*నేనొక నిశ్శబ్దాన్ని*
నేనొక నిశ్శబ్దాన్ని
అనంతమైన ఆకాశాన్ని
అనుక్షణం అన్వేషిస్తూ
అవని మూలాన్ని అవలోకిస్తూ
అలా శూన్యం కేసి చూస్తుంటాను
నిన్న రాతిరి రాల్చిన కలలకు
రేపటి ఆశల తీరానికి దూరమెంతని
ఆరా తీస్తుంటాను
సుఖదుఃఖాలకు ఆవల
నిలబడి కావలి కాస్తూ
అలౌకిక ఆనందంలో
ఆదమరచిపోతుంటాను
మాటలకు మౌనానికి మధ్య
అంతరాన్ని అంచనా వేస్తూ
ఆ అంతరాన్ని అమాంతం
భర్తీ చేస్తూ నిదానంగా
నిశ్శబ్దంగా మారిపోతాను
నాలో పురుడు పోసుకున్న
భావాలు పూర్ణత్వాన్ని
ఆపాదించుకుంటాయి..
జీవనగమనంలో
లక్ష్యం నిర్ధేశించేది నాలోని
నిగూఢత్వమే
గమ్యం గోచరించేది కూడా
నా సమక్షంలోనే
మనోనిశ్చలతను చేకూర్చి
మనసుకు సాంత్వన నిస్తూనే
పరమపథానికి దారులను
అతిచేరువ చేసే సాధనం నేను
నాలో తెలియని మృధుత్వం
మానవజీవితంలో
ఎన్నో జటిలమైన
సంఘర్షణలకు సైతం
సరైన సమాధానం
మనిషికి,మనసుకూ కూడా
మహత్తరమైన వైద్యం అందించే
ధన్వంతరిని..
నిశిలా అగుపిస్తా గానీ
అసలైన మిసిమి నేను
అంతర్దృష్టితో అన్వేషిస్తే
దేదీప్యమానంగా
సాక్షాత్కరిస్తా..
నిదానంగా పరికించి చూస్తే
ప్రతి మనసుకు
పరిచయమే అక్కరలేని
నిర్వచనాన్ని
నేనొక....నిశ్శబ్దాన్ని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి