పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

5, ఏప్రిల్ 2016, మంగళవారం

మరులు దొరలుతున్నట్లు !( మదిలో)

         
మరులు దొరలుతున్నట్లు
విరులు వింధ్యామరలై వీస్తున్నట్లు
కురులు మరుమల్లెలతో ఊసులాడుతున్నట్లు
ఒకపరి పరువం పరుగులు తీస్తున్నట్లు
మకరంధపు  ఝరిలో  తడిచి ముద్దయినట్లు
సిరి గంధం మేనంతా చిలుకరించినట్లు
సరిగమలే సరాసరి నా మానసరాగాలై న్నట్టు
అల్లిబిల్లి ఊహల హృదయం  ఉక్కిరిబిక్కిరి అవుతూ
పురి విప్పిన మయూరమై నా హృదయం పరవశిస్తుంటే
చిగురాకుల చిరుగాలి సరసమాడ సరసకు వస్తుంటే
ఊహలకందని తేనెల ఊటలు నా ప్రాయానికి చవులూరిస్తుంటే
తళుకుల తారల నడుమన అచ్చర నేనన్నట్లు
దివి రాల్చిన సౌందర్యపు తునకను నేనన్నట్లు
రవి ప్రభాత కిరణంలో జిలుగు వెలుగు నేనన్నట్లు
కవి రాసిన కావ్యంలో నాయిక నేనన్నట్టు
ప్రకృతిలో అణువణువున అందానికి అధిదేవతనయినట్టు
ఉన్నది ఏమీ లేదన్నట్లు,లేనిది ఏదో ఉందన్నట్లు
ఇది మాయో,ఏం వింత హాయో
తెలియదుగాని,  ఆ హాయి ప్రతీ హృదయం
పరువపు ప్రాయంలో  అనుభవించే ఉంటారనుకొంటా  ....

                                                  సాలిపల్లి మంగామణి @శ్రీమణి




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి