పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

17, సెప్టెంబర్ 2023, ఆదివారం

వినాయకచవితి శుభాకాంక్షలు

వినాయకచవితి

తూరుపు 
తెలతెలవారక 
మునుపే,
వేకువ 
కువకువలాడక
మునుపే....
పరుగుపరుగున వచ్చె
పార్వతీ తనయుడు
అరుదెంచె మాఇంట
ప్రమద నాయకుడు 
పదేపదే పిలిచానని
కాబోలు
పలుమార్లు తలచానని 
కాబోలు
ఓ మూల తెల్లారకుండా...
పలకరించిపోదామని
పరుగెత్తుకొచ్చాడు
‌పార్వతీ తనయుడు
మము తరింపచేయాలని
తరలి వచ్చేసాడు
 వరసిద్ధివినాయకుడు
ఎలుకపైన ఎక్కలేదు
ఎవ్వరికీ చెప్పలేదు
ఏకదంతుడేకంగా
మా ఇంటికే వేంచేసాడు
పరమేశు పుత్రడొచ్చాడని
పరవశమైపోయాను
సాక్షాత్కరించాడని
సంబరపడి
సాష్టాంగ దండాలు
పెట్టాను...గానీ....
మృష్టాన్న భోజ్యాలు
ఇంకా...వండనేలేదు
పాలలో ఉండ్రాళ్ళు
వేయనేలేదు
కుడుములేమో ఇంకా
ఉడకనేలేదు
పాలవెల్లినింకా..
అమరించనేలేదు
అమ్మకైనా...చెప్పాడో లేదో
మరి....
ఆఘమేఘాలపై
వచ్చి కూర్చున్నాడు...
ఆకలేస్తుందంటూ..
ఆరాటపెట్టాడు
అరనిమిషమైనా....
ఆగలేనన్నాడు
ఇదిగిదిగో వస్తున్న
వక్రతుండా యనుచు
ఆమాట ఈమాటలో
పెట్టి చిట్టిగణపయ్యనేమార్చి
చిటికెలో వంటలను
వండివార్చాను.....
కొసరికొసరి 
వడ్డించి
ముద్దుగణపతికి
ముద్దముద్దనూ...
ముదమారతినిపించి
మురిసిపోయాను.

*అందరికీ వినాయక చవితి*
*శుభాకాంక్షలతో...*
*సాలిపల్లిమంగామణి (శ్రీమణి)*
https://youtu.be/jhIWmc66Ot0?si=cbxWVdwhrOBffhA2

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి