పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

17, ఏప్రిల్ 2016, ఆదివారం

మళ్ళీ రావా ...


నిశిరాతిరి మిసమిసలో నిశ్శబ్ధపు తెరలు  చిదిమి
నామది మదియించి  నులువెచ్చనిపదనిసల తడిమి  
తలవాకిట నిలుచున్నావు. తలపులలో వలపుల వల పన్నావు . 
నిదురించిన  నా కనుదోయికి మృదు మధురపు 
 అధరామృతాన్ని అదిమి, నా పరువానికి తొలి పరవశాన్ని 
 పరిచయ పరిచావు . 
ఆదమరచిన నామదికి ఏదో  
మధురోహల పరిమళాన్ని చిలుకరించి పలుకరించినావు
కమ్మని నిట్టూర్పుల విందును చవి చూపించి 
కవికందని అందాలను కనువిందును  చేసి 
రవికందని మిసిమిని  నా దోసిటబోసి .
తనువంతా విద్యుల్లతగావించి,
అణువణువున అద్భుతాలనాపాదించి, నను అబ్బురపరచి 
అంతలోనే వస్తానని అటుగావెళ్లావు . తుళ్ళి పడిన నా మనసుకు 
మళ్ళీ తారసపడనే లేదు. జాబిలి మాటున దాగావో 
నీలి మేఘాల సరసన చేరి సరసమాడుతున్నావో 
తొలి ప్రణయ సరాగమే నీవో  ?విరి తేనియ జలపాతపు ప్రవాహమే నీవో 
మలి సంధ్యలా మారి మళ్ళీ వస్తావని 
తనువంతా కనులను చేసి  నీ కై ఎడతెగక ఎదురు చూస్తున్నా 
"కల"వేమోనని,నువ్వూ  కలవే మోనని .. కలవైనా గాని 
నీకై కలవరిస్తూనే ఉన్నా .. కలగా నైనా ... కలయికగా నయినా 
నా కనులకు కలిసొచ్చిన కానుకవై మళ్ళీ రావా ... 
తుళ్ళే నా మనసును మళ్ళీ మైమరపించగ .
నన్నే మురిపించగ,మరిపించగ 
మరువంపు తెంపరవై,మకరంధపు తుంపరవై 
మళ్ళీ రావా ... తుళ్ళే నా మనసుకు మళ్ళీ వసంత పున్నమివై !
(పరువపు ప్రాయంలో ప్రతి హృదయపు నిట్టూర్పు)
                                                  సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి