పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

22, జూన్ 2022, బుధవారం

మధురముగాదా

*మధురము గాదా*

ప్రియవదనా...!
నిను వలచిన నా హృదయం 
సుతిమెత్తని ఒక ఉదయమై
నీ చరణాలను స్పృశించినపుడు,
నిరతం నీ స్మరణలో తరించే
నాఅధరాలు మకరందపుఝరులై
ఆ ప్రణయ సుధా వాహినిలో 
పరవశించి ప్రవహించినపుడు,
నా అందెల రవళి,నీమోహనమురళి
శ్రుతిలయలై,
 సమ్మోహనరాగమాలపించినపుడు,
నా నీలి నీలి కురులను చేరి 
నీకరములు అలవోకగ
అరవిరిసిన వలపుల విరులల్లినప్పుడు,
వెన్నెలంటి నీ ఎద పానుపుపై
సేదదీరి నామనసంతా మైమరపుల
మదనమాయినపుడు,
కలవరమైన నా మదిలో 
నీరాక   "కల"వరమై కవ్వించినపుడు
నా మానసతీరాన్ని నీ తలపులు
మలయసమీరాలై పలకరించినపుడు
నా చెంపల్లో విరబూసిన కెంపుల్లో
నీ రూపం సాక్షాత్కరించినపుడు
ఈ కలువకన్నియ కన్నుల నిండిన 
వెన్నెల చంద్రుడు నీవై
మేనక మెరుపుకి తడబడిపోయిన 
ఆ ఋషీంద్రుడు  నీవై
నా వలపుల సడిలో తొలకరి జడివై 
సరసమాడినపుడు,
ఆహా...మధురము గాదా ఆతరుణం!
ఎదురై రాదా యమునా తీరం!
వేణు మాధవా... వలచిన నీ నెచ్చెలి 
మనసంతా మధురోహలు విరిసిన పూదోటే అదిగో మన ఆశల బృందావని
అదియే మన మది దోచిన ఆ మధువని. 

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి