ప్రియసఖా!నీకోసం హొయలన్నీ దాచా!ఊహల ఉయ్యాలలో
వెచ్చని నా ప్రాయం పదిలంగా నీకై పరిచా !
వేయివేయి కలలను నా కన్నుల్లో మోసా..
చేయిచేయి కలుపుకొన్న గురుతులు గుండెల్లో గుప్పుమంటూ
గుబులు రేపుతుంటే,హాయిహాయి నిట్టూర్పులు తనువంతా తడిమేస్తే
మోయలేని నా ప్రాయం నీ కోసం వేచియుంది.
యమునా తీరంలో సవరించిన నా కురుల సాక్షిగా ..
చేసుకొన్న ప్రమాణాలు మరచీ పోతివా ,
పొతే పొనీలెమ్మని నన్నిడిచిపోతివా !
నీ సమ్మోహన రూపంతో నన్నావహించీ,ఇప్పుడు కినుక వహించి
చప్పుడు చేయక ఎక్కడ దాక్కున్నావు?భావ్యమేనా ...
ముగ్ధ మోహనాంగినని,నను తెగ పొగిడావు.
ముద్దమందారమని ముద్దాడావు.
ముత్యాల మురిపాల తడిపేసావు.
అచ్చంగా దొంగల్లే దోచుకెళ్ళావు,నా హృదయాన్ని నీతో తీసుకెళ్ళావు
దోబూచులాడుతున్నావు,సఖా !దొంగాటలాడుతున్నావు.
బాసలు మరిచావో,లేక భామల నడుమ మదనుడివయ్యావో
పొన్న చెట్టు నీడలో నీకు వెన్న పెట్టినప్పుడు,నేనెన్నటికీ నీవాడనని
నిన్నెన్నటికీ వీడనని, చేసుకొన్న బాసలు మరిచావా! మదనమోహనా
నిలువెల్లా కనులై , తనువంతా నీ వలపుల తలపులై
అణువణువులోనూ... నిన్నే చూస్తున్నా..
ప్రతీ క్షణం .. నీకై నిరీక్షిస్తున్నా
నిర్లక్ష్యం సేయక ఆఘమేఘాల పై
పయనించి రావా ... నీ రాధకోసం నిమిషంలో రావా ...
నిలుపవా నా ప్రాణం...కృష్ణా!నీ రాకను కానుక చేసి
నీ మురళీ సుధా రవళీ రసమున నను ఓలలాడించి
( రాధ నిరీక్షణ మాధవునికై )
సాలిపల్లి మంగామణి@ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి