ఉరకలేసే నా ఊహకి రెక్కలొచ్చి చుక్కల పల్లకినెక్కి నీకై వెతికింది .
నా తలపుల కోయిల పల్లవి మరచి నీ చరణాలను తాకింది .
నా ఆశల హరివిల్లు నీ సన్నిధిలోనే వెల్లి విరిసింది .
మకరందం గ్రోలుతున్న తుమ్మెదలా ...
నా మది,
మధురమైన నీ ప్రణయామృతధారలలో పరవశించి తడిచింది .
మండు వేసవిలో కూడా నీ ధ్యాస.
నా మేనును సుతిమెత్తగా తాకింది... మంచు తెమ్మెరలా !
పండువెన్నెల్లో విరబూసిన వెన్నెల కుసుమంలా !
మల్లె చెండు పరిమళాల గుభాళింపులా !
ఏ మాయ చేశావో .. ఏం మత్తు జల్లావో !
నా హృదయం అనుక్షణం, నీ చుట్టూ ప్రదక్షిణం .
నా ఉనికిని నేనే మరచి ,తరచి , తరచి ,అడుగుతున్నా !
నాలో కొలువున్న నా చెలికాడా.... నీ జాడేదని .
నన్ను నాకు కాకుండా చేసిన నా చెలికాడా ....
నువ్వు నా జత చేరే ఘడియేదని .
నీకై వెతికే నా కన్నులకు నీ సన్నిధి చేరే వరమీవా !మధుమాసపు కోయిలకై తరలొచ్చిన వాసంతంలా ....
నిన్ను తలచి మైమరచిన నీ చెలికై
ఆఘమేఘాలపై పయనించి రావా !
నీకై వేచిన నీ సఖికై . చిన్నికృష్ణా ... నిన్ను వేడుకొందు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి