*ఏదీ...శ్రమరాగం*
నీరుగారి పోతావెందుకు
మంది భారమంతా తెచ్చి నీరెక్కలపై వేస్తున్నట్టు
నీరసించి పోతున్నావెందుకు
నింగిని ఎత్తి నీనెత్తిన మోసేస్తున్నట్టు
ఎందుకంత నిస్సత్తువ
నువ్వేమైనా ఎముకలు కొరికే చలిలో ఊపిరి సైతం స్తంభించేలా సరిహద్దులలో
పహరా కాస్తున్నావా..
ఎందుకంత నీరసం
కాడెద్దుల స్థానంలో నీకాయానికి
నాగలి తగిలించి స్వేద తర్పణం చేసి
సేద్యం గావిస్తున్నావా..
మంచం లేచిన మొదలు
నీ కంచం కోసం కాదూ
నీ ఆరాటం
ఆకలి తీరిందని సంతృప్తి పడితే ఆక్షణమే ఆనందం నిన్ను అక్కున చేర్చుకొనేది
అత్యాశల రోట్లో తలదూర్చి
రోకలిపోటుకు భీతిల్లే
నీకు ఓదార్చే చేతులు కావాలా
అనాయాసంగా ఫలితాన్ని అపేక్షించడం అలవాటై
అదేపనిగా రోదిస్తున్నావు గానీ నిస్తేజంలో కూరుకుపోయి నువ్వైతే
రోగగ్రస్తునిగానే కనిపిస్తున్నావు
చేవ వుండీ చేతకాని
ఆలోచన వుండీ అడుగేయని
అసమర్ధునిగా అసంపూర్ణ మానవునిగా మిగిలిపోతున్నావేమో ఆలోచించూ..
ఆరాగం ఆలపించకపోతే
ఆలంబన ప్రశ్నార్థకమే
ఆ చైతన్యం ధరించకపోతే జీవితమంతా నిస్త్రాణమే
శ్రమైక జీవన సౌందర్యంలోనే
జీవనరాగం శ్రావ్యంగా
వినిపిస్తుంది.
*సాలిపల్లి మంగామణి ( శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి