మదన గోపాలా నా మది దోచిన ముగ్ధమొహన గోపాలబాలా
వందలు వేలు చెలియలు నీకున్నారేమో ! నిన్నే వలచిన ప్రియసఖినేను
మరువము,మల్లెలు దోసిట నింపి నీకై నిలుచున్నా
మంచి ముత్యాలు కూర్చి సరముగ నీ రాకకై నిరీక్షిస్తున్నా
సిరి చందనాల పరిమళాలు నీపై చిలుకరించగ కలవరిస్తున్నా
బెల్లం చిట్టి అటుకుల తాయిలాలు నీకోసం దాచుంచి
వెన్నముద్దలు , జున్నుముక్కలు మక్కువనీకని పదిలంగా ఉంచా
నెమలికన్నువింద్యామరతో నీకు సేద తీర్చ వేచి ఉన్నా ..
యమునా తీరంలో నీకై నిలువెల్ల కనులుగా వెతికి వెతికి అలసి పోయా
నీ మురళీగానం ఆలకించాలని నా ఆణువణువూ కలవరించె
నిద్దుర మరచిన నా కన్నుల్లో వద్దన్నా .. నీ రూపే
నిన్నే వలచిన నా హృది ఏమో ! నన్నే వదలి తరలెల్లిపోయింది . నువ్వున్న తావులకై .
వలదన్నా వినకుండా నా అధరాలు నీ నామమే జపిస్తున్నాయి .
ఏ చోట నువ్వు దాగున్నా , వేగిరంగా నాకై రారా ... మురళీలోల .. ముద్దుగోపాలా
ముచ్చట తీర్చగ ఎచ్చటనున్నా ... నీ నెచ్చెలి చేరగ తక్షణమే రా .. రమ్మని
మధురా నాయకా మనమొహన కృష్ణా .. .. నిన్ను వేడుకొందు .
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి