మేని ఛాయదేముంది
మేలిమంటి మనసుంటే
నలుపైతేనేమిగాని
నాణ్యమైనదనే కదా నానుడి
నలుపంటే అలుసెందుకు
అసలైన సొగసంతా
దాగున్నది నలుపులోనే
నందగోపాలుడు నలుపుకాదా
వందల వేల గోపికల మదినిదోచి
వలపు రాగమాలపించలేదా
ఎలకోయిల నలుపేగా..
వీనులవిందైన తన
తియతీయని రాగంతో
వేల ఎదవీణల మీటదా...
కరిమబ్బు నలుపైనా
వాననొలకబోయదా...
పుడమి పులకరించేలా..
కాకి నల్లదైననేమి కలకాలం
కలిసుండమంటూ కడుచక్కని
సందేశం అందించదా
కాటుక నలుపైనా
కలకంఠి కంటికి ఇంపై
అందాన్ని ఇనుమడించదా
సృష్టిలోని అందమంతా
నలుపులోనే దాగుంది
నిశితమైన అనుభూతుల
స్పృశించేటి మనసుంటే..
నలుపు రంగు లేకుంటే
తెలుపుకందమేముంది
రంగులదేముంది గాని
అంతరంగమెరిగి మసలుకో
అసలైన సొబగులన్నీ
మరులుగొన్న మనసునందే
దాగున్నవి తెలుసుకో.
సాలిపల్లి మంగామణి(శ్రీమణి)
Super amma❤️
రిప్లయితొలగించండిThank you 🎉
రిప్లయితొలగించండి