మల్లె మనసు పారేసుకుంది పున్నమి రాతిరిపై
నిలువునా తడిసి ముద్దయింది కలువ కన్య. నెలరాజు వెన్నెల జడిలో
మిస మిసలాడుతుంది కుసుమం మధుపం రాక చూసి
కొత్త పరదా తొడిగింది చిరుగాలి చిట్టి చిలుకకులుకునుగని
గోరింటాకు పెట్టుకొంది ఆ గగనం పృకృతిని పరవశింపచేయాలని
కొత్త నాట్యం నేర్చుతోంది ఆ మయూరం వయ్యారంగా మెరిసే మేఘాన్ని చూసి
గమ్మత్తుగా పాడుతోంది గండుకోయిలమ్మ వాసంతపు పరిమళాన్ని పసిగట్టి
సెలయేరు నయగారాలు పోతుంది కోనలమ్మ వైపు కొంటెగ చూస్తూ
మిన్నంటిన సంబరంతో అడుగుతోంది తరుణి తన్మయంతో తన పరువాన్ని
కొత్త కొత్త ఊహలు , క్రొంగొత్త కలలు , తీయ తీయని అనుభూతులు
అలవాటు లేని నిట్టూర్పులు , మైమరపులు , తుళ్ళింతలు
ఈవేళలో ఇలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయెందుకని
ప్రకృతిలో ప్రతి సౌందర్యం తనతో తలబడుతున్నాయెందుకని
గుండె చప్పుడు గతి తప్పుతోంది ఎందుకలా
కంటికేమో కునుకే రానంది ఆకలి ఆమడదూరంగా ఉంటుంది నిజంగా
ఏమైంది నాకీవేళ ఎందుకంటా ఈ ఆనంద హేల
ఎవరైనా చెబుతారా !ఏమైందో నాకీవేళా
సాలిపల్లి మంగా మణి @శ్రీమణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి