పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

3, మార్చి 2014, సోమవారం

మది మకరందం చవి చూసిన ఘడియ





మనసున  మల్లెలు   విరిసిన  వేళ

మెలమెల్లగా పిల్లతెమ్మెర  మేను  తాకిన ఘడియ 
జాబిలి  మబ్బుల   చాటున  దాగిన వేళ 
కలువ భామ చంద్రునికై వేచిన ఘడియ 
సన్నజాజుల  పరిమళాలతో  వేయి పున్నముల వెన్నెల  కురిసిన వేళ 
స్వాతి జల్లుకై  ముత్తెపుచిప్ప  పరితపించిన  ఘడియ 
సంపంగిపూలు  చెంత చేరి పలకరించిన  వేళ 
ఆ  మరపురాని  ఘడియాలోనే మైమరచా నిను  తలచి 
ఆ  సుమధుర ఘడియ .. 
నా మది మకరందం  చవి చూసిన  ఘడియ 
యమునా తీరంలో పరవశించి  నీ ఒడిలో తలవాల్చిన  వేళ 
నీ సాంగత్యపు మధుర పుటలు మది తాకిన  ఘడియ 
ఆ సుమధుర ఘడియ .. 
నా  మది మకరందం  చవి చూసిన  ఘడియ 
నీ సుతి మెత్తని  స్పర్శతో  నా  తనువు  పులకరించిన  వేళ 
నా కన్నులు నీ  కలలతో  సరాగమాడిన  ఘడియ 
ఆ సుమధుర  ఘడియ ... 
నా  మది మకరందం  చవి  చూసిన  ఘడియ 
అలవోకగా  నా ఊహలు తెరచాపలా  పయనించే  వేళ 
వింత వింత  అనుభూతుల సంతకాల నా ఎద  మురిసిన  ఘడియ 
నిత్యం నీ లోకంలో  నీ కోసం  నే వేచిన  వేళ 
ఆ సుమధుర ఘడియ 
నా మది మకరందం  చవి చూసిన ఘడియ 
   
సాలిపల్లి  మంగా మణి @ శ్రీమణి 

2, మార్చి 2014, ఆదివారం

ప్రియతమా ...... ( ప్రతి కన్నె మనసు నిరీక్షణ )





ప్రియతమా ... ప్రియతమా 
నీవే నా  ప్రేమకి  చిరునామా ... 
నా  తలపుల  వనములో 
విరబూసిన పారిజాతమా .. 
నా  జీవన బృందావనిలో 
వినిపించిన  వేణుగానమా .. 
నా  గుండె గొంతుకలో పలికిన  మృదు సరిగమా 
నా మనసుని శృతి చేసిన  వీణానాదమా 
నా  మదిలో  మెదిలే మధుర  భావమా 
నా  కన్నుల కదిలిన పసిడి స్వప్నమా 
నా  ఊహల  ఒదిగిన నా ప్రాణమా 
మమతను పంచిన  మధురానురాగమా 
ఇల దిగి వచ్చిన  వెన్నెల చంద్రమా 
నా కనుపాపల  కదలాడే చిరు  ప్రతిబింబమా .. 
నా  మనసుని గురి చూసిన  మదనుని బాణమా 
నిరతం  నా అధరం  నీ మననం 
ప్రతీ  క్షణం  నా హృదయం  నీ స్మరణం 
నీ  ఊహలు  నా చెంతనుండగ  దరి చేరదు ఏ  మరణం 
నీకై   వేచిన  క్షణాలు  వేయి యుగాలై నను వేదిస్తుంటే 
వలపులదారుల్లో  నీకై  వెతుకుతున్నా 
వలచిన వరుడా నీకై వేచి  ఉన్నా ... 

సాలిపల్లి మంగామణి @శ్రీమణి              


1, మార్చి 2014, శనివారం

నా తలపుల వనంలో ( పరువంలో ప్రతి హృదయపు భావన ఇది )







ఎటు  చూసినా  నీ  సడి . 
ప్రతీ జడి నీ అడుగులనే  నే  తడబడి ,
నా  మదిలో  ఒక మధురమయిన  అలజడి . 
జడివానలా .... ప్రతి రేయి  నిద్దుర  కొరవడి 
నా కన్నుల .
నీ  చిలిపి  ఊహల  ఒరవడిలో 
నే  తల వాల్చా ... నులివెచ్చని  నీ ఒడిలో ... 
అది ఒక వెన్నెల నిండిన  వలపుగది . 
అది జంట హృదయాల  మైమరపుల  మధుర  ఘడియది 
ప్రతీ  క్షణం  నీ  సాంగత్యం . 
కోరుతోంది  నా మది  అనునిత్యం . 
మచ్చలేని  జాబిలిలా 
అచ్చం నీ రూపమే అచ్చు గుద్దినట్లున్నది   నాఎదలోగిలిలో ...... 
నవ మల్లికా  కుసుమాల గుచ్చం 
విచ్చుకొన్నట్లున్నది  నా చిన్ని మదితోటలో .. 
కటిక చీకటిలో కూడా నీ రూపం  మిణుగురులా 
మిణుక్కుమంటూంటే  ...........
నీ  తలపుల పలకరింతలే నాలో వలపుల  కలవరింతలై 
వేణుగానమాలకించినట్లున్నది 
ఏమరపాటులో నేనుంటే ఏదో మత్తును  చిలకరించి  
నీ  ఊహల  సయ్యాటలో అమాంతం నను దోచేసి 
నీ వలపుల  దారులకై అజ్ఞాతంగా  నడిపిస్తూ 
నా  మనసు  శృతి  లయ  నీవై 
ప్రణయరాగాలు పల్లవింపచేస్తున్నావు 
నిరీక్షించలేకున్నా  నిమిషమాత్రమూ  నీకై 
ఆలశ్యం  దేనికి ప్రియతమా ! 
ఆశలతీరం  చేరడానికి . 
రెక్కలు  తొడిగి రాలేవా ...  నీ నెచ్చెలి దరి  చేరడానికి . 
                                                                           
                                                    సాలిపల్లి మంగామణి @ శ్రీమణి 
                                                                 
                             


28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

అరకు అలివేణి





ప్రకృతి పాదానికి  పచ్చని పారాణి 
మేటి సొగసుల రాణి  అరకు అలివేణి .... 
జలజల  పారే  జలపాత సరాగాల
గున్నమావి వంకలోంచి  ఆమని  రాగాల .... 
కొండల్లో ,కోనల్లో సెలయేటి సంతకాల . 
ధరణి  ధరించిన పసుపు జరీచీరలా ..... 
అరవిరిసిన వలిసెల   సొగసుల . 
అలరారే  మేటి సొగసుల రాణి , అరకు అలివేణి . 
వళ్ళు  జల్లుమన  పిల్లగాలుల ,
వన్నెల, చిన్నెల వంపుల దారుల 
గిరి  కన్నియల  చిరు ధరహాసాల 
మనసు మలిచిన  మధుర కవితలా .............
అలరారే  మేటి  సొగసుల రాణి ,అరకు అలివేణి . 
అరుణ  కాంతుల  తాకి   మంచు తుంపరలు  మంచిముత్యాల్లా ... 
ఎద  దోచే  పూదోటల  పరిమళాల 
బంతుల ,చామంతుల  తోడ  ఇంతుల  మంతనాల , 
ఝుమ్మని  పాడే  తుమ్మెద పాటలా ........ 
అలరారే  మేటి సొగసుల రాణి   అరకు  అలివేణి . 
     
ఇంతటి  సౌందర్యం  మా  సీమాంధ్రలో ఉన్నందుకు  
గర్వంతో  ఉప్పొంగిన హృదయంతో ...
                                                            
                                                           సాలిపల్లి మంగామణి  @ శ్రీమణి
                                                  

27, ఫిబ్రవరి 2014, గురువారం



 బ్లాగరు  సహోదరులందరికి  మహాశివరాత్రి  శుభాకాంక్షలు 
                               
                                             శ్రీమణి 

24, ఫిబ్రవరి 2014, సోమవారం

కలవరమాయే మదిలో


చిలుకమ్మ  అడిగింది  చిగురాకుని
చిరునవ్వు వెల  ఎంతని....  ?
భ్రమరమ్ము అడిగింది సుమ బాలని
తన నోరూర్చు  మధువేదని ... ?
చిరుకోయిల  అడిగింది  వాసంతాన్ని
తనను కరుణించగ  రావా ........అని .
కలువభామ  అడిగింది  చందమామని
తనను  చుంబించు ఘడియేదని ... ?
తరచి తరచి  అడిగింది పడతి  ప్రకృతిని
తనను  జత చేరు  వరుడేడని ......?
సహజమే కదా ... వరాన్వేషణలో
పరువంలో ప్రతి ప్రాణికి .......
కలవరమాయే  మదిలో ...
                                                       
                                                               శ్రీమణి
       

                  

23, ఫిబ్రవరి 2014, ఆదివారం

స్నేహ సౌగంధం







సృష్టిలోని బంధాలకే బహు అందం  స్నేహం . 
జత మనసులు  విరబూసిన  సౌగంధం స్నేహం . 
ఆప్యాయతానురాగాల  సిరి గంధం  స్నేహం . 
మధుర  సుమధుర మధురాతి  మధుర  మకరందం  స్నేహం . 
జన్మ జన్మాల  నిలిచేటి ఆనందం స్నేహం . 
వెల  కట్టగలేని  అమూల్య గ్రంధం  స్నేహం . 
మొగ్గ  విరిసి పుష్పమైన రీతి 
మనసు కలిసి స్నేహమౌను .... 
ఆ కుసుమం చిగురు కొమ్మన  మెరిసినటుల 
మన స్నేహం   జీవిత చరమాంకం   వరకు  నిలవాలి ... 
ఆ సుమం  పలువురికీ పరిమళాలు పంచినటుల 
మన  స్నేహం  అందరికీ  ఆదర్శం  కావాలి ..... 
కానీ ,
ఆ  పూవు  వాడిపోయినా , రూపు మారిపోయినా 
మన స్నేహం  మాత్రం  చిరకాలం చిగురించాలి ...... 
ఈ స్నేహ సుమం  వాడని  కుసుమం 
అని  మరచి పోకు  నేస్తమా ...... 
నను విడిచిపోకు  మిత్రమా .... 
                                                           శ్రీమణి 


22, ఫిబ్రవరి 2014, శనివారం

నా చిన్ని హృదయమా ....



ఓ  చిన్ని  హృదయమా ..... !
నా.... చిన్ని హృదయమా .......... 


నీకెన్ని  ఊహలే .... 
ఎన్నెన్ని  ఊసులే 
ఎంతటి  నెరజాణవే 
ఎంతెంత  మాయలాడివే ...
మైమరపున  జాబిలితో  విహరిస్తావు 
నీలి మబ్బునీడలపై నిదురిస్తావు 
ఆకసాన హరివిల్లు పై  అలిగి  కూర్చుంటావు 
తారల  నడుమన  చేరి  తళుకును   నేనంటావు 
ఆదమరచి  నే  నిదరోతుంటే మధుర  స్వప్నమై యెదురొస్తావు 
నా కనులు గప్పి విహంగమై  విహరిస్తావు 
మందలించి  నా మాట వినమంటే బుంగమూతి  పెడతావు 
నీ కోసం  నేనా  నా  కోసం  నీవా అన్నప్పుడు 
నిజానికి  నువ్వే  నను  నడిపించేది  
నువ్వే నను శాసించేది 
గుప్పెడంత  నా  హృదయమా  
నీ  చప్పుడు  ఆగిన  మరు నిమిషం 
నా ఉనికే  శూన్యం 
అందులకే  చెబుతున్నా  నా మనసా నీకభివందనం

                                                        శ్రీమణి 

20, ఫిబ్రవరి 2014, గురువారం

సౌందర్య పరవశం




తెలతెల్లగ తెల్లారగ  ఉలిక్కిపడి లేచింది .  
తారల పందిరిలో  శయనించిన  కన్నెభామ . 
ఎందైన, ఎందైనా ,ఎందెందైన  నాకు సాటి ఎవరన్నది ?
నాకు దీటు  రారన్నది ..... 
తన సౌందర్య  పరవశాన  తానె ముగ్దురాలైనది . 
పంచాభూతాలపై  నాట్యమాడుతానన్నది ..... 
సింధూరపు  భానుడనే నా నుదుటన తిలకం  దిద్దెద . 
వెండి మబ్బునే  నా నడుముకు  చీరగ చుట్టెద . 
నెలవంకనె  అలవోకగ నా మెడలో ఆభరణం  చేసేస్తా ..... 
గంగా ,యమునా , కృష్ణా ,పెన్నా ........... 
నదులేవైనా , సెలయేర్లైనా 
అన్నీ  నా  చెలరేగిన  కురులే కదా ....... 
సప్తసంద్రాలన్నా ,లక్షద్వీపాలైనా 
కొండలైనా,కోనలైనా ...... కోయిలమ్మ కూతలైనా 
అన్నీ , నా అందానికి  తీరుగ  దిద్దిన  తుది మెరుగులు కావా .........
అని  చిరునగవును చిలుకరించె పులకరిస్తూ ..........  
పడచుమనసు .... 
                                                            శ్రీమణి 

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

నేనెవరో తెలుసా ..... ...... ?



నేనెవరో   చెప్పుకోండి ?

పచ్చని  ప్రకృతి ఒడిలో 
పచ్చికపై  జాలువారు  కిరణం నేను .... 
పున్నమి రాతిరిలో  మనసును మైమరపించే 
వెండి వెలుగు జిలుగును  నేను ...... 
విరిసీ విరియని  రోజా రేకున 
ఊగిసలాడిన  హిమబిందును నేను ...... 
సంకురాతిరి సందె  వెలుగులో 
పడతి  వాకిట  తీర్చిదిద్దిన రంగవల్లిని నేను ....... 
పురి విప్పిన మయూరానికి  వయ్యారాల  నాట్యం నేర్పిన 
అచ్చర నర్తకి అచ్చంగా  నేనే ..................... 
ఆకాశంలో ఆ సప్త వర్ణాల హరివిల్లు నేనే ...... 
కొండాకోనల్లో తుళ్లిపడ్తూ  ఉరకలు వేసే సెలయేరునూ  నేనే ... 
అంతెందుకు . ప్రకృతి ప్రతి అందానికి  ప్రతిరూపం  నిజంగా నేనే .. 
విరజాజి నేను,  విచ్చిన   చామంతి  నేను,
ఎగిసే అలను , కురిసే జడిని ,, ప్రకృతి  ప్రతి  ఆకృతిని  నేనే ... 
సాక్షాత్తూ  ప్రతి పడచు హృదయంలో కదలాడే ఊహను నేను.   

16, ఫిబ్రవరి 2014, ఆదివారం

ప్రజాస్వామ్య ఫలాలు



ప్రపంచాన సాటి లేని ప్రజాస్వామ్య దేశమంటూ 
పొగుడుతారు భారతాన్ని . విశ్వమంతా ...
అది పరిపూర్ణ ప్రజాస్వామ్యమనుటలో ... వాస్తవమెంత ?
దాస్యశృంఖలాలు తెంచుకోని ,
మహామహుల త్యాగంతో తెచ్చుకొన్నాం స్వాతంత్ర్యం .
రాజు లేని రాజ్యంగా ప్రకటించాం గణతంత్రం ...
ఆంగ్లేయుల పాలనల మాకొద్దని ,
మా రాజ్యానికి మేమే రారాజులమన్నాం .
ప్రజాస్వామ్యం సాధించామని ప్రగల్భాలు పలికాం 
నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పడరాని పాట్లు పడ్తున్నాం.
తెల్లదొరల పాలనలో బానిస బ్రతుకైనా బ్రతికాం .
నేటు ప్రజాస్వామ్య రాజ్యంలో బ్రతుకే బరువాయెకదా ..
అడుగడుగున స్వార్ధం తో అల్లాడుతున్న వ్యవస్థ .
అవినీతి రాజ్యమేలుతోంది నేటి మన ప్రజాస్వామ్య వ్యవస్థని .
నోట్ల వ్యామోహంలో ఓట్లనమ్ముకొంటున్నాం .
మద్యంమత్తుల్లో నాయకులనెన్నుకొంటున్నాం .
చేతులారా మన తలకి మనమే కొరివి పెట్టుకొంటున్నాం .
దొరికినంత దోచుకొని దొర అవుతాడొక్కడు
తినడానికి తిండి లేక భిక్షమెత్తుతాడొకడు .
ఇదీ నేటి మన ప్రజాస్వామ్య సమానత్వ నమూనా :
ఆకలి చావులు చీకటితావులు ,
రైతులవెతలు ,అబలల కన్నీటి కతలు ,
నేటిస్వాంతంత్ర్య పంట ఫలాలు .
పదవులకై పోరాటం ,ఆధిపత్యానికై ఆరాటం ,
నీతిమాలిన రాజకీయం ,
ఇదీ నేడు ప్రజాస్వామ్య భారతీయం ... 
అయినాకాని ...
ఆసన్నమాయెను అనువైన సమయం :
నీ ఓటు అనే మహాయుధం పూని ,
సమర్ధ నాయకుని ఎన్నుకోని ,
నీకున్న ప్రజాస్వామ్య ఫలాలను అందిపుచ్చుకొని ,
ప్రక్షాళన చేసేద్దాం పాతుకుపోయిన పాపాన్ని .
విమోచన కల్పిద్దాం బ్రష్టు పట్టిన జాతికి ...
కూకటి వేళ్ళతో పెకలిద్దాం అవినీతి కలుపు మొక్కల్ని .
చేయి చేయి కలుపుదాం ప్రజాస్వామ్యం పరువు నిలబెడదాం ......

                                                                                                                                                                                                        శ్రీమణి 

యువత-దిశానిర్దేశం




కదలిరా యువతా మనం కలలుగన్న ప్రపంచానికి
అవనిపై అదృష్టవశాత్తూ లభించిన
ఈ మానవ జన్మకు అర్ధం పరమార్ధం కల్పించడానికి
ప్రతి జీవికి జననం మరణం తధ్యం కానీ,
నడుమ నీవు సాధించే ఘనతే కదా సత్యం
ఓ యువతా నీ బంగరు భవితకు ఆధారమే నీ నడత.
నేనెంత నేనెంత ఈ అనంత మానవాళి జీవితాలు మార్చుటకై,
కష్టాలు కడతేర్చుటకై అనుకోకు
నేనే అంతా, నాదే ఈ విశ్వమంతా అనుకుంటే
మార్చలేనిదేదీ ఈ జగాన?
కటిక చీకటిలొ చిరుదివ్వెలా ప్రకాశాన్ని అంధించు.
కలుషిత వ్యవష్థపై నీ యువశక్తి బాణాన్ని సంధించు
రేగింగులు, ఈవు టీజింగులు మాని
చేజింగులు చెయ్ నీ లక్ష్య సాధనకై
అమ్మా నాన్నల ఆశలు ఆవిరి చేయొద్దు,.
అమవాస్య చీకటికి చేరువ కావద్దు
కారు చీకట్లు ముసురుకొన్నా, కరవుకాలం ముంచేస్తున్నా
అవినీతి రక్కసి కోరల్లో చిక్కుకు పోవద్దు
దోపిడి, దొంగతనం నీకేలా?
దొర మార్గాలుండగ, నువు పయనించేందుకు!
పొరుగు దేశాలకై పరుగులేల? అగ్ర రాజ్యాలకై వలసలేల?
నిను మోసిన నీ కన్న తల్లికి, జన్మభూమికి వన్నె తేవలెరా,
భరతదేశపు కీర్తి దిగ్దిగంతాలలో మారుమ్రోగేలా
నిరుద్యోగం నిరుద్యోగం అని చింతించకు,
అందిపుచ్చుకో మనకున్న అపార వనరులు నీ చెంతకు
సద్వినియోగం చెయ్ క్రొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని.

ఇనుమడింపచెయ్ నీ దేశ ప్రగతిని
గమ్మత్తులు చూడాలని మత్తుల్లొ తూలేవో,
మరమ్మత్తు చేయలేని మరబొమ్మై మిగులుతావు
ప్రతిదినం ఎదో ఒకచోట అత్యాచారం
ఇది ప్రస్తుత మన వ్యవస్థ గ్రహచారం
మానవత్వం పరిమళించగ మార్పు రావాలి ప్రతి మనిషి నుండీ,

రూపుమాపేందుకు ఈ దురాచారం
పాశ్చాత్య పోకడలు మనకేల,
జగద్విఖ్యాతి చెందిన సంస్కృతి సాంప్రదాయ రీతులు మనకుండగా
జాతి వర్ణ కుల వివక్షతలనే జాడ్యాలు మాని
ఐకమత్యమెనే అస్త్రాన్ని పూని
యువాతా నీవు దూసుకుపో సమసమాజ నిర్మాణం వైపు
కళకళ లాడే భరతావనిలో కల్పతరువై వర్ధిల్లు.
కలనైనా కలుపుమొక్కవు కావద్దు
ఓ యువతా, రేపటి ఉషోదయాన ఉదయించే భానుడివై రా,
అవినీతి, అక్రమాల అణచివేయు రుద్రుడివై రా
సభ్య సమాజనికి ఆదర్శం నీవై జాతిని జాగృతం చెయ్,
ప్రగతివైపు అడుగు వెయ్ జాతి రత్నమై


                                                                                                  శ్రీమణి 

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ప్రేమా చిరునామా




ఎల్లలు  దాటిన  అనురాగానికి  చిరునామా 
కల్లలెరుగని అనుబందానికి  నిర్వచనం  ప్రేమ 
ఆకాశంలా  హద్దుల్లేనిది 
మాట  మూగబోయినా ... 
మనసు గలగల  ఊసులాడే మౌన భాష  ప్రేమ . 
కనులు లేకపోయినా  
ఎద  లోపల  కదలాడే మధురానుభూతి  ప్రేమ . 
జత మనసులకూపిరి పోసే 
అమృత జలధార  ప్రేమ 
కటిక చీకటి పైన కూడా  వెలుగురేఖలు 
కుమ్మరించే  నవకాంతి కిరణం  ప్రేమ 
కనురెప్పలు  దారి తెరచి 
ఎద లోపలి గుడి  తెరచి  
తను కోరుకున్న  ప్రతిరూపం  
పదిలం  చేసే  అపురూపమైన దర్పణమే  ప్రేమ 
సమస్త సృష్టి  స్థితి లయకు  ఆధారం ప్రేమ 
ఇరు హృదయాల  ఆకర్షణ  కాదు ప్రేమ  
ఆరాధన  ప్రేమ, ప్రేమతో  ప్రేమించు, ప్రేమకై జీవించు 
జీవితాంతం ప్రేమగా జీవించు 
ప్రేమకై ప్రేమతోనే  ప్రేమగా ప్రేమించు 
నమ్మకం, విశ్వాసమనే  మూలస్తంభాలేసి 
మూడు ముళ్లు  ఏడుఅడుగులు ప్రమాణాల  మనువే పరమావధిగా 
మనసులు ముడి వేసుకొనే ముచ్చటైన  ప్రేమకు  పరమావధి

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు
      
                                                                           శ్రీమణి