశీస్సులు నన్ను ఆకాశమంత ఎదిగే అవకాశాన్నిచ్చాయి
నువ్వు చూపించిన నడకదారులు ఈనాటి నాలక్ష్యసాధనకు దారిని సుగమం చేసాయి
ఎప్పుడూ నీ మమకారాన్ని మాకు కనిపించనీయకుండా గాంభీర్యం ధరిస్తావేగాని
మౌనంగా మా ఎదుగుదల కోసం అనుక్షణం
తపస్సు చేస్తూ నువ్వు
మహర్షిగా మారావని మేము గ్రహించలేమనుకున్నావా
వ్యక్తపరచడం చేతగాని వెర్రిబాగుల వ్యక్తివి,
నాన్నా నువ్వు మాలో నిక్షిప్తమైన ధైర్యమనే శక్తివి
కనబడదంతే నీకన్నీటి చెమ్మ
కడలికన్న లోతుకదా కన్నతండ్రిప్రేమ
అన్నీ నువ్వై నడిపించావు అంతా నువ్వే చేసావు  దేవుడెలాగుంటాడంటే అదిగో అంటూ నాన్నా నిన్నే చూపిస్తాను.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి )*

19, జూన్ 2022, ఆదివారం

నాన్నా

మనిషి,మనిషికోసం 
భగవంతుడు దిగిరాలేక
ఇదిగో...మీనాన్నంటూ..
చేవ్రాలు చేసి మరీ
ఇలకు పంపినాడంట 
అందుకనే నాన్నంటే.....
ఆకాశమంత ప్రేమ 
అమ్మ అమూల్యమైన జన్మనిస్తే.,. 
బిడ్డను కంటికిరెప్పల్లే
కాపాడే సైనికుడే నాన్న
అమ్మలాలిపాట నేర్పిస్తే
నాన్న బ్రతుకుకు బంగారుబాట వేస్తాడు,నడకనేర్పిస్తూనే,
నడతనేర్పిస్తాడు..
మన అడుగులదారుల్లో...తన అరచేతిని పానుపుగాపరచి, అమ్మపాలకుసరిగా...తన అనురాగపు ఉగ్గుపాలు రంగరించి..అమ్మనేతలపిస్తూ..
అమృతాన్నే చవిచూపిస్తాడు..
తనుకరిగిపోతున్నా...
తరగని చిరునవ్వులే మన
ముంగిట విరబూయిస్తాడు
కష్టాలకు కన్నీళ్ళకు 
తను కావలికాసి ఆవల ఆనందతీరాన్నే వరమందిస్తాడు
గుండెల్లో గుబులైతే గుప్పున
గుర్తొస్తాడు....అడిగీఅడగకముందే 
అన్నీ ఇచ్చేస్తాడు
ఆకాశమంత ప్రేమతో...
అక్కున చేర్చుకుంటాడు
అందుకనే నాన్నా...!
నువ్వు నాప్రాణం కన్నా మిన్నా
మేము,ఎంతెత్తుకుఎదిగినా....
మీ అడుగుజాడలే మాకాదర్శం 
మీ కనుసైగలే మాకు శిరోధార్యం 
అందుకనే నాన్నా...!
ఆ దేవుడే వరమిస్తానంటే
 వెనువెంటనే అడిగేస్తాను
ఎన్నెన్ని జన్మలైనా...నిన్నే 
నాన్నగా...పొందేవరమిమ్మనీ.

                   *ప్రేమతో*
                   *మీ కూతురు*
                 *శ్రీమణి*

15, జూన్ 2022, బుధవారం

*మహాకవి శ్రీశ్రీ... మహాప్రస్థానం*(నాలుగుమాటలు)

*మహాకవి శ్రీశ్రీ... మహాప్రస్థానం*
(నాలుగుమాటలు)

విజ్ఞుడు, అభిజ్ఞుడు, 
మహాభిజ్ఞుడు
మాన్యుడు అసామాన్యుడు 
అనన్య సామాన్యుడు/
శ్రీశ్రీ అనగానే
అభ్యుదయ సాహిత్యానికి
శ్రీకారం స్ఫురణకు వస్తుంది/
అతని కలం యువతలో
ఆవేశం నింపే అగ్నిబీజం/
అతని కవనం ఇచ్చే ఆదేశం
తరతరాలకూ
తలమానికమౌ సందేశం/
అట్టి మహానీయమూర్తికి
చిన్నతనం నుండే
ఏకలవ్య శిష్యురాలను నేను

ఆ రేడు నడిచిన దారిలో
నడవాలని ఆరాటపడే రేణువును/
అలా చిరుప్రాయం నుండే వారి
కవితల ప్రభావం నామీద పడింది/
కష్టజీవులకు ఇరువైపులా 
వుండేవాడే కవి అన్నారు...
బడుగుజీవులకు
అట్టడుగు జీవులకు బాసటగా
నిలిచేదే మహాకవి శ్రీశ్రీ కవిత్వం/

కాలేకడుపులు, 
కలత చెందిన హృదయాలే కాదు 
ఆ కవనక్షేత్రకునికి సృష్టిలోని 
ప్రతి అంశమూ కవితావస్తువే/
వారు సృజించని అంశమంటూ
లేదంటే అతిశయోక్తి కాదేమో/
శ్రమైక జీవన సౌందర్యాన్ని
వారి హృదయసీమలో 
పటిష్టంగా ప్రతిష్టించుకొని/
ప్రతీ కవితలో.. భావావేశాన్ని 
ప్రస్ఫుటింపచేసిన ప్రతిభాశాలి/

అనంతమైన 
సాహితీపరిజ్ఞానాన్ని
ఔపోసన పట్టిన 
ఆ అభ్యుదయకవీంద్రుని
కలం ప్రభవించిన మహాకావ్యగు
మహాప్రస్థానాన్ని సాహితీవనంలో
అణువంతయును లేని నేను 
సమీక్షించడం అంటే 
హనుమంతుడి
ముందు కుప్పిగంతులే/
అయినా సాహసిస్తున్నాను 

మహాప్రస్థానంలో 
అణువణువును
స్పృశిస్తూ అక్షరాలను 
అంతరాంతరాళాల్లో పదిలం
చేసుకొంటూ పరవశించిపోతున్నాను/

ఆ మహనీయుని స్మరిస్తూ
మహాప్రస్థానం వైపు పరుగులు
తీస్తున్నాను/
మహాప్రస్థానంలో చైతన్యం
రగిలించే గీతాలే అన్నీ
నిదురించే హృదయాలను
సైతం వెన్ను చరిచి మేలుకొలిపే
చైతన్య గీతాలే అన్నీ/
మరోప్రపంచం పిలిచిందంటూ

పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి
అంటూ కదం త్రొక్కుతూ
ఉడుకునెత్తురు ఉప్పెనవగా
కవనరంగమున దూకె
ఉగ్రనారసింహుడై మన శ్రీశ్రీ గారు/

ఆహా..ఎంతటి భావావేశం
అనితరసాధ్యమైన సాహిత్యం/
నేను సైతం ప్రపంచాగ్నికి 
సమిధనొక్కటి ఆహుతిచ్చాను 
అంటూ జయభేరి మ్రోగించి 
మనిషిమనిషిలో ఏదో
తెలియని అదృశ్యశక్తి 
ఆవహింపచేసిన
అద్వతీయ కవన రాజం 
మహాప్రస్థానం/

ఆ పదాల ఆవేశం అలాంటిది
ఆ వాక్యాల ప్రవాహం అలాంటిది/
తరచి తరచి చదివినా తరిగిపోని
సంపద మరి.. తరతరాలకూ/

భూతాన్ని యజ్ఞోపవీతాన్ని అంటూ
వినువీధులకెగసే విప్లవగీతాన్ని
ఆలపించిన కలం యోధుడు/
సింధూరం రక్తచంధనం
బంధూకం సంధ్యారాగం
అంటూ నవకవనానికి
నాందీసంకేతాలను
అందిస్తూ అభ్యుదయ
సాహితీ నవశకానికి 
నవజీవం పోసారు/
కవిని ఉదయించే సూర్యునితో
పోలుస్తూ కళారవీ 
అని కొనియాడడం
మహాప్రస్థానంలో 
మనకోసం
ఒక మచ్చుతునక 
మనమూ అంతో ఇంతో కవులమే గనుక/

పొలాలనన్నీ హలాలదున్నీ
ఇలాతలంలో హేమం పిండగ
అంటూ ఎంత అధ్భుత పద
ప్రవాహమో...
ఎంతమందికవులకు సాధ్యమంటారూ/

ఈ కవనాన్ని చదివినంతనే 
కర్షకవీరులకష్టం, 
విలాపాగ్నులూ,
విషాదాశ్రులూ
కనులముందు కదలాడి
ప్రతి హృదయాన్నీ కదిలించి
కర్తవ్యం స్ఫురింపచేయవూ/

బ్రతుకు బరువై మెతుకు కరువై
వెతలు నెలవై చితికి చితికి
చితికి చేరుతున్న వలసబతుకుల
బాటసారి బాధలను హృదయం 
ద్రవించేలా చిత్రీకరించిన వారి
కలం సిరాకు బదులు కరుణనే
నింపుకొందనిపిస్తుంది/

చూడు చూడు నీడలు
పేదవాళ్ళ వాడలంటూ
నిరుపేద బ్రతుకు చిత్రాలకు
నిలువెత్తు చిత్తరువై నిలిపారు
కవనంలో కడుచక్కని పదాలతో ..

ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబురమైతే
అంటూ అద్వైతం శీర్షికతో
అక్షరాలు పేర్చి అందరి
మన్ననలూ పొందితిరిగదా/

ఏ దేశ చరిత్ర చూసినా 
ఏమున్నదిగర్వకారణం 
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం అంటూ
వాస్తవాలను నిర్మొహమాటంగా
ఈ కవనంలో నిలదీసిన
నిక్కమైన కలంవీరుడు/
నిజంగానే నిఖిలలోకం 
నిండుహర్షం వహిస్తుందా 
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా
ఎంత నిగూఢత్వం కవనంలో/

పతితులారా భ్రష్ఠులార
బాధాతర్ప దష్టులార
ఏడవకండేవకండి
వస్తున్నాయ్ వస్తున్నాయ్
జగన్నాధ రథచక్రాలొస్తున్నాయంటూ 
జనంలో ధైర్యాన్ని నింపిన
జనంమెచ్చిన కవి సాహిత్యానికి
సాహో అనక తప్పదు జగం/

నాకనిపిస్తుంది మహాప్రస్థానం
ప్రభావం మనిషిమనిషిలో
చైతన్యం రగిలించే ఆయుధమై
అవతరించిందేమో అని/

నాకనిపిస్తుంది నాబోటి
నత్తనడకలు నడిచే మనుషులతో
క్రొత్తపరుగులు తీయించగలదని/
అది కలమా..కరవాలమా
సందేహమే మరి
కనిపించని కరవాలం 
కలం వెనుక దాగుందేమో/
అందుకే అంత వాడి 
అగండమైన వేడి/

అందుకే అనంతమైన 
ఆ సాహితీ మేరువుకు
అతి చేరువలో కవనసేధ్యం
గావించాలనుకొనే అణువంత కవయిత్రిని/ 

అతిచిన్నవయసులో
వారి మహాప్రస్థానానికి
ప్రభావితమైన శిష్యపరమాణువంటి
చిన్న కవయిత్రిని/

నా విన్నపమిది చిన్ననాటి కవనం
శ్రీశ్రీ గారి పాదాలకు అంకితమైతే
జన్యసార్ధక్యమే నాకు 
అన్యమేమియు వలదు ఇక/

శ్రీశ్రీ నాటిన అభ్యుదయ
సాహితీ వనంలో .. 
నే గడ్డిపూవునయినను చాలు 
ఆ రేడు నడిచిన దారిలో......
ఇసుక రేణువునయినను చాలు 
ఆ అభీకుని కలం విదిల్చిన
సిరా బొట్టు నయిననూ  చాలు 
ఆ మహనీయుని కలానజారిన కవనంలో ....... 
నేనొక అక్షరమయిననూ చాలు 
ఆ దార్శనికుని కవితా కడలిలో
ఎగిసే అలనయినా చాలు 
భాదిత జనాల బాసట  నిలువగ
పీడిత జనాలకూపిరులూదగ 
కవి తలపెట్టిన మహాయజ్ఞం
కొనసాగించుటకై ,
నే ఉడత సాయమందిస్తా ... 
సమ సమాజ స్థాపనలో ,నా
చిరు కవితాబాణం సంధిస్తా ..../ 

నా తొలిసమీక్ష 
అభ్యుదయకవీశ్వరుడు
శ్రీరంగం శ్రీనివాసరావుగారి
మహాప్రస్థానం అని తలచుకొంటేనే
ఉద్వేగంతో తలమునకలైపోతున్నా/
తరించిపోయిన నాకలాన్ని తనివితీరా
చూస్తూ.../
ఇకచాలు ఇకచాలు
ఉన్నా లేకున్నా ఈ భాగ్యమే
చాలు బహుధన్యమే ఇక
నా జన్మము.

ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన
నిర్వాహకు,సమీక్షకులకు
సహ రచయితలకు ప్రణామాలర్పిస్తూ
తొలిప్రయత్నాన్ని ఏమాత్రం
సవరణలున్నా సరిదిద్దుకోగలను
సూచిస్తారని ఆశిస్తూ..ఆకాంక్షిస్తూ
(మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి స్మరణలో)
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
విశాఖపట్నం
8522899458.
🙏🌷🌷🌷🌷🌷🌷🙏

13, జూన్ 2022, సోమవారం

శ్రీశ్రీ కళావేదిక టాప్ 10 ఉత్తమకవితగా

శ్రీశ్రీ కళావేదిక వారు
వృద్ధాశ్రమాలు అనే అంశంపై నిర్వహించిన 
కవితల పోటీలో నేనురాసిన *పరితప్తహృదయాలు* అనే కవిత
టాప్10 ఉత్తమకవితగా ఎంపికైన శుభతరుణం మీ అందరి అమూల్యమైన ఆశీస్సులు ఆకాంక్షిస్తూ
                ....*శ్రీమణి*
🙏🌹🌹🌹🌹🙏

12, జూన్ 2022, ఆదివారం

కొన్ని జీవితాలంతే

*కొన్ని జీవితాలంతే*

పుట్టింది
అమావాస్య చీకటికి కాదు..
అమ్మ గర్భంలోనే
కానీ అంధకారం
అక్కున చేర్చుకొంది
జగన్నాటకంలో
అభాగ్యుని పాత్రధారి మరి
పొగచూరిన బ్రతుకులు
అదృష్టం పొడసూపని
జీవితాలు
నీరెండిన ఈ కన్నులు
నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యాలు
అలమటించే
ఆ ఆకలిప్రేగులు నిత్యాగ్నిహోత్రాలు
తప్పెవరిదైనా ...
తగలబడింది మాత్రం
రేపటి భవితవ్యం
విధి బలీయమంటారా
ఈ వీధిపాలైన బాల్యం.
(ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా)
  *సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*