మెలమెల్లగా పిల్లతెమ్మెర మేను తాకిన ఘడియ
జాబిలి మబ్బుల చాటున దాగిన వేళ
కలువ భామ చంద్రునికై వేచిన ఘడియ
సన్నజాజుల పరిమళాలతో వేయి పున్నముల వెన్నెల కురిసిన వేళ
స్వాతి జల్లుకై ముత్తెపుచిప్ప పరితపించిన ఘడియ
సంపంగిపూలు చెంత చేరి పలకరించిన వేళ
ఆ మరపురాని ఘడియాలోనే మైమరచా నిను తలచి
ఆ సుమధుర ఘడియ ..
నా మది మకరందం చవి చూసిన ఘడియ
యమునా తీరంలో పరవశించి నీ ఒడిలో తలవాల్చిన వేళ
నీ సాంగత్యపు మధుర పుటలు మది తాకిన ఘడియ
ఆ సుమధుర ఘడియ ..
నా మది మకరందం చవి చూసిన ఘడియ
నీ సుతి మెత్తని స్పర్శతో నా తనువు పులకరించిన వేళ
నా కన్నులు నీ కలలతో సరాగమాడిన ఘడియ
ఆ సుమధుర ఘడియ ...
నా మది మకరందం చవి చూసిన ఘడియ
అలవోకగా నా ఊహలు తెరచాపలా పయనించే వేళ
వింత వింత అనుభూతుల సంతకాల నా ఎద మురిసిన ఘడియ
నిత్యం నీ లోకంలో నీ కోసం నే వేచిన వేళ
ఆ సుమధుర ఘడియ
నా మది మకరందం చవి చూసిన ఘడియ
సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి