వాసంతపు పరవశాన మైమరచి పాడుతున్న ఎలకోయిల నడిగా...
నా తలపుల రేడు నీకెరుకాయని
నా తలపుల రేడు నీకెరుకాయని
రయ్ రయ్ న మేనుకు హాయిగ తాకిన పిల్లగాలి నడిగా...
పిల్లవాణ్ణి పిలుచుకు రమ్మని
పిల్లవాణ్ణి పిలుచుకు రమ్మని
పచ్చని చిగురుమావి కొమ్మమీద చిన్ని చిలక నడిగా...
నా చెలికాని జాడేదని
నా చెలికాని జాడేదని
నిండు పున్నమి పండువెన్నెలలో
చంద్రుని చూసి పులకించిన నీటికలువ నడిగా...
చంద్రుని చూసి పులకించిన నీటికలువ నడిగా...
నా సెందురుని నీవెరుగుదువా యని విరితేనియ గ్రోలుచున్నమధులిహమ్ము నడిగా...
నా మది దోచిన సఖుడేడని
కొమ్మ నడిగా, పూరెమ్మ నడిగా,
మలయమారుతమ్ము నడిగా,
మలయమారుతమ్ము నడిగా,
కొండ నడిగా, కోన నడిగా, వాగు నడిగా, వంక నడిగా ...
నా వన్నెల రేడు దాగున్న చోటేదని
నా వన్నెల రేడు దాగున్న చోటేదని
నువ్వేడ దాగినా,దోబూచులాడినా...
నా కనురెప్పల మాటున్నది నీ రూపు కాదా
నా కనురెప్పల మాటున్నది నీ రూపు కాదా
నా అధరాలు పలికేది నీ నామమే కదా
నా మది ఊయలలూగేది నీ తలపుల పానుపుపై కాదా !
సప్తసంద్రాల ఆవల నీవున్నా...
నే సప్తపదులు నడిచేది నీతోటే కాదా!
నే సప్తపదులు నడిచేది నీతోటే కాదా!
సాలిపల్లి మంగా మణి @ శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి