*పదమై నర్తిస్తూ..*
పల్లవి రాస్తున్నాను
పదమై నర్తిస్తూ
అలసినఘడియలపై
అనుభూతులు గుప్పిస్తూ
అనంతమైన అన్వీక్షావిహంగాలు
హృదయగవాక్షం తెరుచుకుని
రివ్వున ఎగిరిపోతూనే వున్నాయి
వారించగలేని ప్రేక్షకపాత్ర
చేతలుడిగి చూస్తుంది
నిన్నని మోస్తున్నానని
కనికరించదుగా కాలం
కదిలిపోతూనే వుంటుంది
భారమైన కనురెప్పలు విప్పారేలోపు
వేకువ చెక్కిలిపై చెక్కిన గురుతుల్లా
వెన్నెలచేసిన సంతకాలు
అవధుల్లేని పరవశానికి ప్రతీకలై
నిన్న తళుకులీనిన స్వప్నాలు
ఆఘ్రాణించకనే
అంతర్థానమవుతుంటే
అవలోకనం చేసుకొనే ప్రయత్నంలో
అలా అంతరంగంలో పొదిగిన
అనుభూతులను ఆర్తిగా గుమ్మరించాను
అక్షరనక్షత్రాలై కాగితాన్ని
కవనంతో అలంకరించాయి
కాలం కరిగిపోయింది
అక్షరాలా ఆక్షణం మాత్రం
చెక్కుచెదరక నిలిచిపోయింది
అందుకే అక్షరాలంటే
అంతటి అనురక్తి
నేను రాసుకొనే అక్షరాలు
ఎన్నో అంతర్జ్వలనాలకు
అనులేపనాలు
ఆశలకు ఆలంబనగా నిలిచే
నా అక్షరాలలో నేను
ఆకాశమంత
నిజానికి ఇదంతా
నా చుట్టూరా ప్రపంచం
నేను మాత్రం తలపులతో
తక్షణమే ప్రపంచాన్ని చుట్టేస్తూ
నిరంతర విహారిని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి