త్రిస్రగతి 6/6/6/6
నీలిమబ్బు పులకరించి
కురిసినదీ వానచినుకు
విరితావుల పలకరించి
మురిసినదీ వానచినుకు
ఆకాశం చేస్తున్న
అభిషేకం బాగున్నది
ఆకుపచ్చ సంతకమై
మెరిసినదీ వానచినుకు
తొలకరిలో తడవాలని
మనసుకెంత ఉబలాటం
మైమరపుల పరవశాలు
చిలికినదీ వానచినుకు
చిటపటమను సవ్వడితో
మధురమైన సంగీతం
చిరుగాలిని పెనవేసుకు
ఉరికినదీ వానచినుకు
ధరణీమణి చరణాలకు
చిరుజల్లుల సత్కారం
అణువణువున అమృతమై
ఒలికినదీ వానచినుకు.
*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి