తరువులు తల్లడిల్లె తమ ఉనికి మాయమవుతుందని,
మానవులకు తాము చేసిన అన్యాయమేమనుచు
మానవాళికి ఆయువిచ్చు తమ ప్రాణం తీయుదురాయని,
నీడనిచ్చు మాజాతిని నిర్దయగా కూల్చుదురాయని
మీ పాపానికి ఠారెత్తిన భూతాపం. చల్లార్చిన మా పైనా మీ ప్రతాపం.
మిము కభళించే కాలుష్యం కరిగిస్తూ,
మా చల్లని గాలుల అలసిన మీకు సేద దీరుస్తూ
అమృతఫలాలనిస్తూ,మీ ఆకలి తీరుస్తూ,
మీకోసం పెరుగుతూ,మీకోసం మండుటెండల్లో మరుగుతూ
మా తనువున అణువణువూ మీ కోసం కరుగుతూ,
మా సర్వస్వం మానవాళికర్పించే
మా పైనా మీ అమానుషత్వం?
జాలిలేని మానవుడా... మా జోలికి రావద్దని,మా ప్రాణంతీయొద్దని,
విలపిస్తూ వేడుకొనెను వృక్షజాతి విరిగిన కొమ్మల తోడ,
తరువు గుండె తరుక్కుపోయి,
అపకారికి ఉపకారం మహాత్వంటూ నీతులు చెప్తారే,
మీ జాతికి మహోపకారం చేసిన మా కిదేనా?మీ ప్రత్యుపకారం?
ఒక్క క్షణం. ఒకే ఒక్క క్షణం మా కోసం ఆలోచించండి.
పుడమి తల్లి పులకించేలా,ప్రకృతి పరవశించేలా..
కరువు కాటకాలు నశియించేలా...
పర్యావరణం పరిమళించేలా ..
భావితరం సస్యశ్యామలంగా,పసిడి వెలుగుల పల్లవించేలా
మము కాపాడగా... ఉద్యమించండి.
నవ అశోకులై నడుం బిగించండి.
పచ్చని మా జాతిని ఉద్దరించండి.
ప్రతి ఒక్కరు చక్కగా ఒక మొక్కని
నాటి పెంచండి.
లోకా సమస్థా... సుఖినో భవంతు
వృక్షో రక్షిత,రక్షితః
సాలిపల్లి మంగామణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి