చిరుగాలి పరదాలతో చిగురుమావికొమ్మ
కుహూ కుహూ రాగాలతో చిరుకోయిలమ్మ
మైమరపుల పరిమళాలతో సిరిమల్లె పూరెమ్మ
పరవశించి వేచి ఉంది ప్రకృతిలో ప్రతీ జన్మా
ఈ ఉగాదికై ఈనవ సంవత్సరాదికై
జయం జయం మాకంటూ అభయం మాకిమ్మంటూ
నీ రాకతో జయగంటలు మ్రోగిస్తూ గత అనుభవాల చేదు ఖేదాన్ని మరపిస్తూ
ఈ మధుమాసం మధుకలశం మనకోసం తేవాలని
జయ జయ ధ్వానాలతో, హర్ష ధ్వానాలతో
ఆహ్వానిద్దాం ఈనవ ఉగాదిని, ఆశీశ్సులిమ్మందాం మన జయ సంవత్సరాదిని
ఈ నవ వసంతం ప్రతి జీవితాన నవ ఉషస్సు నింపాలని
ఈ చైత్రం మన జీవన పధానికి చైతన్య రధం కావాలని
మానవాళిలో మానవతా పరిమళాలు వెదజల్లాలని,
మానవాళి భవిత ప్రజ్వలింప జేయాలని
చిరునవ్వుల హరివిల్లులు ప్రతి ముంగిట విరబూయాలని.
సిరుల జల్లు విరిజల్లై ప్రతియింటా కురవాలని
ఉదయించే ప్రతి దినం మనకు ప్రవర్ధమానమవ్వాలని,
వేసే ప్రతి అడుగు ప్రగతి పసిడి బాట కావాలని
ప్రకృతిలో ప్రతి జీవి పరవసంతో ఉండాలని
అలసిన మా హృదయాల పాలిట సేద తీర్చగ కల్పతరువై రావాలని
ఆహ్వానిద్దాం ఈనవ ఉగాదిని ఆశీశ్సులిమ్మందాం మన జయ సంవత్సరాదిని
అన్నదమ్ములం మేం విడివడినా గాని
అమ్మ కాంక్షించే జయాలనే అమ్మకు అంకితం ఇవ్వాలని
నూతన రాష్ట్రంలో నూతనంగా అడుగిడుతున్న
ఈ ఉగాదిని ఆనందం తెమ్మందాం
జయములనిమ్మందాం ఈ జయ సంవత్సరాదిని.
తీపిని చేరువ చేస్తూ కారం దూరంచేస్తూ,
పులుపును కలగలిపేస్తూ
చేదు కటువుల్లో మధువును పూస్తూ
వగరును చిరునగవులతొ వారిస్తూ
ఉప్పును సరిపాళ్ళుగ పోస్తూ షడ్రుచులను
మన జీవిత విస్తరిలో కొసరి కొసరి వడ్డిస్తూ
జయమనే పానీయం మనకందించమంటూ
ఆహ్వానిద్దాం ఈనవ ఉగాదిని ఆశీశ్సులిమ్మందాం మన జయ సంవత్సరాదిని
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి