ఎటు చూసినా విరులు, మరులుగొలుపు ఝరులు
ఎటు చూసినా ప్రకృతి రాసిన ప్రణయ ప్రబందాలే
ఎటు చూసినా హృదయంగమమవు మలయ సమీరాలే
ఎటు చూసినా తుళ్ళింతలు, కేరింతలు, గిలిగింతలే , చక్కిలిగింతలే
వింత వింత అనుభూతుల నా మది సాంతం ప్రశాంతమై ప్రకృతిలో మమేకమై
విహంగమై విహరించా వినీల గగనం వైపు
అలా అలా అలలా
ఉరకలు వేసే నాహృదయంలో ఒక ఊపిరి ఊగిసలాడింది
తన్మయమొందిన తరుణంలో తారసపడినది ఒక ప్రణయం
తీయ తీయని వలపుల మైమరపును జల్లిన మధుపంలా
తెలియని హాయిని పరిచయ పరచిన అభినవ మదనుని బాణంలా
వన్నెల సూరీడు చిందిన నవ ఉషస్సువెలుగుల జడిలా
పున్నమి రేరేడు జల్లిన వెండి వెన్నెల జిలుగుల వానలా
పడచు వాకిట పరచుకొన్న విరజాజి పరిమళంలా
కలల మాటునా !కనురెప్పచాటునా కన్నుగీటుతూ పలకరించిన
అరవిరిసిన నా పరువానికి కొత్త అనుభూతిని పంచిన ప్రాయంలా
ఎదురయ్యింది .
అలా నా కన్నె మనస్సులోకి
కమ్మని కావ్యంలా అరుదెంచిన మరు క్షణం ,
నాలో మొదలయింది నిరీక్షణం
వేవేల వర్ణాల హరివిల్లు లో నీవు
చలువల రేడు ప్రతిబింబంలో నీవు
కలువల సరసన సరసుల్లో నీవు
చిటపట చినుకుల చిరుజడిలోనీవు
నా కన్నె మనసు అలజడిలో నీవు
ఏ వలపుల వలపన్నావో !!
నా తలపుల తలమునకలు చేసావు.
సవరించిన నా కురులు సాక్షిగా
నీ జాడ గానక నిమిషమయినా గాని
నిలువజాల !
నా తుది శ్వాస వరకు నా ఉనికి నీ కొరకే
సప్త సంద్రాల ఆవల నీవున్నా ..
నే సప్తపదులు నడిచిన నీకై నిరీక్షిస్తూనే ఉంటా ...
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి