*మృగశిరకార్తె..*
మురిపిస్తూ,మురిపిస్తూ
మృగశిర కార్తె
కాస్త పలకరించిందో లేదో...
పులకరించిపోయింది
సమస్త ప్రకృతి..!
మేఘమాల వచ్చి
చిరుజల్లు చిలకరించిందో...లేదో
పచ్చపచ్చని సోయగంతో
పుడమి యావత్తూ,
పురివిప్పినమయూరమై నాట్యమాడింది..!
ఎర్రని ఎండకు నెర్రెలిచ్చిన నేలసైతం సుతిమెత్తని చల్లగాలితాకిడికి
పరవశించిపోయింది..!
నిన్నటిదాకా నిప్పులకొలిమై
భగభగమండి,ఉక్కపోతతో
ఉస్సూరంటూ...
రోహిణి తాపానికి
ఠారెత్తిన ప్రాణికోటి
చినుకు ఉనికితో కొత్త
ఊపిరి పోసుకుంది..!
ఆకాశం కేసి ఆశగా చూస్తున్న
రైతన్నకళ్ళల్లో
రతనాలమెరుపేదో
తళుక్కున మెరిసింది..!
మలయ సమీరం ముదమారా
తాకగానే ప్రతి హృదయం
మైమరపుల సరాగమేదో
మధురంగా ఆలపించింది...!
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి