దోచే "సినారె"
ఆహా..సినారె ఏమి రాసినారె
ఏమి రాసినారె
అక్షరాలలో అలవోకగా
అమృతాన్ని కలబోసినారె
పదములనె పంచదార
పాకంలో ముంచి తీసినారె
అశేష భారతావనిని
తన పాటల పల్లకిలో
తెలుగు వాకిట వెలుగు
సుమమై విరబూసినారె
వేల హృదయాలను
గాలమేసి లాగేసినారె
ఉరికే ఘన సాహిత్యపుఝరియై
వెలిగే కవన రాజ శిఖరమై
మిక్కిలి పేరు మోసినారె
మృధు మధురమైన పదాలతో
మా మనసు పుటలను నింపేసినారె
మమ్మలరించి మైమరపించి
మా చిత్తములను చిత్రంగా
దోచేసినారె
అద్భుతమైన పాటల వెల్లువలో
నిలువునా తడిపే సినారె
జన రంజక కవి రాజ శిఖరమై
జ్ఞానపీఠమెక్కేసినారె
ఓ మధురిమల పలుకు సిరి
ఓ సిరి చందనాల విభావరి
ఎంత పనిచేసినారె
ఇంతలోనే
గగనసీమ కెగసినారె
మము కన్నీళ్ళ పాల్జేసినారె
శోక సంద్రాన ముంచేసినారె
ఓ మహర్షీ...
ఓ మహాత్మా...
మహోన్నతమూర్తీ...
మానవతామూర్తీ...
ఓ సాహితీ ఘనకీర్తీ...
చలనచిత్ర సాహిత్య చక్రవర్తీ...
అందుకో...మా అశ్రునయనాల
నడుమ లక్షలనివాళి
అందుకోవయ్యా....ఓ అక్షరవనమాలీ........
మా అక్షర నివాళి.
*సాలిపల్లి మంగామణి(శ్రీమణి)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి