*రెప్పవాల్చని రాత్రి*
ఆమె ఒక రెప్పవాల్చని రాత్రి
ఓరిమి ధరించని ధరిత్రి
యుద్ధానికి సిద్ధంగా పరివర్తన
పరిణితి చెందిన పడతి
వాడి ముళ్ళదారులను అధిగమించే
ప్రయత్నంలో స్వభావాన్ని మార్చుకోవాల్సివచ్చింది
సహజసిద్ధమైన సౌకుమార్యం స్థానంలో పరాక్రమాన్ని భర్తీచేసుకుంది
తరుణి తక్షణకర్తవ్యాన్ని గ్రహించి
కాలానికి తగ్గట్టు మనుగడ పగ్గాలను
పట్టుకు అడుగులు సారిస్తుంది
ఏమరుపాటును ఏమాత్రం ఆశ్రయించదు ఏకీచక క్రీనీడ పడకుండా రక్షణకవచాన్ని
సన్నద్ధం చేసుకుంది
మానప్రాణ సంరక్షణ కోసం
ఆమె సివంగిలా రూపాంతరం చెందింది ఆడదాన్ని అమ్మలా పూజించే సంస్కృతికి అంతిమవాక్యం
రాస్తున్న రాకాసికాలానికి సమాధానంగా
ఆమె అప్రమత్తమైంది
ఏ గాలానికి చిక్కదు అప్రతిహతంగా పహరా కాసుకుంటుంది
అహర్నిశలు మేలుకొనే వుంటుంది
ఆమె ఒక రెప్పవాల్చని రాత్రి
ఓరిమి ధరించని ధరిత్రి
అఘాయిత్యాలను భరించలేని అతివ
అగ్గిరవ్వగా అవతరించింది.
*సాలిపల్లి మంగామణి( శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి