పట్టెడు మెతుకులకై పుట్టెడు అగచాట్లు .
కంట కన్నీళ్లు ,ఇంట గంజి నీళ్ళు .
భూమి పుత్రుల ఆత్మార్పణలు ,
ఎన్నాళ్ళిలా
మంచం లేచిన మొదలు లంచపు లాంచనాలు .
గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తూలుతూ
మరమ్మత్తు చేయలేని మరబొమ్మ గా మారుతున్న వైనాలు
కుప్పతొట్టికి బహూకరించిన పసిమొగ్గల ఆక్రందనలు
చీత్కారంతో అమ్మల కు నడిరోడ్డు సత్కారాలు
ఎన్నాళ్ళిలా ..
అడుగడుగునా అబలలపై అకృత్యాలు
అడ్డుకట్టలేని అవినీతి మురికి కూపాలు .
మసక బారిపోతున్న మానవత్వపు ఆనవాళ్ళు .
మర జీవనాలు,అనురాగ రహిత జీవశ్చవాలు
నల్లధనం మూటలు ,కోటలు దాటిన మాటలు
ఎన్నుకొన్న నాయకుల వెన్నుపోట్లు ,పన్నుపోట్లు
అడుగడుగునా విద్య విక్రయశాలలు .
పైసా లేక ఆసుపత్రుల్లో అసువులు బాసిన అభాగ్యులు
ప్రభుత్వంలో భుక్తాలు ,
పాలనా యంత్రాంగంలో మంత్రాంగాలు
దొంగోడే దొరలా .. నిలువు దోపిడీ విధానాలు .
నీరసించిన ధర్మపాదం .
పెచ్చుమీరిన అధర్మ వాదం .
ఎన్నాళ్ళిలా ...
రాదంటారా కలలు గన్న సమాజం .
లేదంటారా .. సుభిక్షమయిన జనజీవనం
అర్ధ రహితమంటూ .... వృధా యత్నమంటూ
ఈ వ్యవస్థ ఇంతేనని తమ మట్టుకు తలపట్టుకు కూచోక
మీ నుండే మొదలెడితే .. మార్పు అనే మరమ్మత్తు.
మన వంతుగ కృషి చేస్తే ..మాన్యమగు వ్యవస్థ తధ్యం
ప్రతీ నీవు స్పందిస్తే ప్రపంచమే మారదా ...
పట్టు వీడక ప్రయత్నిస్తే పసిడి పండదా బీడు భూమిలో ....
ప్రయత్నిద్దాం ... ప్రయత్నిస్తూనే ఉందాం .
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
http://pandoorucheruvugattu.blogspot.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి