పేజీలు

బ్లాగు వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు

HTML codes

10, ఫిబ్రవరి 2014, సోమవారం

నీకై నేను ...

   
     

నీకోసమే  నే  వేచియున్నా... 
ప్రతి  కదలికలో  నిన్నే చూస్తున్నా  
ఆ జాబిలి  నీవైతే ... 
కలువను  నేనవుతా 
ఆ మధుపం  నీవైతే ... 
మధూలికను  నేనవుతా 
నీలాకాశం నీవైతే ... 
హరివిల్లును  నేనవుతా 
ఆ  మనసిజుడివి  నీవైతే ...
నీ మనసెరిగిన   సతి నేనవుతా 
కన్నులు నీవైతే ... భాష్పం నేనవుతా 
మెరిసే మేఘం నీవైతే ... 
పురి  విప్పిన  మయూరి నేనవుతా 
చిరుమావివి నీవైతే ... 
చిరు కోయిల  నేనవుతా 
ఆ  మాధవుడవు నీవైతే ... 
నీ రాధను  నేనవుతా .... 
                                                                                శ్రీమణి 



9, ఫిబ్రవరి 2014, ఆదివారం

ఎందుకెన్నుకోవాలి నాయకులను ?



ఎందుకెన్నుకోవాలి  నాయకులను ?
ఎందుకు తన్నుకు చావాలి  నాయకులకై 
ఎంతమంది  ప్రజాపరిపాలకులు 
ప్రజలకై  పాలన  చేస్తున్నారిపుడు 
ఎన్నికలొస్తాయని  ఎన్ని''కలలో '' సగటు ప్రజకు 
తమనుద్దరించగ  సమర్ధ నాయకుడొస్తాడని 
''ఎన్నికలలో '' సగటు ప్రజకు 
నిజానికి  ఇది ఎండమావుల తావులకై  పరుగులిడిన  వైనం 
కొందరి ప్రజానాయకులకు  ప్రజలేగా ''ఇంధనం ''
ఎంత  దోచినా తనివి  తీరని '' ప్రజాధనం ''
అదే వారికి ''మూలధనం ''
నేటి కొందరు  అవినీతి రాజకీయ శక్తులు 
అడుగడుగున  కుట్రా కుయుక్తులు 
కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట 
మనుష్యుల  విడదీసి, నోట్లను  ఎర చూపి 
కోట్లాదికోట్ల  ఓట్లను  నోట్ల కట్లతో  కట్టిపడేసి 
కర్తవ్యం  మరచిన  కాఠిన్యమూర్తులు 
నల్లదనం  కరిచిన కక్కుర్తి  రాబంధులు 
''ఎందుకెన్నుకోవాలి  నాయకులను 
ఎందుకు తన్నుకు చావాలి  నాయకులకై ''
ప్రజల వెన్నెముకపై  మోయలేని  పన్నులభారం 
అందలానికెక్కిన  అవసరాల ధరలు 
అరకొర వైద్యాలు, అందరాని విద్యలతో 
అల్లాడుతున్న  ప్రజానీకం పాట్లను 
పట్టించుకోని  పాలకవర్గాలు 
మరి... ''ఎందుకెన్నుకోవాలి  నాయకులను 
ఎందుకు  తన్నుకు  చావాలి  నాయకులకై ''?

                                                                                           శ్రీమణి 

8, ఫిబ్రవరి 2014, శనివారం

చిత్తం గీసిన చిత్తరువు



నా  గుండె  గొంతుక నే  సరిగమ రాగం చేసి, 
నా  అందెల  సవ్వడినే  నవశ్రుతి  చేసి,
నా గాజుల  గలగలనే  స్వరముగ  చేర్చి,
నే  పాడెద  నవ్య భవ్య  మాధుర్య గీతం ... 
నా  ఊహలే  రంగుగా ,నా ఊపిరే  కుంచెగా,
నే గీసెద  నా హృదయపు  కాన్వాసు  మీద 
రసరమ్య మనోహర  రమణీయ  చిత్రం
అలరించే  అనుభూతులు  అల్లిక చేస్తూ,
అనుభవాల  అక్షరాలు  ప్రతిబింబిస్తూ,
సమాజాన  ప్రజ్వలించు పాపాలను  తూర్పారపోస్తూ,
నే రాసెద  సుతిమెత్తని  తియతీయని  చిరుకవితల్లా 
                                                         
                                                                                           శ్రీమణి 

5, ఫిబ్రవరి 2014, బుధవారం

ప్రతిఫలము



ఏమిస్తే ఆ సూర్యుడు 
నవ ఉషస్సులను  ఉదయిస్తున్నాడు 
ఏమిస్తే ఆ చంద్రుడు 
సిరివెన్నెల  కురిపిస్తున్నాడు 
ఏమిస్తే  ఆ పూవులు  
విరబూసి  పరిమళాలు వెదజల్లుతున్నాయి 
ఏమిస్తే ఆ ఫలాలు  
ఫలియించి  ఆకలి  తీరుస్తున్నాయి 
ఏమిస్తే  ఆ మబ్బులు  
వానలు కురిపిస్తున్నాయి 
ఏమిస్తే ఆ తరువులు  
వింధ్యామరలై  వీస్తున్నాయి 
ఏమిస్తే ఆ కోయిల  
మధురగానం  ఆలపిస్తుంది 
ప్రతిఫల మాశించక  ప్రకృతి  ఇచ్చే 
ప్రతీ ఫలం  అనుభవించు  
మానవుడికెందులకు  
ప్రతీ పనిలో " ప్రతిఫలం" 
                                                                            
                                                                                    శ్రీమణి 

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఓం శ్రీ సరస్వత్యైనమః

                                                         
 నేడు  శ్రీపంచమి సరస్వతీ పూజకోసం నా ఈ చిన్ని కవితాకుసుమం     
జననీ జ్ఞానప్రదాయిని  శ్రీవాణీ
విద్యున్మాలిని  వీణాపాణీ  శర్వాణీ
సౌదామినీ  శాస్త్రరూపిణీ  సువాసినీ
నా మనసునె హారతి  చేసేద  
గైకొనుమమ్మా కళావాహినీ
అర్చింతును  తల్లీ  
నిను అక్షరమాలికలతోడ
నిను కొలిచెద దేవీ నిరతం 
నిర్మల హృదయమ్ము తోడ
ప్రణమిల్లెద పద్మలోచనీ 
నీ పాదాల చెంత కవితాకుసుమాలతో
అనుగ్రహించు సరస్వతీ  
నీ సాహిత్యాంబుదిలో నీటి బొట్టై  నిలిచేందుకు
ఆశీస్సులందిచవమ్మ  వాగ్దేవీ  
నా మదిలో నీ ధ్యానమే  స్మరించేందుకు
ప్రసరింపుము  శారదాంభ  
నీ కృపాకరుణా కటాక్ష వీక్షణాలు  
నా ఈ చిరు కవితార్చనపై
                                                                                                                                                                                                                           
                                                                                                                                         శ్రీమణి

                                                            

3, ఫిబ్రవరి 2014, సోమవారం

తెలుగుతల్లి ఆక్రందన


తెలుగుతల్లి గుండెల్లో పగుళ్ళు  పుట్టాయి 
పచ్చని తెలుగు పైరులో తెగుళ్లు పుట్టాయి .... 
మా తెలుగుతల్లి సరములోని  
సుమాలు విడివడిపోయాయి 
అన్నదమ్ముల  ప్రాంతీయతగాదాలు 
అమ్మ పంపకాలకి పాల్పడ్డాయి 
కళకళలాడే తెలుగునేల కలిసుండే 
కలలు కల్లలైపోయినాయి 
తలో దిక్కైన తనపిల్లలతో తల్లడిల్లే  తల్లిమనసు 
సమైఖ్య గీతంలో పల్లవి పలు దారుల మళ్ళింది 
కళ్ళెదుటే కన్నతల్లి 
కన్నీటి వెల్లువై  ఉప్పొంగింది 
సమరం సంబరమయ్యిందని సంరంభం ఒక వైపు 
అమరజీవుల త్యాగఫలం  విఫలమాయెనని  
విషణ వదనాలొకవైపు 
ఒక ప్రక్కన మోదంతో ఒక ప్రక్కన ఖేదంతో 
అటు వీపు ఇటు కడుపని 
మిన్నకుండి  చూస్తుంది 
ముక్కలైన తెలుగుతల్లి 
                                                                                              
                                                                                    శ్రీమణి 

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

బిత్తరపో యిన ఉత్తరఖండం



మహోగ్రరూపం  మహోగ్రరూపం 
మహాప్రతాపం మహాప్రతాపం 
మంచుకొండల్లో మహాగంగమ్మ ప్రళయ తాండవం 
మరు భూమిని తలపిస్తూ  ప్రకృతి మ్రోగించిన మరణమృదంగం .... 
ఉత్తరఖండం బిత్తరపోయిన తరుణం 
బ్రద్దలయిందా ఆకాశం ... 
అగాధంలో కూరుకు పోయిందా చారధామం 
చారధామ యాత్ర మారిందా..  మరణయాత్రలా 
ఎల్లలు దాటిన కల్లోలం ... కళ్లెదుటే కైలాసం 
అసువులు బాసెను అమాయకజనం 
తల్లి బిడ్డ జాడ కానక తల్లడిల్లే తలోదిక్కై 
కొండపెళ్లలు  ఫెళ్ళు ఫెళ్ళు మన ప్రాణమరచేత పట్టుకొని 
కళ్ళనీళ్లె  కడుపు నింపే ,కటిక చీకటి పహారా ... కాలయముడే  కాపలా .. 
మృత్యు కౌగిట మూగ అభ్యర్ధనల 
ఆర్తనాదాలు , ఆకలిచావులు ,హాహాకారాలు 
గ్రుక్కెడు నీళ్లు లేక బిక్కుబిక్కుమనె  దిక్కుమాలిన చావులు 
పెను విధ్వంసం పెను విధ్వంసం దేవదేవుని దివ్యధామం 
హృదయ విదారకంగా ఆలపించే మృత్యుగీతం 
పరమశివుడే ప్రత్యక్ష సాక్షిభూతం ... 
స్వయం కృతపరాధం , స్వయం కృతపరాధం, 
మానవతప్పిదాన ప్రకృతిపై మానవ వికృత చర్యకు  పర్యవసానం ... 
పరమవిలయ తాండవం ... 
                                                                                                                                                                                                       శ్రీమణి 

1, ఫిబ్రవరి 2014, శనివారం

పరితపిస్తోన్న వృక్షజాతి



తరువులు  తల్లడిల్లె 
తమ ఉనికి మాయమౌతుందని
మానవులకు  తాముచేసిన  
అన్యాయమేమనుచు 
మానవాళికి   ఆయువిచ్చు 
తమ ప్రాణం తీయుదురాయని 
నీడనిచ్చు మా జాతిని 
నిర్దయగా కూల్చివేయుదురాయని 
మీ పాపానికి తారెత్తిన భూతాపం 
చల్లార్చిన మాపైనా  మీ ప్రతాపం 
మిము కబళించే కాలుష్యం కరిగిస్తూ 
అలసిన మీకు చల్లని గాలుల సేద తీర్చుతూ 
అమృత ఫలాల తో ఆకలి తీర్చుతూ 
మా తనువున అణువణువును మానవాళికర్పించే  
మా పైనా  మీ అమానుషత్వం 
జాలిలేని మానవుడా మా జోలికి రావొద్దని ,
మా  ప్రాణం  తీయొద్దని విలపిస్తూ  
వేడుకొనెను విరిగిన కొమ్మల తోడ 
అపకారికి ఉపకారం  మహాత్వమన్నారే 
మీ జాతికి మహోపకారం  చేసిన 
మా కిదేనా  మీ ప్రత్యుపకారము 
మము ఉద్దరించగ ఉద్యమించండి  
నవ ఆశోకులయి  నడుం బిగించండి 
పుడమి తల్లి  పులకరించగ  ప్రకృతిమాత    
పరవశించగ కరువు  రూపు మాపగా 
పర్యావరణం పరిమళించగా  
భావితరంలో  పచ్చని  పసిడి నింపగా 
పచ్చని మొక్కని నాటి పెంచుదాం  
వృక్షజాతి ఋణం  తీర్చుదాం 
                                                                                                                            శ్రీమణి 
                             

29, జనవరి 2014, బుధవారం

పండూరు

పండూరు  చెరువుగట్టు



పెద్ద చెరువు, పచ్చనిచేలు,
పైరగాలులు, నోరూరించే ఊరగాయలు,
మదిదోచే మామిడితాండ్ర,
ముచ్చటైన మాఊరు పండూరు
పేరుకు తగట్టే మధురాను భూతులు పంచేను మా ఊరు
జ్ఞాపకాల తాయిలాలు దాచేను మాఊరు
మమతాను రాగాల హరివిల్లు మాఊరు,
మధుర ఫలం మా ఊరు
ఆ దివి భువికొసగిన సుమధుర ఫలం మాఊరు,
తూర్పు గోదారమ్మ జడన తురిమిన
విరిమల్లియ మా ఊరు,సిరిమల్లియ నాఊరు
దేవతలు నిర్మించిన వేణుమాధవునిగుడి
కళకళలాడే రైతు సోదరుల సందడి,
గువ్వల చిరుసడి, లేగదూడల గిట్టల సవ్వడి,
అమ్మని తలపించే కమ్మని వడి
ఇవి అమూల్యమైన ఆభరణాలు మా ఊరికి
శాంతి,ఐక్యతలకి నిర్వచనం మాఊరు,
కోస్తాకే కొంగు పసిడి మా ఊరు,
ఎన్నో పల్లెలకాదర్శం మాఊరు



                                                                        శ్రీమణి

23, జనవరి 2014, గురువారం

అక్కినేనికి కన్నీటి వీడ్కోలు


అక్కినేనికి  లెక్కలేని హృదయాలకన్నీటి వీడ్కోలు  

మహాశిఖరం నేలకొరిగిపోయింది 
మహావృక్షం మట్టికలసిపోయింది  
మహోజ్వల తేజం మసకబారిపోయింది
మహానటసామ్రట్ట ధీరం 
మరలరానిలోకాలకు తరలిపోయింది 
చలన చిత్ర సీమలొ మహాధ్యాయం  
మధురపుటలతో ముగిసిపోయింది 
బహుదూరపు బాటసారి 
అందరాని తీరాలకు సాగిపోయె
ప్రేమనగరి రారాజు  
జనసీమనొదిలి అమరసీమకేగెనే 
వెండితెర  నిందుచంద్రుడు 
వన్నెతరగని వెన్నెలిచ్చి 
స్వర్ణచరిత్రకు పయనమాయెను  
శతాబ్దానికొకటయి  పూచినపూవు 
పరమాత్ముని సన్నిదికై దివికెగసిపోయెనే   
పసిడి స్మృతులు పదిలపరచి 
శాశ్వత నిదురలోకి జారిపోయెనా! 
ఓ మహర్షీ.... ఓ మహాత్మా.... ఓ మనోజ్ఞమూర్తీ.... 
ఓ స్పూర్తిప్రధాతా.... ఓమార్గదర్శీ..... ఓ మానవతామూర్తీ  
అనంతలోకాలకు నీవు సాగిపోయినా 
నీఅడుగుజాడలే మాకు శ్రీరామరక్ష 

అక్కినేని అధీశునికి 

                                    అశ్రుతప్త నయనాలతో 
                                                                
                                                                                   శ్రీమణి

19, జనవరి 2014, ఆదివారం

“అమ్మ”

“అమ్మ”
అరుదగు వాఖ్యం “అమ్మ”
అత్యద్భుత కావ్యం “అమ్మ”
అమృతధారలు అధరాలకు అందించే అమృతభాండం అమ్మ
అఖిలాండకోటి బ్రహ్మాండానికి ఆది మూలం అమ్మ
ఆ విధాత మనకొసగిన అమూల్య కానుక అమ్మ
అర్ధించకనే ఆకలితీర్చు ఆరాధ్యదేవత అమ్మ
మాటలకందని మమతల శిఖరం అమ్మ.
ఊహలకందని ఊర్వి రూపం అమ్మ.
శోకం తెలియని, లోకం ఎరుగని ఆ పాపాయిని
భువికి పరిచయపరచిన పరమపావని అమ్మ
బుడిబుడి నడకల బుడతడి తడబడు అడుగుల
నడకలు నేర్పిన ఆది గురువు అమ్మ.
కోటి ముద్దులతోడ, గోరుముద్దలు చేసి
ఆ సుధాంశుని చూపి సుతునికి
కథలు చెప్పే మహా కవయిత్రి అమ్మ.
పారాడే పాపాయిని
జాతిని కాపాడగ పోరాడే సిపాయిగా,
మనిషిని మనీషిగా జగతికి వెలుగునిచ్చు
దీపంలా మలిచే మహా శిల్పి అమ్మ.
సృష్టిని నడిపించే రెండక్షరాలు అమ్మ
ఈజగతిన "అమ్మకు సాటి అమ్మే"!
అమ్మని మరిపించే మరోపదం "అమ్మే"!


                                                                                                                                          శ్రీమణి

17, జూన్ 2013, సోమవారం

మహా కవి శ్రీ శ్రీ 30వ వర్ధంతి - కవిత ల పోటీలు







మహా కవి శ్రీ శ్రీ 30వ వర్ధంతి పురస్కరించుకొని 
యువ సాహితీ స్రవంతి, సీతమ్మధార, విశాఖపట్టణం వారు 
నిర్వహించిన కవితల పోటీలో
యువత దిశానిర్దేశం కవితకు  
బహుమతి పొందిన సందర్భముగా తీసిన చిత్రం








1, మే 2013, బుధవారం

శ్రీ శ్రీ జయంతి - కవిత ల పోటీలు




శ్రీ శ్రీ 103వ జయంత్యుత్సవాలు పురస్కరించుకొని 
విశాఖ జిల్లాలో  జరిగిన కవితల పోటీలో 
ప్రధమ బహుమతి పొందిన సందర్భంగా తీసిన చాయా చిత్రం