తేది. 20.4.2014 న మానస సాహిత్య సాంస్క్రతిక అకాడమీ విజయవాడ వారి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో భాగంగా "ఉగాది పురస్కారం
"(కవితల విభాగంలో) అందుకుంటున్న శ్రీమణి @ శ్రీమతి సాలిపల్లి మంగామణి ఈ శుభ సందర్బముగా తీసిన చిత్రములు
పచ్చని చేలు, పెద్ద చెరువు, పచ్చికల పైరగాలులు , కమ్మని ఊరగాయలు (పచ్చడులు), మామిడి తాండ్ర, మా ఊరు........
21, ఏప్రిల్ 2014, సోమవారం
14, ఏప్రిల్ 2014, సోమవారం
చెబుతారా!ఎవరైనా
మల్లె మనసు పారేసుకుంది పున్నమి రాతిరిపై
నిలువునా తడిసి ముద్దయింది కలువ కన్య. నెలరాజు వెన్నెల జడిలో
మిస మిసలాడుతుంది కుసుమం మధుపం రాక చూసి
కొత్త పరదా తొడిగింది చిరుగాలి చిట్టి చిలుకకులుకునుగని
గోరింటాకు పెట్టుకొంది ఆ గగనం పృకృతిని పరవశింపచేయాలని
కొత్త నాట్యం నేర్చుతోంది ఆ మయూరం వయ్యారంగా మెరిసే మేఘాన్ని చూసి
గమ్మత్తుగా పాడుతోంది గండుకోయిలమ్మ వాసంతపు పరిమళాన్ని పసిగట్టి
సెలయేరు నయగారాలు పోతుంది కోనలమ్మ వైపు కొంటెగ చూస్తూ
మిన్నంటిన సంబరంతో అడుగుతోంది తరుణి తన్మయంతో తన పరువాన్ని
కొత్త కొత్త ఊహలు , క్రొంగొత్త కలలు , తీయ తీయని అనుభూతులు
అలవాటు లేని నిట్టూర్పులు , మైమరపులు , తుళ్ళింతలు
ఈవేళలో ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయెందుకని
ప్రకృతిలో ప్రతి సౌందర్యం తనతో తలబడుతున్నాయెందుకని
గుండె చప్పుడు గతి తప్పుతోంది ఎందుకలా
కంటికేమో కునుకే రానంది ఆకలి ఆమడదూరంగా ఉంటుంది నిజంగా
ఏమైంది నాకీవేళ ఎందుకంటా ఈ ఆనంద హేల
ఎవరైనా చెబుతారా !ఏమైందో నాకీవేళా
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
13, ఏప్రిల్ 2014, ఆదివారం
తనువంతా కనులై
ఏమని ఏమార్చను కృష్ణయ్యా ! నీకై వేచిన నా కన్నులను
ఎంతని ఊరడించను కన్నయ్యా !నిన్నే వలచిన నా మదిని
జగడాలెందుకు ప్రియా !నాపైనీ జవరాలను నే కానా !
గిల్లికజ్జాలెందుకు కన్నయ్యా !పంతం మానుకో కొంతైనా !
ఎంతైనా నే నీ ప్రియ సఖినేగా !నువు మెచ్చిన నీ నెచ్చెలి నేనేగా
నేరమేమి చేశాను నిన్ను చేరనీవు నన్ను
ఆకలి మరిచా నీతో గడిపిన మధుర స్మృతులు నెమరు వేసుకొంటూ
దాహమూ మరచిపోయా !నీ ప్రణయామృత ధారలు సేవిస్తూ
నిద్దురెలాగూ కరువైంది కన్నులకు
,మన సాంగత్యపు మధుర ఘడియలె మదిని మదిస్తుంటే
నన్ను నేనే మరచిపోయా! నాలో కొలువై వున్న నిన్నే ఆరాదిస్తూ
నీకై తపిస్తూ నిరతం నీ నామమే జపిస్తూ నీ రాకకై పరితపిస్తూ
తనువంతా కనులుగా వేచియున్నా నీకై , వేగిరంగా రమ్మంటూ
చిన్నికృష్ణా నిన్ను వేడుకొందు
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
11, ఏప్రిల్ 2014, శుక్రవారం
ప్రణయ గీతిక
ఎద నందనవనములో వీచిన సుమ సుగంధ వీచిక
హృది స్పందన శృతి లయగా ఆలపించె మృధు గీతిక
మది సాంతం మైమరచే వింత విషయ సూచిక
మనసంతా విరబూసిన మధురోహల మధూలిక
అదే ప్రణయ గీతిక. జంట హృదయాల పెనవేసిన అనురాగ మాలిక
విరబూసిన ప్రాయంలో అరవిరిసిన మరు మల్లిక
విహంగమై విహరించే వీనుల విందైన వేడుక
కలల మాటునా! కనురెప్ప చాటునా !
కన్ను గీటుతూ పలకరించిన పులకరింతల ఆనంద డోలిక
అదే ప్రణయ గీతిక . జంట హృదయాల పెనవేసిన అనురాగ మాలిక
పట్ట పగలే పండువెన్నెల పడచు వాకిట పరచుకొన్న పరువపు చిరు కోరిక
ప్రతి హృదయం పరవశించి, పాడే పాటకు పల్లవిగా
ఒకరికి ఒకరై నివశించి , ఒకరిలో ఒకరై ప్రవహించే జంట పరువాల అల్లిక
నిండు నూరేళ్ళు పయనానికి, ఏడేడు జన్మల ప్రాతిపదిక
అదే ప్రణయ గీతిక ,జంట హృదయాల పెనవేసిన అనురాగ మాలిక
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
9, ఏప్రిల్ 2014, బుధవారం
నీ ధ్యాశలో
వాసంతపు పరవశాన మైమరచి పాడుతున్న ఎలకోయిల నడిగా...
నా తలపుల రేడు నీకెరుకాయని
నా తలపుల రేడు నీకెరుకాయని
రయ్ రయ్ న మేనుకు హాయిగ తాకిన పిల్లగాలి నడిగా...
పిల్లవాణ్ణి పిలుచుకు రమ్మని
పిల్లవాణ్ణి పిలుచుకు రమ్మని
పచ్చని చిగురుమావి కొమ్మమీద చిన్ని చిలక నడిగా...
నా చెలికాని జాడేదని
నా చెలికాని జాడేదని
నిండు పున్నమి పండువెన్నెలలో
చంద్రుని చూసి పులకించిన నీటికలువ నడిగా...
చంద్రుని చూసి పులకించిన నీటికలువ నడిగా...
నా సెందురుని నీవెరుగుదువా యని విరితేనియ గ్రోలుచున్నమధులిహమ్ము నడిగా...
నా మది దోచిన సఖుడేడని
కొమ్మ నడిగా, పూరెమ్మ నడిగా,
మలయమారుతమ్ము నడిగా,
మలయమారుతమ్ము నడిగా,
కొండ నడిగా, కోన నడిగా, వాగు నడిగా, వంక నడిగా ...
నా వన్నెల రేడు దాగున్న చోటేదని
నా వన్నెల రేడు దాగున్న చోటేదని
నువ్వేడ దాగినా,దోబూచులాడినా...
నా కనురెప్పల మాటున్నది నీ రూపు కాదా
నా కనురెప్పల మాటున్నది నీ రూపు కాదా
నా అధరాలు పలికేది నీ నామమే కదా
నా మది ఊయలలూగేది నీ తలపుల పానుపుపై కాదా !
సప్తసంద్రాల ఆవల నీవున్నా...
నే సప్తపదులు నడిచేది నీతోటే కాదా!
నే సప్తపదులు నడిచేది నీతోటే కాదా!
సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి
31, మార్చి 2014, సోమవారం
30, మార్చి 2014, ఆదివారం
జయము నీయ రావమ్మ జయ వత్సరమా
చిరుగాలి పరదాలతో చిగురుమావికొమ్మ
కుహూ కుహూ రాగాలతో చిరుకోయిలమ్మ
మైమరపుల పరిమళాలతో సిరిమల్లె పూరెమ్మ
పరవశించి వేచి ఉంది ప్రకృతిలో ప్రతీ జన్మా
ఈ ఉగాదికై ఈనవ సంవత్సరాదికై
జయం జయం మాకంటూ అభయం మాకిమ్మంటూ
నీ రాకతో జయగంటలు మ్రోగిస్తూ గత అనుభవాల చేదు ఖేదాన్ని మరపిస్తూ
ఈ మధుమాసం మధుకలశం మనకోసం తేవాలని
జయ జయ ధ్వానాలతో, హర్ష ధ్వానాలతో
ఆహ్వానిద్దాం ఈనవ ఉగాదిని, ఆశీశ్సులిమ్మందాం మన జయ సంవత్సరాదిని
ఈ నవ వసంతం ప్రతి జీవితాన నవ ఉషస్సు నింపాలని
ఈ చైత్రం మన జీవన పధానికి చైతన్య రధం కావాలని
మానవాళిలో మానవతా పరిమళాలు వెదజల్లాలని,
మానవాళి భవిత ప్రజ్వలింప జేయాలని
చిరునవ్వుల హరివిల్లులు ప్రతి ముంగిట విరబూయాలని.
సిరుల జల్లు విరిజల్లై ప్రతియింటా కురవాలని
ఉదయించే ప్రతి దినం మనకు ప్రవర్ధమానమవ్వాలని,
వేసే ప్రతి అడుగు ప్రగతి పసిడి బాట కావాలని
ప్రకృతిలో ప్రతి జీవి పరవసంతో ఉండాలని
అలసిన మా హృదయాల పాలిట సేద తీర్చగ కల్పతరువై రావాలని
ఆహ్వానిద్దాం ఈనవ ఉగాదిని ఆశీశ్సులిమ్మందాం మన జయ సంవత్సరాదిని
అన్నదమ్ములం మేం విడివడినా గాని
అమ్మ కాంక్షించే జయాలనే అమ్మకు అంకితం ఇవ్వాలని
నూతన రాష్ట్రంలో నూతనంగా అడుగిడుతున్న
ఈ ఉగాదిని ఆనందం తెమ్మందాం
జయములనిమ్మందాం ఈ జయ సంవత్సరాదిని.
తీపిని చేరువ చేస్తూ కారం దూరంచేస్తూ,
పులుపును కలగలిపేస్తూ
చేదు కటువుల్లో మధువును పూస్తూ
వగరును చిరునగవులతొ వారిస్తూ
ఉప్పును సరిపాళ్ళుగ పోస్తూ షడ్రుచులను
మన జీవిత విస్తరిలో కొసరి కొసరి వడ్డిస్తూ
జయమనే పానీయం మనకందించమంటూ
ఆహ్వానిద్దాం ఈనవ ఉగాదిని ఆశీశ్సులిమ్మందాం మన జయ సంవత్సరాదిని
సాలిపల్లి మంగామణి @ శ్రీమణి
28, మార్చి 2014, శుక్రవారం
చేరవోయి నీ చెలి చెంతకు
మదన గోపాలా నా మది దోచిన ముగ్ధమొహన గోపాలబాలా
వందలు వేలు చెలియలు నీకున్నారేమో ! నిన్నే వలచిన ప్రియసఖినేను
మరువము,మల్లెలు దోసిట నింపి నీకై నిలుచున్నా
మంచి ముత్యాలు కూర్చి సరముగ నీ రాకకై నిరీక్షిస్తున్నా
సిరి చందనాల పరిమళాలు నీపై చిలుకరించగ కలవరిస్తున్నా
బెల్లం చిట్టి అటుకుల తాయిలాలు నీకోసం దాచుంచి
వెన్నముద్దలు , జున్నుముక్కలు మక్కువనీకని పదిలంగా ఉంచా
నెమలికన్నువింద్యామరతో నీకు సేద తీర్చ వేచి ఉన్నా ..
యమునా తీరంలో నీకై నిలువెల్ల కనులుగా వెతికి వెతికి అలసి పోయా
నీ మురళీగానం ఆలకించాలని నా ఆణువణువూ కలవరించె
నిద్దుర మరచిన నా కన్నుల్లో వద్దన్నా .. నీ రూపే
నిన్నే వలచిన నా హృది ఏమో ! నన్నే వదలి తరలెల్లిపోయింది . నువ్వున్న తావులకై .
వలదన్నా వినకుండా నా అధరాలు నీ నామమే జపిస్తున్నాయి .
ఏ చోట నువ్వు దాగున్నా , వేగిరంగా నాకై రారా ... మురళీలోల .. ముద్దుగోపాలా
ముచ్చట తీర్చగ ఎచ్చటనున్నా ... నీ నెచ్చెలి చేరగ తక్షణమే రా .. రమ్మని
మధురా నాయకా మనమొహన కృష్ణా .. .. నిన్ను వేడుకొందు .
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
27, మార్చి 2014, గురువారం
వరమీయవా
ఉరకలేసే నా ఊహకి రెక్కలొచ్చి చుక్కల పల్లకినెక్కి నీకై వెతికింది .
నా తలపుల కోయిల పల్లవి మరచి నీ చరణాలను తాకింది .
నా ఆశల హరివిల్లు నీ సన్నిధిలోనే వెల్లి విరిసింది .
మకరందం గ్రోలుతున్న తుమ్మెదలా ...
నా మది,
మధురమైన నీ ప్రణయామృతధారలలో పరవశించి తడిచింది .
మండు వేసవిలో కూడా నీ ధ్యాస.
నా మేనును సుతిమెత్తగా తాకింది... మంచు తెమ్మెరలా !
పండువెన్నెల్లో విరబూసిన వెన్నెల కుసుమంలా !
మల్లె చెండు పరిమళాల గుభాళింపులా !
ఏ మాయ చేశావో .. ఏం మత్తు జల్లావో !
నా హృదయం అనుక్షణం, నీ చుట్టూ ప్రదక్షిణం .
నా ఉనికిని నేనే మరచి ,తరచి , తరచి ,అడుగుతున్నా !
నాలో కొలువున్న నా చెలికాడా.... నీ జాడేదని .
నన్ను నాకు కాకుండా చేసిన నా చెలికాడా ....
నువ్వు నా జత చేరే ఘడియేదని .
నీకై వెతికే నా కన్నులకు నీ సన్నిధి చేరే వరమీవా !మధుమాసపు కోయిలకై తరలొచ్చిన వాసంతంలా ....
నిన్ను తలచి మైమరచిన నీ చెలికై
ఆఘమేఘాలపై పయనించి రావా !
నీకై వేచిన నీ సఖికై . చిన్నికృష్ణా ... నిన్ను వేడుకొందు .
25, మార్చి 2014, మంగళవారం
అలిగిన నా హృదయం
ప్రియా !
అలిగిన నా హృదయం నీ దరికే వచ్చింది .
అర్ధం లేని ప్రశ్నలతో నిను కలవరపెడుతోందా ...
తన చిలిపి చిలిపి భావాలతో నీ ఇల్లు తీసి పందిరి వేస్తోందా ..
అప్పటికీ నే వారించా ... నన్ను కాదని ,పరుగులు తీసింది . నీ వైపే.
నేనంటే ఏదో నీ ద్యాసలో గడిపేస్తున్నా . కాని నా హృదయానికి తొందరెక్కువ . అందుకే ..
తను మాత్రం నిను చూడాలని మారాం చేస్తుంది.
నీ వ్యాపకాలలో పడి నా జ్ఞాపకాలు కూడా నిర్లక్ష్యం చేస్తే
ఊరుకోవడానికి అది నాలా కాదు .మహా మొండి .
నీ గుండెలోకి చేరి, గుట్టు బయట పెడ్తుంది . తర్వాత నీ ఇష్టం .
నువ్వు జీవించేది నా కోసం అని నాకైతే తెల్సు .
కాని....
దానికి నీ గుండెలోని లోతుల్లో దాని జాడలే కనిపించాలట .
నీ శ్వాసలో తన ధ్యాసే నిండాలట .
నిరంతరం దాని తలపుల్లోనే నువ్వు తలమునకలవ్వాలట .
నిమిషమాత్రమైనా నీ ఎడబాటు తనకు తగదట .
మూడు ముళ్ళు వేసిన మరుక్షణమే.నీతో వీడని ముడి వేసిందట .
ఏడడుగులు వేసినంతనే తన అడుగుజాడల్లో నిను కట్టిపడేసిందట .
నువ్వు రెప్పవేసినంతలో కూడా తనను మరువకూడదట .
నిత్యం నీ గుండెల్లో తను కొలువుండాలట .
నిత్యం నీ గుండెల్లో తను కొలువుండాలట .
తన స్థానం నీ గుండెల్లో పదిలమని
తనతోడే నీ జీవనమని ,నిదానంగా వివరించి ,
నా మనసును ఊరడించి ,నిండు నూరేళ్ళు ,ఏడు జన్మలూ ,నీకై నేనున్నానని , ఒట్టేసి చెప్పెయ్యవా నువ్వు ఒంటరి కావని ,
నా గుండెగుడి నేలేటి నా నెచ్చెలి నీవని ,నీ ప్రియసఖుడను నేనే అని
అనునయించి చెప్పు నా హృదయానికి .
హృదయారావిందం గా ...
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
తనతోడే నీ జీవనమని ,నిదానంగా వివరించి ,
నా మనసును ఊరడించి ,నిండు నూరేళ్ళు ,ఏడు జన్మలూ ,నీకై నేనున్నానని , ఒట్టేసి చెప్పెయ్యవా నువ్వు ఒంటరి కావని ,
నా గుండెగుడి నేలేటి నా నెచ్చెలి నీవని ,నీ ప్రియసఖుడను నేనే అని
అనునయించి చెప్పు నా హృదయానికి .
హృదయారావిందం గా ...
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
23, మార్చి 2014, ఆదివారం
నీ సన్నిధికై (నిరీక్షించే ప్రతి హృదయపు వేదన)
నిను చేరే దారిని సరళం చేస్తే
గరళాన్నైనా చిరునవ్వుతో సేవించేస్తా !
నిన్ను చూడగ కనులకు కాంతినిస్తే ,
కటికచీకటిలో నే కాలంగడిపేస్తా !
నా ప్రణయం తెలుపగ నా అధరానికి పదములనిస్తే,
ఆపై మూగనయినా నే మురిసిపోతా !
నీ మనసును ఒక పరి గెలుచుటకై ,
నిరంతరం నే ఓడిపోతా !
నా హృదయపూతోటలోకి నువ్వొస్తానంటే ,
నూరేళ్ళకైనా కనురేప్పేయక నే నిరీక్షిస్తూనే ఉంటా !
నిజంగా .. ప్రియతమా !
నీకై తెల్లవారుతోంది ఉదయం , నీకోసమే ఆ సాయం సమయం .
నిదరోకముందే కలను కూడా ఆదేశిస్తా !
నిన్నే తనతో తీసుకురమ్మని . లేకుంటే కరిగిపొమ్మని .
ఇల నా జీవితాన్ని నే శాశిస్తా !
నీ జత లేదంటే శూన్యం కమ్మని .
అందులకే నే నువ్వోస్తావనే నే జీవిస్తున్నా !
నీకై నే నిరీక్షిస్తున్నా... నిద్దురలోనూ మేలుకొని .
సాలి పల్లి మంగా మణి @ శ్రీమణి
సెక్రటరీ, విశాఖ కళావేదిక
22, మార్చి 2014, శనివారం
పుస్తకాలయం
ఓం
మహా విశాఖ నగరంలోని సుప్రసిద్ధ రచయితలు ,రచయిత్రుల రచనలను భద్ర పరచే క్రమంలో భాగంగా ' పుస్తకాలయం' ఒకటి నెలకొల్పవలెనన్న సదాశయంతో కళావేదిక నేడు మీ ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మీ, మీ సలహాలను ,సూచనలను మా కళావేదిక ఆహ్వానించే క్రమంలో ది . 29-3-2014,స్థిరవారం (శనివారం ) సాయంత్రం “4.30 గం..కు శ్రీ నండూరి రామకృష్ణ గారి నివాసంలో plot no -132, sector -8, M.V.P.కాలనీ , ఉషోదయ జంక్షన్ (సత్యసాయి విద్యావిహార్ కు చేరువలో ) మీ అందరితో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడమయినది .
కావున మీరు తప్పక ఈ సమావేశానికి విచ్చేసి మీ, మీ సలహాలను /సూచనలను అందచేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం . అలాగే మీ మీ రచనలను(ముద్రితాలను మాత్రమే) తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము . మీ మీ profile ని కూడా hard copy జతపరుస్తారని ఆశిస్తున్నాము .
గమనిక : సమయం పాటిద్దాం . మీ సహకారం ఆశిద్దాం
(సాయంత్రం “4.30 గం..కు ప్రారంభిద్దాం, 6.00 గం''కు ముగిద్దాం
Salipalli Mangamani@srimaani (Visakhapatnam Kalavedika seceratory)
Contact
21, మార్చి 2014, శుక్రవారం
కవితా కన్యక

ఎవరివో నీవు నా కలల్లో విహరించి, అలలా ఉప్పొంగి ,
నా కలాన జాలువారి,
కవినైన నాలో కవితల్లె కదలినావు
అరవిరిసిన మందారానివా !
ఇల దిగి వచ్చిన గాంధర్వ కన్యకవా !
ప్రణయ భావం పల్లవించగ ప్రణయ దేవతవా !
మానసముల్లాస పరచగ మధుకలశానివా !
చెంపకు చారెడు కన్నుల కుసుమకోమలివా !
కమ్మనైన కధలో మెదిలిన కావ్య నాయిక నీవా !
వేచిన కనులకు వెన్నెల తునకవా !
నటనమాడే మయూరివా !
నండూరి ఇంట ఎంకివా !
రెప్పపాటులో మెరిసి మురిసిన బంగరులేడివా !
తలవాకిట తీరుగ దిద్దిన రంగవల్లికవా !
మధుమాసపు కోయిలవా
ఇలా అరుదెంచిన ఎల్లోరా శిల్పానివా !
నా కవి హృదయం దోచేసిన సౌందర్య కవితాకన్యకవా !
ప్రపంచ కవితా దినోత్సవం సందర్బంగా 'ఈ కవితా కన్యక' నా మిత్రులందరికీ ,బ్లాగర్లందరికీ
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
విశాఖ కళావేదిక సెక్రటరీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)












