పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

27, ఆగస్టు 2026, గురువారం

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

అన్న హృదయం హిమశిఖరం
చెల్లెలు సాక్షాత్తూ మమకారపు
మణిమకుటం
నా అనే బంధం
నేనున్నాననే
సంబంధం
తోడబుట్టిన అనుబంధం
అమ్మలోని సగం
నాన్నలోని మరో సగం
కలబోస్తే అన్నదమ్ముల అనురాగం
చెల్లి కంటిలో చిప్పిల్లిన 
కన్నీటిచుక్క
నేరుగా అన్న హృదయాన్ని
చెమరిస్తుందంటే
సోదరి మోమున విరిసిన చిరునవ్వు
సహోదరుల జీవితాల్లో
కోటిదివ్వెలను వెలిగిస్తుందంటే
అదే కదా అద్వితీయ అనుబంధం
అన్నదమ్ముల శ్రేయస్సుకోసం
అహర్నిశలు ప్రార్ధించే ఆచేతులు
మమతల దారంతో కట్టే కంకణం
సురక్షాకవచమై
విరాజిల్లుతుందంటే
ఆడపడచుల సౌభాగ్యం కోసం
అన్నదమ్ములు కురిపించే
అనురాగం అర్ణవమై
వెన్నంటిన అదృష్టమై
ఆశీర్వదిస్తుందంటే
అది కదా రక్షాబంధనం
ఆ అపురూపమైన ఘట్టానికి
వేదికగా ఆనందాలవేడుకగా
అలరారుతున్న ఈదినం
అదికదా రక్షాబంధనం

ఎదురుగా ఉన్నా
ఏడు సంద్రాల ఆవల వున్నా
ఈచెల్లి హృదయం మాత్రం
నీ చుట్టూనే అన్నా...
నిరంతరం నీ క్షేమం కోరుకుంటూ...
నీ చెల్లి

అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలతో
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
మరిన్ని కవితలకోసం వీక్షించండి 
శ్రీమణి కవనసమీరంలో 
https://youtu.be/oWFzVC4JPMo?si=3UuK4bEP90Jbv0W8


22, ఆగస్టు 2026, శనివారం

మానవ జీవన ప్రస్థానం

మానవ జీవన ప్రస్థానం

​జీవితం ఒక అష్టావధానం!
జీవన ప్రయాణంలో అడుగడుగునా ఎదురైన
అవరోధాలను అధిగమిస్తూ
సమర్థవంతంగా సాగిపోవడమే మనిషిగా మన కర్తవ్యం.
​జీవితంలో తారసపడే ప్రతి సంఘటనా పృచ్ఛకుడై
సమస్యను సంధిస్తూ ఉంటే...
సమయానుకూలంగా స్పందిస్తూ,
సముచిత సమాధానాన్ని సమర్థవంతంగా
అశువుగా అందిస్తూ గమనం సాగించడమే మన కర్తవ్యం.
​అప్పుడప్పుడు మనం నడిచే దారుల్లో
రాళ్ళూ ముళ్ళూ గుచ్చుకుని వేధిస్తూ ఉంటాయి.
అక్కడక్కడా పూల పరిమళాలు
మనలను సుతిమెత్తగా తాకి మైమరపిస్తూనూ ఉంటాయి!
​కష్టాలైనా సుఖాలైనా, కలిమైనా లేమైనా...
ఏమైనా గాని అధిగమిస్తూ సాగిపోవడమే జీవనం
నిలదీసే అసంబద్ధాలూ ఉంటాయి,
కలవరపెట్టే అసందర్భాలూ ఉంటాయి...
సమయస్ఫూర్తితో, నైపుణ్యంతో దూసుకుపోవాలి!
​జీవితమనే మహోత్కృష్టమైన పద్యాన్ని పూరించాలంటే...
రమ్యంగా మలచడానికి వర్ణనలూ ఉంటాయి,
చైతన్యం నింపడానికి చమక్కులూ ఉంటాయి.
నిషిద్ధాక్షరాలు నిలదీస్తూ ఉన్నా,
న్యస్తాక్షరాలు నాట్యమాడుతున్నా,
పొంతన లేని దత్తపదులూ దాడిచేస్తున్నా...
అనుభవాలను పొదివి పట్టుకొని
బదులిస్తూ సాగడమే మానవ జీవన ప్రస్థానం!
​— సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం
నా మరిన్ని కవితలు నా గొంతులో విధానాలను కొంటే వీక్షించండి శ్రీమణి కవనసమీరంలో 
👇👇👇👇👇👇👇
https://youtube.com/@srimanikavanasameeram?si=gsYiwS1d5nvQWKsz

11, ఆగస్టు 2026, మంగళవారం

నేనొక గేయం

హృదయానికి గాయమైనపుడల్లా
నేనొక గేయమౌతాను
నేలకొలికిన కన్నీటిచుక్కకు
నేస్తమల్లే మారిపోతాను
ఒక్కొక్కసారి రాస్తూ రాస్తూ
కవితలోనే కరిగిపోతాను
ఆర్తి నిండిన హృదయవీధిలో
అగ్నిశిఖలకు తాళలేక
అక్షరాలను ఆశ్రయిస్తాను.

*సాలిపల్లి మంగామణి (శ్రీమణి)*
నా మరిన్ని కవితలు వినడం కోసం 
వీక్షించండి శ్రీమణి కవనసమీరంలో 
🙏👇👇👇👇👇🙏
https://youtube.com/@srimanikavanasameeram?si=NnTuDhhl7OuFZ8yK