పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

12, మే 2016, గురువారం

సఖా !నీకోసం.


సఖా !నీకోసం.నిలువెల్లా వేచా!కన్నుల  వెన్నెల్లో నిన్నే కొలిచా!
ప్రియసఖా!నీకోసం హొయలన్నీ దాచా!ఊహల ఉయ్యాలలో 
వెచ్చని నా ప్రాయం పదిలంగా  నీకై పరిచా !
వేయివేయి కలలను నా కన్నుల్లో మోసా.. 
చేయిచేయి కలుపుకొన్న గురుతులు గుండెల్లో గుప్పుమంటూ 
గుబులు రేపుతుంటే,హాయిహాయి నిట్టూర్పులు తనువంతా తడిమేస్తే 
మోయలేని నా ప్రాయం నీ కోసం వేచియుంది. 
 యమునా తీరంలో సవరించిన నా కురుల సాక్షిగా .. 
చేసుకొన్న ప్రమాణాలు మరచీ పోతివా ,
పొతే పొనీలెమ్మని నన్నిడిచిపోతివా !
నీ సమ్మోహన రూపంతో నన్నావహించీ,ఇప్పుడు  కినుక వహించి 
చప్పుడు చేయక ఎక్కడ దాక్కున్నావు?భావ్యమేనా ...
ముగ్ధ మోహనాంగినని,నను తెగ పొగిడావు. 
ముద్దమందారమని ముద్దాడావు. 
ముత్యాల మురిపాల తడిపేసావు. 
అచ్చంగా దొంగల్లే దోచుకెళ్ళావు,నా హృదయాన్ని నీతో తీసుకెళ్ళావు 
దోబూచులాడుతున్నావు,సఖా !దొంగాటలాడుతున్నావు. 
బాసలు మరిచావో,లేక భామల నడుమ మదనుడివయ్యావో 
పొన్న చెట్టు నీడలో నీకు వెన్న పెట్టినప్పుడు,నేనెన్నటికీ నీవాడనని 
నిన్నెన్నటికీ  వీడనని, చేసుకొన్న బాసలు మరిచావా! మదనమోహనా 
నిలువెల్లా కనులై , తనువంతా నీ వలపుల తలపులై 
అణువణువులోనూ... నిన్నే చూస్తున్నా.. 
ప్రతీ క్షణం .. నీకై నిరీక్షిస్తున్నా 
నిర్లక్ష్యం సేయక ఆఘమేఘాల పై 
పయనించి రావా ... నీ రాధకోసం నిమిషంలో రావా ... 
నిలుపవా నా ప్రాణం...కృష్ణా!నీ రాకను కానుక చేసి 
నీ మురళీ సుధా రవళీ రసమున  నను ఓలలాడించి 
                            
                                       ( రాధ నిరీక్షణ  మాధవునికై )
                                                      సాలిపల్లి మంగామణి@ శ్రీమణి 

9, మే 2016, సోమవారం

అమ్మను అయితే అయ్యాను,గానీ ......????????????




అమ్మను అయితే  అయ్యాను,గానీ ... 
ఏదో సంధిగ్ధంతో సతమతమవుతూనే ఉన్నా ...
 నా బిడ్డడు ,రాముని తలపించే  ఆదర్శమూర్తిగా అవతరిస్తాడో .. 
 రక్కసుడల్లె  కర్కశుడే  జనియిస్తాడో ?
కన్నతల్లికి, జన్మభూమికి   ఖ్యాతి పెంచే  రత్నమల్లె మెరిసిపోతాడో ..    పుడమి  తల్లికే కే పెను భారమయ్యే కరుడు గట్టిన  పాషాణమల్లే  పరిణమిస్తాడో , 
కన్నవారినీ ,కాలరాసే  కాల యముడికి ఊపిరోస్తానో .. 
కలియుగానికి ఆలవాలమవు   అపర రావణున్నే ఇలకు తెస్తానో ,
కీచకుడే పుడతాడో ,సమాజానికి పట్టిన  చీడపురుగుల్లో ఒకడికి నేనే తల్లవుతానో ,
ఒక మానవత్వమూర్తినే కని  తెగ మురిసిపోతానో .. 
మహాత్ముడు కాకున్నాగాని,మంచికి ఊపిరిపోసే మాన్యుడైతే చాలు .  
నలుగురితో  నారాయణ కాదు  . పలువురికోసం  ప్రాణాలిచ్చే ,
జన్మభూమికి వన్నె తెచ్చే , 
అనాకారియైనా ఆనందమే ,అహంకారి కాకుంటే సరి . 
ఆ యమ్మ కన్నబిడ్డ కనకమనిపించాలి .
కనకనే . కునుకే కరువయి  ఓ  అమ్మ పడే    ఆరాటం . 
పాపో ,బాబో తెలిపే పరికరాలు పుట్టెడు ఉన్నా , పట్టెడు మెతుకులు పెడతాడని ,
మంచికిమారుగా పుడతాడని ,చెప్పే యంత్రం ఉంటే బావుండుకదా !
 చీడ పురుగునుకడుపులోనే కాలరాసి ,
మానవత్వం పరిమళించే మాన్య బిడ్డకు జన్మనిచ్చి ధన్యమవదా ..ప్రతి కన్నతల్లి .   (సమాజంలో జరుగుతున్న అరాచకాలకు భయభ్రాంతురాలైన నిండు గర్భిణి ఆవేదన )
.నిజానికి పుట్టినప్పుడు ప్రతీ బిడ్డా పరమ పావనుడే ,ఏ బిడ్డా జన్మతః దుర్మార్గుడు కానేకాదు . 
 బుద్ధి నెరిగిన నాటి నుండే , వక్రమార్గపు వెతుకులాటలు .,వెర్రితలలు వేస్తున్న అక్కర లేని  ఆధునికతల ముసుగుల్లో , వింత వింత పోకడలు , మత్తుల్లోమునిగిపోయి  మతిభ్రమించి పరిభ్రమించేరు అభినవ కౌరవుల్లా .. 
అందులకే చెబుతున్నా .. 
తల్లులార మీ బిడ్డల భవితకు బంగారు తాపడాన్ని మీరే అద్దాలి . 
తల్లి తలచిన కాని కార్యము లేదు జగాన తనయుల తీర్చి దిద్దుటలో ..... రేపటి పౌరునిగా మలచుటలో .. 
ఉగ్గుపాలు , ముద్దు మురిపాలతో ,పాటు 
మానవత్వపు పాలు  రంగరించి పెంచి చూస్తే  ప్రతీ తల్లి . 
పెడత్రోవకెక్కడ తావుంది ?ప్రేగు పంచుకొన్న బంధానికి ?
మన సుసంపన్న సంస్కృతినీ ,సాంప్రదాయ రీతులనీ ,నైతిక విలువల్నీ, అక్షరాభ్యాసంతో పాటూ అవపోసన పట్టిస్తే ,
ఆణిముత్యమల్లే మారడా ... అమ్మా ,నాన్నల కనుల వాకిలిలో 
 కోరుకొన్న భవితవ్యం రంగవల్లిగా తారసపడదా  .  ఏ ఆధునికత ప్రభావమైనా ,పెచ్చు మీరిన సాంకేతిక విజ్ఞానమైనా ,తల్లి నేర్పిన మొదటి పాఠపు పరిజ్ఞానం ముందు పటాపంచలయిపోదా . దుష్టలోచన దూరమవదా ..  
 ఎన్ని యుగాలు మారినా ,ఒక కన్న తల్లి   సంకల్పిస్తే ,ప్రతీ బిడ్డ  పసిడి తుల్యం . 
సమాజ ప్రక్షాళనలో ప్రముఖ పాత్రధారిణి  మాతృమూర్తి .  నవ సమాజ నిర్మాణంలో క్రియాశీలి ఒక తల్లే . 
అందుకే , తల్లి చూపిన సన్మార్గమే రేపటి కల్మష రహిత సమాజానికి వారధి . ప్రతీ తల్లీ సారధే ..  రేపటి భావి భారత పసిడి రధానికి .  మొక్కై  వంగనిది . మానై వంగునా .. అంటూ ఊరక కూచోక 
 నారులోనే మానవత్వపు నీరుపోసి ,మంచి మార్గం నిర్దేశిస్తే , నిక్కంగా కొంగు బంగారమే ,అమూల్యమైన బహుమానమే,అమృత ఫల నైవేద్యమే 
ప్రతీ బిడ్డా ..  పరమ పావన భారతావనికి . (అవునంటారా నా మాటలను , కొట్టి పారేస్తారా నీతులని )           
                                                            సాలిపల్లిమంగామణి @శ్రీమణి 

6, మే 2016, శుక్రవారం

ఊరట కావాలా ?


పడి లేచే కెరటానికి ఇసుమంతైనా లేదే అలసట..  
నిత్యం వీచే గాలికి ఏనాడంట ఊరట?
నిత్యం ఘోషించే సంద్రానికి నోరెండిపోతుందా ?
అలుపెరుగకఅవనిని  పాలించే ఆ సూరీడుకి ఆటవిడుపు ఏనాడు?
నిశిరాతిరి అయినా నిదురేది,తీరిక కుదిరేది , ఆ రేరాజుకి 
నేలతల్లి తల్లడిల్లి భారంమోయనంటూ చేతులెత్తేస్తే చేసేదేముంది . 
ఆఆకాశం వేసారి రాజీనామా చేస్తుందా !తనవల్ల కాదంటూ.. 
నీలిమబ్బు శలవంటూ..
 వీడుకోలు పలికితే చుక్క ఒలుకుతుందా... 
పుడమిన నీటిచుక్క మిగులుతుందా ... 
నిత్యం పరుగెడితే నీరసమొస్తుందందా!సాగే సెలయేరు. 
అమ్మ నొప్పులనోర్వను,నేనంటే నీ ఉనికెక్కడ ఉంది. 
పరోపకారార్ధం ప్రకృతిలో ప్రతి అణువు శ్రమియిస్తే .. 
మనకోసం మన మనుగడ కోసం చేసే మన  కర్తవ్యంలో 
ఎందుకంత అలసట?ఎందుకు కావాలి ఊరట ,
ఆశావహ ధృక్పదంతో అడుగులు వేస్తూ ఉంటే.. 
అనుకొన్నది. ఆసన్నమవదా... అరనిమిషంలో ... 

                                                            సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

5, మే 2016, గురువారం

ఎన్నాళ్ళిలా ..?


ఎన్నాళ్ళిలా ..?
 పావలా బతుకులో  ముప్పావలా వెతలు
 పట్టెడు   మెతుకులకై పుట్టెడు అగచాట్లు . 
 కంట కన్నీళ్లు ,ఇంట గంజి నీళ్ళు .  
 భూమి పుత్రుల ఆత్మార్పణలు ,
 ఎన్నాళ్ళిలా.. ?
 మంచం లేచిన మొదలు లంచపు లాంచనాలు . 
 గమ్మత్తులు చూడాలని మత్తుల్లో తూలుతూ 
 మరమ్మత్తు చేయలేని మరబొమ్మ గా మారుతున్న వైనాలు
 కుప్పతొట్టికి బహూకరించిన పసిమొగ్గల  ఆక్రందనలు 
  చీత్కారంతో తల్లిదండ్రులకు నడిరోడ్డు సత్కారాలు 
  ఎన్నాళ్ళిలా .. ?
 అడుగడుగునా అబలలపై  అకృత్యాలు 
  అడ్డుకట్టలేని అవినీతి మురికి కూపాలు . 
  మసక బారిపోతున్న మానవత్వపు  ఆనవాళ్ళు . 
 మర జీవనాలు,అనురాగ రహిత జీవశ్చవాలు 
 నల్లధనం మూటలు ,కోటలు దాటిన మాటలు 
 ఎన్నుకొన్న నాయకుల వెన్నుపోట్లు ,పన్నుపోట్లు 
 అడుగడుగునా  విద్య విక్రయశాలలు . 
 పైసా లేక ఆసుపత్రుల్లో అసువులు బాసిన అభాగ్యులు 
 ప్రభుత్వంలో భుక్తాలు ,
 పాలనా యంత్రాంగంలో మంత్రాంగాలు 
  దొంగోడే దొరలా ..   నిలువు దోపిడీ విధానాలు . 
 నీరసించిన ధర్మపాదం . 
 పెచ్చుమీరిన  అధర్మ వాదం . 
 ఎన్నాళ్ళిలా ...?
 రాదంటారా కలలు గన్న సమాజం . 
 లేదంటారా .. సుభిక్షమయిన  జనజీవనం 
 అర్ధ రహితమంటూ  .... వృధా యత్నమంటూ 
ఈ వ్యవస్థ ఇంతేనని తమ  మట్టుకు తలపట్టుకు కూచోక 
మీ నుండే మొదలెడితే  .. మార్పు అనే మరమ్మత్తు.  
మన  వంతుగ కృషి చేస్తే  ..మాన్యమగు  వ్యవస్థ తధ్యం 
 ప్రతీ నీవు స్పందిస్తే ప్రపంచమే మారదా ... 
 పట్టు వీడక ప్రయత్నిస్తే పసిడి పండదా బీడు భూమిలో .... 
 ప్రయత్నిద్దాం ... ప్రయత్నిస్తూనే ఉందాం . 


                                                           సాలిపల్లిమంగామణి @శ్రీమణి  
                                            http://pandoorucheruvugattu.blogspot.in




1, మే 2016, ఆదివారం

సమిధనయినా...చాలు!









 శ్రీశ్రీ నాటిన అభ్యుదయ సాహితీ వనంలో ..
నేనొక గడ్డి పూవునయినను చాలు . 
ఆ అభినవ సూరీడు నడిచిన దారిలో......
        ఇసుక రేణువునయినను చాలు
ఆ అభీకుని కలం విదిల్చిన మహా ప్రస్థానంలో 
చిరు సిరా బొట్టు నయిననూ చాలు . 
ఆ కవీంద్రుని  కలాన జారినకావ్యంలో  ....... 
     నేనొక అక్షరమయిననూ చాలు . 
ఆ దార్శనికుని కవన సంద్రాన 
 ఎగిసిన అలనయినా చాలు . 
           భాదిత జనాల బాసట  నిలువగ,
           పీడిత జనాలకూపిరులూదగ ,
   ఆ అభీకుడు తలపెట్టిన 
మహాయజ్ఞం ప్రజ్వలించుటలో 
సమిధనయినా మేలు. 
ఆ మహనీయుని ఆశయాల సాధనలో 
నా  ఉడత సాయమందిస్తా ... 
సమ సమాజ స్థాపనలో ,
నా చిరు కవితాస్త్రాన్ని  సంధిస్తా .... 
(నాలుగో తరగతి నుండే శ్రీశ్రీ గారి కవితల్లో అర్ధాన్ని గ్రహిస్తూ,
వారినే అనుకరిస్తూ చిరు ప్రాయం నుండీ శ్రీశ్రీ గారి ఏకలవ్య శిష్యురాలిగా నన్ను నేను ఒక విప్లవకవితతో కవయిత్రిగా మలుచుకొన్నా... వారి జయంతి సందర్భంగా 
నివాళులర్పిస్తూ.......సాలిపల్లిమంగామణి  @శ్రీమణి  
                                             కళావేదిక కల్చరల్ &ఛారిటబుల్ ట్రస్ట్ 
                                                                                 సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

                                                                                (కళావేదిక కల్చరల్ &చారిటబుల్ ట్రస్ట్ )

29, ఏప్రిల్ 2016, శుక్రవారం

పొగడజాల! సొగసరీ....


కొండమల్లి, బొండుమల్లి, చిలిపి చెండుమల్లి, ,
బొడ్డుమల్లి, ,కాడ మల్లి,జిలిబిలి జాజిమల్లి 
దొంతరమల్లి ,పందిరి మల్లి, నాజూకు మల్లి 
నిత్యమల్లి ,కంచె మల్లి,ఓ నాగ మల్లి 
   శంకుమల్లి,ఝుంకామల్లి, చిరునవ్వుల   సిరిమల్లీ.. 
 ఓ సిరిమల్లీ,మా మరుమల్లీ 
 మైమరపులతుళ్ళే, తొలి వలపుల వల్లీ, 
  ఇంచక్కా మళ్ళీ వచ్చేసావు
ఎంచక్కా.. మనసును గిల్లీ గిచ్చేసావు.   
 వింత వింత మాయేదో చేసావు 
 మనసంతా మత్తులతో  దోచేసావు . 
  నవ వధువుకు  వలపుల కానుక తెచ్చేసావు 
నులు సిగ్గుల మొలకల్లె  కులికావు 
జత కౌగిట నాయిక నీవు 
అందచందాల సిరిగంధ సుమమే నీవు
ఆనాటికీ ,ఈనాటికీ ఏ నాటికైనా 
సుతిమెత్తని పరిమళాల సొగసరి నీవేనట  
 సీతమ్మవాకిట్లో మెరిసినావట  
 రామయ్య చరణమ్ముల మురిసావట 
మనసున మల్లెల మాలలూగెనని 
తేనెల జారిన పాటల్లే,పల్లవించినావట  
గుడిలో ,వాలుజడలో 
ముడిలో, సొగసరి ఒడిలో 
సిగ్గు దొంతరలో,ముత్యాల ముగ్గులఝరిలో 
మధురోహల మాలికలో మరుమల్లికా 
కన్నెగుండెలో కవ్వింతల కదలికా 
అందచందాల సిరిమల్లికా 
నీ జాడలేక,
చిన్నబోదా ఆ జాబిలి. ఆతారక 
దోసిలిలో చిరు మల్లీ 
తనువంతా వెదజల్లి 
తన్మయాన తనువంతా 
 పులకింతల గిలిగిలి,
ప్రకృతిలో సొగసంతా  అగుపించద 
 మా  కన్నుల ముంగిలి . 
అందులకే!ఓ మల్లికా           
నువ్వు వలపుల  తొలకరివి 
యేమని కొనియాడగలను,నీ సౌందర్య సోయగాన్ని 
ఎంతని వర్ణించగలను నీ వలపును, వలపుల  బోణీ          
 పొగడజాల !సొగసరీ 
మూగబోతి నిన్నుజూసి, నీ సుమ సుగంధ పరిమళాల 
పరవశమొంది 

      
                                      సాలిపల్లిమంగామణి@శ్రీమణి 

27, ఏప్రిల్ 2016, బుధవారం

నేను అమ్మను!


నేను  అమ్మను , 
ఒకప్పుడు ఆబ్రహ్మ చేసిన బొమ్మను , 
తదుపరి అమ్మ గర్భంలో ఒక కమ్మని కదిలికను , 
ఆనక  నాన్నకన్నుల్లో  ఆనందపు చెమ్మని ,
మొన్న..  నా వలపుల రేడుకి ముద్దు గుమ్మని , 
నిన్న, బిడ్డకి  జన్మనిచ్చిన అమ్మను ,
ఆ తరువాత,అక్షరాలు దిద్దించి మంచి చెడులు నేర్పించిన , మొదటి పంతులమ్మను ,
కొత్త పదవి తో... అయ్యాను అత్తమ్మను , 
ఆనక ,పిట్ట కధలు చెప్పే బామ్మను . 
చివరి మజిలీ చేరే నాటికి  నేను అమ్మను కాను, ఎవరికీ ఏమీ కాని వ్యర్ధమైన జన్మను 
బిడ్డలకడ్డొచ్చిన  అవిటి బొమ్మను , 
అంగట్లో విసిరేసిన  దూళి , దుమ్మును.  
(మొన్నటి ఈనాడు దినపత్రికలో అంధురాలైన కన్న తల్లిని నిర్ధాక్షిణ్యంగా నడి రోడ్డు మీద  వదిలెళ్లిన నయ వంచకుల్లాంటి బిడ్డలను కన్నప్రతీ తల్లి కన్నీటి రోదన ఎలా ఉంటుందో.. అర్ధం చేసుకొని వార్ధక్యంలో తల్లిదండ్రులనెప్పుడూ  అక్కున చేర్చుకోవాలే గాని అంగడి పాలు చెయ్యొద్దని చేతులెత్తి వేడుకొంటూ ...   )

                                               సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

25, ఏప్రిల్ 2016, సోమవారం

ఆ.... నెలరాజెవరో ?



నిన్నటి సన్నటి కల నీ కలయికతో కమ్మని వాస్తవమై కళ్ళ ముందు నిలిచింది. 
సన్నజాజి తీవెలా నీ ఊహల తావుల్లో సన్నాయిరాగమాలపించింది. 
అది విన్న నా హృదయం  నీసందిట నిలిచింది. 
నులివెచ్చని నీతలపుల జడి నా వలపై  కురిసింది. 
మరు క్షణమే మరుమల్లికయై మది పరిమళాలు రువ్వింది .
తక్షణమే నాలో  నిరీక్షణం నీ రాకకై నా ప్రతీక్షణం 
క్షణం క్షణం బరువై,  అది నిద్దుర కరువై, మది నీకు చేరువై, 
కన్నార్ప లేకున్నా !కనుపాపలో  నీ రూపు నిట్టూర్పు అవుతుందని,
జాబిలీ అలిగింది జామురాతిరైనా గాని నీ ధ్యాసే ఏమని ?
సంగతేమిటంటూ సంపంగి సరసమాడింది.  
తరచి తరచి వీచింది మలయ సమీరం .ఇది ప్రణయ సరాగమని సందడి చేస్తూ 
 ఉన్నదేమిటంటూ..  గున్నమామి రుసరుసలు.  
 వన్నెలాడి కధ యేమని వెన్నెలమ్మ మిసమిసలు 
 చిన్న మాట చెప్పమంటూ ఝుంటి తుమ్మెదమ్మ బుసలు 
 చెంత చేరి కోయిలమ్మ కుహుకుహూ ఊసులు. 
 గుట్టు విప్పమంటూచుట్టూ చెలియల  గుసగుసలు. 
 నిన్నా... మొన్నా ఎరుగని వింత ఏమిటంటూ 
 బుగ్గల్లో సిరి చందనాల నిగ్గు దేనికంటూ 
 కన్నుల్లో మిన్నంటిన సందడేమిటంటూ 
 ఈ నెచ్చెలి  మెచ్చిన  చక్కని చెలికాడెవరంటూ...  
 మేటి విలుకాడు ఎవరంటూ ?
 అన్నులమిన్నకు సరిజోడి  వెన్నెల రాజెవరంటూ ?
 ఆ.... నెలరాజెవరంటూ ?
 పలకలేక మూగబోతి  ముద్దబంతినయితి . 
ముగ్ధనయితి, ఆతని ముగ్ధ మోహన రూపాన్ని తలచి, 
నులు సిగ్గుల మొగ్గనయితి వలపుల రేడును వలచి       
కలువభామనయితి,చలువల రేడును తలచి. 
 ఇంతకీ అతడెవరో తెలుసా !
ఆ జతగాడెవరో తెలుసా !
(పరువంలో ప్రతీ హృదయం ప్రణయంలో పడినప్పటి ప్రేమికుడే అతడు )
                                                         
                                                                                సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

24, ఏప్రిల్ 2016, ఆదివారం

అమ్మ పెట్టిన అరచేత గోరింట.

మరువగలమా! ఆనాటి గురుతులు 
వెలగట్టలేని మరులు,మాణిక్యాలు .
చేరిపేయగలమా! చెంగల్వ పూవులవి 
అమ్మణ్ణి ఆటల్లో గుమ్మాడిపూలు. 
ఎంత భాగ్యము నాది ,
కన్నుల పంట నైతి తల్లి గోదారి ఇంట.
 నిన్నటి తేనెల ఊటల తేటలు ఇంకా 
నా అధరపుటంచుల చవులూరిస్తుంటే 
ఆనాటి ఆపాత మధురాలు ఆపాదమస్తకం 
పులకరింతలతోటి తడిపేస్తూ ఉన్నాయి. 
ఎంత మధురమాపాతమధురాలు,
చింత తెలియని చిరుప్రాయ కధనాలు. 
అమ్మ పెట్టిన అరచేత గోరింట అది ఎంత మధురం
కమ్మకమ్మని అమ్మమ్మ నేతివంట ఎంత మధురం
తాతయ్య కాళ్ళపై గుమ్మాడి ఆట మధురం
కొమ్మ కొమ్మల దాగి కోతికొమ్మచ్చి ఆట మధురం
చిమ్మ చీకటివేళ అమ్మ లాలియను పాట మధురం 
గోధూళి వేళల్లోనర్తించు  గొబ్బిళ్ళ గౌరమ్మ మధురం
తల వాకిట్లో మెరిసేటి  ముత్యాల ముగ్గెంత మధురం
చెరువు గట్టున జుర్రిన తాటిముంజెల తేటెంత  మధురం
 మర్రి ఊడలతోటి ఉయ్యాల సయ్యాటలెంత మధురం 
ఏటి గట్టున విన్న ఎలకోయిలమ్మల  పాట ఇంకెంత మధురం
మచ్చుతునకలు మరి ,మరువగలమా... 
ఆణిముత్యాలసరులవి విడువగలమా... 
గుర్రు పెట్టిన తాత మీసాల ఆట. 
కర్రిఆవుల పొదుగుల్లో పొంగి పొర్లిన పాల తేనియల ఊట. 
 గిర్రుగిర్రున రంగులరాట్నాల మోత. 
తుర్రుమంటూ తూనీగల వెంట తుంటరి వేట. 
చద్దిబువ్వలోనంజు  ఘాటు ఆవకాయ మంట. 
అవ్వ పక్కలోరువ్విన  పిట్టకధల చిటపటా. 
మరువగలమా !మరి చిరునవ్వుల చిట్టా 
చేరిపేయగలమా !అది పసిడి వెన్నెల మూట 
( మొన్ననా పుట్టినూరు పండూరు  వెళ్ళిన తరుణంలో 
 చవిచూసిన అమూల్యమయిన అనుభూతి 
అది అమ్మ చేత పెట్టించుకొన్న నా అరిచేత గోరింటాకు 
అది మీ అందరితో పంచుకోవాలనే ఆరాటంతో..... )

                                                                    సాలిపల్లి మంగామణి @శ్రీమణి 






గోరింటాకు

19, ఏప్రిల్ 2016, మంగళవారం

నీకై !



ఎటు చూసినా గిరులే,పచపచ్చని తరులే 
ఎటు చూసినా విరులు, మరులుగొలుపు ఝరులు 
ఎటు చూసినా ప్రకృతి రాసిన ప్రణయ ప్రబందాలే 
ఎటు చూసినా హృదయంగమమవు మలయ సమీరాలే 
ఎటు చూసినా తుళ్ళింతలు, కేరింతలు, గిలిగింతలే , చక్కిలిగింతలే 
వింత వింత అనుభూతుల నా మది సాంతం ప్రశాంతమై ప్రకృతిలో మమేకమై 
విహంగమై విహరించా వినీల గగనం వైపు 
అలా అలా అలలా 
ఉరకలు వేసే నాహృదయంలో  ఒక ఊపిరి ఊగిసలాడింది 
తన్మయమొందిన తరుణంలో తారసపడినది ఒక ప్రణయం  
అది నా మువ్వల  సవ్వడిలో వినిపించిన మానసరాగంలా 
తీయ తీయని వలపుల  మైమరపును జల్లిన మధుపంలా 
తెలియని హాయిని పరిచయ పరచిన అభినవ మదనుని బాణంలా
 వన్నెల సూరీడు చిందిన నవ ఉషస్సువెలుగుల జడిలా  
పున్నమి రేరేడు జల్లిన వెండి వెన్నెల జిలుగుల వానలా 
పడచు వాకిట పరచుకొన్న విరజాజి పరిమళంలా 
కలల మాటునా !కనురెప్పచాటునా కన్నుగీటుతూ పలకరించిన
అరవిరిసిన నా పరువానికి కొత్త అనుభూతిని పంచిన ప్రాయంలా 
ఎదురయ్యింది . 
 అలా నా కన్నె మనస్సులోకి
 కమ్మని కావ్యంలా అరుదెంచిన మరు క్షణం ,
నాలో మొదలయింది నిరీక్షణం 
వేవేల వర్ణాల హరివిల్లు లో నీవు 
చలువల రేడు ప్రతిబింబంలో నీవు 
కలువల సరసన సరసుల్లో నీవు 
చిటపట  చినుకుల చిరుజడిలోనీవు 
నా కన్నె మనసు అలజడిలో నీవు 
ఏ వలపుల వలపన్నావో !!
నా తలపుల తలమునకలు చేసావు. 
సవరించిన నా కురులు సాక్షిగా 
నీ జాడ గానక నిమిషమయినా గాని 
నిలువజాల !
నా తుది శ్వాస వరకు నా ఉనికి నీ కొరకే 
సప్త సంద్రాల ఆవల నీవున్నా .. 
నే సప్తపదులు నడిచిన నీకై నిరీక్షిస్తూనే ఉంటా ... 

                                                             సాలిపల్లి మంగా మణి @శ్రీమణి 




18, ఏప్రిల్ 2016, సోమవారం

నీటిచుక్కా... నీకు అభివందనం



తూరుపు గోదారమ్మ బిడ్డన్నేను 
వన్నె తరిగిన కన్నతల్లిని గాంచి
కన్నీరు మున్నీరయ్యాను 
తల్లడిల్లీ నేను  తెల్లబోయాను
నిత్య కళ్యాణి నిట్టూర్పు వింటూ 
ఓదార్పు లేని ఒంటరయ్యాను  
పసిడి పంటలతల్లి బీటలేస్తుంటేను 
ఖసి తీర నాగుండె పిసికేసినట్టుంది 
పచ్చపచ్చని పైరులెండిపోతుంటేను 
చూస్తున్న నా గుండెగొంతెండిపోయింది 
కువకువల రాగాలు కల్లలవుతుంటే 
గలగల సవ్వడులు  కలలై కదిలిపోతుంటే
 కళ్ళెదుట మరుభూమి సాక్షాత్కరించింది 
చెమ్మగిల్లిన అమ్మ గోదారి కన్నుల్లో 
చిమ్మ చీకటి నాకు కానవచ్చింది 
వెల్లువల గోదారి వెలవెల బోతేను 
వెన్నెల్లో చందురునీ జాడ లేనట్టుంది. 
అమ్మ ఒడిలో సేద దీరలేమింకంటే 
జన్మమెందుకు ఫలములేదనిపించింది 
 ప్రచండభానుని కీలల్లో జలరాశులు జ్వలితమయిపోతుంటే 
గ్రుక్కెడు నీళ్ళు లేక బిక్కుబిక్కున   తనువులొదిలి పాడిపశువుల 
కళేబరాల కనులార గాంచి 
నిలువెల్లా ,,, కూలబడి చూస్తున్న నిస్త్రాణ గోదారి 
నిర్జీవ కళ గాంచి కనుల ముందే కటిక చీకటి గోచరించింది 
కోరలిప్పిన కరువు రక్కసి 
ఉక్కు చెరలో చేతలుడిగిన గోదారమ్మను చూస్తే 
బ్రతుకు వ్యర్ధమనిపించింది.కానీ... ఆలోచిస్తే 
మానవ తప్పిదానికి మారణ హోమం సమాధానమో 
కలియుగాన పెల్లుబికిన కల్మషాల ప్రతీకార శాపమో 
ఆ"కలి" ఆకలి ఘీంకారమో 
ప్రకృతిపై మానవ వికృత చర్యకు పర్యవసానమో 
మహోగ్ర రూపం, మహా ప్రతాపం
ప్రజ్వలించిన ప్రచండ భానుని ప్రళయ ప్రకోపం 
కనుచూపు మేరల్లో కానరాని పచ్చదనం 
అడుగంటిపోతున్నది. అమ్మఅమృత స్థన్యం 
ఇప్పటికయినా మేలుకొందాం .
తప్పిదాలను మన్నించమందాం . 
పచ్చదనాన్ని పెంపొందిద్దాం . 
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం . 
నేటి నుండే నడుం బిగిద్దాం . 
నీటి చుక్కను ఒడిసి పట్టుదాం. 
కరువు రక్కసి డొక్క చీల్చుదాం. 
మనిషొక్క మొక్కనయినా నాటి పెంచుదాం 
గోదారమ్మకు కల నేరవేరుద్దాం 
కళకళ,గలగల మళ్ళీ తెద్దాం 
కన్న బిడ్డగా తల్లి కమ్మని కల నెరవేరుద్దాం ... 
                                          సాలిపల్లిమంగామణి@శ్రీమణి 

17, ఏప్రిల్ 2016, ఆదివారం

మళ్ళీ రావా ...


నిశిరాతిరి మిసమిసలో నిశ్శబ్ధపు తెరలు  చిదిమి
నామది మదియించి  నులువెచ్చనిపదనిసల తడిమి  
తలవాకిట నిలుచున్నావు. తలపులలో వలపుల వల పన్నావు . 
నిదురించిన  నా కనుదోయికి మృదు మధురపు 
 అధరామృతాన్ని అదిమి, నా పరువానికి తొలి పరవశాన్ని 
 పరిచయ పరిచావు . 
ఆదమరచిన నామదికి ఏదో  
మధురోహల పరిమళాన్ని చిలుకరించి పలుకరించినావు
కమ్మని నిట్టూర్పుల విందును చవి చూపించి 
కవికందని అందాలను కనువిందును  చేసి 
రవికందని మిసిమిని  నా దోసిటబోసి .
తనువంతా విద్యుల్లతగావించి,
అణువణువున అద్భుతాలనాపాదించి, నను అబ్బురపరచి 
అంతలోనే వస్తానని అటుగావెళ్లావు . తుళ్ళి పడిన నా మనసుకు 
మళ్ళీ తారసపడనే లేదు. జాబిలి మాటున దాగావో 
నీలి మేఘాల సరసన చేరి సరసమాడుతున్నావో 
తొలి ప్రణయ సరాగమే నీవో  ?విరి తేనియ జలపాతపు ప్రవాహమే నీవో 
మలి సంధ్యలా మారి మళ్ళీ వస్తావని 
తనువంతా కనులను చేసి  నీ కై ఎడతెగక ఎదురు చూస్తున్నా 
"కల"వేమోనని,నువ్వూ  కలవే మోనని .. కలవైనా గాని 
నీకై కలవరిస్తూనే ఉన్నా .. కలగా నైనా ... కలయికగా నయినా 
నా కనులకు కలిసొచ్చిన కానుకవై మళ్ళీ రావా ... 
తుళ్ళే నా మనసును మళ్ళీ మైమరపించగ .
నన్నే మురిపించగ,మరిపించగ 
మరువంపు తెంపరవై,మకరంధపు తుంపరవై 
మళ్ళీ రావా ... తుళ్ళే నా మనసుకు మళ్ళీ వసంత పున్నమివై !
(పరువపు ప్రాయంలో ప్రతి హృదయపు నిట్టూర్పు)
                                                  సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి