పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

25, ఏప్రిల్ 2016, సోమవారం

ఆ.... నెలరాజెవరో ?



నిన్నటి సన్నటి కల నీ కలయికతో కమ్మని వాస్తవమై కళ్ళ ముందు నిలిచింది. 
సన్నజాజి తీవెలా నీ ఊహల తావుల్లో సన్నాయిరాగమాలపించింది. 
అది విన్న నా హృదయం  నీసందిట నిలిచింది. 
నులివెచ్చని నీతలపుల జడి నా వలపై  కురిసింది. 
మరు క్షణమే మరుమల్లికయై మది పరిమళాలు రువ్వింది .
తక్షణమే నాలో  నిరీక్షణం నీ రాకకై నా ప్రతీక్షణం 
క్షణం క్షణం బరువై,  అది నిద్దుర కరువై, మది నీకు చేరువై, 
కన్నార్ప లేకున్నా !కనుపాపలో  నీ రూపు నిట్టూర్పు అవుతుందని,
జాబిలీ అలిగింది జామురాతిరైనా గాని నీ ధ్యాసే ఏమని ?
సంగతేమిటంటూ సంపంగి సరసమాడింది.  
తరచి తరచి వీచింది మలయ సమీరం .ఇది ప్రణయ సరాగమని సందడి చేస్తూ 
 ఉన్నదేమిటంటూ..  గున్నమామి రుసరుసలు.  
 వన్నెలాడి కధ యేమని వెన్నెలమ్మ మిసమిసలు 
 చిన్న మాట చెప్పమంటూ ఝుంటి తుమ్మెదమ్మ బుసలు 
 చెంత చేరి కోయిలమ్మ కుహుకుహూ ఊసులు. 
 గుట్టు విప్పమంటూచుట్టూ చెలియల  గుసగుసలు. 
 నిన్నా... మొన్నా ఎరుగని వింత ఏమిటంటూ 
 బుగ్గల్లో సిరి చందనాల నిగ్గు దేనికంటూ 
 కన్నుల్లో మిన్నంటిన సందడేమిటంటూ 
 ఈ నెచ్చెలి  మెచ్చిన  చక్కని చెలికాడెవరంటూ...  
 మేటి విలుకాడు ఎవరంటూ ?
 అన్నులమిన్నకు సరిజోడి  వెన్నెల రాజెవరంటూ ?
 ఆ.... నెలరాజెవరంటూ ?
 పలకలేక మూగబోతి  ముద్దబంతినయితి . 
ముగ్ధనయితి, ఆతని ముగ్ధ మోహన రూపాన్ని తలచి, 
నులు సిగ్గుల మొగ్గనయితి వలపుల రేడును వలచి       
కలువభామనయితి,చలువల రేడును తలచి. 
 ఇంతకీ అతడెవరో తెలుసా !
ఆ జతగాడెవరో తెలుసా !
(పరువంలో ప్రతీ హృదయం ప్రణయంలో పడినప్పటి ప్రేమికుడే అతడు )
                                                         
                                                                                సాలిపల్లి మంగామణి @శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి