పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

18, ఏప్రిల్ 2016, సోమవారం

నీటిచుక్కా... నీకు అభివందనం



తూరుపు గోదారమ్మ బిడ్డన్నేను 
వన్నె తరిగిన కన్నతల్లిని గాంచి
కన్నీరు మున్నీరయ్యాను 
తల్లడిల్లీ నేను  తెల్లబోయాను
నిత్య కళ్యాణి నిట్టూర్పు వింటూ 
ఓదార్పు లేని ఒంటరయ్యాను  
పసిడి పంటలతల్లి బీటలేస్తుంటేను 
ఖసి తీర నాగుండె పిసికేసినట్టుంది 
పచ్చపచ్చని పైరులెండిపోతుంటేను 
చూస్తున్న నా గుండెగొంతెండిపోయింది 
కువకువల రాగాలు కల్లలవుతుంటే 
గలగల సవ్వడులు  కలలై కదిలిపోతుంటే
 కళ్ళెదుట మరుభూమి సాక్షాత్కరించింది 
చెమ్మగిల్లిన అమ్మ గోదారి కన్నుల్లో 
చిమ్మ చీకటి నాకు కానవచ్చింది 
వెల్లువల గోదారి వెలవెల బోతేను 
వెన్నెల్లో చందురునీ జాడ లేనట్టుంది. 
అమ్మ ఒడిలో సేద దీరలేమింకంటే 
జన్మమెందుకు ఫలములేదనిపించింది 
 ప్రచండభానుని కీలల్లో జలరాశులు జ్వలితమయిపోతుంటే 
గ్రుక్కెడు నీళ్ళు లేక బిక్కుబిక్కున   తనువులొదిలి పాడిపశువుల 
కళేబరాల కనులార గాంచి 
నిలువెల్లా ,,, కూలబడి చూస్తున్న నిస్త్రాణ గోదారి 
నిర్జీవ కళ గాంచి కనుల ముందే కటిక చీకటి గోచరించింది 
కోరలిప్పిన కరువు రక్కసి 
ఉక్కు చెరలో చేతలుడిగిన గోదారమ్మను చూస్తే 
బ్రతుకు వ్యర్ధమనిపించింది.కానీ... ఆలోచిస్తే 
మానవ తప్పిదానికి మారణ హోమం సమాధానమో 
కలియుగాన పెల్లుబికిన కల్మషాల ప్రతీకార శాపమో 
ఆ"కలి" ఆకలి ఘీంకారమో 
ప్రకృతిపై మానవ వికృత చర్యకు పర్యవసానమో 
మహోగ్ర రూపం, మహా ప్రతాపం
ప్రజ్వలించిన ప్రచండ భానుని ప్రళయ ప్రకోపం 
కనుచూపు మేరల్లో కానరాని పచ్చదనం 
అడుగంటిపోతున్నది. అమ్మఅమృత స్థన్యం 
ఇప్పటికయినా మేలుకొందాం .
తప్పిదాలను మన్నించమందాం . 
పచ్చదనాన్ని పెంపొందిద్దాం . 
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం . 
నేటి నుండే నడుం బిగిద్దాం . 
నీటి చుక్కను ఒడిసి పట్టుదాం. 
కరువు రక్కసి డొక్క చీల్చుదాం. 
మనిషొక్క మొక్కనయినా నాటి పెంచుదాం 
గోదారమ్మకు కల నేరవేరుద్దాం 
కళకళ,గలగల మళ్ళీ తెద్దాం 
కన్న బిడ్డగా తల్లి కమ్మని కల నెరవేరుద్దాం ... 
                                          సాలిపల్లిమంగామణి@శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి